'నాకు ఏమీ తెలీదు.. అమాయకుడిని' | Narsingh Yadav Claims 'Conspiracy' After Failing Dope Test | Sakshi
Sakshi News home page

'నాకు ఏమీ తెలీదు.. అమాయకుడిని'

Jul 24 2016 4:04 PM | Updated on Sep 4 2017 6:04 AM

'నాకు ఏమీ తెలీదు.. అమాయకుడిని'

'నాకు ఏమీ తెలీదు.. అమాయకుడిని'

తాను డోపింగ్ టెస్టులో విఫలమైనట్లు నివేదిక రావడం వెనుక కుట్ర దాగి ఉందని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ స్పష్టం చేశాడు.

న్యూఢిల్లీ: తాను డోపింగ్ టెస్టులో  విఫలమైనట్లు నివేదిక రావడం వెనుక కుట్ర దాగి ఉందని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ స్పష్టం చేశాడు. గత నెల్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నిషేధిత  స్టెరాయిడ్స్ను తీసుకున్నట్లు రావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. రియోకు వెళ్లే తన అవకాశాలను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే కుట్ర పన్నారన్నాడు. త్వరలోనే నిజం ఏమిటి అనేది తెలుస్తుందని నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

 

' నాకు ఏమీ తెలీదు.. అమాయకుడిని. నేను ఎటువంటి నిషేధిత ఉత్ర్పేరకాలు తీసుకోలేదు. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. నన్ను నమ్మండి. నాకు ఈ సమయంలో భారత ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓఏ) అండగా నిలవాలని కోరుకుంటున్నా' అని నర్సింగ్ యాదవ్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ ఏ రోజూ కూడా తాను నిషేధిత డ్రగ్స్ను తీసుకోలేదనే విషయం గుర్తించాలన్నాడు. తాను డోపింగ్ పాల్పడినట్లు నివేదిక రావడం ఒక పన్నాగంలో భాగమేనన్నాడు.


నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ) నిర్వహించిన డోపింగ్ టెస్టుల్లో నర్సింగ్ యాదవ్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అతనికి నిర్వహించిన 'ఎ', 'బి' శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చాయంటూ  జాతీయ మీడియాలో వెలుగు చూసింది. అయితే ఈ విషయంపై  భారత రెజ్లింగ్ సమాఖ్య నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడి కాలేదు. కాగా,  భారత క్రీడామంత్రిత్వ శాఖ మాత్రం ఒక రెజ్లర్ డోపింగ్ టెస్టుల్లో విఫలమయ్యాడనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఆ రెజ్లర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ ఆ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అయితే మాత్రం అతని రియో భవితవ్యం సందిగ్ధంలో పడినట్లే.  ఆగస్టు 5 నుంచి 21 వరకు జరగనున్న రియో ఒలింపిక్స్ లో  భారత్ తరఫున నర్సింగ్ యాదవ్ 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో బరిలోకి దిగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement