కడుపు నిండా భోజనం చేయండి...మీకేం కావాలన్నా నిర్మొహమాటంగా అడగండి...ఇది మీ ఇల్లే అనుకోండి...ఇదీ కాకినాడ సుబ్బయ్య హోటల్ విజయానికి ప్రధాన సూత్రం
1947లో కాకినాడ నడిబొడ్డులో ఉన్న రామారావుపేటలో కాఫీ హోటల్‌తో జీవితం ప్రారంభించారు నెల్లూరు జిల్లా చాకలికొండ గ్రామ వాస్తవ్యులు సుబ్బయ్య. ‘‘నెల్లూరులో పనులు లేకపోవడంతో మా నాన్నగారు తన స్నేహితులతో కలిసి తన పదహారవ ఏట కాకినాడ చేరుకుని, కాఫీ హోటల్ ప్రారంభించారు. అక్కడి వారంతా మా నాన్నగారి చేతి కాఫీ తాగి, సంబరపడేవారు. కాకినాడలో విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో, చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి రూమ్ అద్దెకు తీసుకుని చదువుకునేవారు. వారికి భోజన సదుపాయం సరిగ్గా లభించేది కాదు. అటువంటి సమయంలో విద్యార్థులంతా వచ్చి మా నాన్నను కాఫీ హోటల్ తీసేసి, భోజన హోటల్ పెట్టమని అర్థించారు. హోటల్‌కి కావలసిన పెట్టుబడి కూడా వారే పెడతామన్నారు. అలా నాన్న పేరుతోనే సుబ్బయ్య హోటల్ ప్రారంభమైంది’’ అంటారు సుబ్బయ్య రెండో కుమారుడు గోవిందు.