గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఆస్తి నష్టం సుమారు రూ.40 లక్షల వరకు జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో చేపల వేటకు వెళ్లని మత్స్యకారులు బోట్లను హార్భర్‌లో పార్క్ చేశారు.
అయితే అర్థరాత్రి బోట్లు పార్క్ చేసిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం హార్బర్‌లో చోటుచేసుకోవడం.. నీరు పక్కనే ఉన్న మంటలు ఎవరూ అదుపు చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. రెండు బోట్లలో ఒకే సమయంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎవరో కావాలనే చేశారని తెలుస్తోంది. ఎవరైనా తగల బెట్టారా లేక.. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న మత్స్యకారులే ఇన్సురెన్స్ కోసం ఇలా చేసి ఉంటారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.