అప్పుడే మాటలు నేర్చుకున్న పిల్లలు మాట్లాడే మాటలు ఎంతో ముద్దు ముద్దుగా ఉంటాయి. అదే గొంతుతో చిన్న చిన్న రాగాలు తీస్తే చెవులకు భలే వినసొంపుగా ఉంటుంది. మరి ఓ బుజ్జి పిల్లాడితో పెంపుడు జంతువు సంభాషణ కలిపితే ఎలా ఉంటుంది. పిల్లవాడితో పోటీపడి మరి రాగం తీస్తే ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ చంటిగాడితో పాడింది ఏ చిలకో కాదు.. ఓ పెంపుడు కుక్క. అవును నిజమే.. ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్న బాబుకు ఏం అనిపించిందో ఏమో ఒక్కసారిగా కూని రాగాలు తీయడం ప్రారంభించాడు. ఆడుతూ, గెంతుతూ సింగర్‌లా రాగం ఎత్తుకున్నాడు.
పక్కనే ఉన్న పెంపుడు కుక్క కూడా చిన్నారితో కలిసి పాడటం మొదలు పెట్టింది. దానికి వచ్చిన భాషలో పిల్లవాడు ఎంత శ్రుతిలో హమ్ చేస్తే ...కుక్క కూడా అదే స్థాయిలో పాడటం ప్రారంభించింది. వాడేదో అడుగుతుంటే అది సమాధానం చెప్పినట్లు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. ఇక ఈ వీడియోను ‘ఈ రోజు మీరు చూసే వాటిలో ఇదొక అందమైన వీడియో’ అంటూ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో దీన్నిచూసిన నెటిజన్లు ‘ఇద్దరి మద్య సంభాషణ బహు బాగు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.