
న్యూఢిల్లీ: కరోనా కంటే ప్రజల్లో భయాందోళనలే పెద్ద సమస్యగా మారాయని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు ఒక్కసారిగా సొంతూళ్లకు పయనం కావడంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కార్మికుల భారీ వలసలను నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి దాఖలైన రెండు వేర్వేరు పిల్‌లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ చేపట్టింది.
ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా ఉపాధి, ఆశ్రయం కోల్పోయిన వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లకుండా ఆపాలని, వారికి అవసరమైన ఆహారం, నీరు అందించాలని, వైద్య సౌకర్యాలు కల్పించాలని పిటిషనర్లు కోరారు. సొంతూళ్లకు పయనమైన కార్మికులు రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్లనివ్వకపోవడంతో రోడ్డుపైనే చిక్కుకుపోతున్నారన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో నీరు, ఆహారం దొరక్క అలమటిస్తున్నాన్నారు. రాష్ట్రాల యంత్రాంగాల మధ్య సమన్వయం లోపించిందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వలసలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ చెప్పారు.