తిమింగలాన్ని చూస్తేనే చాలా మంది భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా దానిపై దూకి సముద్రంలో చక్కర్లు కొట్టాడు. మొప్పల్ని మలిచి దానిపై సవారీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన సౌదీ అరేబియాలోని యంబూ పట్టణతీరంలో చోటుచేసుకుంది. వివరాలు.. జకీ అల్- సబాహి అనే వ్యక్తి స్నేహితులతో కలిసి సముద్రం(రెడ్ సీ)లో బోటులో సరదాగా షికారుకు వెళ్లాడు. ఇంతలో రెండు తిమింగలాలు వారి బోటుకు సమీపంలోకి వచ్చాయి.
దీంతో అతడు ఒక్క ఉదుటున తిమింగలంపైకి దూకాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఉత్సాహపరుస్తుండగా కాసేపు దానిపై షికారు చేశాడు. ఈ షాకింగ్ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది జకీ అల్ ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. మరికొంత మంది మాత్రం.. ‘‘జీవరాశులను హింసించడం ఎంతవరకు సమంజసం, అది నిన్ను మింగేయాల్సింది అప్పుడు తెలిసేది. నిజంగా నువ్వు మూర్ఖుడివే’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక చాలా మటుకు తిమింగలాలు ప్రశాంతంగానే ఉంటాయని, అయితే వాటికి కోపం వస్తే మాత్రం భయంకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జంతు ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. కాగా గతంలోనూ కొంతమంది వ్యక్తి ఇలాంటి స్టంట్లు చేసి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే.