జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవుల్లోని ‘ మౌంట్ సినాబంగ్’ సోమవారం మరోసారి విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిదతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే గత కొన్ని వారాలుగా సినాబంగ్ యాక్టివ్‌గా ఉందని, సోమవారం నాటి పేలుడు మరో హెచ్చరిక వంటిదని, ఎవరూ కూడా రెడ్‌జోన్ ఏరియాలోకి వెళ్లవద్దని ఇండోనేషియా వోల్కనాలజీ, జియోలాజికల్ మిటిగేషన్ సెంటర్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరోసారి అగ్పిపర్వతం విస్పోటనం చెందే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇక ఈ విషయం గురించి మౌంట్ సినాబంగ్ పరిసరాల్లోని నమంటెరన్ గ్రామ పెద్ద మాట్లాడుతూ.. ‘‘అంతా మాయాజాలంలా ఉంది. అగ్పిపర్వతం బద్దలవగానే పొగ, బూడిద కమ్ముకువచ్చాయి. ఊరంతా దాదాపు 20 నిమిషాల పాటు చీకటైపోయింది. ప్రస్తుతానికి అంతా క్షేమంగానే ఉన్నాం’’అని పేర్కొన్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి వ్యాప్తి, మరోవైపు ప్రకృతి విపత్తులతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు.
కాగా 400 ఏళ్ల తర్వాత మౌంట్ సినాబంగ్ అగ్నిపర్వతం 2010 నుంచి క్రియాశీలకంగా మారింది. 2014లో సంభవించిన విస్ఫోటనం వల్ల దాదాపు 16 మంది మరణించగా.. 2016 నాటి ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జావా, సుమత్రా దీవుల్లో విస్తరించి ఉన్న ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి 2018లో సముద్రంలో సునామీ చెలరేగా దాదాపు 400 మంది మృత్యువాత పడ్డారు.