కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ కరోనా దెబ్బకు పెళ్లిళ్లు కూడా వాయిదా పడక తప్పట్లేదు. లేదూ.. పెళ్లి జరిగి తీరాల్సిందే అంటే 20 మంది కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని అధికారులు షరతు విధిస్తున్నారు. దీంతో ఎంతో కోలాహలంగా జరగాల్సిన వివాహాలు గుట్టుచప్పుడుగా జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఓ జంట మాత్రం పెళ్లికి ముందు జరగాల్సిన సంగీత్ కార్యక్రమాన్ని కూడా ఎంతో మందితో కలిసి సందడిగా, వైభవంగా జరుపుకుంది. దీనికి పోలీసులు ఎలా అనుమతిచ్చారని ఆశ్చర్యపోకండి. వాళ్లు సంగీత్ జరుపుకుంది ఆన్‌లైన్‌లో. గజల్ బవ అనే యువతికి హేమంత్ అనే వ్యక్తితో ఈ వీకెండ్‌లో వివాహం జరగాల్సి ఉంది.
అయితే ప్రస్తుత విషమ పరిస్థితుల వల్ల దాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఆమె స్నేహితులు మాత్రం సంగీత్ పార్టీ జరగాల్సిందేనని సంకల్పించారు. ఈ తంతుకు ఆన్‌లైన్ వేదికగా మారింది. ఇంకేముందీ.. ఓ పంజాబీ పాటకు ఎవరింట్లో నుంచి వాళ్లు డ్యాన్స్ చేస్తూ సంగీత్ నిర్వహించారు. దీనిపై కాబోయే పెళ్లికూతురు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. నెటిజన్లు సైతం వారి వర్చువల్ సంగీత్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.