Sumatra islands
-
ఇండోనేసియాలో వరదలు.. 37 మంది మృతి
జకార్తా: ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది మృతి చెందగా మరో 18 మంది వరకు కనిపించకుండా పోయారు. మరాపి అగ్నిపర్వతం నుంచి రాళ్లు, లావా కలిసి కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికి తోడు, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన బురద ప్రవాహం నాలుగు జిల్లాల పరిధిలోని నివాసప్రాంతాలను తుడిచిపెట్టింది. వందకు పైగా నివాసాలు, భవనాలు వరదలో మునిగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. -
ఇండోనేసియా భూకంపంలో ఏడుగురు మృతి
పసమన్ (ఇండోనేషియా): ఇండోనేసియా సుమత్రా దీవుల్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 85 మంది గాయపడ్డారు. 5 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకం ప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. -
బద్దలైన అగ్నిపర్వతం.. అంతా చీకటిమయం!
-
బద్దలైన అగ్నిపర్వతం.. అంతా చీకటిమయం!
జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవుల్లోని ‘ మౌంట్ సినాబంగ్’ సోమవారం మరోసారి విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిదతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే గత కొన్ని వారాలుగా సినాబంగ్ యాక్టివ్‌గా ఉందని, సోమవారం నాటి పేలుడు మరో హెచ్చరిక వంటిదని, ఎవరూ కూడా రెడ్‌జోన్ ఏరియాలోకి వెళ్లవద్దని ఇండోనేషియా వోల్కనాలజీ, జియోలాజికల్ మిటిగేషన్ సెంటర్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరోసారి అగ్పిపర్వతం విస్పోటనం చెందే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక ఈ విషయం గురించి మౌంట్ సినాబంగ్ పరిసరాల్లోని నమంటెరన్ గ్రామ పెద్ద మాట్లాడుతూ.. ‘‘అంతా మాయాజాలంలా ఉంది. అగ్పిపర్వతం బద్దలవగానే పొగ, బూడిద కమ్ముకువచ్చాయి. ఊరంతా దాదాపు 20 నిమిషాల పాటు చీకటైపోయింది. ప్రస్తుతానికి అంతా క్షేమంగానే ఉన్నాం’’అని పేర్కొన్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి వ్యాప్తి, మరోవైపు ప్రకృతి విపత్తులతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు.(చదవండి: అగ్నిసాక్షిగా కాదు.. అగ్నిపర్వతం సాక్షిగా వారి పెళ్లి!) కాగా 400 ఏళ్ల తర్వాత మౌంట్ సినాబంగ్ అగ్నిపర్వతం 2010 నుంచి క్రియాశీలకంగా మారింది. 2014లో సంభవించిన విస్ఫోటనం వల్ల దాదాపు 16 మంది మరణించగా.. 2016 నాటి ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జావా, సుమత్రా దీవుల్లో విస్తరించి ఉన్న ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి 2018లో సముద్రంలో సునామీ చెలరేగా దాదాపు 400 మంది మృత్యువాత పడ్డారు. -
ఒక సునామీ.. 600 ఏళ్ల చరిత్రను మార్చింది
ఇండోనేసియాకు ఆగ్నేయంగా ఉన్న సుమత్రా దీవుల్లో 2004, డిసెంబర్ 26న సంభవించిన భూకంపం ధాటికి ఆచె తీర ప్రాంతంలో రాకాసి అలలు 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడి అందరినీ భయకంపితుల్ని చేశాయి. కేవలం ఆచెలో లక్షా 60 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. సరిగ్గా 600 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో వచ్చిన సునామీ ఇండోనేసియా చరిత్ర గతిని మార్చేసింది. ఒక శక్తిమంతమైన ముస్లిం రాజ్య స్థాపనకు కారణమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇటీవల ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 2004 నాటి సునామీ ప్రభావాన్ని అంచనా వేసే క్రమంలో పురావస్తు శాస్త్రవేత్త పాత్రిక్ డ్యాలీకి ముస్లింలకు చెందిన కొన్ని సమాధులు కనిపించాయి. అవి 600 ఏళ్ల నాటికి క్రితంవని తేలింది. ఆ సమయంలో వచ్చిన సునామీ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తే, అక్కడే ఆచె అనే బలమైన సుల్తాన్ రాజ్యం ఏర్పడిందని తేలింది. ఆచె అనే ఈ రాజ్యం శతాబ్దాల పాటు వలసవాదులు ఆక్రమించకుండా విజయవంతంగా అడ్డుకుంది. సింగపూర్ ఎర్త్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న డ్యాలీ అకెహ్ తీర ప్రాంతంలో 40కి పైగా గ్రామాల్లో పాత మసీదుల సమాధుల్ని, పాలరాతి కట్టడాలను, మానవ అవశేషాల్ని కనుగొన్నారు. అవన్నీ 11, 12 శతాబ్దాలకు చెందినవని తేలింది. 1394లో అక్కడ సునామీ వచ్చి ఊళ్లకి ఊళ్లను ముంచేసిందని వారికి తెలిసింది. సునామీ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. ఆ తర్వాత కాలంలో అక్కడికి వచ్చిన వారు అత్యంత శక్తిమంతమైన ఇస్లాం రాజ్యం ఆచెను ఏర్పాటు చేశారని వారు చేసిన అధ్యయనంలో తేలింది. -
టోబా సరస్సులో ఘోర పడవ ప్రమాదం
-
పెను విషాదం.. 200 మంది జలసమాధి
జకార్త: సామర్థ్యానికి మించి భారీగా ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియా సుమత్రా దీవిలోని టోబా సరస్సులో సోమవారం ఓ ఫెర్రీ ప్రమాదానికి గురైంది. ఫెర్రీ నీట మునగటంతో అందులోని ప్రయాణికులు గల్లంతయ్యారు. తొలుత ఇది స్వల్ఫ ప్రమాదమని భావించినప్పటికీ, ఫెర్రీలో 200 మందికి పైగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పటంతో ఇది భారీ ప్రమాదమని అధికారులు నిర్ధారించారు. ఉత్తర సమత్రా ప్రొవిన్స్‌లోని టోబా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద వోల్కనిక్ సరస్సు. రంజాన్ పవిత్ర మాసం ముగియటంతో సోమవారం స్థానిక ప్రజలు ఫెర్రీలో వేడుకల కోసం సిద్ధమయ్యారు. అయితే కేవలం 45 మంది సామర్థ్యం ఉన్న ఫెర్రీలోకి.. భారీ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోగా, అదే సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించటంతో ఫెర్రీ నీట మునిగింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ప్రయాణికులకు రక్షించేందుకు రంగంలోకి దిగారు. ఒడ్డున ఆర్తనాదాలు... ప్రమాదం జరిగాక సుమారు 18 మంది ఈదుకుంటూ ఒడ్డుకుచేరుకోగా, వారిచ్చిన సమాచారం మేరకు ఫెర్రీలో 200 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన సహయక సిబ్బంది, కాసేటికి మూడు మృతదేహాలతో టిగారస్ పోర్టు ఒడ్డుకు చేరారు. ప్రయాణికుల బంధువులంతా ఒడ్డున చేరుకుని తమ వారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గజ ఈతగాళ్లతో వెతికించినా ఎలాంటి లాభం లేకపోవటంతో అధికారులు సైన్యం సాయం తీసుకున్నారు. చివరకు ఫెర్రీ సుమారు టోబా సరస్సు 1500 అడుగుల లోతులో మునిగిపోయిందని తేల్చారు.(పూర్తి లోతు 1600 అడుగులపైమాటే...) మృతదేహాలు అందులోనే చిక్కుకుని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫెర్రీని పైకి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. విఫలమైతే డైవర్స్‌ను లోపలికి పంపి మృత దేహాలను వెలికి తీస్తామని అధికారులు బంధువులతో చెప్పారు. మరోవైపు ప్రమాదానికి కారణం తమ నిర్లక్ష్యమేనని పర్యాటక శాఖ ప్రకటించింది. సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించుకున్నప్పుడు వారందరికీ లైఫ్ జాకెట్లు సమకూర్చాలన్నది నిబంధన. పైగా టికెట్లు తీసుకోకుండా ప్రయాణికులందరినీ ఫెర్రీలో ఎక్కించుకున్నారని తేలింది. ఇవేవీ పర్యవేక్షించకుండా అధికారులు ఫెర్రీని టోబా సరస్సులోకి అనుమతించారు. మొత్తం 192 మంది జలసమాధి అయి ఉంటారని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియాలో ఏడాదిలో వందల బోటు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇందులో 12 శాతం వాతావరణం అనుకూలించకపోవటంతో జరిగేవి అయితే, 40 శాతం నిర్లక్ష్యం, మానవ తప్పిదం మూలంగానే అని తేలింది. ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఇండోనేషియా చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. -
300 మంది ఖైదీలు పరారు
జకార్తా(ఇండోనేసియా): జైలులో శిక్ష అనుభిస్తున్న ఖైదీలు సందు దొరికితే చాలు పారిపోదామని చూస్తారు. అదే వందల్లో ఖైదీలు ఉండి, పదిమంది లోపే పోలీసులు ఉంటే ఏమౌతుంది. సందు దొరికిందని పారిపోతారు. సరిగ్గా అలాంటి సంఘటనే సుమాత్రా దీవుల్లోజరిగింది. సుమాత్రా దీవిలోని సియాలంగ్ బంగ్‌కుక్ అనే ఓ కిక్కిరిసిన జైలు నుంచి సుమారు 300 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా వారంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. అయితే, కాపలాగా ఆరుగురు సిబ్బంది ఉండటంతో వారి పని సులువైంది. గార్డులను పక్కకు నెట్టేసి ఖైదీలంతా తలోదిక్కు పారిపోయారు. సమాచారం అందుకున్న యంత్రాంగం అప్రమత్తమయింది. పోలీసులతోపాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. అన్ని రోడ్లను దిగ్బంధించి సోదాలు చేపట్టారు. పరారైన ఖైదీల సంఖ్యపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. అయితే, సుమారు 300 మంది ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జైలులో సామర్ధ్యానికి మించి మూడు రెట్లు అదనంగా, దాదాపు 1,800 మంది ఖైదీలున్నారు. -
తీరాన్ని వణికించిన భూకంపం
ఇండోనేసియాలోని సుమత్రా దీవులను భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4.25 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం తీరప్రాంతాన్ని గట్టిగానే తాకిందని అమెరికా సిస్మాలజిస్టులు చెబుతున్నారు. భూకంప కేంద్రం పడాంగ్ నగరానికి 140 కిలోమీటర్ల దూరంలో భూమికి 50 కిలోమీటర్ల లోతున ఉంది. భూకంపం వచ్చే సమయానికి ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. దీనివల్ల ఏమైనా ఆస్తినష్టం, ప్రాణనష్టం ఉన్నాయా లేవా అన్న విషయం కూడా ఇంకా తెలియలేదు. ఇండోనేసియాలో తరచు భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు పేలడం లాంటివి జరుగుతుంటాయి. -
అండమాన్ నికోబార్ దీవుల్లో 8 భూకంపాలు
అండమాన్ నికోబార్ దీవులను 8 భూకంపాలు వణికించాయి. వీటిలో రెండు భారీ భూకంపాలు కూడా ఉన్నాయి. ఆదివారం రాత్రి సమయంలో ఇవి వచ్చాయి. భారీ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5కు పైగా నమోదైంది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదు. మరోవైపు.. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల్లో కూడా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో మరో భూకంపం భూమికి పది కిలోమీటర్ల లోతున సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపాలన్నీ భూమికి 35-60 కిలోమీటర్ల లోతున నమోదయ్యాయి. గతంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో పలుమార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతంతో పాటు ఇండోనేషియాలో కూడా భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.