విద్యుత్ ఉద్యోగులకు 27.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 27.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, రెండు డిస్కంలు (టీఎస్ ఎస్‌పీడీసీఎల్, టీఎస్ ఎన్‌పీడీసీఎల్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే అమలు చేయాలని ఆయన సూచించారు. వేతన సవరణ (పీఆర్‌సీ) అమలులో భాగంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పటికే 27.5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అమలవుతోంది. తాజాగా 27.5 శాతం ఫిట్‌మెంట్ అమలు వల్ల తేడా ఏమీ లేదని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాల మేరకు ఫిట్‌మెంట్‌తోపాటు మూడు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరోవైపు 30 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్ ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. సీఎం పునరాలోచించి రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌తోపాటు కాంట్రాక్టు ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ఇవ్వాలని జేఏసీ చైర్మన్ పద్మారెడ్డి, కో-చైర్మన్ శ్రీధర్, కన్వీనర్ సుధాకర్‌రావు విన్నవించారు.