వార్తాపత్రికల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు, వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. వార్తాపత్రికల విషయంలో కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి పత్రికల వల్ల వైరస్ వ్యాప్తి అన్నది జరగదు. అయినప్పటికీ పత్రిక ప్రచురణలో సాక్షి మరిన్ని జాగ్రత్తలు చేపట్టింది. పత్రిక ముద్రణ ప్రక్రియలో అడుగడుగునా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యం దొర్లకుండా, తమపై ప్రజలకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ పూర్తి రక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పత్రికలను ముద్రిస్తోంది. ముద్రణ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి అడుగులో జాగ్రత్తలు పాటిస్తూ పత్రికలపై ప్రత్యేకమైన ఏర్పాట్ల మధ్య శానిటైజర్ స్ప్రే వెదజల్లుతోంది. పాఠకులకు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది.