రేపు కర్నూలుకు శివరామకృష్ణన్ కమిటీ రాక | tomorrow shivarama krishnan commitee Arrival to kurnool | Sakshi
Sakshi News home page

రేపు కర్నూలుకు శివరామకృష్ణన్ కమిటీ రాక

Jul 6 2014 3:15 AM | Updated on Sep 2 2017 9:51 AM

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈనెల 7వ తేదీ కర్నూలుకు రానుంది.

- అభిప్రాయాలను రాత పూర్వకంగా ఇవ్వవచ్చు : కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
- 7వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష

కర్నూలు(కలెక్టరేట్): కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈనెల 7వ తేదీ కర్నూలుకు రానుంది. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటించిన ఈ కమిటీ ఎట్టకేలకు కర్నూలు వచ్చి ఇక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు కానుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ కర్నూలుకు వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆంధ్ర రాష్ట్రానికి 1953 నుంచి 1956 వరకు కర్నూలు రాజధానిగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడంతో రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అప్పుడు త్యాగం చేసి నష్టపోయినందున ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలునే రాజధాని చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ఇందుకు తగిన విధంగా జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అంతేగాక శ్రీశైలం జలాశయం ఉన్నందున నీటికి కొరత లేదు. వివిధ రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులు ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. శివరామక్రిష్ణన్ కమిటీ వస్తుండటంతో జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కమిటీ కలెక్టరేట్ సమావేశ మందిరానికి చేరుకుంటుంది.  కొత్త రాజధాని ఎంపిక, విద్య, వైద్య సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం చేస్తున్న ఈ కమిటీకి అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను రాత పూర్వకంగా ఇవ్వవచ్చని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement