బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో సంభవించిన భారీ పేలుళ్లతో దేశంలో భయానక వాతావరణం నెలకొంది. నగరంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఈ పేలుళ్లలో సుమారు 100 మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వీధులకు వీధులే నేలమట్టం అయ్యాయి. మరికొన్ని ఇళ్లలో బాల్కనీలు, కిటికీలు దారుణంగా దెబ్బతిన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా శ్మశాన నిశబ్దమే రాజ్యమేలుతోంది. విధ్వంసానికి సంబంధించి పొగ ఇంకా వెలువడుతూనే ఉంది. పోర్ట్ ఏరియా పూర్తిగా ధ్వంసమయ్యింది. ఎక్కడిక్కడ భారీ నిర్మణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రోడ్లన్ని గాజు పెంకులు, ఇనుప చువ్వలతో నిండి పోయాయి. అపార్ట్‌మెంట్లలోని ప్లాట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. నరమానవుడనే వాడు ప్రస్తుతం ఈ ప్లాట్స్‌లో కనిపించడం లేదు. విధ్వంసానికి సంబంధించిన ఏరియల్ ఫూటేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.