
కుందురు నాగార్జున రెడ్డి, మాదాసి వెంకయ్య, నందిగం సురేష్, టీజేఆర్ సుధాకర్‌బాబు
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉన్నారు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. అత్యున్నత విద్యనభ్యసించిన వారినే కాకుండా సామాన్య పేద కుటుంబాల్లో జన్మించి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి టికెట్లిచ్చారు. జిల్లా రాజకీయ యవనికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కొత్త తరం నాయకులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
కొండారెడ్డి గారి అబ్బాయి
మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో అందరికీ కేపీ కొండారెడ్డి, ఉడుముల కుటుంబాలు సుపరిచితమే. వారి కుటుంబం నుంచి రాజకీయ వారసుడొచ్చాడు. మార్కాపురం నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కుందురు పెద్ద కొండారెడ్డి తనయుడు కుందురు నాగార్జున రెడ్డి రాజకీయ అరంగ్రేటం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఈయన అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తొలిసారే అయినా రాజకీయాల్లో దశాబ్దాలుగా రాణిస్తున్న కుటుంబం కావడం, తన మామ ఉడుముల శ్రీనివాసరెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే కావడం నాగార్జున రెడ్డికి కలిసొచ్చే అంశంగా మారింది. తన తండ్రే తనకు రోల్ మోడల్ అని చెబుతున్న ఈయన.. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయించి కరువు, ఫ్లోరైడ్ సమస్యలు నివారించేందుకు పాటుపడతానని పేర్కొన్నారు.
పేదల వైద్యుడు.. ప్రజాసేవకొచ్చారు
కొండపి: నిరుపేద కుటుంబంలో జన్మించిన మాదాసి వెంకయ్య అనేక ఆటుపోట్లు ఎదుర్కొని వైద్య విద్యను అభ్యసించారు. టంగుటూరు మండలం కారుమంచిలో జన్మించిన ఈయనను తల్లి కోటమ్మ కూలీ పనులు చేసి రెక్కల కష్టంతో చదివించారు. గుంటూరు ప్రభుత్వ కళాశాల నుంచి ఎంబీబీఎస్, ఎంఎస్ పట్టా పొందిన ఈయన బాంబే టాటా మెమోరియల్ వైద్యశాలలో సైతం శిక్షణ పొందారు. కార్పొరేట్ వైద్యశాలలో చేరకుండా దశాబ్ద కాలం ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాలతోపాటు మరో పదేళ్లు రిమ్స్‌లో వైద్యునిగా, అధ్యాపకునిగా పనిచేసి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ వైద్యునిగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఉలవపాడులో కేవలం 20 రూపాయల ఓపీతో పేదలకు వైద్యం చేస్తున్న వైద్యుడు ఈయన ఒక్కరే.
మానవ సేవే మాధవసేవగా భావించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. లక్షల మంది రోగులకు ఆపరేషన్లు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన వెంకయ్య 2014లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ముగ్గురు గవర్నర్లు, వైఎస్సార్‌తోపాటు ఆ తర్వాత అధికారం చేపట్టిన ముగ్గురు ముఖ్యమంత్రుల మీదుగా అవార్డులు స్వీకరించారు. 2016లో నేషనల్ మెడికల్ టూరిజం మెంబరుగా ఎంపికయ్యారు. ప్రభుత్వ, ప్రేవేట్ ఆస్పత్రుల్లో వందకు పైగా అవార్డులు పొందిన డాక్టర్ వెంకయ్య అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈయన ఎస్సీ రిజర్వుడు నియోజకవ్గం అయిన కొండపి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
పోరాటాలు మలిచిన నాయకుడు టీజేఆర్
చీమకుర్తి: సామాన్య పేద కుటుంబంలో జన్మించిన టీజేఆర్ సుధాకర్‌బాబు విద్యార్థి దశ నుంచే పోరాట పంథాతో ముందుకు సాగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల వైపు ఆకర్షితుడైన ఈయన 1991 నుంచి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల్లో క్రియాశీలకంగా పనిచేశారు. వైఎస్సార్ మరణానంతం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం వేధింపులకు గురిచేయడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో సుధాకర్ బాబు జగన్ వెంట నడిచారు. సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగుతున్న సుధాకర్ బాబు.. ప్రజా సమస్యలపైనా పోరాటాలు చేయడం ద్వారా మరింత గుర్తింపు పొందారు. ప్రజల ఆశిర్వాదంతో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేసి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని టీజేఆర్ పేర్కొన్నారు.
బాపట్ల బరిలో సామాన్యుడు
ఒంగోలు సిటీ: సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన నందిగం సురేష్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వీరాభిమాని. తమ కుటుంబానికి ఉన్న ఎకరాన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే రాజకీయాలపై ఆసక్తితో జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీ దుర్మార్గాలకు తెరలేపింది. ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు పంట పొలాలు తగలబెట్టి ఆ కేసును వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మెడకు చుట్టేందుకు పక్కాగా ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నందిగం సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మానసికంగా, శారీరకంగా చిత్రవదకు గురిచేశారు. తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామని బెదిరించారు. పంట పొలాల దహనం కేసులో వైఎస్ జగన్ పేరు చెప్పాలని బలవంతం చేశారు. కానీ నందిగం సురేష్ పోలీసుల బెదిరింపులకు లొంగలేదు. తదనంతరం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో సురేష్ కూడా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులై ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించిన తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనని, ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసేది లేదని సురేష్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు.. దళితులను నానా రకాలుగా దుర్భాషలాడుతున్న తీరును రాష్ట్రంలోని దళితులు యావగించుకుంటున్నారని చెప్పారు.