
మా కాంబినేషన్‌లో మరో విజయం!
సంగీతం వచ్చు కదా అని కథలో అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. కథకు తగ్గట్టు ఎక్కడ తక్కువ వాడాలో కూడా తెలుసుండాలి.
‘‘సంగీతం వచ్చు కదా అని కథలో అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. కథకు తగ్గట్టు ఎక్కడ తక్కువ వాడాలో కూడా తెలుసుండాలి. నేను కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ ఇస్తాను’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘బోయపాటి స్టైల్ మిక్స్ అయిన ఫ్యామిలీ మాస్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా ప్రారంభం నుంచి మనం కూడా కథతో పాటే ప్రయాణిస్తాం. ఓ సారి దర్శకుడు త్రివిక్రమ్‌గారు ఫోన్‌చేసి పవన్ కల్యాణ్‌గారి చిత్రానికి ‘అత్తారింటికి దారేది’ అన్నదే టైటిల్ అన్నారు.
అంతపెద్ద స్టార్ హీరోకి ఆ టైటిల్ ఏంటి? అనుకున్నా. కానీ, కథ పరంగా చూస్తే కరెక్టే అనిపించింది. ఈ చిత్రానికి ‘జయ జానకి నాయక’ అని బోయపాటిగారు చెప్పగానే కథ నాకు తెలుసు కాబట్టి, కరెక్ట్‌గా సరిపోతుందనిపించింది. ప్రతి ఫ్రేమ్ బాగుంటుంది. కథకు తగ్గట్టుగా భారీ ఖర్చుతో తీశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా ఇది. ‘భద్ర, తులసి, లెజెండ్’ తర్వాత బోయపాటిగారు, నా కాంబినేషన్‌లో వస్తున్న ‘జయ జానకి నాయక’ మరో విజయంగా భావిస్తున్నాం’’ అన్నారు.