సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు భవనాలు కూలి 15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మంది మృతి చెందారన్నదానిపై అధికారిక సమాచారం లేదు.
కాగా రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షం బీభత్సంగా కురుస్తోంది. నిన్న 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సె.మీకి పైగానే వర్షం కురిసింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. మరో రెండు రోజులు వర్షం కొనసాగనుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రులందరూ వారి వారి జిల్లాలకు పరుగులు తీశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఇక, ఈశాన్య రుతుపవనాలతో ఈ ఏడాది పడాల్సిన వర్షం పూర్తి స్థాయిలో పడింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది.