300 మంది ఖైదీలు పరారు
జకార్తా(ఇండోనేసియా): జైలులో శిక్ష అనుభిస్తున్న ఖైదీలు సందు దొరికితే చాలు పారిపోదామని చూస్తారు. అదే వందల్లో ఖైదీలు ఉండి, పదిమంది లోపే పోలీసులు ఉంటే ఏమౌతుంది. సందు దొరికిందని పారిపోతారు. సరిగ్గా అలాంటి సంఘటనే సుమాత్రా దీవుల్లోజరిగింది. సుమాత్రా దీవిలోని సియాలంగ్ బంగ్‌కుక్ అనే ఓ కిక్కిరిసిన జైలు నుంచి సుమారు 300 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా వారంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు.
అయితే, కాపలాగా ఆరుగురు సిబ్బంది ఉండటంతో వారి పని సులువైంది. గార్డులను పక్కకు నెట్టేసి ఖైదీలంతా తలోదిక్కు పారిపోయారు. సమాచారం అందుకున్న యంత్రాంగం అప్రమత్తమయింది. పోలీసులతోపాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. అన్ని రోడ్లను దిగ్బంధించి సోదాలు చేపట్టారు. పరారైన ఖైదీల సంఖ్యపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. అయితే, సుమారు 300 మంది ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జైలులో సామర్ధ్యానికి మించి మూడు రెట్లు అదనంగా, దాదాపు 1,800 మంది ఖైదీలున్నారు.