కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లో సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. దాదాపు 45 నిమిషాల పాటు ట్రక్కులో ఉన్న డజనుకు పైగా సిలిండర్లకు మంటలంటుకొని బారీ శబ్దంతో పేలుడు జరగడంతో అక్కడి స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అయింది. దీంతో పాటు రహదారికి ఇరువైపుల బారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఉధంపూర్ ఎస్పీ రాజీవ్ పాండే మాట్లాడుతూ...' 300 సిలిండర్ల లోడుతో జమ్మూలోని బారీ బ్రాహ్మణ నుంచి నార్త్ కశ్మీర్‌లోని సోపోర్‌కు బయలుదేరింది. కాగా ట్రక్కు జమ్మూ కశ్మీర్ హైవేపై ఉన్న తిక్రి ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా సిలిండర్లకు మంటలంటుకున్నాయి. కాగా 45 నిమిషాల పాటు 100 ఫీట్లకు పైగా సిలిండర్లు పైకి ఎగురుతూ కింద పడ్డాయి. ఈ సమయంలో దారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ట్రక్కు డ్రైవర్ ఉజ్జలసింగ్ సిలిండర్ల పేలుడు జరుగుతున్న సమయంలోనే ట్రక్కును వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.' అత్యధిక ఉష్ణోగ్రతతోనే ట్రక్కులో సిలిండర్ల పేలుడు జరిగిందేమోనన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రాజీవ్ పాండే తెలిపారు.