జైలు జీవితం అనగానే ఎవరికైనా నేరం చేసిన ఖైదీలు, సాధా సీదా జీవితం గడుపుతూ తాము చేసిన తప్పులకు ప్రాయాశ్చిత్తం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగిన ఓ సంఘటన మాత్రం దీనికి అతీతం. జైలులో శిక్షను అనుభవిస్తున్న ఓ నేరస్తుడు తన పుట్టిన రోజు వేడుకలను కేకు కట్ చేసి ఘనంగా జరుపుకున్నాడు. అంతేగాక పార్టీ కోసం క్యాటరింగ్ ఆర్డర్ చేసి తోటి ఖైదీలకు విందు భోజనాన్ని అందించాడు. జైలు నిబంధనలను ఉల్లంఘనపై జరిగిన ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనేత్తుతుంది. అసలు జైల్లో ఇలా చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు
బీహార్‌లోని సీతామార్హి జైలులో ఇద్దరు ఇంజనీర్లను హత్య చేసిన కేసులో పింకు అనే ఖైదీ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇటీవల అతని పుట్టినరోజు రావడంతో జైలులోనే ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్‌చేసి, స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం మటన్‌తో భోజనం చేశారు. అయితే దీన్ని తోటి నేరస్తులంతా ప్రోత్సహిస్తూ అక్కడ జరిగిన తతంగాన్నంతా వీడియో తీశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్తా జైలు అధికారి దాకా వెళ్లడంతో జైలు ఐజీ విచారణకు ఆదేశించారు. అసలు జైలులోకి మొబైల్ ఫోన్ ఎలా వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జైలు నుంచి ఓ వీడియో బయటకు వచ్చి వైరల్ అయిన విషయం తెలిసిందే.