Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Vallabhaneni Vamsi Hospitalised In Kankipadu1
వల్లభనేని వంశీకి అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు

కంకిపాడు: విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసు­కున్న వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు. కస్టడీ నిమిత్తం వంశీని కంకిపాడు తీసుకొచ్చారు. కస్టడీ అనంతరం స్టేషన్‌లోనే ఉంచారు. అస్వస్థతకు గురి కావడంతో వంశీని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండికానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశాడంట. అప్పుడేమో చంద్రబాబుకి.. లోకేష్ కి సమ్మగా ఉందంట.. ఇప్పుడేమో పగలదీస్తారంట. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కొట్టడం.. నడవలేకుండా చేస్తున్నారు. ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారు. రేపైనా ఇలాగే ఉంటుంది. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వాసుపత్రి నుంచి వంశీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు.కంకిపాడు పీఎస్‌లో వంశీ విచారణ బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ను శుక్రవారం కంకిపాడు పోలీసుస్టేషన్‌లో పోలీసులు విచారించారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.

Rs 52000 crore loan has already been taken in the name of Amaravati construction2
కొండంత అప్పు.. బాబు ‘సెల్ఫ్‌’ డప్పు!

కొండను సైతం అవలీలగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు.. మీరు మోసుకొస్తే చాలు.. నేను మోసేస్తా..! అని జారుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు! రైతులిచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలే 8 వేల ఎకరాలను విక్రయించి రూ.లక్ష కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్‌ ప్రాజెక్టులు రావాలని.. అందుకోసం మరో 44 వేల ఎకరాలకుపైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెబుతున్నారు!! రూ.లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం అటుంచితే దాదాపు లక్ష ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘‘రాజధాని అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు... ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది..!’’ సీఎం చంద్రబాబు తరచూ వల్లించే మాటలివీ! కానీ.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తుండగా ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లను కేటాయించింది.రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గతనెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు.తాజాగా స్మార్ట్‌ ప్రాజెక్టుల పేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధాని కోసం సమీకరించే దిశగా టీడీపీ కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఇక అందులో నిర్మాణ పనులు చేపట్టి.. మొత్తం రాజధానిని పూర్తి చేయాలంటే అన్నీ కలిపి కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని.. ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్‌ డబ్బానేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఆ అప్పు తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాజధానిపై లీకులు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌! రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని.. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని దేవతల రాజధాని అమరావతిని తలపించే రీతిలో ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరాన్ని నిరి్మస్తానంటూ 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంపై వందిమాగధులకు ముందే లీకులిచ్చారు. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ ద్వారా తన బినామీలు, సన్నిహితులు కారు చౌకగా రైతుల నుంచి భూములు కాజేశాక రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ (భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలను సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములతో కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ.) రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేశారు. కామధేనువు కాదు అప్పుల కుప్ప.. ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పులు ఓ చిన్న ఇల్లు కట్టాలన్నా ముందుగానే తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటారు. అలాంటిది ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే (నిధులున్నాయో లేదో చూసుకోకుండా) 2016–19 మధ్య రాజధాని ప్రాంతంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం లేఅవుట్ల అభివృద్ధి పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఇందుకోసం సీఆర్‌డీఏ రూ.8,540.52 కోట్ల అప్పులు తెచ్చింది. అయితే 2019 మే నాటికి ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.28,047.82 కోట్లతో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు రద్దు చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. 2018–19 ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరలు పెద్దగా పెరగలేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105 శాతం పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనుల పేరుతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు వెరసి రూ.31 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఆర్‌డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. అమరావతి కామధేనువు కాదు.. అప్పుల కుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి బాబు చెబుతున్న సెల్ఫ్‌ పైనాన్స్‌ మోడల్‌ ఎక్కడ ఉందన్నది ఆయనకే తెలియాలి! ఇకపోతే రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని గత నెలలో సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్‌ ఇవ్వడం గమనార్హం. మరో 44,676.64 ఎకరాల సమీకరణ దిశగా.. భూ సమీకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దాంతో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా స్మార్ట్‌ ప్రాజెక్టులు వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, అవి రావాలంటే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిపోర్టు, స్పోర్ట్స్‌ సిటీ నిరి్మంచాలని చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి భూములు లేవంటూ.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో 44,676.64 ఎకరాలను సమీకరించే దిశగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇక ఆ భూముల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణంతోపాటు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే సుమారుగా మరో రూ.80 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి పెరిగే ధరలను (ఎస్కలేషన్‌) పరిగణనలోకి తీసుకుంటే అన్నీ కలిపి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని లెక్కగడుతున్నారు. అదంతా అప్పులు చేయాల్సిందే. వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందో ఊహించవచ్చు. ఆ అప్పు అంతా చివరకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తంతోనే తీర్చాల్సి ఉంటుందని తేటతెల్లమవుతోంది. అమరావతిపై బాబు డాబుసరి మాటలివిగో..‘రాజధానిగా అమరావతి కామధేనువు లాంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్‌ ఫైనాన్షియల్‌ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. భూ సమీకరణ కింద తీసుకున్న భూములు.. రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లుతోసహా అన్ని పోనూ ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయి. వాటిని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి’ – 2020 ఆగస్టు 7న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి అందరికి ఆమోద­యోగ్యమైంది. అది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు. అందరికీ ఇవ్వగా మిగిలే 8 వేల ఎకరాలకుపైగా భూములను అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అక్కడ ఏ భవనం తాత్కాలికం కాదు.. అన్నీ శాశ్వత భవనాలే’ – 2020 ఆగస్టు 14న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ సిటీ అని గతంలోనే చెప్పా. మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇక్కడ సృష్టించే సంపదతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను చేపడతాం’ – 2024 జూన్‌ 19న సీఎం చంద్రబాబు‘అమరావతిలో రైతులిచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది’ – 2024 జూన్‌ 20న సీఎం చంద్రబాబు

BRS KTR Press Meet Over MLC Kavitha Issue3
కవిత లేఖ కలకలం.. కేటీఆర్‌ కీలక ప్రెస్‌మీట్‌

సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ, కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించనున్నారు. తెలంగాణభవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.ఇక, అంతకుముందు కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్‌ఎస్‌పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత..‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్‌ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్‌కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్‌కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్‌ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది అని అన్నారు. మరోవైపు.. కవిత అభిమానులు.. ఆమెను సీఎం.. సీఎం.. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

India criticized Pak for disinformation regarding the Indus Waters Treaty4
పాక్‌ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్‌

న్యూయార్క్‌: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ తీరును ప్రపంచ వేదికలపై భారత్‌ ప్రశ్నిస్తూ.. దాయాదిని ఇరుకునపెడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాక్‌ రాయబారి అ‌సిమ్‌ ఇఫ్తికర్‌ అహ్మద్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. అంతటితో ఆగకుండా.. ఇటీవల భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది.ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్‌ రాయబారి పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌.. పాకిస్తాన్‌కు కౌంటరిచ్చారు. హరీశ్‌ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్‌కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదు. పాక్‌‌ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. భారత్‌ దశాబ్దాలుగా పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోంది.26/11 ముంబై దాడుల నుంచి ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్ర దాడులు చేశారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్‌ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. భారత పౌరులే లక్ష్యంగా పాక్‌ దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకుంది. ఇలాంటి పనులు చేస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదం అంటూ చురకలు అంటించారు.#IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 2025భారత్‌ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. 65 సంవత్సరాల క్రితం సింధు జల ఒప్పందంలోకి చిత్తశుద్ధితో ప్రవేశించింది. ఒప్పందంపై స్పూర్తితో, స్నేహ భావంతోనే ఇన్ని రోజులు ఉంది. ఆరున్నర దశాబ్దాలుగా భారత్‌పై పాకిస్తాన్‌ మూడు యుద్ధాలు చేసింది. ఉగ్రదాడులకు పాల్పడింది. సింధు జలాల ఒప్పందం స్పూర్తిని ఉల్లంఘించింది. నాలుగు దశాబ్దాలలో 20,000 మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారు అని చెప్పుకొచ్చారు.

YS Jagan mohan Reddy is angry over the behavior of Dachepalli police towards Harikrishna5
ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు?

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో బరితెగించి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శిశుపాలుని మాదిరి పాపాలు చేస్తున్నారని, వీటిని ప్రజ­లు ఎంత మాత్రం క్షమించరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామా­నికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ పట్ల దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? హరికృష్ణపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచి పెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతడిని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయ­డం కాదా? చంద్రబాబూ.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని ఆ పోస్ట్‌లో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

how India banned transshipment impacting Pakistan imports and exports6
పాక్‌ సరుకు రవాణా అస్తవ్యస్తం!

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంతో పాక్‌కు తంటాలు తప్పడం లేదు. యుద్ధ సమయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయంతో పాక్‌ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. దాంతో ఆర్థికంగా, వాణిజ్యం పరంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో పాకిస్థాన్‌ నుంచి ఓడరేవుల ద్వారా వచ్చే సరుకుల రవాణాను భారతదేశం నిషేధించింది. ఇది ఆ దేశ దిగుమతులు, ఎగుమతులను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.ఈ చర్య వల్ల పాకిస్థాన్‌కు, అక్కడి నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రత్యక్ష సర్వీసులను కోర్‌ షిప్పింగ్ లైన్లు నిలిపివేశాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాక్‌ ఫీడర్ నౌకలపై ఆధారపడవలసి వస్తుంది. ఈ నిషేధం వల్ల ముఖ్యంగా ఐరోపాతో దాయాది దేశం వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. భారతదేశంలోని ముంద్రా నౌకాశ్రయం పాక్‌ నుంచి యూరప్‌ వెళ్లే ఎగుమతులకు కీలకమైన ట్రాన్స్‌షిప్‌మెంట్‌ కేంద్రంగా ఉంది. కానీ పాక్‌ ఉగ్రవాదులు భారత పర్యాటకులను దారుణంగా హతమార్చిన నేపథ్యంలో భారత్‌ విజయవంతంగా ఆపరేషన్‌ సింధూర్‌ను అమలు చేసింది. ఈ సమయంలో పాక్‌ సరుకు రవాణాను నిషేధించింది.భారంగా బీమా ఛార్జీలుప్రస్తుతం పాకిస్థాన్‌ షిప్పింగ్ కంపెనీలు కొలంబో, సలాలా, జెబెల్ అలీ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ టెర్మినల్స్ ద్వారా సరుకును రవాణా చేస్తున్నాయి. దాంతో పాక్‌ సంస్థలకు అదనంగా బీమా ఛార్జీలు భారంగా మారాయి. దాంతోపాటు పాకిస్థానీ అమ్మకందారులతో వ్యవహరించే వ్యాపారులను బ్యాంకు గ్యారంటీలు ఇవ్వమని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇది వాణిజ్య కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది.ఇదీ చదవండి: ‘భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధం’పేరుకుపోతున్న నిల్వలుఇప్పటికే కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కీలక పరికరాలు, ముడిసరుకులు, యంత్రాల దిగుమతుల్లో జాప్యాన్ని ఎదుర్కొంటుందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ధాన్యాలు, వస్త్రాల ఎగుమతులు కూడా దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల పాకిస్థాన్‌లోని వివిధ టెర్మినల్స్ వద్ద ఎగుమతి కంటైనర్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. దాంతో సరుకుల రవానా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఆలస్యం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

OTT: The Diplomat Movie Review In Telugu7
The Diplomat Review: మాయ మాటలు నమ్మి పాకిస్తాన్‌ వెళితే..

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హిందీ చిత్రం డిప్లొమాట్‌ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. వాస్తవ కథలను సినిమాగా తీయడం ఓ సవాల్‌ అనే చెప్పాలి. అందులోనూ నిజంగా జరిగిన సున్నిత ఘటనలను సినిమా రూపంలో తీయాలంటే దర్శకుడికి కత్తి మీద సామే. అలాంటి ప్రయత్నమే ‘డిప్లొమాట్‌’( Diplomat Movie Review ) సినిమాలో చేశారు దర్శకుడు శివమ్‌ నాయర్‌. ఈ మూవీ చూస్తున్నంతసేపూ ఆ కథను మనం దగ్గరగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో దర్శకుడు నటీనటులతో జీవింపచేశారు. జాన్‌ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించగా సాధియా కతీబ్‌ మరో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఏం ఉందో చూద్దాం. ఇదో యథార్థ గాథ. 2017లో ఉజ్మా అహ్మద్‌ అనే భారతీయ వివాహితను పాకిస్తాన్‌కు చెందిన తాహిర్‌ అనే యువకుడు మాయ మాటలతో తమ దేశం రప్పించుకుంటాడు. కేన్సర్‌ బారిన పడ్డ ఉజ్మా కూతురు వేరే దేశంలో ఉంటుంది. తన కూతురి ఆరోగ్యం కోసం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తాహిర్‌ వలలో పడుతుంది ఉజ్మా. పాకిస్తాన్‌ వెళ్లాక ఉజ్మాకు అతని అసలు రంగు తెలుస్తుంది. తరువాత తాహిర్‌ ఆమెపై అత్యాచారం జరిపి, చిత్రహింసలు పెడుతుంటాడు. ఈ దశలో ఆ అమ్మాయి అతని దగ్గర నుండి తప్పించుకుని పాకిస్తాన్‌లోని ఇండియన్‌ ఎంబసీలోకి శరణార్థిగా ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న ఇండియన్‌ ఎంబసీ అధికారి అయిన జేపీ సింగ్‌కు తన గోడు వెళ్ళబోసుకుంటుంది. ఇంతలో తాహిర్‌ నానా రకాలుగా ఎంబసీలోకి రావడానికి ప్రయత్నించి చివరకు ఉజ్మా మీద, ఇండియన్‌ ఎంబసీ మీద కేసు పెడతాడు. అక్కడ నుండి కథ పలు మలుపులు తిరిగి, చివర్లో ఉజ్మాను భారతదేశానికి జేపీ సింగ్‌ ఎలా క్షేమంగా చేర్చాడన్నదే సినిమా. ఇక్కడ ఉజ్మా వల్ల భారత్‌–పాకిస్తాన్‌ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు చాలానే వస్తాయి. వాటిని అధిగమించి ఈ భారతదేశ బిడ్డను పాకిస్తాన్‌ నుండి ఎలా చేర్చాడు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. సినిమా చివర్లో నిజమైన ఉజ్మాతో పాటు అప్పటి ఎంబసీ అధికారిని... వారి చిత్రాలతో చూపించడం చాలా బావుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ ‘డిప్లొమాట్‌’ నిజంగా సూపర్‌ థ్రిల్లర్‌. వర్త్‌ఫుల్‌ వాచ్‌ ఫర్‌ వీకెండ్‌. – హరికృష్ణ ఇంటూరు

US Court Blocks Trump Order Over Harvard Enrolling Foreign Students8
ట్రంప్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక​ తగిలింది. హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల చేరిక అంశంపై ట్రంప్‌ నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. దీంతో, ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చినట్టు అయ్యింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాన్ని టార్గెట్‌ చేశారు. వర్సిటీకి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్‌ సర్కార్‌.. తాజాగా ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని గురువారం రద్దు చేసింది. దీంతో, ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్‌ యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టులో యూనివర్సిటీ పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్‌ బరోస్‌.. ట్రంప్‌ సర్కార్‌పై మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు.తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్‌ఈవీపీ వ్యవస్థ నుంచి విశ్వవిద్యాలయాన్ని తొలగించడం అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవతుందని హార్వర్డ్‌ తన తాజా పిటిషన్‌లో పేర్కొంది.BREAKING: A federal judge has BLOCKED the Trump Administration’s illegal move to bar Harvard University from enrolling international students.— Trump Lie Tracker (Commentary) (@MAGALieTracker) May 23, 2025‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు వారిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని’ హార్వర్డ్‌ పేర్కొంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. ఈ మొత్తం సంఖ్య యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 27 శాతానికి సమానం. తమకు వెంటనే ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం కలిగించాలని హార్వర్డ్‌ తాజా పిటిషన్‌లో కోరింది. వర్సిటీ మారాల్సిందే ట్రంప్‌ సర్కారు నిర్ణయం హార్వర్డ్‌లో చదువుతున్న 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. వీరిలో 788 మంది భారతీయులున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. కోర్సుల మధ్యలో ఉన్నవారు మాత్రం ఇతర వర్సిటీల్లోకి మారాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన హోదా కోల్పోయి దేశ బహిష్కరణకు గురవుతారని నోయెమ్‌ స్పష్టం చేశారు.విమర్శల వెల్లువ హార్వర్డ్‌పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం (ఎస్‌ఏఏ)తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్‌లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్‌లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్నివిధాలా సాయమందిస్తామని ఎస్‌ఏఏ ప్రకటించింది.

Hyderabad beat Royal Challengers Bangalore by 42 runs9
బెంగళూరుకు రైజర్స్‌ బ్రేక్‌

లక్నో: ‘ప్లే ఆఫ్స్‌’కు దూరమైన అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ‘ప్లే ఆఫ్స్‌’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్‌... శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. శుక్రవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (48 బంతుల్లో 94 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా... అభిషేక్‌ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనికేత్‌ వర్మ (9 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్‌ సాల్ట్‌ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆరంభంలో భయపెట్టినా... చివర్లో ఒత్తిడి పెంచిన రైజర్స్‌ ఫలితం రాబట్టింది. సన్‌రైజర్స్‌ కెపె్టన్‌ కమిన్స్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభం నుంచే దంచుడు... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో ఓవర్‌లో హెడ్‌ ఫోర్‌తో ఖాతా తెరవగా... భువనేశ్వర్‌ వేసిన రెండో ఓవర్‌లో హెడ్‌ ఫోర్, అభిషేక్‌ 4, 6 బాదారు. మూడో ఓవర్‌లోనూ అభిషేక్‌ 4, 6 దంచగా... నాలుగో ఓవర్‌లో ఈ జోడీ 4, 6, 4 కొట్టింది. వీరిద్దరూ మూడు బంతుల వ్యవధిలో అవుట్‌ కాగా... పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్‌ 71/2తో నిలిచింది. క్లాసెన్‌ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... ఇషాన్‌ కిషన్‌ నిలకడ కనబర్చాడు. సుయాశ్‌ శర్మ వేసిన 11వ ఓవర్‌లో అనికేత్‌ 6, 4, 6 కొట్టి కాసేపటికే ఔట్‌ కాగా... ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి (4) ప్రభావం చూపలేకపోయాడు. అభినవ్‌ మనోహర్‌ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆఖర్లో బాదే బాధ్యత ఇషాన్‌ భుజాలకెత్తుకున్నాడు. 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్‌... చివర్లో మరింత వేగం పెంచి సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓపెనర్లు మినహా... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు... భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్‌ కొట్టిన కోహ్లి, మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు దంచాడు. నాలుగో ఓవర్‌ వేసిన హర్షల్‌కు అదే శిక్ష వేశాడు. కోహ్లి 7 ఫోర్లు కొట్టేవరకు ఒక్క బౌండ్రీ బాదలేకపోయిన సాల్ట్‌ ఆ తర్వాత జూలు విదిల్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి చాలెంజర్స్‌ 72/0తో నలిచింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం విరాట్‌ అవుట్‌ కాగా... పడిక్కల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ (11) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాల్ట్‌ కాసేపటికి వెనుదిరగగా... జితేశ్‌ శర్మ, రజత్‌ పాటీదార్‌ జోరు కొనసాగించారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 163/3తో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు అవసరమైన దశలో... బెంగళూరు బ్యాటర్లు తడబడటంతో పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) సాల్ట్‌ (బి) ఇన్‌గిడి 34; హెడ్‌ (సి) షెఫర్డ్‌ (బి) భువనేశ్వర్‌ 17; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 94; క్లాసెన్‌ (సి) షెఫర్డ్‌ (బి) సుయాశ్‌ 24; అనికేత్‌ (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ 26; నితీశ్‌ రెడ్డి (సి) కృనాల్‌ (బి) షెఫర్డ్‌ 4; అభినవ్‌ మనోహర్‌ (సి) సాల్ట్‌ (బి) షెఫర్డ్‌ 12; కమిన్స్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–54, 2–54, 3–102, 4–145, 5–164, 6–188. బౌలింగ్‌: యశ్‌ దయాళ్‌ 3–0–36–0; భువనేశ్వర్‌ 4–0–43–1; ఇన్‌గిడి 4–0–51–1; సుయాశ్‌ శర్మ 3–0–45–1; కృనాల్‌ పాండ్యా 4–0–38–1; షెఫర్డ్‌ 2–0–14–2. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: ఫిల్‌ సాల్ట్‌ (సి) హర్షల్‌ (బి) కమిన్స్‌ 62; కోహ్లి (సి) అభిషేక్‌ (బి) హర్‌‡్ష దూబే 43; మయాంక్‌ (సి) ఇషాన్‌ (బి) నితీశ్‌ 11; పాటీదార్‌ (రనౌట్‌) 18; జితేశ్‌ శర్మ (సి) అభినవ్‌ (బి) ఉనాద్కట్‌ 24; షెఫర్డ్‌ (సి అండ్‌ బి) మలింగ 0; కృనాల్‌ (హిట్‌ వికెట్‌) (బి) కమిన్స్‌ 8; టిమ్‌ డేవిడ్‌ (సి) క్లాసెన్‌ (బి) మలింగ 1; భువనేశ్వర్‌ (బి) కమిన్స్‌ 3; యశ్‌ దయాళ్‌ (సి) అభిషేక్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 3; ఇన్‌గిడి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 189. వికెట్ల పతనం: 1–80, 2–120, 3–129, 4–173, 5–174, 6–174, 7–179, 8–186, 9–187, 10–189.బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–28–3; ఉనాద్కట్‌ 4–0–41–1; హర్షల్‌ పటేల్‌ 3.5–0–39–1; ఇషాన్‌ మలింగ 4–0–37–2; హర్‌‡్ష దూబే 2–0–20–1; నితీశ్‌ రెడ్డి 2–0–13–1. ఐపీఎల్‌లో నేడుఢిల్లీ X పంజాబ్‌వేదిక: జైపూర్‌ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

Army Officer Dies Rescuing Soldier10
తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

న్యూఢిల్లీ: తోటి సైనికుని కాపాడబోయిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషాదరక ఘటన సిక్కిం(Sikkim)లో చోటుచేసుకుంది. తన బృందంలోని సైనికుడొకరు వాగులో పడి కొట్టుకుపోతుండగా చూసిన ఆర్మీ అధికారి అతనిని కాపాడబోయి, నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.వివరాల్లోకి వెళితే గత ఏడాది డిసెంబర్‌లో నియమితులైన లెఫ్టినెంట్ శశాంక్ తివారీ(23) సిక్కింలోని వ్యూహాత్మక ఆపరేటింగ్ పెట్రోలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. వీరి బృందం కీలక పోస్ట్ వైపు కదులుతుండగా, అగ్నివీర్(Agniveer) స్టీఫెన్ సుబ్బా లాగ్ వంతెనను దాటుతూ, కాలు జారి వాగులో పడిపోయారు. దీనిని గమనించిన లెఫ్టినెంట్ తివారీ నీటిలోకి దూకారు. అతనికి మరో సైనికుడు నాయక్ పుకార్ కటెల్‌ సాయం అందించారు. వారిద్దరూ అగ్నివీర్‌ సుబ్బాను రక్షించగలిగారు.అయితే సుబ్బాను రక్షించే ప్రయత్నంలో లెఫ్టినెంట్ తివారీ(Lieutenant Tiwari) బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయారు. అతని మృతదేహం 30 నిమిషాల తర్వాత 800 మీటర్ల దిగువన కనిపించింది. తివారీకి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. కాగా ‘చిన్న వయస్సులోనే ఎంతో తెగువ చూపిన లెఫ్టినెంట్ తివారీకున్న ధైర్యం రాబోయే తరాలకు, సైనికులకు స్ఫూర్తినిస్తుందని భారత సైన్యం పేర్కొంది. ఈ అమరుని మృతదేహం అతని స్వస్థలానికి తరలించే ముందు బెంగ్డుబి మిలిటరీ స్టేషన్‌లో లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ ఎ మిన్వాల్లా పూర్తి సైనిక గౌరవాలు అందించారని సిలిగురికి చెందిన 33 కార్ప్స్ (త్రిశక్తి కార్ప్స్) ‘ఎక్స్‌’లో పేర్కొంది.ఇది కూడా చదవండి: 43 ఏళ్ల న్యాయపోరాటం.. 104 ఏళ్ల వృద్ధునికి జైలు నుంచి విముక్తి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement