Panchayati Raj Department
-
పల్లె ముంగిట కొత్త ‘పద్దు’
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్‌లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్‌లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిని గ్రామ బడ్జెట్లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు. మూడొంతుల పంచాయతీల్లో పూర్తి ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్‌ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. -
తెలంగాణలో ఇతర ఆసరా పింఛన్లూ పెంపు?
హైదరాబాద్: రాష్ట్రంలో ఆసరా పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయల మేర పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. ఆసరా పథకంలో దివ్యాంగుల పింఛన్‌ను గత నెలలో రూ.3,016 నుంచి రూ.4,016కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకూ పెంచాలని ఇతర ఆసరా పింఛనుదారులు కోరుతున్నారు. ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,016 పింఛను ఇస్తోంది. వీరికి సైతం వెయ్యి పెంచి రూ.3,016 ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం అనంతరం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇతర లబ్ధిదారులకూ త్వరలో పింఛను మొత్తాన్ని పెంచుతామని ఆదివారం సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 44,82,254 మందికి పింఛన్లు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులతో పాటు పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు; గీత, చేనేత, బీడీ కార్మికులు; ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ రోగులకు కలిపి మొత్తం 44,82,254 మందికి పింఛను ఇస్తోంది. ఇందుకు ఏటా రూ.11,628 కోట్లు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల్లో 5,16,890 మంది దివ్యాంగులకు గత నెల నుంచి వెయ్యి పెంచింది. వీరిని మినహాయిస్తే.. ఇతర పింఛనుదారులు 39 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,000 పెంపుతో ఖజానాపై మరో రూ.450 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. -
రేపటి నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం నుంచి నగదు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఇంటిపన్ను సహా ఏ అవసరానికి పంచాయతీకి డబ్బు చెల్లించాలన్నా.. కేవలం నగదు రహిత విధానంలోనే చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి నగదు రహిత లావాదేవీల నిర్వహణను తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోను ఈ విధానం అమలుకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ప్రత్యేక విధివిధానాలను ఖరారు చేసింది. సాధారణంగా ఆన్లైన్ విధానంలో నగదు చెల్లింపులు.. నెట్ బ్యాంకింగ్ విధానంలోగానీ, పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే పీవోఎస్ మిషన్లలో డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారాగానీ, ఫోన్‌పే, పేటీఎం వంటి విధానాల్లో మొబైల్ ఫోన్లతో క్యూఆర్ కోడ్లను స్కాన్‌చేయడం ద్వారాగానీ చేయాల్సి ఉంటుంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డులను ఎక్కువమంది వినియోగించకపోవచ్చన్న అంచనాతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల్లో రెండురకాల విధానాల్లో నగదు రహిత ఆన్లైన్ చెల్లింపుల విధానం అమలుకు ఏర్పాట్లు చేసింది. మూడువేలకు తక్కువగా జనాభా ఉండే చిన్న గ్రామాల్లో కేవలం మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానం, మూడువేలకు పైగా జనాభా ఉండే గ్రామాలకు వివిధ రకాల కార్డుల ద్వారా చెల్లింపులకు వీలుగా పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు బ్యాంకుల్లో పంచాయతీల పేరిట ప్రత్యేక ఖాతాలు ఆగస్టు 15 నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపుల నిర్వహణకు వీలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇందుకు నాలుగు ప్రముఖ బ్యాంకులతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. 11 జిల్లాల్లో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (యూబీఐ)లో, తొమ్మిది జిల్లాల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో, ఐదు జిల్లాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో, ఒక జిల్లాలో ఐడీఎఫ్సీ బ్యాంకులో పంచాయతీల వారీగా ఖాతాలు తెరిచారు. ♦ రాష్ట్రంలో మొత్తం 13,325 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో మూడువేలకన్నా తక్కువ జనాభా ఉన్నవి 10,003. ఈ పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు మొబైల్ ఫోన్ల చెల్లింపులకు వీలుగా ప్రత్యేక క్యూఆర్ కోడ్లను ఇప్పటికే కేటాయించాయి. ♦ మూడువేలకు పైగా జనాభా ఉన్న 3,322 పంచాయతీల్లో కార్డుల ద్వారా నగదు చెల్లించేందుకు పీవోఎస్ మిషన్లను ఆయా పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు ఉచితంగా ఇస్తున్నాయి. ఒక్కో పంచాయతీకి ఒకటి చొప్పున, ఏదైనా పెద్ద పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలున్న చోట, అదనంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఒకటి చొప్పున మొత్తం 5,032 పీవోఎస్ మిషన్లను అందజేస్తున్నాయి. ♦ గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఎల్జీడీ కోడ్ నంబరు ఆధారంగా బ్యాంకులు ఆయా పంచాయతీలకు ఆన్లైన్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కోడ్లను కేటాయిస్తున్నాయి. ♦ బ్యాంకులో పంచాయతీ ఖాతాకు జమ అయిన సొమ్మును ఆ పంచాయతీ కార్యదర్శి ట్రెజరీ అకౌంట్లో జమచేస్తారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ.. పంచాయతీ కార్యదర్శులకు విధివిధానాలతో ఆదేశాలు జారీచేసింది. -
‘స్థానిక’ ఖాళీలపై ఎన్నికల కమిషన్ కదలిక
సాక్షి, హైదరాబాద్: వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడిన పలు ప్రజాప్రతినిధుల స్థానాల ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్ఈసీ) వర్గాలు వెల్లడించాయి. పలు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యులు, ఇతర పోస్టులకు ఎన్నికలెందుకు నిర్వహించడం లేదంటూ తాజాగా ఎస్ఈసీకి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఎన్ని రోజుల్లోగా నిర్వహిస్తారో వెల్లడించాలని, అందుకు నెల రోజుల సమయం కూడా కోర్టు ఇచ్చిన నేప థ్యంలో ప్రభుత్వానికి ఎస్ఈసీ విజ్ఞప్తి చేయను న్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టు నోటీస్ జారీకి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎస్ఈసీకి, పీఆర్ శాఖకు చేరేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ లోగా ఖాళీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. పీఆర్ శాఖ కమిషనర్‌కు కూడా కోర్టు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా అంశాల ప్రాతిపదికన సమా« దానం పంపేందుకు సిద్ధమ వుతున్నట్టు తెలుస్తోంది. నూతన పీఆర్ చట్టం ప్రకారం... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి ప్రభుత్వ సమ్మతి, ఆమోదంపొందాకే ఎస్ఈసీ వాటిని ఖరారు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. వివిధ గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం 2024 జనవరిలో ముగియనుంది. ఖాళీలు ఏర్పడిన స్థానాలకు ఇంకా 9 నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏదైనా కారణంతో స్థానిక సంస్థల పోస్టులు ఖాళీ అయితే ఆరునెలల్లో భర్తీ చేయాల్సి ఉండగా, వీటి ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. మినీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వివిధ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల పోస్టులు ఆరువేలకుపైగా ఖాళీలు ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో ఈ ‘మినీ పంచాయతీ’ఎన్నికలు జరుగుతాయో, లేదోననే చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాక ఎన్నికల వ్యయం వెల్లడించకపోవడం, విధుల నిర్వహణలో అలస త్వం ప్రదర్శించడం, అక్రమాలు, పీఆర్ చట్ట ఉల్లంఘనకు పాల్పడటం వంటి కారణాలతో కొన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులు, మున్సిపల్ వార్డు సభ్యుల పోస్టులు ఖాళీ అయ్యా యి. వీటికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది భాస్కర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎస్ఈసీకి, పీఆర్ కమిషనర్లకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
AP: మరో 875 రోడ్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 875 రోడ్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో కీలకమైన ఐదురోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ 875 రోడ్లలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 442, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 300, మున్సిపల్ శాఖ పరిధిలో 133 ఉన్నాయి. రోడ్లను ఎంపికచేసి ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోడ్ల పనులను మార్చిలో ప్రారంభించి జూన్ నాటికి పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రోడ్ల పునరుద్ధరణ నిధులను కూడా 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ వంటి పథకాలకు మళ్లించింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాది భారీవర్షాలతో రోడ్ల పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. అనంతరం రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టింది. మొదటిదశ కింద రూ.2,205 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఆ పనులు 95 శాతం పూర్తయ్యాయి. రెండోదశ కింద రూ.1,700 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండోదశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. ఈ పనులను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతలో యుద్ధప్రాతిపదికన నియోజకవర్గానికి ఐదు రోడ్ల చొప్పున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విధానంలో 875 రోడ్ల పునరుద్ధరణ పనులు మొదట పూర్తిచేయనున్నారు. అనంతరం రెండోదశ రోడ్ల పునరుద్ధరణ పనులను చేపట్టి డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ప్రణాళిక రూపొందించారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రోడ్ల కోతకు చెక్ నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశించారు. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించనుంది. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లను ఈ సాంకేతికతతో నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ (సీఐఆర్) నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మెత్తటి నేలలున్న ప్రాంతాల్లో అదే టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. -
‘పంచాయతీరాజ్’లో భారీగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం ఈవోపీఆర్డీలుగా పనిచేస్తున్న వారితోపాటు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏవో)గా పనిచేస్తున్న వారికి ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాతికేళ్ల తర్వాత 237 మంది ఎంపీడీవోలకు ఇటీవల ఒకేసారి పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎంపీడీవోల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉండడంతో కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇక సాధారణ నిబంధనల ప్రకారం మండలాల్లో ఎంపీడీవో పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు మూడు మార్గాల్లో వాటిని భర్తీచేస్తుంటారు. మొత్తం ఖాళీల్లో 30 శాతం పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన పోస్టులను ఈవోపీఆర్డీలు.. జెడ్పీలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏవోలుగా పనిచేసే వారికి పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, 20 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణులైన 45 మందిని నేరుగా ఎంపీడీవోలుగా నియమించింది. మిగిలిన వాటిలో సుమారు 220 ఎంపీడీవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు ఇప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు. నెలాఖరుకల్లా సీనియారిటీ జాబితాలు.. ఇక సెప్టెంబరు మొదటి వారానికల్లా ఈ పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసేందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు కార్యాచరణను సిద్ధంచేసుకున్నారు. ఇందులో భాగంగా.. జోన్ల వారీగా ఈఓపీఆర్డీలు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తయితే, అక్టోబరులో డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీ ద్వారా పదోన్నతులు పొందే వారి తుది జాబితాలను అధికారులు రూపొందిస్తారు. నవంబరు ఐదో తేదీ కల్లా పదోన్నతులు పొందిన అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కూడా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. -
ఇటు పరిశుభ్రం.. అటు రాబడి
దాదాపు రెండు వేల జనాభా ఉండే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 15 రోజుల నుంచి వర్మీ కంపోస్టు తయారీ మొదలైంది. మే నుంచి ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను 45 రోజుల పాటు కుళ్లబెట్టి వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. సేకరించిన చెత్తలో అట్టముక్కలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు వస్తువులు వంటి పొడి చెత్తను వేరు చేసి 217 కిలోలు విక్రయించారు. వీటిపై వచ్చిన రూ.2,800ను గ్రామ పంచాయతీకి జమ చేశారు. పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీలు తయారు చేసే వర్మీని ‘పల్నాడు వర్మీ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెటింగ్ చేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. పల్నాడు జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు ఉండగా 83 గ్రామాల్లో పూర్తి స్థాయిలో వర్మీ కంపోస్టు తయారీ ప్రారంభమైంది. అలాగే 186 గ్రామాల్లో తయారీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభత్రతో కళకళలాడుతున్నాయి. మరోవైపు సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేయడం ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తతో దాదాపు 1,314 టన్నుల వర్మీ కంపోస్టును తయారుచేశాయి. అంతేకాకుండా ఇందులో 742 టన్నులను విక్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. 4,043 గ్రామాల్లో సేకరించిన చెత్తను.. అవే గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తలను వేరు చేసి.. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేస్తున్నారు. అలాగే పొడి చెత్తను నేరుగా విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో సేకరించిన చెత్తలో ఇప్పటిదాకా 1290.544 టన్నుల పొడి చెత్తను అమ్మారు. వర్మీ కంపోస్టు, పొడి చెత్త అమ్మకం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.1.41 కోట్ల ఆదాయం సమకూరిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ వ్యూహాలపై అధికారుల కసరత్తు.. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీకంపోస్టు తయారీ ప్రారంభమైతే ఒకట్రెండు సంవత్సరాల్లోనే 20–30 రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మీ కంపోస్టును సకాలంలో అమ్మడానికి ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం అవసరమని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో తయారుచేస్తున్న వర్మీ కంపోస్టును పల్నాడు బ్రాండ్ పేరుతో విక్రయించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలోనే స్థానిక రైతులు వర్మీ కంపోస్టును కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించనున్నారు. అలాగే భవిష్యత్‌లో ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను రోడ్ల తయారీలో, సిమెంట్ పరిశ్రమలో వినియోగించేలా చర్యలు మొదలుపెట్టారు. ప్రతివారం సమీక్ష ఒకప్పుడు అపరిశ్రుభ వాతావరణం కారణంగా గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్ వంటివి సంభవించేవి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో వీటికి అడ్డుకట్ట పడింది. వారంలో ఒక రోజు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. సేకరించిన చెత్తను తుది దశకు చేర్చడంపై దృష్టిసారిస్తున్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ.. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. ఆ చెత్తను ఆ గ్రామంలో నిర్మించిన షెడ్లకు తరలించి వర్మీ తయారు చేయడం.. వేరు చేసిన పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత వర్మీ కంపోస్టు కామన్ బ్రాండ్ నేమ్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. – కోన శశిధర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ -
గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరుగా ఆస్తి పన్ను!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరు ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి వేర్వేరు పన్ను విధానం అమలులో ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు ఒకే రకమైన ఇంటి పన్నును వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు తమ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని అవే సమకూర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పలుమార్లు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా నివాసిత ఇళ్లకు ఇప్పుడు అమలులో ఉన్న ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించనున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు మాత్రం కొత్త ఇంటి పన్ను విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అయితే, వ్యాపార దుకాణాలకు ఎంత ఇంటి పన్ను విధించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖే ఒక ప్రాతిపదికను నిర్ధారించనుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీలు వ్యాపార దుకాణాలకు పన్ను నిర్ణయించుకునేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా సర్వే.. గ్రామాలవారీగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించనుంది. పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వ్యాపార అవసరాలకు నిర్మించిన షాపులతోపాటు నివాసిత ఇళ్లకు అనుబంధంగా ఆ ఇంటిలోనే నిర్వహిస్తున్న దుకాణాల వివరాలను వేర్వేరుగా సేకరించనున్నారు. సర్వే అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీ వడ్డన నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పన్నును సవరించాల్సి ఉంది. అయితే, 1996 తర్వాత ఇప్పటివరకు పన్ను సవరణ జరగలేదు. దీనికి బదులుగా 2001 నుంచి ఏటా పాత పన్నుపై ఐదు శాతం చొప్పున పెంచే విధానం అమలవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో అప్పటి ఇళ్ల విలువ ఆధారంగా కొత్త ఇంటి పన్నును నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. దీంతో ఆ జిల్లాలో ఒక్కో యజమాని చెల్లించాల్సిన పన్ను అంతకు ముందున్న ఇంటి పన్నుకు ఐదారు రెట్లు పెరిగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మాదిరిగా రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను పెంపునకు కసరత్తు చేపట్టారు. ఇందుకుగాను 2018లో ప్రిస్ సర్వే పేరిట ప్రతి ఇంటి కొలతలు తీసుకున్నారు. వాటికి ఆ గ్రామంలోని మార్కెట్ ధరను కలిపి ఆ వివరాలన్నింటినీ అన్లైన్లో నమోదు చేశారు. అయితే, 2018 ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం ముగియడం, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఇంటి పన్ను అమలును టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది. -
నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాట య్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అప్పట్లో తెలంగాణలో భిన్న పరిస్థితులు మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. ఆ రాష్ట్రంలో 2016 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. అయితే రాజకీయంగా ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉందని, ఈ దృష్ట్యా కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా వెంటనే జెడ్పీల విభజన చేపట్టడానికి పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదనేది ఒక కారణం అని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల కచ్చితంగా అధికార టీఆర్ఎస్ వారే చైర్మన్లుగా గెలుస్తారో లేదో అన్న సంశయంతో పాత జెడ్పీలనే కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని సమాచారం. అయితే మన రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీకి లేఖ.. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
‘రియల్’ మోసాలకిక కళ్లెం
సొంతిల్లు కట్టుకోవడానికి తొలుత కాసింత స్థలం సమకూర్చుకోవాలన్నది సగటు మధ్యతరగతి కుటుంబం కల. ఈ కలను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అక్రమ లే అవుట్లతో అందినకాడికి దోచుకుని, అమాయక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నగరాలు, పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అందులో ఇల్లు కట్టుకోలేక, ఆ స్థలాన్ని తిరిగి అమ్ముకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్నేళ్లుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏ సౌకర్యం లేని చోట ప్లాట్ కొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్రమ లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కట్టడికి ఉపక్రమించింది. కనీసం రోడ్డు, కరెంటు లైన్, మంచి నీటి వసతి కూడా లేని అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొని సామాన్య ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలుగా జారీ చేసింది. మరోవైపు ఒక వేళ ఇప్పటికే ఆ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్న వారు సైతం నష్టపోకుండా.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ లే అవుట్లను నియంత్రించడంతో పాటు వాటిలో ఇళ్ల ప్లాట్లను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తగిన సూచనలు చేయాలంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు వేయడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. గత పదేళ్ల కాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 431 మండలాల పరిధిలోని 3,716 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 78,303 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇళ్ల నిర్మాణం కోసం 15,783 లే అవుట్లు కొత్తగా వెలిశాయి. అందులో 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లే అవుట్లు అక్రమంగా వేసినవని పంచాయతీరాజ్ శాఖ ఇటీవల నిర్ధారించింది. ఇలాంటి అక్రమ లే అవుట్లలో 2,54,854 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. 2015 నాటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 6,049 అక్రమ లే అవుట్లు ఉన్నాయని అప్పటి అధికారులు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోకుంటే ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయే ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ తర్వాత కూడా గ్రామాల్లో అక్రమ లే అవుట్ల దందా యధావిధిగా కొనుసాగింది. పర్యవసానంగా 2019 నాటికి అక్రమ లే అవుట్ల సంఖ్య 9,422కు పెరిగింది. 90 శాతం వాటిలో కరెంటు లైను కరువు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,169 అక్రమ లే అవుట్లలో కేవలం 4,179 లే అవుట్లకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. కేవలం 362 లేఅవుట్లకు మాత్రం మంచి నీటి సరఫరా సౌకర్యం అందుబాటులో ఉంది. 814 లే అవుట్లకు కరెంటు లైను వసతి ఉన్నట్టు అధికారులు తేల్చారు. అంటే 9,355 అక్రమ లే అవుట్లకు కరెంటు లైను కూడా లేదు. నిబంధనల ప్రకారం.. అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే కొత్తగా రోడ్డు వసతితోపాటు కరెంటు లైను, మంచి నీటి పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు, గ్రామ పంచాయతీలు ముందుకొస్తాయి. అనుమతులు పొందని వాటికి ఆ వసతుల కల్పనకు ఆటంకాలు ఉంటాయి. ఇళ్ల కోసం కొత్తగా ఎలాంటి లే అవుటు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందడంతో పాటు లే అవుటు ప్లానింగ్‌కు సంబంధించి డీటీసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిలో లే అవుటు ఏర్పాటు చేస్తుంటే దానికీ వేరుగా అనుమతులు తీసుకోవాలి. ఈ సమయంలో లే అవుట్ల విస్తీర్ణం ప్రకారం నిబంధనల మేరకు వెడల్పైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తం లే అవుట్ల విస్తీర్ణంలో పది శాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి బదలాయించాల్సి ఉంటుంది. ఆ ప్రాంత స్థానికుల అవసరాల మేరకు భవిష్యత్‌లో అక్కడ పాఠశాల, పార్కు, మంచి నీటి ట్యాంకు వంటి వాటి ఏర్పాటుకు వీలుంటుంది. నగరాలు, పట్టణాల పక్కన ఉండే గ్రామాల్లోనే.. నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే అక్రమ లే అవుట్ల దందా పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,684 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు విస్తరించి ఉండగా, అందులో నగరాలు, పెద్ద పట్టణాలు ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 29,075 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన గ్రామాల్లో కేవలం 8,609 ఎకరాల్లో ఈ అక్రమ లే అవుట్లు ఉన్నాయి. -
‘పంచాయతీరాజ్’లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల నుంచి ఎంపీడీవోల వరకు పదోన్నతులు దక్కనున్నాయి. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 52 డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులతో పాటు జిల్లాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిప్యూటీ జెడ్పీ సీఈవో పోస్టులలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 128 ఎంపీడీవో పోస్టుల్లో మండల స్థాయిలో పనిచేసే ఈవోపీఆర్డీలతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లోని అడ్మినిస్ట్రేటివ్ అధికారుల(సూపరిండెంట్లు)కు పదోన్నతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం 4 జోన్ల పరిధిలో 45 ఈవోపీఆర్డీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఈవోపీఆర్డీలకు పదోన్నతుల ద్వారా అదనంగా చేరే పోస్టుల్లో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేసే వారికి పదోన్నతి కల్పించనున్నారు. ఏపీలోని 4 జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులు.. గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ దక్కనుంది. -
చెత్త నుంచి సంపద సృష్టించిన గ్రామాలు
సాక్షి, అమరావతి: చెత్తే కదాని తేలిగ్గా తీసి పడేయకండి.. ఎందుకంటే ఇప్పుడది సంపదను సృష్టించే వనరుగా మారింది. దాని నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయార్జనకు బాటలు వేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయతీ గడిచిన మూడు నెలల్లో ఇలా రూ.1,62,800 ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మారుస్తూ.. దానిని రైతులకు అమ్ముతూ ఆ డబ్బును కూడబెట్టాయి. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 గ్రామ పంచాయతీలు ఇలా చెత్త నుంచి వర్మీ కంపోస్ట్, అమ్మకం ద్వారా రూ.14,06,994ను సంపాదించాయి. క్లీన్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ రెండో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించాక.. పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ చెత్త సేకరణ ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో చెత్త సేకరణకు అవసరమైన ఆటో రిక్షాలు, ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చడంతో పాటు చెత్త సేకరణలో పనిచేసే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలనూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 98.73 లక్షల ఇళ్లు ఉన్నట్టు అంచనాకాగా, వాటిలో 95.63 లక్షల ఇళ్ల నుంచి ఇప్పటికే రోజు వారీ చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇక ఆ చెత్త నుంచి వర్మీ తయారీపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 198 గ్రామాల్లో ఇప్పటికే వర్మీ తయారీ అమ్మకాలు మొదలు కాగా.. రానున్న వారం రోజుల్లో మరో 656 గ్రామాల్లో వర్మీ తయారీ, అమ్మకాల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 40 రోజుల్లో వర్మీ రెడీ చెత్తను వర్మీగా తయారు చేసేందుకు కనీసం 40 రోజులు పడుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామాల్లో ప్రభుత్మం నిర్మించిన సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలిస్తారు. ఇప్పటికే ఉన్న షెడ్లకు తోడు ప్రభుత్వం కొత్తగా మరో 1,794 గ్రామాల్లో షెడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ షెడ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల్లో ఆ చెత్తను వేసి, దానిపై వాన పాములను ఉంచుతారు. ఆ తర్వాత వాటిపై గోనె పట్టలను ఉంచి ఎప్పటికప్పుడు వాటిని తడిచేస్తూ నిర్ణీత ఉష్ణోగత్ర కొనసాగేలా జాగ్రత్తలు చేపడతారు. 40 రోజుల తర్వాత వాన పాములు ఉంచిన ఆ చెత్త మిశ్రమం వర్మీగా మారుతుందని అధకారులు చెబుతున్నారు. కిలో వర్మీ రూ.10 చెత్త నుంచి తయారు చేసిన వర్మీని కిలో రూ.10 చొప్పన అమ్మాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సూచనలిచ్చింది. ప్రస్తుతం చాలా తక్కువ గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ మొదలవడంతో.. తయారైన కొద్దిపాటి వర్మీ అమ్మకానికి పెద్దగా ఇబ్బందుల్లేవని అధికారులంటున్నారు. స్థానిక రైతులతో పాటు ఇళ్లల్లో మొక్కలు పెంచుకునే వారు కూడా వర్మీని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ ఊపందుకుని, పెద్ద మొత్తంలో అందుబాటులోకొస్తే.. అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అనుమతి కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. అన్ని గ్రామాల్లో మొదలైతే రూ.300 కోట్ల వరకూ ఆదాయం పంచాయతీరాజ్ శాఖ ముందస్తుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి వర్మీ తయారీ ప్రక్రియ మొదలైతే గ్రామ పంచాయతీల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ తరహా వర్మీ తయారీ ద్వారానే గ్రామాలకు ఏటా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. -
లేఅవుట్లపై ‘అక్రమ’ రాతలు!! ‘ఈనాడు’ మార్కు రాతలకు పరాకాష్ట
సాక్షి, అమరావతి: అదేంటో!! చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోతే... రామోజీకి, ఆయన ‘ఈనాడు’ పత్రిక చూపులు భలే పదునెక్కిపోతాయి. అప్పటిదాకా మూసుకుపోయినా... ఒక్కసారిగా తెరుచుకుంటాయి. పాపం చూపు బాగయితే ఇబ్బందేమీ లేదు!. కానీ... అప్పుడు చూసినవన్నీ అంతకు ముందు లేవనుకోవటంతోనే చిక్కంతా!!. ‘అక్రమ లేఅవుట్లకు రాజకీయ అండ’ అని ఆదివారం నాడు మొదటి పేజీలో వండేసి అచ్చోసిన కథనం కూడా ఇలాంటిదే. పోనీ ఆ అంకెలైనా సరిగా వేశారా అంటే... అవీ తప్పులే. మన ప్రభుత్వం కాదు కాబట్టి ఎంత బురదయినా చల్లొచ్చనుకునే దుర్మార్గపు రాతలకు పరాకాష్ట ఆ అంకెలు. ‘ఈనాడు’ మరీ దిగజారిపోయి రాసిన ఈ రాతల్లో ఏ కొంచెమైనా నిజముందా? అసలేది నిజం? ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడి హయాంలో విచ్చలవిడిగా వెలసిన అక్రమ లే అవుట్లతో కలిపి... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనుమతుల్లేని లేఅవుట్ల సంఖ్య సాక్షాత్తూ 10,160. వీటిలో 3,551 వరకూ గ్రామాల్లో ఉండగా... మిగిలినవి అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం లే అవుట్లు 37,684 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని... వీటిలో దాదాపు 2.54 లక్షల ప్లాట్లున్నాయని ఇటీవల ప్రభుత్వాధికారులే ఓ నివేదికను తయారు చేశారు. అక్రమ లే అవుట్లకు మంచినీరు, కరెంటు వంటి సదుపాయాలుండవు కాబట్టి... అక్కడి ప్లాట్ల యజమానులకు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేస్తే బాగుంటుందనే అంశాన్ని ఇటీవల మంత్రుల బృందం సమగ్రంగా చర్చించింది. అధికారుల నివేదిక మొత్తాన్ని పరిశీలించింది. మరి ఇదే నివేదికలోని అంశాలను ‘ఈనాడు’ తప్పులెందుకు రాసింది? మొత్తం లే అవుట్ల సంఖ్యను 10వేలకు బదులు 13,711గా... 37వేల ఎకరాలకు బదులు 47వేల ఎకరాలుగా ఎందుకు రాసింది? ఎందుకంటే ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు కాబట్టి ఎంత బురదయినా చల్లొచ్చనేది దాని సిద్ధాంతం. ఇంకో చిత్రమేంటంటే... ఈ లే అవుట్లన్నీ ఇప్పుడే వెలసినట్లు... వాటన్నిటినీ అధికార పార్టీకి చెందిన నాయకులు కాపాడుతున్నట్లు ఇష్టం వచ్చినట్లు రాసి పారేసింది. ఈ అక్రమ లే అవుట్లపై కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారని, వీటివల్ల పంచాయితీలు, నగరాభివృద్ధి సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని కూడా శోకాలు పెట్టింది. చంద్రబాబు నివేదికను ప్రస్తావించరేం? నిజానికి చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక అక్రమ లే అవుట్లు ఇష్టానుసారం వెలిశాయి. పెద్ద సంఖ్యలో నేతల అండతో అనుమతుల్లేని లే అవుట్లు పుట్టుకొచ్చాయి. దీనిపై 2015లో అప్పటి అధికారులు నాటి సీఎం చంద్రబాబునాయుడికి నివేదిక ఇస్తూ... రాష్ట్రంలో అప్పటికి 6,049 అక్రమ లే అవుట్లున్నాయని పేర్కొన్నారు. వాటిపై చర్యలు తీసుకోకుంటే కొనుగోలుదారులు నష్టపోతారని కూడా తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పాపానే పోలేదు. ఆ తరవాతైనా అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట పడిందా అంటే... దాదాపు శూన్యం. దీంతో 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఈ సంఖ్య ఏకంగా 9.422 వరకూ చేరింది. పాపం రామోజీకి, ‘ఈనాడు’కు అప్పట్లో చూపు మందగించి ఇవేవీ కనిపించలేదు. వీటిపై వార్తలు వస్తే ఒట్టు!!. మంత్రుల బృందం చర్యలు... కొత్తగా వచ్చే లే అవుట్లకు రోడ్డు, కరెంటు, మంచినీరు వంటి వసతుల కల్పన అంశంలో గ్రామ పంచాయతీల నుంచి ఆ శాఖ కమిషనర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కొద్దినెలల క్రితం గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను జల్లెడపట్టే ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం గ్రామాల వారీగా ఆయా మండల ఈఓపీఆర్డీ, సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఓ జూనియర్ అసిస్టెంట్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లేఅవుట్లు అనుమతులు లేనివేనని పంచాయతీరాజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. ఈ అక్రమ లేఅవుట్లలో మొత్తం 2,54,854 ప్లాట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ ప్లాట్లు చాలావరకూ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయన్నది అధికారుల మాట. ఈ 10,169 అక్రమ లే అవుట్లలో 4,179 లేఅవుట్లకు రోడ్డు వసతి ఉండగా, 362 లేఅవుట్లకే మంచినీటి సరఫరా వసతి ఉంది. 814 లేఅవుట్లకు మాత్రమే కరెంటు లైను ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ లే అవుట్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలి? వీటిని నియంత్రించటంతో పాటు ప్లాట్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాన్ని పెద్దిరెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ చర్చించింది కూడా. త్వరలో వీరు సీఎంకు నివేదించాక తదుపరి చర్యలేంటన్నది తెలిసే అవకాశముంది. కాకపోతే ‘ఈనాడు’ మాత్రం ఈ వాస్తవాలన్నిటికీ ముసుగేసి... ఇవన్నీ ఇప్పుడే వెలసినట్లు... అధికార పార్టీ అండదండలతో పెరిగిపోతున్నట్లు పాఠకులను తప్పుదోవ పట్టించేలా వార్తలు రాయటాన్ని ఏమనుకోవాలి? ఇది ఏ మార్కు జర్నలిజం రామోజీ? -
గ్రామాల్లో పారిశుధ్యంపై ‘యాప్’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేసింది. తమ ఇళ్ల పరిసరాల్లో అపరిశుభ్రతపై స్థానికులు మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సర్పంచ్ ఆధ్వర్యం లో సంబంధిత పంచాయతీ కార్యదర్శి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. గ్రామాలను పరి శుభ్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకునే చర్యల ఆధా రంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరుకు రేటింగ్ ఇవ్వనున్నారు. యాప్ ద్వారా అందే ఫిర్యాదుల పరి ష్కారంపై పర్యవేక్షణకు జిల్లా డీపీవో కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూంలతో పాటు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో మరొకటి ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ఫిర్యాదు అందిన తర్వాత 72 గంటలపాటు కంట్రోల్ రూం ద్వారా పర్య వేక్షిస్తారు. పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా వివరాలు తెలియజేస్తారు. ఒకవే ళ సంతృప్తి చెందకున్నా, పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకున్నా మరోసారి ఫిర్యాదు చేసే వీలుంది. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే పంచాయతీ కార్యదర్శి పనితీరుపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారు. అతి త్వరలో అందుబాటులోకి యాప్.. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ‘జేఎస్ఎస్’ పేరుతో ఇప్పటికే మొబైల్ యాప్ సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో ప్లే స్టోర్ ద్వారా యాప్ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. తప్పుడు ఫిర్యాదులకు అవకాశం లేకుండా అప్పటికప్పుడు తీసిన ఫోటో లేదా చిన్నపాటి వీడియోను మాత్రమే ఫిర్యాదుతో జోడించేలా యాప్‌ను రూపొందించారు. యాప్ ద్వారా పంపిన ఫిర్యాదు వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శికి చేరుతుంది. 24 గంటల తర్వాత మండల స్థాయి ఈవోపీఆర్డీకి, 48 గంటల తర్వాత జిల్లా డీపీవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం వద్దకు ఆటోమెటిక్‌గా సమాచారం అందుతుంది. ఏ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు? క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గ్రామాలను సైతం పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన విషయం తెలిసిం దే. పల్లెల్లోనూ ప్రతి ఇంటినుంచి చెత్తసేకరణ కార్య క్రమాన్ని చేపడుతున్నారు. తమ ఇళ్ల నుంచి నిర్ణీత గడువు ప్రకారం రోజువారీ చెత్తను సేకరించక పో యినా, రోడ్లపక్కన ఒకేచోట పెద్దమొత్తంలో పేరుకు పోయినా, మురుగు కాల్వలు సక్రమంగా లేకున్నా, మురుగునీటి గుంతలున్నా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వీలుంది. ఫిర్యాదులో వివరాలు నమోదు చేసేలా వీలు కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో.. గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వ మే అందజేస్తోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు, ఆటో రిక్షాలు లాంటివి అన్ని గ్రామాలకు సరఫరా చేసింది. అక్టోబరు 2న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 55.41 లక్షల ఇళ్ల నుంచి రోజువారీ చెత్త సేకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్లను శుభ్రం చేసే హై ప్రెజర్ క్లీనర్స్, దోమల నివారణకు ప్రతి గ్రామానికి ఒక ఫాగింగ్ మిషన్, ఇతర యంత్రాల సరఫరాకు చర్యలు చేపట్టారు. 2022 డిసెంబరు వరకు పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షించే ఈ కార్యక్రమాలు తర్వాత పంచాయతీ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయి. -
ఫోన్ కొట్టు.. అవినీతి ఆటకట్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రెండేళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లోనే యాక్షన్‌లోకి దిగిపోతోంది. ఫిర్యాదుల తీరును బట్టి తగిన చర్యలు తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు వాస్తవమని తేలితే కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏసీబీ ‘స్పందన’ వ్యవస్థను విజయవంతంగా నిర్వహిస్తోంది. 97 శాతం కేసులు నిర్ణీత వ్యవధిలో పరిష్కారం బాధితుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడంపై ఏసీబీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందుకోసం విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ 14400 కేటాయించింది. బాధితులు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే విజయవాడలోని ఏసీబీ ప్రధాన కా ర్యాలయానికి వెంటనే సమాచారమిస్తారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆరోపణల తీరును బట్టి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరిస్తున్నారు. సాధారణ ఫిర్యాదులైతే 10 రోజులు, లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఫిర్యాదులైతే నెల రోజుల్లో పరిష్కరించాలన్నది గడువు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ 4 వరకు 97% ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం విశేషం. ఇప్పటివరకు 5,155 ఫిర్యాదులు రాగా.. వాటిలో నిర్ణీత గడువులోగా ఏకంగా 5,037 ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. కేవలం 118 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి కూడా ఇంకా గడువు ఉంది. ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలియగానే చాలా వరకు కేసులు పరిష్కారమైపోతున్నాయి. ప్రభుత్వం కఠినంగా ఉండటంతో సంబంధిత అధికారులు, ఉద్యోగులు తక్షణం బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాగా, వచ్చిన ఫిర్యాదులను విచారించి అవినీతి ఆరోపణలు వాస్తవమని గుర్తించిన కేసుల్లో తదనుగుణంగా తక్షణం చర్యలు తీసుకుంటోంది. అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల పైనే.. రెండేళ్లలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విషయంలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో, పంచాయతీరాజ్ శాఖ రెండో స్థానంలో ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, సర్టిఫికెట్ల మంజూరు, భూముల సర్వేకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. పంచాయతీరాజ్ శాఖలో సర్టిఫికెట్ల జారీ, రుణాలు/పింఛన్లు/ఇళ్లపట్టాల మంజూరు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. -
వెలగబెట్టేశారు!
ఒక్క గ్రామంలోనే ఏటా రూ.25 వేలు ఆదా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మాల్యవంతం గ్రామంలో ఐదు నెలల కిత్రం వరకు ఎల్ఈడీ వీధి దీపాలు 24 గంటలూ వెలుగుతుండేవి. గ్రామంలో 325 విద్యుత్ స్తంభాలుంటే ప్రతి నెలా 650 యూనిట్ల వరకు కరెంట్ వినియోగం అయ్యేది. 2018 జూలై నుంచి అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న వీధి దీపాల నిర్వహణ బాధ్యతను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో గత జూలైలో వినియోగం 310 యూనిట్లకు తగ్గిపోయింది. అంటే ఒక్క గ్రామంలోనే నెలకు 340 యూనిట్లు ఆదా అవుతోంది. యూనిట్ రూ.6.05 చొప్పున పంచాయతీపై కరెంట్ బిల్లు భారం ప్రతి నెలా రూ.2,057 తగ్గింది. ఇలా ఒక్క పంచాయతీలోనే ఏడాదికి దాదాపు రూ.25 వేల వరకు ఆదా కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించినప్పటికీ ఏళ్ల తరబడి వీధి దీపాల కరెంట్ వృథా కారణంగా ఇంకా రూ.లక్షల్లో బకాయిలున్నట్లు పంచాయతీకి ప్రతి నెలా నోటీసులు అందుతున్నాయి. – సాక్షి, అమరావతి ఏం చేస్తున్నావురా వెంకన్నా...? మా అయ్య చేసిన అప్పులు తీరుస్తున్నా..! రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఇదే మాదిరిగా ఉంది. గత సర్కారు మోపిన అవినీతి గుదిబండ భారాన్ని మోయలేక గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ శాఖ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా దాదాపుగా అన్ని గ్రామాల పరిస్థితి ‘మాల్యవంతం’ మాదిరిగానే ఉంది. 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 9 నుంచి 13 లక్షల దాకా వీధి దీపాలు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉండటమే దీనికి కారణం. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం టీడీపీ సర్కారు నియమించిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. కనీసం పంచాయతీలకైనా అప్పగించకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీధి దీపాల నిర్వహణ బాధ్యత నుంచి కాంట్రాక్టర్లను తప్పించి తిరిగి పంచాయతీలకు అప్పగించింది. పగటి పూట వృథాను నివారిస్తూ ప్రతి 20–30 వీధి దీపాలకు ఒక స్విచ్ బాక్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. గత రెండు నెలలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు చేపట్టారు. కర్నూలు మినహా మిగిలిన 12 జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.వందల కోట్లు ఆదా.. వీధి దీపాలు రాత్రి 6.30 నుంచి తెల్లవారుజాము వరకు సగటున 11 గంటల పాటు వెలిగితే సరిపోతుంది. రోజంతా 24 వాట్ల ఎల్ఈడీ బల్బు అనవసరంగా వెలగడం వల్ల ఏడాదికి 114 యూనిట్లు అదనంగా వినియోగం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా విద్యుత్తు వృథానే. వీధి దీపాల కరెంట్‌కు యూనిట్ రూ.6.05 చొప్పున బిల్లు చెల్లించాలి. పగలు కూడా వెలగడంతో ఒక్కో బల్బుకు ఏటా దాదాపు రూ.700 అదనంగా బిల్లు కట్టాల్సి వస్తోంది. 200 వీధి దీపాలుండే చిన్న పంచాయతీపై ఏటా రూ.1.40 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. పగటి పూట వెలిగే వీధి దీపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలపై ఏటా రూ.70 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా. 15 మంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నెడ్‌క్యాప్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు గత సర్కారు పేర్కొంది. అయితే ఆ తర్వాత టీడీపీ పెద్దల అనుయాయులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఒప్పందాలు చేసుకున్నారు. 15 మంది కాంట్రాక్టర్లు జిల్లాలవారీగా పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 24.86 లక్షల ఎల్ఈడీ బల్బులు మార్పిడి చేశారు. వాటి పర్యవేక్షణ, మరమ్మతుల బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దేనని ఒప్పందంలో ఉన్నప్పటికీ నిర్వహణను గాలికి వదిలేశారు. 13 లక్షల వీధి దీపాలకు స్విచ్ బాక్స్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలిగి పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా జరిగినట్లు అధికారులు తెలిపారు. రూ.3,800 కోట్లకు చేరిన బకాయిలు.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లుల బకాయిలు రూ.3,800 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. కాంట్రాక్టర్ల నిర్వాకంతో వీధి దీపాలు నిరంతరం వెలగడం, ప్రతి నెలా అపరాధ రుసుము పేరుకుపోవడం భారీ బకాయిలకు కారణం. 2018 ఆగస్టు నుంచి పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ప్రత్యేకాధికారుల కొనసాగిన సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రూ.వెయ్యి బల్బుకు రూ.6,000 పంచాయతీల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ట్యూబ్‌లైట్ వీధి దీపాలను అధిక విద్యుత్తు వినియోగం జరుగుతోందంటూ గత సర్కారు 2017లో తొలగించి ఎల్డీఈ బల్బులు ఏర్పాటు చేసింది. పంచాయతీలపై రూపాయి భారం పడకుండా వీటిని సమకూరస్తున్నట్లు నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎల్ఈడీ బల్బుల వల్ల ఆదా అయ్యే విద్యుత్ బిల్లులో 80 శాతాన్ని సంబంధిత పంచాయతీలు కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ఒక్కో బల్బుకు మూడు నెలలకు ఒకసారి రూ.150 చొప్పున ఏడాదికి రూ.600 పదేళ్ల పాటు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. రూ.1,000 విలువైన ఎల్ఈడీ బల్బుకు గ్రామ పంచాయతీ పదేళ్ల పాటు దాదాపు రూ.6,000 కాంట్రాక్టర్లకు చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. -
సీఎంకు పంచాయతీరాజ్ శాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు సీఎం జగన్‌ను కలిశారు. -
Andhra Pradesh: ఆ ఊళ్లన్నీ ఏకతాటిపై..
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో అత్యధికంగా మత్స్యకార కుటుంబాలే నివశిస్తుంటాయి. ఆ గ్రామంలో దాదాపు 19 వేల జనాభా ఉంది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉండే 18 వార్డు సభ్యులతో పాటు సర్పంచి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఎవరెన్ని చెప్పి చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా, ఈ ఊళ్లో వారి పప్పులు ఉడకలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వివిధ రూపాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదని మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లో తేటతెల్లమైంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పట్టింది. పదివేలకుపైగా జనాభా ఉండే 11 పెద్ద గ్రామాల్లో సైతం ప్రజలు ఒకే పక్షా న ఉంటూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మొ త్తం వార్డు సభ్యులతోపాటు సర్పంచిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13,095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2,199 సర్పంచి పదవులకు, 48,022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీ వంగా ఎన్నికలు ముగిశాయి. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువశాతం పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో అత్యధికం రెండు వేలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అత్యధికంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా జిల్లాల వారీగా వివరాలను సేకరించి ఒక నివేదికను సిద్ధం చేసింది. రెండు వేలు, అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో 1,401 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు నిర్ధారించారు. -
పంచాయతీ పటిష్టం!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో కొత్తగా స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు తదితర గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను ఈ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ.. ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ స్థాయిలో అదనంగా ఎన్ని కమిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో ఉండే వార్డు సభ్యులందరినీ ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో తప్పనిసరిగా సభ్యునిగా నియమించాల్సి ఉంటుంది. ఒక్కో వార్డు సభ్యుడు రెండుకు మించి స్టాండింగ్ కమిటీలలో ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, సంబంధిత అంశంలో గ్రామ స్థాయి నిపుణత ఉన్న పౌరులను ఈ కమిటీలలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా తమ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ చట్టానికి తగిన సవరణలు తీసుకు రావడంతో పాటు, సంబంధిత శాఖ ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖ రాశారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రభుత్వాలలో స్టాండింగ్ కమిటీల విధానం ఇప్పటికే అమలులో ఉంది. అయితే నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ప్రస్తుతం స్టాండింగ్ కమిటీల విధానం కొనసాగుతోంది. మండల పరిషత్‌లలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ తరహా ప్రక్రియ అమలులో లేదు. చట్ట సవరణ ద్వారా కొత్తగా గ్రామ పంచాయతీలలో కూడా స్టాండింగ్ కమిటీల ఏర్పాటు వల్ల సుస్థిర అభివృద్ధితో పాటు పనుల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆస్తుల పరిరక్షణ, వివిధ కార్యక్రమాల అమలు సులువవుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీల బాధ్యతలు 1.జనరల్ స్టాండింగ్ కమిటీ : పంచాయతీ పాలన, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ, గ్రామ పంచాయతీ ఆస్తుల నిర్వహణ, గ్రామంలో రేషన్‌షాపుల పర్యవేక్షణ– కార్డుదారుల ప్రయోజనాలను కాపాడడం తదితర అంశాలు. 2.గ్రామ వైద్య, పారిశుధ్య, పోషకాహార స్టాండింగ్ కమిటీ : గ్రామ పరిధిలో వైద్య సంబంధిత, పారిశుధ్య సంబంధిత అంశాల అమలు. ఎక్కువ షోషకాలు ఉండే వాటినే ఆహారంగా తీసుకునేలా స్థానిక ప్రజలలో అవగాహన కల్పించడం. 3.ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ : గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం. పంచాయతీ నిధుల పర్యవేక్షణ, ఆడిట్, ఇతర పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు. 4. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ : అంగన్ వాడీ కేంద్రాలతో పాటు గ్రామ పరిధిలో విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఆయా విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు తీరుపై పర్యవేక్షించడం. 5.సోషల్ జస్టిస్ కమిటీ : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ. 6.మంచినీటి సరఫరా, పర్యావరణ కమిటీ : గ్రామంలో మంచినీటి సరఫరా, వర్షపునీటిని ఆదా చేసేందుకు తగిన చర్యలు చేపట్టడం, వ్యవసాయానికి సాగునీటి సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలు. -
ఉపాధి హామీ బిల్లులు రెండు వారాల్లో చెల్లించండి
సాక్షి, అమరావతి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించిన బకాయిలను రెండు వారాల్లో పిటిషనర్లందరికీ చెల్లించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బకాయిలు చెల్లించకపోవడం పౌరులు హుందాగా జీవించే హక్కును హరించే విధంగా ఉందంది. కొందరికి బకాయిలు చెల్లించామని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించడంలేదంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం మరోసారి విచారణ జరిగింది. బకాయిల డబ్బు పిటిషనర్ల ఖాతాల్లో జమ కాలేదని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ న్యాయవాది వడ్లమూడి కిరణ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖర్చు చేయని నిధులు ఉన్నాయన్న కేంద్రం వాదన సరికాదన్నారు. రాష్ట్రం అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తాన్ని కేంద్రం నిధుల విడుదల సమయంలో సర్దుబాటు చేసుకుందని తెలిపారు. ఇప్పటికే బకాయిలను ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. బకాయిలను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ, పిటిషనర్లకు బకాయిలను మాత్రం రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించారు. -
ఏపీ: స్వయం ఉపాధిలో ‘చేయూత’ మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం తొలి విడతలో 78 వేల రిటైల్ షాపులను మహిళలు ఏర్పాటుచేశారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తొలి విడత చేయూత లబ్ధిదారులు 1,19,000 పశువులను, 70,955 గొర్రెలు, మేకలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 12న వైఎస్సార్ చేయూత మొదటి విడత కార్యక్రమాన్ని అమలు చేశామని, దీనిలో మొత్తం 24,00,111 మంది లబ్ధిదారులకు రూ.4,500.20 కోట్ల మేర లబ్ధి జరిగిందన్నారు. రెండో ఏడాది 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.4,400 కోట్ల అర్థిక సాయం అందించామని మంత్రి తెలిపారు. మంచి ఆశయంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకాన్ని అమలుచేయడం, పర్యవేక్షించడంలో అధికారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ప్రశంసించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లపై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఇప్పటికే రిలయన్స్, ఏజియో, మహేంద్ర అండ్ ఖేధీ వంటి ప్రముఖ సంస్థలు మహిళల వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన మార్కెటింగ్‌లో శిక్షణకు ముందుకు వచ్చాయన్నారు. వీధి దీపాల నిర్వహణలో ఏజెన్సీ విఫలం గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీ పనితీరుపట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వీధిదీపాలకు చెల్లిస్తున్న విద్యుత్ బిల్లును తగ్గించాలనే లక్ష్యంతో జగనన్న పల్లెవెలుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటుచేశామని.. అయితే వీటి నిర్వహణలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీ విఫలమయ్యిందన్నారు. పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతుండడంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని పెద్దిరెడ్డి అన్నారు. వీటి నిర్వహణలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇక పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ ఎన్ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్: గ్రామ కంఠాల్లోని ఆస్తులకు సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా గ్రామ కంఠాల్లో ఇల్లు లేదా ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న వీటిని పంపిణీ చేయనుందని సమాచారం. దాదాపు 100 గ్రామ కంఠాల్లో 20 వేల నుంచి 25 వేల వరకు ఆస్తులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ధ్రువీకరణ పత్రాలు అందజేయించాలని పంచాయతీరాజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 241 గ్రామాల్లోని ఆస్తులకు మ్యాప్‌లలో మార్కింగ్.. గ్రామ కంఠాల్లో ప్రజలకు సంబంధించిన ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణ పత్రాల్లేవు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా ఇప్పటిదాకా 753 గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తయ్యిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 241 గ్రామాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు మ్యాప్‌లలో మార్కింగ్ చేశారు. వీటిని పంచాయతీరాజ్ శాఖకు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ సంబంధిత గ్రామాలకు వీటిని పంపిస్తోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆస్తిని ధ్రువీకరించుకుంటారు. ఇవి కాకుండా క్షేత్ర స్థాయిలోని అధికారులు ఏవైనా ఆస్తులను గుర్తిస్తే.. వాటి వివరాలను మ్యాప్‌కు జత చేసి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. ఈ వివరాలను పరిశీలించి మళ్లీ కొత్త మ్యాప్‌లను తయారు చేస్తారు. తుది మ్యాప్‌లో గ్రామ పరిధిలోని ఒక్కొక్క ఆస్తికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఒక్కొక్క ఆస్తికి.. దాని యజమాని వివరాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. ఈ పత్రాల్లో ఆ ఆస్తికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. 16 గ్రామాల్లో 3,170 ఆస్తుల వివరాలు సిద్ధం ఇప్పటివరకు 16 గ్రామాల పరిధిలో ఆస్తి ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ 16 గ్రామాల పరిధిలో ఉన్న 3,170 ఆస్తులకు సంబంధిత యజమాని వివరాలతో పాటు మ్యాప్‌లు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లా బూతుమిల్లిపాడు పరిధిలోని గ్రామ కంఠంలో ఉన్న ఆస్తుల గుర్తింపు ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించారు. -
‘ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోండి’
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో హైకోర్టు ప్రామాణిక రూపంలో జారీచేసే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేరుస్తూ ఇద్దరు హైకోర్టు అధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రామాణిక రూపానికి అదనపు వాక్యాలు చేర్చడం న్యాయస్థాన రాజ్యాంగ విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టంచేసింది. ఇందుకు బాధ్యులైన ఆ ఇద్దరు అధికారులపై సుమోటో కింద కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. పరిపాలనాపరంగా వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌కు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సర్వీసు క్రమబద్ధీకరణకు పిటిషన్.. తన నియామకం జరిగిన నాటి నుంచి బిల్ కలెక్టర్‌గా తన సర్వీసును క్రమబద్ధీకరించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎస్. భైరవమూర్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భైరవమూర్తి సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలుచేయకపోవడంతో వారిపై భైరవమూర్తి 2020లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఎస్వీ నాగేశ్వర నాయక్‌లను ప్రతివాదులుగా చేర్చారు. చివరకు 2021 మే 31న అధికారులు కోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి డీపీఓ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ కారణమని న్యాయస్థానం తేల్చింది. కానీ, ఇందులో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ అతని పేరు తొలగించింది. అనంతరం డీపీవో, ద్వివేదీలు కోర్టు ఆదేశాల అమల్లో జాప్యానికి క్షమాపణ కోరి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటామన్నారు. దీంతో హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార కేసును మూసివేసింది. ఆ ఇద్దరు అధికారులు బాధ్యులు ప్రామాణిక రూపంలో ఉండే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేర్చడాన్ని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులెవరో గుర్తించాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించారు. విచారణ జరిపిన రిజిస్ట్రార్.. ఇందుకు ఇద్దరు అధికారులను బాధ్యులుగా తేల్చారు. వారిపై పాలనాపరమైన చర్యల నిమిత్తం ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను జస్టిస్ దేవానంద్ ఆదేశించారు. -
పట్టణాలకు దీటుగా పల్లెలు
సాక్షి, అమరావతి: పట్టణాలకు దీటుగా పల్లెల్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు ముందుండి పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వంద రోజులపాటు చేపట్టే ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఆ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక శంఖారావం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్డీ దుర్గాప్రసాద్‌లు తాడేపల్లి కమిషనర్ కార్యాలయం నుంచి పాల్గొనగా.. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆయా మండలంలో సర్పంచులందరూ ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ తపిస్తున్నందున ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 పల్లెలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని పెద్దిరెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,371 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరారు. పరిశుభ్రతతో 95 శాతం అంటువ్యాధులు తగ్గాయి గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు 95 శాతం తగ్గినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని సర్పంచ్‌లకు సూచించారు. 11,412 మంది సర్పంచులకు చెక్ పవర్.. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 11,412 మంది సర్పంచులకు సోమవారం నాటికి చెక్ పవర్ బదలాయింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,680 మందికీ ఒకట్రెండు రోజులలోనే బదలాయించనున్నట్లు తెలిపారు. అలాగే, పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేశామన్నారు. మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్‌లు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. కాగా, వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి సర్పంచ్ ఇందిరెడ్డి స్వాతి, కర్నూలు జిల్లా ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష, నెల్లూరు జిల్లా జమ్మలపాలెం సర్పంచ్ బి. శ్రీదేవి, ప్రకాశం జిల్లా జువ్వలేరు సర్పంచ్ ఎస్. సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. రీచ్‌ల నుంచే నేరుగా జగనన్న కాలనీలకు ఇసుక విజయవాడలో మంత్రి పెద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేరుగా రీచ్‌ల నుంచే జగనన్న కాలనీల్లో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రవాణా చార్జీలు తగ్గడంతోపాటు డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లే హ్యాండ్లింగ్ చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. లేనిపక్షంలో వీటిని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. కడుతున్న ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా, వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. నెలాఖరులోపు ఈ సీజన్‌కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు. -
సర్పంచ్‌లతో నేడు మంత్రి పెద్దిరెడ్డి సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం అమలుపై ఆయన సర్పంచ్‌లతో చర్చిస్తారు. ప్రతిధ్వని పేరుతో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున 26 మంది సర్పంచ్‌లు మంత్రితో మాట్లాడనున్నారు. -
విధులకు డుమ్మా కొట్టి.. విందులో చిందులు
కొండపాక(గజ్వేల్): పనివేళల్లో విధులకు డుమ్మా కొట్టి విందులు, వినోదాల్లో మునిగితేలారు సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది. జిల్లాలోని 22 మండలాల పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు శుక్రవారం కొండపాక శివారులోని ఓ మామిడి తోటలో సమావేశమై విందులు చేసుకుంటూ చిందులు వేశారు. ఈ వ్యవహారం కాస్తా టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీరియస్ అయ్యారు. కొండపాక ఎంపీడీఓ రాజేశ్‌ను కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) నర్సింగరావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చదవండి: Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు! -
గ్రామ పొలిమేరల్లోకి కరోనాను రానివ్వొద్దు
సాక్షి, అమరావతి: గ్రామ పొలిమేరల్లోకి కూడా కరోనా రాకుండా సర్పంచుల నేతృత్వంలో పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచులందరూ బాధ్యతగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో చేపట్టనున్న కరోనా కట్టడి, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలపై జిల్లాల వారీగా సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలను మంత్రి సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. తొలి రోజు ఉదయం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు, సాయంత్రం కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన మొత్తం 4,171 మంది సర్పంచులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి కార్యక్రమ ప్రారం¿ోపన్యాసం చేస్తూ.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే మన లక్ష్యం కావాలని సర్పంచులకు దిశానిర్ధేశం చేశారు. జగనన్న స్వచ్ఛసంకల్పం అనేది మన ఇంటిని, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవడం అనే అవగాహన ప్రజల్లో కల్పించడం ద్వారా కరోనా కట్టడికి ఉపయోగపడుతుందని వివరించారు. దానికి అధికారులతో పాటు గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యత తీసుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలి.. కరోనా విజృంభిస్తున్న దశలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా హైపోక్లోరైట్ ద్రావణాలను ఎప్పటికప్పుడు పిచికారీ, బ్లీచింగ్ పౌడర్‌తో మురుగునీరు నిల్వ ఉండే ప్రదేశాలు, సైడ్ డ్రైన్ల వద్ద శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వివరించారు. చెరువుల పూడికతీతలపై కూడా ఉపాధి హామీ కింద పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చామని, ఈ ఏడాది మొత్తం 27 కోట్ల పనిదినాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వారంలోగా సర్పంచ్‌లకు చెక్ పవర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా సర్పంచ్‌లుగా గెలిచిన వారందరికీ చెక్ పవర్‌ను బదలాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్ల వివరాలను కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)లో నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం సోమవారం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమవుతుందని.. వారంలోగా సర్పంచ్‌లందరికీ చెక్ పవర్ కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. సీఎఫ్ఎంఎస్లో వివరాల నమోదుకు ఆర్థిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచ్ల గెలుపు ధ్రువీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్ సిగ్నేచర్‌ను అన్ని సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ వివరాల నమోదు పూర్తయ్యాక జిల్లా ట్రెజరీ అధికారులు ఆమోదముద్ర వేయాలి. కాగా, గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా 2018 ఆగస్టు నుంచి ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన విషయం తెలిసిందే. ఏ గ్రామ పంచాయతీకి ఏ అధికారి ప్రత్యేకాధికారిగా కొనసాగారో వారికే చెక్ పవర్ అధికారం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచ్‌లు ఏప్రిల్ 3న పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారికి చెక్ పవర్‌ను బదలాయించే ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ వేగవంతం చేసింది. -
పంచాయతీరాజ్ డీఈఈపై ఏసీబీ పంజా
సాక్షి, అమరావతి/కడప అర్బన్/తిరుపతి: కడప పంచాయతీరాజ్ శాఖలోని క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) రామిశెట్టి సుధాకర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికార బృందాలు కడప విజయదుర్గ కాలనీలో నివసిస్తున్న సుధాకర్ ఇంటితో పాటు, అతని కుమార్తె, స్నేహితుడు, ఆయన బిజినెస్ పార్టనర్ వేణుగోపాల్, మైదుకూరులోని దగ్గరి బంధువు, రైల్వేకోడూరులోని వియ్యంకుడు, తిరుపతిలో నివాసం ఉంటున్న అతని తమ్ముడు మురహరి ఇంటిపైనా దాడులు నిర్వహించాయి. సుధాకర్, అతని కుటుంబ సభ్యుల పేరిట కడప విజయదుర్గ కాలనీలో జీ+1 భవనం, కడపలో ఏడు నివాస స్థలాలు, మైదుకూరులో మూడు ఇళ్ల స్థలాలు, కడప శివారున 1.12 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నట్టు గుర్తించారు. 156.22 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.24,685 విలువైన వెండి సామగ్రి, రూ.20,51,283 విలువైన ఇంటి సామగ్రి, రూ.14,13,493 బ్యాంకు బ్యాలెన్స్, రూ.1.46 లక్షల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.1.31 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు ప్రాథమికంగా దొరికిన రికార్డులను బట్టి గుర్తించామని, అతన్ని అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ కార్యాలయం తెలిపింది. -
గ్రామాల్లో కోవిడ్ కట్టుబాట్లు
సాక్షి, అమరావతి: కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని గ్రామాల్లో సైతం కరోనా నియంత్రణ విషయంలో ప్రజా చైతన్యం బాగా కనిపిస్తోంది. పాజిటివ్ కేసులు నమోదయ్యే గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా తమ గ్రామంలో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయం 11 వరకు మాత్రమే.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో రెండు నెలల వ్యవధిలో 69 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఆరుగురు మృత్యువాత పడటంతో గ్రామస్థులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొల్లిపర, తూములూరులో ఈ నెల 16వ తేదీ వరకు వ్యాపార దుకాణాలు, హోటళ్లు, టీస్టాళ్లు ఉదయం 11 గంటలకే మూసి వేస్తున్నారు. స్థానిక పెద్దల వినతి మేరకు తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐలతో కూడిన మండల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది. దైనందిక కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాల విషయంలోనే ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు. తెనాలి మండలం పెదరావూరు, అంగలకుదురు, కటివరం గ్రామ పంచాయతీలలోనూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాల కార్యకలాపాలను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేలా ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు. భట్టిప్రోలు మండలంలోని నాలుగు గ్రామాల్లో కూడా ఇదే తరహా ఆంక్షలు విధించుకున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు.. కరోనా కేసులు నమోదవుతున్న గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయడంతోపాటు బ్లీచింగ్ పౌడరును ప్రధాన రోడ్ల వెంట చల్లుతున్నారు. -
నేటి నుంచి గ్రామాల్లో సర్పంచ్ల పాలన
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి సర్పంచ్ల పాలన మొదలు కాబోతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు పని చేస్తున్నాయి. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2020 మార్చిలో ఇతర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నించగా, అప్పటి ఎస్ఈసీ కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,097 గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఏప్రిల్ 3వ తేదీన కొత్తగా ఎన్నికైన సభ్యులతో తొలి సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తాజాగా గ్రామాల్లో మళ్లీ సర్పంచ్ల పాలన కొనసాగబోతుంది. ప్రమాణ స్వీకారం.. ప్రతిజ్ఞ ► కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు శనివారం నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించి ఘనంగా జరిపేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిర్ణయించారు. ► అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని నిర్ణయించారు. ► శనివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, వర్షపు నీటి సంరక్షణపై అన్ని గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేస్తారు. ► 12.15 గంటలకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కొత్తగా ఎన్నికైన సభ్యుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అన్ని చోట్ల కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారితో గ్రామ పంచాయతీల మొదటి çసమావేశం నిర్వహిస్తారు. -
గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత
సాక్షి, అమరావతి: పల్లెల్లోని ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగించబోతున్నారు. ఈ నెల 31న అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సేవలను ‘జగనన్న పల్లె వెలుగు’ పేరుతో ప్రజల ముంగిటకే తెస్తున్న సర్కారు.. రాత్రి వేళ ప్రతీ వీధి దీపం వెలగాలన్న లక్ష్యంతోనే కీలక అడుగువేసిందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ. చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీధి దీపాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్వహణ లోపాలతో.. కేంద్ర ఇంధన పొదుపు సంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) 10,382 గ్రామ పంచాయతీల్లో 23.29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేసింది. ఈ పథకం కిందలేని 2,303 గ్రామ పంచాయతీల్లోనూ అదనంగా 4 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకూ వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఈఈఎస్ఎల్ నియమించిన కాంట్రాక్టు సంస్థ పరిధిలో ఉండేది. కానీ, దీనివల్ల అనేక సమస్యలొస్తున్నాయి. వెలగని, కాలిపోయిన వీధి దీపాలను మార్చడంలేదన్న విమర్శలొస్తున్నాయి. ఫలితంగా పల్లెల్లో కారుచీకట్లు నెలకొంటున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. వీటిపై ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. గ్రామ సచివాలయాల్లో 7 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 48 గంటల్లోనే రిపేర్ వీధి దీపాల నిర్వహణకు అధికారులు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వెలగని వీధి దీపంపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వీధి దీపాల పోర్టల్ లింక్ అయి ఉంటుంది. వీటిద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎనర్జీ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు పరిశీలించి తక్షణమే స్పందిస్తారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో దానిని రిపేర్ చేయాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. ఇక కాలిపోయిన, చెడిపోయిన లైట్లను మార్చుకునేలా ప్రతీ పంచాయతీ పరిధిలో కొన్ని లైట్లు అందుబాటులో ఉంచనున్నారు. -
‘స్వచ్ఛ’ గ్రామం.. జగనన్న సంకల్పం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని, వాటిని ‘స్వచ్ఛ’ గ్రామాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో మాదిరి గ్రామాల్లోనూ ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, ప్రతిరోజూ రోడ్లను ఊడ్చే కార్యక్రమాలను చేపట్టనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. గ్రామాల్లోని వీధుల్లో చెత్తకుప్పలు ఉండరాదు.. ఇళ్ల మధ్య నీటిగుంతలు కనిపించకూడదు.. రోడ్లపై చెత్త, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండరాదు.. వీధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి.. అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 100 రోజులపాటు ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా అంశాలపై గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించనుంది. అయితే గ్రామాల పరిశుభ్రతకు ఎన్ని కోట్ల నిధులు వెచ్చించినా ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమనే భావనతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ భారీ కార్యక్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రజలను పూర్తిగా భాగస్వాములను చేస్తూ అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. కార్యక్రమం అమలు ఇలా.. ► వీధుల్లో చెత్తకుప్పలు లేని.. చెత్తకుండీలు సైతం అవసరం లేని.. ఇళ్లమధ్య నీటి గుంతలకు తావులేని.. పూర్తి పరిశుభ్రమైన గ్రామంగా ఉండడానికి ప్రతిరోజూ ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలో, వాటన్నింటినీ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జూలై 8వ తేదీ నుంచి వంద రోజులపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులే అమలు చేసి చూపిస్తారు. ఈ వంద రోజుల కార్యక్రమానికయ్యే ఖర్చును పంచాయతీరాజ్ శాఖ నిధుల నుంచే వ్యయం చేస్తారు. ► వందరోజుల సమయంలోనే గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కుటుంబ ఆరోగ్య విషయాల్లో కనిపించే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన పెంచే ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తారు. ► గ్రామాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతుండడం వల్ల జరిగే అనర్థాలపైనా ప్రజలలో అవగాహన కల్పిస్తారు. ► వంద రోజులపాటు రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పూర్తి పరిశుభ్రంగా ఉంచడాన్ని చూపించి.. ఆ తర్వాత తమ ఊరిని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యతను గ్రామ పంచాయతీకి, స్థానిక ప్రజలకు అప్పగిస్తారు. ఇందుకు గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు సరిపోనిపక్షంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా తెలియచెబుతారు. చెత్తను ఇష్టానుసారం రోడ్లపైన వేయడం, మురుగునీటిని రోడ్లపైకి మళ్లించడం వంటి అపరిశుభ్ర కార్యక్రమాలకు పాల్పడేవారిపై అవసరమైతే పెనాల్టీలు వసూలు చేసుకునే అధికారాలను గ్రామపంచాయతీలకు అప్పగిస్తారు. ఏప్రిల్ 7 నుంచి సన్నాహక కార్యక్రమాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవమైన ఏప్రిల్ 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ మొదలుపెట్టనుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన అన్నిరకాల ఆధునిక పనిముట్లను ఈ సందర్భంగా గుర్తించి ఆయా గ్రామ పంచాయతీలకు అందజేస్తుంది. గ్రామంలో ఎవరూ చెత్తను రోడ్డుపై పడవేయకుండా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రైసైకిళ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు, ఫాగింగ్ మిషన్లను అన్ని గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న పరికరాలకు అదనంగా కావాల్సినచోట మరికొన్నింటిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల ద్వారా కొనుగోలు చేస్తారు. సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయడానికి గ్రామాల్లో అవసరమైన చోట్ల షెడ్లను ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మిస్తారు. అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో గ్రామాల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 8 నుంచి మొదలుపెట్టే వంద రోజుల భారీ ప్రచార కార్యక్రమం అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల పరిశుభ్రత విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని ఆయన చెబుతూ.. సొంత ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్.. 100 రోజుల ప్రచారం) -
పోలింగ్‌కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరిగ్గా వంద మంది పోలింగ్ జరగడానికి ముందే చనిపోయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖల పరిశీలనలో వెల్లడైంది. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సైతం కొందరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యాక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేసిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. అప్పట్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై అధికారులు వాకబు చేసినట్టు తెలిసింది. 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 87 మంది, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 మంది చనిపోయారని నిర్ధారించారు. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 9,692 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,321 స్థానాల్లో పోటీ జరుగుతుండగా, 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 2371 మందిలో చిత్తూరులో ఐదుగురు.. విజయనగరం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున 8 మంది చనిపోయారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న 19 వేల మందిలో 79 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారే కావడం గమనార్హం. ఐదుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు. ఏకగ్రీవంగా నెగ్గిన జెడ్పీటీసీ సభ్యుడొకరు.. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను అప్పట్లో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన 652 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒకరు మృతి చెందారు. ఏకగ్రీవంగా ముగిసినవి పోను 526 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 2,092 మంది పోటీలో ఉన్నారు. వీరిలో చనిపోయిన 12 మందిలో (ఏకగ్రీవమై చనిపోయిన వ్యక్తి కాకుండా) 11 మంది వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారు. ఆ స్థానాల్లో మళ్లీ నామినేషన్‌కు వీలు! అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సంప్రదాయం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట మాత్రం ఈ అవకాశం ఉండని చెబుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. -
నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు
సాక్షి, అమరావతి: నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, పురపాలక సంఘాలకు ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ ఈ ఆలోచన చేశారన్నారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో మునిసిపల్, నగర పాలక సంస్థల చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్టు పెద్దిరెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 18న చైర్మన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లు.. డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందన్నారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా రెండో వైస్ చైర్మన్, డెప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చైర్మన్లు, మేయర్ల పదవులను రెండున్నరేళ్ల పాటు పంపకాలు చేయబోతున్నారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అలాంటి ఆలోచనేది ప్రభుత్వానికి లేదన్నారు. మునిసిపాలిటీ, నగరపాలక సంస్థల్లో చైర్మన్, మేయర్ బాధ్యతలను ప్రతిరోజు కొంత సమయం ఇద్దరేసి చొప్పున ఉండే వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్టు చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎస్ఈసీ పూర్తి చేయాలి కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవాలను రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలన్న ఎస్ఈసీ ప్రయత్నాలకు హైకోర్టు చెక్ పెట్టిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున ఎస్ఈసీ నిమ్మగడ్డను కోరుతున్నామన్నారు. ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి ఆయన పదవీ విరమణ చేస్తే బాగుంటుందన్నారు. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తే యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు లభించిందనే విషయం పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు అద్దం పడుతున్నాయన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తాం తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 17న జరిగే ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఆ స్థానం తిరిగికైవసం చేసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఏకగ్రీవాలైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన పారితోషికాలను త్వరలోనే ఆయా పంచాయతీలకు విడుదల చేస్తామన్నారు. చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. సీఐడీలో పెండింగ్‌లో ఉన్న కేసులు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చారే తప్ప అందులో కక్ష సాధింపు చర్యలేముంటాయని ప్రశ్నించారు. ఇది పూర్తిగా డిపార్టుమెంటల్ ఎంక్వైరీ మాత్రమేనన్నారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఆర్డీఎ పరిధిలో చట్టవిరుద్దంగా అమ్మకాలు, అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో బీనామీ లావాదేవీలు జరిగాయని వారే ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టించాలని ప్రభుత్వం చూస్తోందనడంలో వాస్తవం లేదన్నారు. -
పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు
సాక్షి, అమరావతి/బస్‌స్టేషన్ (విజయవాడ వెస్ట్): దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు పనిచేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అన్ని విభాగాల ఉద్యోగులు ఒకే సంఘంగా ఏర్పడి ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్’ ఆవిర్భావానికి నాంది పలికారు. సోమవారం ఆర్టీసీ క్లాంపెక్స్‌లోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి నేతృత్వంలో అసోసియేషన్‌ను ఎన్నుకున్నారు. ఎంపీడీవో అసోసియేషన్, ఈవోపీఆర్డీ ఉద్యోగుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఏపీ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్, ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం, ఏపీపీఆర్ ఇంజనీరింగ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఏపీ పీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, ఏపీ డీఎల్డీవో అసోసియేషన్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడుగా వెంకట్రావిురెడ్డిని, అధ్యక్షుడిగా కె. శ్రీనివాసరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీనివాస్‌ను, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా వైవీడీ ప్రసాద్‌ను, కన్వీనర్‌గా జె.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే తొమ్మిది మంది సభ్యులతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ కౌన్సిల్లో సభ్యత్వం దక్కేలా.. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నప్పటికీ అందరూ ఏకతాటిపై లేకపోవడం వలన ప్రభుత్వ ఉద్యోగుల విధానపరమైన నిర్ణయాల్లో వీరి భాగస్వామ్యం లేకుండా పోయిందని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకట్రావిురెడ్డి అన్నారు. అసోషియేషన్ ఏర్పాటుపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ వేదిక అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అసోసియేషన్ సభ్యత్వం పొందే దిశగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. -
పరిశుభ్రతలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచడంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా, చెత్తచెదారం లేకుండా చూడడం.. గ్రామస్తులందరూ వంద శాతం మరుగుదొడ్లు వినియోగించడం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఓడీఎఫ్ ప్లస్’ పేరుతో స్వచ్ఛభారత్–2 కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రమాణాలకు తగ్గట్లుగా రాష్ట్రంలో పూర్తి పరిశుభ్ర గ్రామాలుగా 680 పల్లెలను గుర్తించారు. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,060 గ్రామాలను గుర్తించగా.. అందులో సగానికి పైగా మన రాష్ట్రంలోవే ఉండడం విశేషం. హరియాణ రెండో స్థానం దక్కించుకుంది. అక్కడ 199 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 89 గ్రామాలను గుర్తించగా.. తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో మొత్తం 35 రాష్ట్రాలుండగా, 24 రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి. 2020 ఏప్రిల్ నుంచి స్వచ్ఛ భారత్–2 దేశంలోని 6.03 లక్షల గ్రామాలను 2025 మార్చి నెలాఖరుకల్లా పూర్తి పరిశుభ్రత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి స్వచ్ఛభారత్–2 కార్యక్రమానికి ఓడీఎఫ్ ప్లస్ పేరుతో శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టే నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నింటినీ కలుపుకుంటూ గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ పల్లెలుగా తీర్చిదిద్దాలని కేంద్రం సూచించింది. ఈ ప్రక్రియలో.. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తించడానికి ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు స్పష్టంచేసింది. అవి.. – గ్రామంలో రోడ్లపై మురుగునీరు నిలిచే పరిస్థితి ఉండకూడదు. – మురుగు కాల్వల వ్యవస్థ సక్రమంగా ఉండాలి. – గ్రామంలో కనీసం 80 శాతానికి పైగా ఇళ్ల నుంచి చెత్తను క్రమపద్ధతిలో సేకరించే కార్యక్రమం కొనసాగాలి. – ఈ ఇళ్ల నుంచి వెలువడే వృధా నీరు మురుగునీటి కాల్వలో కలిసే ఏర్పాట్లు ఉండాలి. – గ్రామంలో వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించాలి. – పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించాలి. – ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్ధం గ్రామం వెలుపల కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలి. – పరిశుభ్రతపై గ్రామస్తులకు చైతన్యం కలిగించే కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపట్టాలి. రాష్ట్రంలో ‘మనం–మన పరిశుభ్రత’ పేరుతో.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో చిన్నచిన్న కుగ్రామాలతో కలిపి మొత్తం 18,841 గ్రామాలున్నాయి. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్లు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మనం–మన పరిశుభ్రత’ పేరుతో ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. తొలి విడతగా.. మండలానికి రెండేసి గ్రామాలు చొప్పున 2020 జూన్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,320 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలు అమలుచేస్తుండగా, రెండో విడతలో 4,737 గ్రామ పంచాయతీల్లో గత డిసెంబరు నుంచి శ్రీకారం చుట్టింది. స్థానికులను భాగస్వాములను చేస్తూ తొలి 15 రోజులపాటు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ల స్థాయి నుంచి జిల్లా అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. -
సర్పంచ్.. మలి పంచ్ నేడే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత జరిగే గ్రామాల్లో శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగు తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ జరగనుంది. సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 29,304 కేంద్రాల్లో పోలింగ్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 29,304 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్ సిబ్బంది శుక్రవారం రాత్రికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మ కంగా, 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పేపరుతో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 18,387 పెద్దవి, 8,351 మధ్యస్థం, 24,034 చిన్న సైజు బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 81,327 మంది సిబ్బంది పాల్గొంటుండగా 4,385 మంది జోనల్ అధికారులు, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరిం చనున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ సమయంగా నిర్ణయించారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 9,661 కేంద్రాలలో ప్రత్యేక వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తమ కార్యాలయాల నుంచి పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు శనివారం సాయంత్రమే మొదలు కానుంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాలెట్ బాక్స్‌లను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. వేర్వేరు గదుల్లో ఏర్పాట్లు.. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు వెంటనే చేపడుతున్న నేపథ్యంలో రెండు వేర్వేరు గదుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, ఇతరులు బ్యాలెట్ పేపర్లు తాకకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, జిల్లా ఇన్చార్జ్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రాత్రి కూడా నిర్వహించే పక్షంలో తగినన్ని లైట్లు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, డేటాను భద్రంగా ఉంచాలని సూచించారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో అదనంగా ఒక అధికారిని నియమించాలని, పెద్ద పంచాయతీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్వోకి సహాయంగా గెజిటెడ్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 13 జిల్లాలకు ఇప్పటికే రూ.80 కోట్లు విడుదల చేశామని, రెండో విడత కోసం రూ.116 కోట్లు విడుదలయ్యాయని, నిధులను పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు. -
తుదివిడత పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: తుది విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగాల్సిన గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 13 జిల్లాల పరిధిలో 162 మండలాల్లోని 3,299 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులతో 34,112 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతాయి. బుధవారం ఉ.10.30 నుంచి 12వ తేదీ సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడత సర్పంచి బరిలో 17,664 మంది మూడో విడతగా ఈనెల 17న ఎన్నికలు జరగనున్న 3,323 పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. సర్పంచి పదవులకు 17,664 మంది బరిలో ఉన్నారు. 31,516 వార్డు సభ్యుల పదవులకు 77,447 మంది పోటీలో ఉన్నారు. 2వ విడతలో 539 సర్పంచ్‌లు ఏకగ్రీవం రెండో విడతగా ఈనెల 13న ఎన్నికలు జరిగే 3,328 గ్రామ పంచాయతీల పరిధిలో 539 సర్పంచి పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయా పంచాయతీల పరిధిలోని 33,570 వార్డు పదవుల్లో 12,605 వార్డు పదవులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు అధికారులు తెలిపారు. -
ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం.. వారి ప్రాణాలు కాపాడడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఏమాత్రం ఆలోచించకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం, మొండిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలోనే జరుపుతామంటున్నారని తెలిపారు. ఈ మేరకు ద్వివేది శుక్రవారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన ఏం పేర్కొన్నారంటే.. సీఎస్ సూచనలను పట్టించుకోలేదు ‘రాష్ట్ర ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అధికారులు, సిబ్బంది మొత్తం కోవిడ్ వ్యాక్సినేషన్ సన్నాహక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇవ్వబోతున్నారు. ఈ నెల 11న ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ వివరాలన్నీ ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చి 13 తర్వాత ఎన్నికలపై సంప్రదింపుల ప్రక్రియ చేపడదామని కోరినప్పటికీ పట్టించుకోలేదు’. అధికార దురహంకారంతో వ్యవహరించారు.. ‘గత ఏడాది మార్చి 15 నాటికి రాష్ట్రంలో ఒకేఒక్క కోవిడ్ కేసు నమోదు అయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా సంప్రదించిన తరువాతే ఎన్నికల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికలు జరిపేందుకు అనువైన పరిస్థితుల్లేవని, అనుకూల పరిస్థితులు ఏర్పడిన వెంటనే తెలియజేయగలమని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2020 అక్టోబరు 28న లిఖిత పూర్వకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెలియజేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం షెడ్యూలు ప్రకటించారు. ఎలక్షన్ కమిషనర్ వాస్తవాలను విస్మరించడమే కాకుండా, తాను ముందుగానే నిర్ణయించుకున్న విధంగా ఉద్దేశపూర్వక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారు’. హైకోర్టు ఉత్తర్వులూ బేఖాతరు ‘కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగాలేదని.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉంటుందని ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఎస్ఈసీకి మూడ్రోజుల్లోపు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఉత్తర్వుల కాపీ ఈ నెల 5న ప్రభుత్వానికి అందగా.. 7న తన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి తెలియజేసింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 13న ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. జనవరి 13 తరువాత సంప్రదింపులకు సమయం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరాం. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 8వ తేదీనే సంప్రదింపులకు హాజరుకావాలని, లేదా తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలియజేయటం ఏకపక్ష నిర్ణయమే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, తాను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను.. వ్యాక్సినేషన్ ఆవశ్యకతను వివరించాం. కనీసం మొదటి దశ వాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కోరినా పట్టించుకోలేదు’.. అని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ప్రకటనలో వివరించారు. -
జనం ఆస్తికి అధికారిక ముద్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యజమానులకు ఇప్పటివరకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేయనుంది. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామ కంఠాల్లో కోటిన్నరకి పైగానే ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ భూములకు రెవెన్యూ సర్వే రికార్డులు లేవు. అలాగని అవసరమైనప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధానమూ ఇంతవరకు లేదు. దీనివల్ల యజమానులకు ఆ ఆస్తులతో ఎలాంటి ఇతర ప్రయోజనాలూ లభించడం లేదు. కనీసం బ్యాంకు రుణాలు కూడా లభించడం లేదు. ఇంటి పన్ను వసూలుకు వీలుగా గ్రామ పంచాయతీల వద్ద ఇళ్ల యజమానుల జాబితాలు తప్ప ఆయా ఇళ్లకు సంబంధించి రికార్డులు, ఆస్తి వివరాలు ఆయా గ్రామ పంచాయతీల వద్ద లేవు. దీంతో ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే పెద్ద మనుషుల మధ్య కాగితాలు రాసుకోవాల్సిందే తప్ప ఆ పత్రాలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండటం లేదు. దీనివల్ల సరైన రేటూ లభించడం లేదు. అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఇబ్బందులే. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు గ్రామ కంఠంలో ఉండే అలాంటి ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర స్థలాలన్నింటికీ ‘క్యూఆర్ కోడ్’ (వివరాలు తెలుసుకునేందుకు ఉపకరించే ఆప్టికల్ లేబుల్)తో కూడిన ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకంలో భాగంగా సోమవారం నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనుంది. ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ ► ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి తనకు సంబంధించిన ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ లభిస్తుంది. తద్వారా ఆస్తికి రక్షణ లభిస్తుంది. ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకు రుణం తీసుకునేందుకు ఆ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సహజంగానే ఆస్తి విలువ పెరిగిపోతుంది. ► ఇల్లు/ స్థలం అమ్ముకోవాలనుకుంటే.. నిర్దిష్ట ఆస్తి సర్టిఫికెట్ ఉండటంతో సులభంగా మార్పిడి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆ ఆస్తి సర్టిఫికెట్లో ముద్రించిన క్యూఆర్ కోడ్ సహాయంతో గ్రామ పంచాయతీ వద్ద ఉండే రికార్డులలో సంబంధిత కొత్త యజమాని పేరు ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. కొత్త యజమానిపేరుతో పంచాయతీ కార్యదర్శి ఆస్తి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ► అలాగే ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్న సమయంలో.. పాత ఆస్తి సర్టిఫికెట్‌ను రద్దు చేసి, పంపకంలో వచ్చిన వాటాల మేరకు అన్నదమ్ములకు వెంటనే కొత్త ఆస్తి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ► గ్రామాల్లో స్థలాల వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సులభంగా పరిష్కరించేందుకు కూడా వీలు కలుగుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ఇలా.. ► వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల పరిధిలో అన్ని రకాల భూముల రీ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల పరిధిలో గ్రామ కంఠం ప్రాంతంలో ఉన్న వాటితో సహా అన్ని ఇళ్లు, ఇతర స్థలాలన్నింటినీ డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ విధంగా గ్రామ పరిధిలో ప్రతి ఇంటినీ, స్థలాన్ని హద్దులతో సహా గుర్తించి, స్థానిక అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం విస్తీర్ణం, మూలలు, కొలతలు, ఇతర వివరాల నిర్ధారణతో రికార్డులను గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. ► గ్రామ కంఠంలో ఉండే ఇళ్లు, స్థలాలకు కొత్తగా సర్వే నంబర్లు కూడా కేటాయిస్తారు. ప్రతి ఇంటినీ, ప్రతి స్థలాన్ని వేర్వేరు ఆస్తిగా పేర్కొంటూ వాటికి వేర్వేరుగా గుర్తింపు నంబర్లను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ► ఒక్కొక్క ఆస్తికి వేర్వేరుగా ఆస్తి సర్టిఫికెట్లను (ధ్రువీకరణ పత్రాలు) తయారు చేసి (వాటిపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు) గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని సంబంధిత యజమానులకు పంచాయతీరాజ్ శాఖ పంపిణీ చేస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలోని 423 ఇళ్లు, 83 ఖాళీ స్థలాల యజమానులకు సోమవారం ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. -
గ్రామ పంచాయతీలకు రూ.1,168 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1,168.28 కోట్లను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధులను కేంద్రం ఆ ఆర్థిక ఏడాది విడుదల చేయలేదు. ఆ నిధులను ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయడంతో వాటిని ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
పారిశుద్ధ్యంపై జనచైతన్యం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై స్థానిక ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోలిస్తే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మలేరియా వ్యాధులు సగానికి పైగా తగ్గగా.. డెంగీ, డయేరియా తదితర వ్యాధులు దాదాపు 20 శాతానికే పరిమితమయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రజాచైతన్యాన్ని మరింత పెంచడం ద్వారా గ్రామాల్లో అంటువ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు ఆ శాఖ నడుంకట్టింది. ► మనం – మన పరిశుభ్రత పేరుతో పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామాల్లోనూ విడతల వారీగా సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తారు. ఇప్పటికే మొదటి విడతలో 1,320 గ్రామాల్లో , రెండో విడతలో 4,740 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ► దీనికి తోడు ప్రజాచైతన్యం కోసం సోషల్ మీడియాను ఉపయోగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2.70 కోట్ల వరకు జనాభా ఉన్నట్లు అంచనా. వీరిలో కోటిమందికిపైగా ఇంటర్నెట్ వసతితో కూడిన మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించింది. వీరిలో 66 లక్షల మంది ఫేస్బుక్, వాట్సాప్‌లను, 40 లక్షలమంది ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ► పరిసరాల అపరిశుభ్రత కారణంగా సంక్రమించే వ్యాధులు, ఫలితంగా కలిగే ఆర్థికభారం, సంపూర్ణ పారిశుద్ధ్యం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ స్క్రీన్షాట్లను రూపొందించి గ్రామాల్లో మొబైల్ ఫోన్ల వినియోగదారులకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రాంతాల వారీగా సబ్ గ్రూపుల రూపకల్పనకు ఆలోచిస్తున్నారు. ► గ్రామీణ ప్రాంతానికి ఎక్కువగా సంబంధం ఉండే ఉన్నత పా´ఠశాలలు, జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు ఇతరత్రా చురుగ్గా ఉండే వారిని వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపట్టే చర్యల్లో భాగస్వాముల్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
ఆస్తి లెక్క.. ఫొటో పక్కా!
సాక్షి, హైదరాబాద్: ఆస్తుల నమోదులో ఇంటి యజమాని ఫొటోను కూడా సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన యాప్‌లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రివిజన్ రిజిస్టర్లో ఉన్న ప్రాపర్టీలే కాకుండా.. కొత్త వాటికి కూడా ఈ ఫొటోలను సేకరించాలని తాజాగా ఆదేశించింది. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి కట్టడాన్ని మదింపు చేయాలని నిర్దేశించిన పంచాయతీరాజ్ శాఖ.. సేకరించిన సమాచారాన్ని ఈ–పంచాయతీ వెబ్సైట్లో పొందుపర్చాలని నిర్దేశించింది. ఈ ప్రక్రియను కూడా బుధవారం అర్ధరాత్రిలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో గ్రామ కార్యదర్శులు ఆస్తుల లెక్క తీయడంలో తలమునకలయ్యారు. మరోవైపు ఆస్తుల గణనను తీరు క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను జిల్లాలకు పంపింది. కులం, ఫొటో, ఆధార్ ఇవ్వాల్సిందే.. ఈ–పంచాయతీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్న సమాచారాన్ని వ్యవసాయేతర ఆస్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్–న్యాప్ (తెలంగాణ వ్యవసాయేతర ఆస్తులు) యాప్‌లో నిక్షిప్తం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఈ మేరకు కార్యదర్శులకు యాప్ లింక్‌ను పంపింది. ఇప్పటివరకు ఫోన్, ఆధార్ నంబర్ సరిపోతుందని భావించిన కార్యదర్శులు యాప్‌లో పొందుపరిచిన ప్రశ్నావళితో తలపట్టుకున్నారు. ఆస్తి యజ మాని ఫొటో, వయసు, ఆధార్, కులం, కరెంట్, నల్లా కనెక్షన్ నంబర్, నిర్మాణ విస్తీర్ణం, కట్టడం కేటగిరీ తదితర సమగ్ర సమాచారాన్ని సేకరించాలని స్పష్టం చేసింది. స్థల కొలతలు సేకరించడమే గాకుండా.. ఇంటి యజమాని ఫొటోను జత చేయాలని మెలిక పెట్టింది. దీంతో కార్యదర్శులపై తీవ్ర పనిభారం పడింది. గడువు తక్కువగా ఉండటంతో సేకరించాల్సిన డేటా చాంతాడంత ఉండటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు సమాచారంలో తప్పులు దొర్లితే చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలకు రాష్ట్ర స్థాయి అధికారులు.. వ్యవసాయేతర ఆస్తుల నమోదును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను పంచాయతీరాజ్ శాఖ పంపింది. ఇప్పటికే మండలాల వారీగా ఆయా జిల్లాల అధికారులను కలెక్టర్లు నియమించగా.. తాజాగా జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర స్థాయి అధికారులను కూడా జిల్లాలకు పురమాయించారు. తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నమోదు ప్రక్రియను అంచనా వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. డేటా అప్లోడ్.. సర్వర్ డౌన్ పెద్ద గ్రామ పంచాయతీలు మినహా చిన్న జీపీల్లో సాధ్యమైనంత వరకు బుధవారంలోగా ఆస్తుల గణన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టింది. దీం తో డెడ్‌లైన్ ముగుస్తుండటంతో సేకరించిన డేటాను కార్యదర్శులు ఈ–పంచాయతీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలు నమోదు ప్రక్రియకు అవరోధంగా మారాయి. ఏకకాలంలో వివరాలను నిక్షిప్తం చేస్తుండటంతో సర్వర్ మొరాయిస్తోంది. ఇది కూడా పంచాయతీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు ఆస్తుల గణన పూర్తయిందని డిక్లరేషన్ ఇవ్వాలని కొన్ని జిల్లాల డీపీవోలు కార్యదర్శులు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. -
బాల వికాసానికి 'మూలస్థానం'
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి చెంత బాల వికాసం పరవళ్లు తొక్కుతోంది. అధికారుల అంకితభావం అక్కడి బాలకార్మిక వ్యవస్థకు అడ్డుకట్ట వేసింది. బాల్య వివాహాలను తరిమికొట్టింది. అంగన్వాడీల లాలన చిన్నారుల్లో రక్తహీనతను రూపుమాపి బాలల ఆరోగ్యానికి బాటలు వేసింది. శిశు మరణాలను దూరం చేసింది. గ్రామస్తుల సహకారం సమస్యాత్మక పల్లెకు సరికొత్త రూపు తెచ్చింది. అదే ఆ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. బాలల సంరక్షణ విషయంలో సమర్థవంతమైన పనితీరు కనబర్చినందుకు గాను 2020 సంవత్సరానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘బాలమిత్ర (చైల్డ్ ఫ్రెండ్లీ) పంచాయతీ’ పురస్కారాన్ని దక్కించుకుంది. గౌతమీ గోదావరి చెంతన చెన్నై–కలకత్తా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ గ్రామమే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం పంచాయతీ. సమస్యల చీకట్లను జయించి.. ► నిత్యం తగాదాలతో మూలస్థానం తల్లడిల్లేది. మరోవైపు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం తదితర సమస్యలు గ్రామాన్ని పీడిస్తుండేవి. ► గ్రామంలోని అంగనవాడీ కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 434 మంది, గర్భిణులు 51 మంది, బాలింతలు 44 మంది ఉన్నారు. ► గ్రామస్తులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి రుగ్మతలను రూపుమాపేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతోపాటు మండలస్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా పనిచేశారు. ► అధికారులు, గ్రామంలోని ఉద్యోగుల కృషికి గ్రామస్తుల సహకారం తోడవటంతో ఏడాదిలోనే మంచి ఫలితాలను సాధించారు. ఆరోగ్య లోపాలను అధిగమించి.. ► మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచీ ప్రసవమయ్యే వరకూ అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలుఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయగలిగారు. ► చిన్నారులకు సకాలంలో టీకాలు వేయడం, వయసుకు అనుగుణంగా వారి ఎత్తు, బరువును నమోదు చేసి లోపాలున్న వారికి పౌష్టికాహారం అందించారు ► తీవ్ర పోషకాహార లోపం, అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైద్య సిబ్బందితో కలిసి రక్తహీనత గల చిన్నారులను గుర్తించి రెట్టింపు పోషకాహారాన్ని అందించారు. ► ఏడాది క్రితం వరకు గ్రామంలో శిశు మరణాలు 3 శాతం వరకు ఉండగా.. అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ వహించి గత ఏడాదిలో ఒక్క శిశు, బాలింత మరణం కూడా సంభవించకుండా చర్యలు చేపట్టారు. ► గతంలో గ్రామంలోని 10 శాతం మంది చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాల్య వివాహాలకు.. బాల కార్మిక వ్యవస్థకు చెక్ ► దగ్గరి బంధువులనో.. మంచి సంబంధమనో 10వ తరగతిలోపు బాలికలకు పెళ్లిళ్లు చేసేవారు. ► వీటిని అరికట్టే దిశగా అంగన్వాడీ కార్యకర్తలు 2015లో చర్యలు చేపట్టారు. వారికి పంచాయతీ, మండల అధికారుల సహకారం తోడవటంతో బెదిరింపులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించారు. ► గ్రామంలోని 80 వరకు ఇటుకల బట్టీలు, కూరగాయల సాగు విస్తరించి ఉన్నాయి. 2018 నాటికి 52 బాల కార్మికులు ఉండగా వారిని గుర్తించి బడిబాట పట్టించారు. అవార్డు రావడం గర్వంగా ఉంది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ‘చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ’ అవార్డు మా గ్రామానికి దక్కడం చాలా గర్వంగా ఉంది. యు.రేణుక, పంచాయతీ కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల వరకు వారికి నిర్ణీత సమయంలో వైద్య సేవలందించి శిశు మరణాలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించాం. ఎం.సుమలత, పీహెచ్సీ అధికారి, చొప్పెల్ల పౌష్టికాహార లోపం లేకుండా పర్యవేక్షణ చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా చర్యలు తీసుకున్నాం. నిరంతరం ఆటపాటలు నేర్పించి చురుకుదనం పెరిగేందుకు కృషి చేశాం. ఎల్.విజయ కుమారి, అంగన్వాడీ కార్యకర్త -
అంటువ్యాధులు పరార్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే పరిమితమైనట్లు పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో తేలింది. 13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు.. ► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. ► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా డెంగీ కేసులు... ► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు. ► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి. -
ముంపు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి: తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన 112 గ్రామాలకు ప్యాకెట్లు, క్యాన్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ సరఫరా చేస్తోంది. పాక్షికంగా నీట ముంపునకు గురైన వాటితో కలిపి మూడు జిల్లాల్లో 330 గ్రామాల వరకు వరద నీటి ప్రభావం ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డిలు మంగళవారం సాయంత్రం మూడు జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలు, ఎస్ఈలు, ఇతర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ► ముంపు గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 4.86 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 20 లీటర్ల సామర్ధ్యం కలిగిన 1,160 క్యాన్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 ట్యాంకర్లను గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలకు ఇప్పటికే తరలించింది. ► ముంపు గ్రామాల్లో డయేరియా, మలేరియా, అంటు వ్యాధులు ప్రబలకుండా ఆయా గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాల ఓవర్‌హెడ్ ట్యాంకులు, బోర్ల నీటిని రెండు, మూడు రోజుల పాటు తాగొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించాలి. ► ముంపు గ్రామాల్లో ప్రతి బోరు, బావి నుంచి నీటి శాంపిల్స్ సేకరించి, అవి తాగునీటి అవసరాలకు పనికి వస్తాయా లేదా అని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి, ప్రతి రోజూ క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలి. ► తాగడానికి పనికొస్తాయని నిర్ధారణ అయిన బోర్లను గుర్తించి, వాటిలోని నీటిని మాత్రమే వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజెప్పాలి. ► ఆయా ప్రాంతాల్లో నీరు పూర్తిగా గ్రామం నుంచి వెళ్లగానే పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా చేపట్టాలి. ► మేట వేసిన మట్టిని తొలగించి బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ చల్లాలి. ► రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఎక్కడైనా రోడ్లపై చెట్లు విరిగిపడితే, వాటిని వెంటనే తొలగించాలి. -
వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, ఫిర్యాదుల పర్యవేక్షణ ప్రక్రియను గ్రామ సచివాలయాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014కి ముందు గ్రామ పంచాయ తీల పర్యవేక్షణలో ఉన్న వీధి దీపాల నిర్వహణను టీడీపీ హయాంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. గ్రామాల్లో చాలా వీధి దీపాలు రేయింబవళ్లు వెలుగుతుండడం, మరికొన్ని రాత్రివేళ వెలగకపోవడంపై పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎనర్జీ అసిస్టెంట్‌కు బాధ్యతలు.. ► ఇక నుంచి వీధి దీపాల మరమ్మతులు, నిర్వహణను గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్‌కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు అందిన 24–48 గంటల లోపే సమస్య పరిష్కరిస్తారు. ► రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాలు లేని 2,000 గ్రామాల్లో కొత్తగా నాలుగు లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఇక నుంచి జగనన్న పల్లె వెలుగుగా పేరు మార్చారు. ఇళ్ల పట్టాల లేఔట్ల వద్ద భారీగా మొక్కల పంపిణీ జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మొక్కలు నాటాలని సమావేశంలో నిర్ణయించారు. 25,814 కిలోమీటర్ల పొడవునా రహదారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనలకు అనుగుణంగా ఈ ఆర్థిక ఏడాది ఉపాధి హామీ పథకం కూలీలకు 25 కోట్ల పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. మంగంపేట బైరటీస్ విస్తరణ వేగవంతం చేయాలి మంగంపేట బైరటీస్ విస్తరణ, ఉత్పత్తి పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన సులియేరి, మదన్‌పూర్ బొగ్గు బ్లాకుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగారు. బొగ్గు బ్లాకుల కోసం కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. -
రాష్ట్రానికి 11 పంచాయతీ అవార్డులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)–2020 అవార్డులు ఈ ఏడాది రాష్ట్రానికి 11 దక్కాయి. పారిశుధ్యం, ప్రజా సేవలు (తాగునీరు, వీధి దీపాలు, మౌలికవసతులు), సహజ వనరుల నిర్వహణ, అట్టడుగు వర్గాలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయో వృద్ధులు), సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్తవిధానాలు, ఇ–గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ఇస్తారు. ఈ ఏడాది అవార్డుల జాబితాను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీబ్ పత్‌జోషి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఈ ఏడాది అవార్డులను దక్కించుకున్నాయి. అవార్డులు ఇలా.. జిల్లా స్థాయిలో– పశ్చిమ గోదావరి మండల స్థాయిలో– రామచంద్రాపురం, బంగారుపాళెం (చిత్తూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ జిల్లా) గ్రామ పంచాయతీ స్థాయిలో– కొండకిందం (విజయనగరం జిల్లా), వేములకోట, కురిచేడు (ప్రకాశం జిల్లా), చెల్లూరు (తూర్పు గోదావరి జిల్లా), అంగలకుదురు, కొట్టెవరం (గుంటూరు జిల్లా). -
సచివాలయాల పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. జూలై చివరి వారంలో పరీక్షలు ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభమైంది. 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం విదితమే. ఫిబ్రవరి ఏడో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ► రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఆధ్వర్వంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. ఈ సమాచారంతో సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇతర పరీక్షల షెడ్యూళ్లతో ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు. ► 14 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ► పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు కలిపి కేటగిరి –1లో నిర్వహించే పరీక్షకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్షలు ప్రారంభించే తొలిరోజునే ఈ పరీక్షను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. -
గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.277 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది మంచినీటి ఇబ్బందుల నివారణకు ఇప్పటికే రూ.277.68 కోట్లు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రెండు విడతల్లో రూ.177 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు మరో రూ.100 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు అవసరమైన చోట చిన్న మరమ్మతులు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా ఈ ఏడాది వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాల్సిన గ్రామాల సంఖ్య తగ్గిందని మంత్రి వివరించారు. గత ఏడాది వేసవిలో 5,175 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తే, ఈ ఏడాది వేసవిలో 3,314 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో పశువుల అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. -
‘మల్టీపర్పస్’ పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలకు పాలక వర్గాలు ఎసరు పెడుతున్నాయి. అరకొర జీతాలిస్తూ.. పెరిగిన వేతనాలను నొక్కేస్తున్నాయి. బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీ పర్పస్వర్కర్) నియామకాల్లో స్పష్టత కొరవడటంతోనే ఈ అక్రమాలకు తెరలేచినట్టు తెలుస్తోంది. నిర్దేశిత జనాభా కంటే అధికంగా ఉన్న సిబ్బందిని ఇతర గ్రామాల్లో సర్దుబాటు చేయకపోవడం.. జనాభా కంటే తక్కువ ఉన్న చోట్ల కొత్తగా నియమించుకోకుండా ప్రభుత్వ ఖజానాకు జెల్లకొడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఇప్పటివరకు అనేక జిల్లాల్లో పెంచిన వేతనాలు ఇవ్వకుండా స్వాహా చేస్తున్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. కోత పెట్టాలన్నా.. కొత్తగా పెట్టుకోవాలనుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 2.04 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభాకు అనుగుణంగా మల్టీపర్పస్ వర్కర్‌ను నియమించుకోవాలి. ఇందులో 4,380 గ్రామ పంచాయతీల్లో 500 జనాభానే ఉంది. వీటిలో మాత్రం కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో 36 వేల మంది పనిచేస్తుండగా.. మరో 17 వేల మందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా సిబ్బందిని నియమించుకోవాలనుకున్నా.. అదనంగా ఉన్నవారికి కోతపెట్టాలన్నా.. పక్క పంచాయతీల్లో సర్దుబాటు చేయాలనుకున్నా స్థానిక రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికంగా ఉన్నవారు పక్క గ్రామాలకు వెళ్లేందుకు ససేమిరా అనడమేగాక.. ప్రభుత్వం పెంచిన వేతనాన్ని సమానంగా పంచుకుంటామని, అందరం ఇక్కడే పనిచేస్తామని మొండికేస్తున్నారు. దీంతో అంతర్గత సర్దుబాటు చేసుకుని వారి చేత అక్కడే పనిచేయించుకుంటున్నారు. ఇక, గోల్మాల్ కూడా ఈ అంశం ఆధారంగానే జరుగుతోంది. కొన్ని జీపీల్లో జనాభా దామాషా ప్రకారం ఉండాల్సిన సిబ్బంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్నారు. జనాభా దామాషాకు అనుగుణంగా ఆయా జీపీల్లో తగినంత మంది సిబ్బందిని నియమించుకుని వారందరికీ కొత్త వేతనాలు చెల్లించాలి. కానీ, అలా చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై తక్కువ మందితోనే నెట్టుకొస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిబ్బంది వేతనాలను డ్రా చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మరికొన్ని చోట్ల పాత వేతనాలిస్తూ కొత్తజీతాలిస్తున్నామని రికార్డుల్లో రాసుకుంటూ మిగిలింది నొక్కేస్తున్నారనే సమాచారం కూడా పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో గ్రామపంచాయతీల వారీగా పనిచేస్తున్న సిబ్బందికి గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం నెలకు రూ.8,500 అందుతున్నాయో లేదో నివేదిక తెప్పించుకుని తమకు పంపాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు ఇటీవల లేఖ రాసింది. కచ్చితంగా విచారణ జరిపి తగిన సమాచారం ఇవ్వాలని ఈ నెల 6న పంచాయతీరాజ్ కమిషనర్ మెమో నం: 4978 జారీ చేశారు. 500 జనాభాకు ఒకరు.. ప్రతి 500 జనాభాకు ఒక బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీపర్పస్ వర్కర్)ని నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామంలో 500 జనాభా మాత్రమే ఉంటే కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పించింది. పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ, పంచాయతీకి సంబంధించిన ఇతర పనులకు వినియోగించుకోవాలని నిర్దేశించింది. ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్‌ను పంపిణీ చేస్తున్నందున.. దీన్ని నడిపేలా ఒకరికి కచ్చితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరా పనులు చేయడంలోనూ నైపుణ్యం ఉండేలా చూడాలని, లేనిపక్షంలో జాబ్ వర్క్ కింద ప్రైవేటు సేవలు పొందాలని పేర్కొంది. ఈ మేరకు గతేడాది అక్టోబర్‌లో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సర్కార్.. ఇప్పటికే గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని, ఒకవేళ నిర్దేశిత జనాభా కంటే ఎక్కువ మంది కార్మికులుంటే 5 కి.మీ.ల పరిధిలో ఉండే గ్రామాల్లో వీరి సేవలను వాడుకోవాలని స్పష్టం చేసింది. కాగా, విధిగా అదే గ్రామానికి చెందినవారినే వర్కర్లుగా పెట్టుకోవాలని కూడా సూచించింది. ఈ నిబంధన పంచాయతీల్లో గందరగోళానికి తెరలేపింది. -
ఏకగ్రీవమైతే భారీ నజరానా!
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించనుంది. ఇలా ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందజేస్తోంది. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్లు అందు తున్నాయి. వీటితోపాటు పంచా యతీలు స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా ఏకగ్రీవ మయ్యే గ్రామాలకు ప్రభుత్వం నిధులు అందజేసే అవకాశం ఉందని అంటున్నారు. -
బీసీలకు 4.. ఎస్సీలకు 2
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాపరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం ఖరారు చేసింది. ఈ మేరకు 13 జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ప్రకారం.. నాలుగు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 6జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్(అన్‌రిజర్వ్)కు కేటాయించారు. కాగా మొత్తం 13 జిల్లా పరిషత్‌లకుగాను ఆయా కేటగిరీల వారీగా 6 మహిళలకు రిజర్వు అయ్యాయి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రాగా, అందులో పేర్కొన్న నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతలపాటు ‘స్థానిక’ ఎన్నికలు జరిగాయి. ఈ 4 విడతల ఎన్నికల్లోనూ నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిన జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ వస్తోంది. అదే రొటేషన్ క్రమంలో ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలకోసం ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలవారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయడం తెలిసిందే. సర్పంచ్ రిజర్వేషన్ల ఖరారుపై వీడియో కాన్ఫరెన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం ఖరారు చేసే కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లా, మండల అధికారులకు సూచనలు చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌తో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లు, డీపీవోలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,057 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతోపాటు వాటి పరిధిలో ఉండే 1,33,726 వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను శని, ఆదివారాల్లోగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ సందర్భంగా అధికారులను గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. -
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈఈ
సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనంతపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొండసాని సురేష్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా, అనుచరుడిగా సుపరిచితుడైన సురేష్ రెడ్డి ఇంటిపై శుక్రవారం కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు చేశారు. రాంనగర్లో ఆయన నివాసంతో పాటు పుట్టపర్తిలో రెండు చోట్ల, కర్నూలు జిల్లా బేతంచర్లలోని అత్తారింట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పుట్టపర్తిలో సాయి సంస్కృతి ఎడ్యుకేషన్ ట్రస్టు స్థాపించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. అతని భాగస్వామి విజయభాస్కర్‌రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. మొత్తం రూ.4.17 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నామని ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవీ అక్రమాస్తుల చిట్టా.. ఏసీబీ బయటపెట్టిన సురేష్ రెడ్డి అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2018లో పుట్టపర్తిలో ఎకరం ఖాళీ స్థలాన్ని, పుట్టపర్తి మండలం ఎనుములపల్లిలో 1.63 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీజీ వెల్లడించారు. తనిఖీల్లో 332.4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.98 లక్షల విలువైన వస్తువులు, రూ.4.13 లక్షల నగదు గుర్తించారు. ఇన్నోవా, ఆల్టో కారు ఉన్నట్లు తెలిపారు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చనే కోణంలో విచారిస్తున్నారు. ఎవరీ సురేష్ రెడ్డి ? 1991లో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా అడుగుపెట్టి.. 2004లో ఆ శాఖ మంత్రిగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా వెళ్లారు. 2009లో జేసీ అండతో పుట్టపర్తి టికెట్ తనకే అనే ప్రచారం కూడా చేసుకుని.. పంచాయతీరాజ్ విభాగంలో ఏఈఈ ఉద్యోగానికి రాజీనామా చేశారు. టికెట్ రాకపోవడంతో తన పలుకుబడితో మళ్లీ ఉద్యోగం సంపాదించుకున్నారు. సెటిల్మెంట్లకు పాల్పడుతూ రూ.కోట్లు సంపాదించారనే ఆరోపణలున్నాయి. -
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం పంచాయతీరాజ్ శాఖను ఒడిదుడుకులకు గురిచేసింది. బడ్జెట్లో ఆ శాఖ కేటాయింపులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రామీణాభివృద్ధికి ఆశాజనకంగా నిధులు కేటాయించినా.. పంచాయతీరాజ్ విభాగానికి మాత్రం కోత పడింది. గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్న సర్కారు.. పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ బడ్జెట్లో హైలెట్. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులతో వీటిని భర్తీ చేయనుంది. గత బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు మంచి ప్రాధాన్యత దక్కింది. నీటిపారుదల శాఖ తర్వాత పీఆర్కే ఎక్కువ నిధులు కేటాయించింది. ఈసారి ఇరిగేషన్‌కు కూడా నిధుల కత్తెరపడినప్పటికీ, అదేస్థాయిలో ఈ శాఖకు నిరాశే మిగిలింది. 2018–19 బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు రూ.15,562 .84 కోట్లను కేటాయించగా, తాజా బడ్జెట్లో పీఆర్, గ్రామీణాభివృద్ధికి కలిపి రూ.15,124.89 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పెంచిన ఆసరా పింఛన్ల మొత్తానికి అనుగుణంగా నెలకు రూ.830 నుంచి రూ.850 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. లబ్దిదారులు అందుబాటులో లేకనో, ఇతరత్రా కారణాలతోనో ఇందులో 15శాతం వరకు వెనక్కు వస్తున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద దాదాపు 40 లక్షల మందికి ఈ పింఛన్లు అందుతున్నాయి. పింఛన్ల మొత్తాన్ని పెంచకముందు (రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నపుడు) రూ. 420–450 కోట్ల వరకు వ్యయమయ్యేది. ఆసరాకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం వాస్తవ లెక్కలకు అనుగుణంగా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల అర్హతను 60 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. హైదరాబాద్ మినహాయించి మిగతా జిల్లాల్లోనే 57 ఏళ్లకు పింఛను పొందేందుకు అర్హులైన వారి సంఖ్య ఆరున్నర లక్షలు ఉంటుందని సమాచారం. -
నేటి నుంచి ‘సచివాలయ’ రాత పరీక్షల హాల్ టికెట్లు
సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ వెబ్ పోర్టర్లలోనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సూచించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆన్లైన్ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 12.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, సాయంత్రం.. రెండు పూటలా రాతపరీక్షలు జరుగుతాయి. -
మీరే నా స్వరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశమంతా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న వేళ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసమే కొత్తగా వలంటీర్ల వ్యవస్థను తెస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లుగా నియమితులై బాధ్యతల్లో చేరుతున్న సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. విజయవాడలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వలంటీర్లు హాజరు కాగా మండల, మున్సిపల్ కార్యాలయాల వద్ద దీన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3,648 కి.మీల దూరం సాగిన తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయని వారు కూడా ఐదేళ్లలో తాము చేసే మంచి పనులను చూసి వచ్చే దఫా తమకే ఓటు వేసేలా వారి మనసు కరగాలన్నది తమ లక్ష్యమన్నారు. ఈ ఏడాదే 80 శాతం హామీల అమలు... నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలోని ఇతర పథకాల అమలు కూడా వలంటీర్ల ద్వారానే జరుగుతుందని సీఎం చెప్పారు. వలంటీర్లే ప్రభుత్వ స్వరం లాంటివారన్నారు. ప్రతి వలంటీర్ వద్ద మేనిఫెస్టో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని 80 శాతం పైచిలుకు హామీలను ఈ సంవత్సరమే అమలులోకి తెస్తామని, వచ్చే ఏడాది మిగిలిన 20% అమలులోకి తెస్తామని జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏం మాట్లాడారో వివరాలు ఆయన మాటల్లోనే... వలంటీర్లంటే ... ‘‘వలంటీరు అంటే మూడు పదాల్లో.. లబ్ధిదారుల గుర్తింపు, డోర్ డెలివరీ, 50 ఇళ్లకు తోడుగా ఉండడం. వలంటీర్లు చేయాల్సిన బాధ్యతలన్నీ ఈ మూడు పదాలలోనే కలసి పోతాయి. ఈ ప్రక్రియలో వలంటీర్లు గ్రామ సచివాలయం, కలెక్టర్లతో అనుసంధానం అవుతారు. ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేయడం, లబ్ధిదారులను గుర్తించడం రెండు కళ్లు లాంటివి అయితే మూడోది 50 ఇళ్లకు లీడర్షిప్ తీసుకోవడం. ఆ 50 ఇళ్లకు ఏ పనైనా వలంటీర్లే దరఖాస్తు చేయించాలి. వచ్చేలా చేయాలి. ఆ తర్వాత కార్డు కూడా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలి. అప్పుడే వలంటీరుగా తన బాధ్యత నెరవేర్చినట్లు అవుతుంది. వలంటీర్ల వ్యవస్థలో అవినీతి అనేది ఉండకూడదు. పనిచేసే వారికి ఆ ఆలోచన, ఆ తలంపు కూడా రాకూడదనే ప్రతి ఒక్కరికి రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్నాం. తమకు కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించే వలంటీర్లను లీడర్లుగా చేస్తాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా పారదర్శకత, చిరునవ్వుతో అందరికీ సహాయం చేస్తే 50 ఇళ్లకు మీరు చేసే మంచితో వారి గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు. 3 నెలల్లో లక్షల ఉద్యోగాలిచ్చిన చరిత్ర.. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా తిరగక మునుపే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బహుశా ఎక్కడా లేదు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ద్వారా దాదాపు 1.40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 2.80 లక్షల మందిని వలంటీర్లుగా నియమించాం. దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చాం. ప్రతి నెలా కచ్చితంగా ఒక కార్యక్రమం.. చాలా పథకాల అమలుకు వలంటీర్ల నియామకం కోసం వేచి చూస్తున్నాం. ఇక మీరొచ్చారు కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. గ్రామ సచివాలయాలు అక్టోబరు 2న గాంధీ జయంతి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఈ సంవత్సరం మనం చేయబోయే పెద్ద కార్యక్రమాలు రైతు భరోసా, అమ్మ ఒడి. మరొకటి రాబోయే ఉగాది నాటికల్లా రాష్ట్రంలో ఇంటి స్థలం లేని పేదవాడు ఎవరూ ఉండకూడదు. పింఛన్‌ను మేం వచ్చిన వెంటనే రూ.2,250తో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళుతున్నాం. అన్నీ బాగుంటే సెప్టెంబరు నుంచే అటో డ్రైవర్లు, సొంతంగా టాక్సీ కలిగిన వారికి సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అక్టోబర్ నుంచి వైఎస్సార్ రైతు భరోసా మొదలవుతుంది. నవంబరు నాటికి మరికొన్ని పథకాలున్నాయి. చేనేతలకు సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తామని చెప్పాం. షాపులున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు రూ.పది వేల చొప్పున సాయం చేస్తామని చెప్పాం. ఈ లబ్ధిదారులను గుర్తించే బాధ్యత వలంటీర్లదే. ఇలా నెలకొక కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి.. వలంటీర్ల ద్వారా బియ్యం డోర్ డెలివరీ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుంది. నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి అందచేస్తాం. దీన్ని క్రమంగా విస్తరించి ఏప్రిల్ కల్లా ప్రతి జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్నిస్తే ఓపిగ్గా సమాధానం చెప్పాలి.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే వలంటీర్లకు అన్ని కార్యక్రమాలపై అవగాహన ఉండాలి. ఏ పథకంపై ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోవాలి. ఆ అవగాహన రావాలంటే నేను ఏం మాట్లాడుతున్నానో వింటూ ఉండాలి. మనం అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు. ఎవరైనా ప్రశ్నలు వేస్తే కొంచెం ఓపిగ్గా సమాధానం చెప్పాలి. మనం ప్రతి పథకాన్ని ప్రారంభిస్తూనే ఉన్నాం. వలంటీర్లకు ఎదురయ్యే ప్రశ్నలను గుర్తించి సావధానంగా ఎలా వివరించాలో తెలియచేసేందుకు ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం’’ ‘ప్రతి లబ్ధిదారుడికి మంచి చేసే విషయంలో వలంటీర్ల నుంచి ముఖ్యమంత్రిగా నేను ఆశించేవి రెండే రెండు. ఒకటి లంచాలు ఉండకూడదు, రెండు వివక్ష చూపకూడదు. మన, తన తేడా చూపకూడదు. ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ. ఎవరైనా పర్వాలేదు. కచ్చితంగా సహాయం అందాలి. ఇదే వలంటీర్ల నుంచి నేను ఆశించేది’ ‘ప్రతి లబ్ధిదారుడికి మంచి చేసే విషయంలో వలంటీర్ల నుంచి ముఖ్యమంత్రిగా నేను ఆశించేవి రెండే రెండు. ఒకటి లంచాలు ఉండకూడదు, రెండు వివక్ష చూపకూడదు. మన, తన తేడా చూపకూడదు. ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ. ఎవరైనా పర్వాలేదు. కచ్చితంగా సహాయం అందాలి. ఇదే వలంటీర్ల నుంచి నేను ఆశించేది’ ‘రాష్ట్ర ప్రజలందరికీ భరోసా నింపేందుకు నా దగ్గర మొదలైన ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అన్న స్వరం మీది (వలంటీర్లు) కూడా కావాలి’ – వలంటీర్ల వ్యవస్థ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ ఏ ముఖ్యమంత్రీ చేయలేరు: మంత్రి పెద్దిరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన దేశ చరిత్రలోనే అద్వితీయ ఘట్టమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మరే రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదని, మళ్లీ అలాంటిది జరిగితే జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా మరే సీఎం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేరన్నారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు, గిరిజా శంకర్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు వలంటీర్ల కరదీపికను సీఎం ఆవిష్కరించారు. కొందరు వలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రతి ఇంట్లో సీఎం ఫొటో... అందరికీ మేలు చేయాలన్న తలంపుతో పనిచేస్తున్న యువ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ప్రతి కుటుంబం తమ ఇంట్లో, మనసులో భద్రంగా దాచుకుంటుంది. –ఆరేపల్లి ప్రతాప్, విజయవాడ -
గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్
-
గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని.. వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. దీంతో ప్రజాసంకల్పయాత్రంలో వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామస్వరాజ్యం దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. స్థానిక స్వపరిపాలనలో నవశకానికి నాంది పలికింది. దీనికి సీఎం శ్రీకారం చూట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని అన్నారు. ‘గడిచిన 73 ఏడేళ్లలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు ఇంకా స్వాతంత్య్రానికి దూరంగా ఉన్నాయి. అభివృద్ధి, ఉపాధిలేదన్న విషయాన్ని 3648 కి.మీ నా సుధీర్ఘ పాదయాత్రలో చూశాను. పేదలకు అండగా ఉన్నామన్న భరోసా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఉండాలి. దానిలో భాగమే గ్రామ వాలెంటీర్ల వ్యవస్థ. లంచాలు, వివక్ష, కులాలు, మతాలు, రాజకీయాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. ప్రజల మనసులు గెలిచే విధంగా గ్రామ వాలెంటీర్లు పనిచేయాలి. నా స్వరం మీనోటి వెంట రావాలి.. వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. అధికారంలోకి వచ్చిన మూడు నెలలు తిరగకముందే 4లక్షల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర దేశంలో ఇప్పటి వరకూ లేదు. నేను విన్నాను నేను ఉన్నాను అని నా నోట వచ్చిన స్వరం.. ఇప్పటి నుంచి మీనోట కూడా కావాలి. గ్రామ వాలెంటీర్లు చేసే పనులు ఎంతో కీలకమైనవి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడం, డోర్ డెలివరీ చేయడం. సెప్టెంబర్ 1న శ్రీకాకుళం నుంచి రేషన్ బియ్యం డోర్‌డెలివరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మేనిఫెస్టోలో మనం చెప్పిన ప్రతి పథకం పేదలకు చేరాలి. ప్రధానంగా నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందాలి. రైతు భరోసా అక్టోబర్ 15న ప్రారంభిస్తాం. ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా రూ.12500 ఇవ్వాలని నిర్ణయించాం. లబ్ధిదారుల ఎంపికలో లంచాలు, వివక్ష ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందారు. రాష్ట్రంలో ఇంటిస్థలం లేని వారు ఎవరూ ఉండకూడదు. ఉగాది నాటికి అందరికీ ఇంటి స్థలాలను చూపించాలి. దీనిలో వాలెంటీర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మీలోనుంచే నేను లీడర్లను తయరుచేస్తాను’ అని అన్నారు. 2,66,796 మంది వాలంటీర్ల నియామకం కేవలం 45 రోజుల వ్యవధిలో వివాదాలకు తావు లేకుండా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వాలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. వీరంతా గురువారం నుంచే విధుల్లో చేరనున్నారు. విజయవాడలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లంతా వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్సీడీలను ఏర్పాటు చేశారు. సగం మంది మహిళలే.. వాలంటీర్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకే దక్కాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు. -
నేడు విధుల్లోకి వలంటీర్లు
సాక్షి, అమరావతి: పూజ్య బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో వివాదాలకు తావు లేకుండా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించింది. వీరంతా గురువారం విధుల్లో చేరనున్నారు. విజయవాడలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లంతా వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్సీడీలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామ, వార్డుల వారీగా నియమితులైన వలంటీర్లు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల వద్ద తొలిరోజు సమావేశమవుతారు. మండల కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. విజయవాడలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పాల్గొంటారని, వారితో సీఎం ముఖాముఖి మాట్లాడుతారని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. సగం మంది మహిళలే.. వలంటీర్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకే దక్కాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు. విధుల్లో చేరగానే బేస్‌లైన్ సర్వే గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది, పట్టణ ప్రాంతాల్లో 73,375 మంది వలంటీర్లు విధుల్లో చేరనున్నారు. వలంటీర్లు బాధ్యతలు చేపట్టగానే వారి ద్వారా ప్రతి కుటుంబం వివరాలను సేకరించాలని, ఈ మేరకు బేస్‌లైన్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబం వారీగా ప్రతి సభ్యుడి సమగ్ర వివరాలను తెలుసుకునేలా 13 పేజీల సర్వే ప్రొఫార్మాను సిద్ధం చేసి, ఇప్పటికే జిల్లాలకు పంపినట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. -
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 21 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోక రోజు గడువు పెంచడంతో 22 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్ 2) పరీక్షలను సెప్టెంబర్ 7 ఉదయానికి వాయిదా వేశారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్ 8, ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల షెడ్యూల్ ఇలా.. సెప్టెంబర్ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి సెప్టెంబర్ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు సెప్టెంబర్ 7, ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి సెప్టెంబర్ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి సెప్టెంబర్ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి -
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే లోకల్ అభ్యర్థిత్వం
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే లోకల్ అభ్యర్థిత్వం అమలు జరుగుతుందని, ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో వాటిని అమలు చేస్తామని పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయటానికి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పని సరిగా గ్రామస్థాయిలో నివాసం ఉండాలన్నారు. పెళ్లై జిల్లా మారిన మహిళా అభ్యర్థులను నాన్ లోకల్‌గా పరిగణిస్తామన్నారు. నాన్‌లోకల్‌గా మూడు జిల్లాల్లో దరఖాస్తు చేసుకునే వీలు ఉందన్నారు. పదవ తరగతికి ముందు ఏడేళ్ల కాలంలో ఎక్కడ ఎక్కువ కాలం చదివితే అదే జిల్లా లోకల్ అవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 10 అర్థరాత్రి ఆఖరు తేదీ అని, సెప్టెంబర్ 1న రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. తదనంతరం 15 రోజుల్లో ఫలితాలు వెలువడతాయని చెప్పారు. రాత పరీక్ష ఆధారంగానే నియామక పక్రియ ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తులో సంతకం కంపల్సరీగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఏపీలో గ్రామ స్థాయిలో పెనుమార్పులు రాబోతున్నాయని చెప్పారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : ఫోన్ : 91212 96051, 91212 96052, 91212 96053 ఫోన్ : 91212 96054, 91212 96055 -
మీ అందరికీ ఆల్ ద బెస్ట్ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలు, పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలు భర్తీకి సన్నాహకాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు అనూహ్య స్పందన వస్తోంది. నిన్న ఒక్కరోజే 1.34లక్షల మందికిపైగా, మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించాను. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి : గ్రామ సచివాలయ ఉద్యోగాలు: ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు) -
కొలువుల జాతర: ప్రత్యేక హెల్ప్ డెస్క్
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో సందేహాలు నివృత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్‌కి ఫోన్ చేయవచ్చని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేస్తే సందేహాలను నివృత్తి చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు gramasachivalayam. ap. gov. in, vsws. ap. gov. in, wardsachivalayam. ap. gov. in అనే మూడు ప్రత్యేక వెబ్సైట్లను సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయిన విషయం తెలిసిందే. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది. చదవండి: 1,26,728 గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వయో పరిమితి.. జీతం ఇలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
పంచాయతీలకే అధికారాలు..
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలను ‘స్థానిక ప్రభుత్వాలు’గా తీర్చిదిద్దే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారాలను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు.. ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సచివాలయాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ప్రతి పంచాయతీ ఇక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994లో పార్లమెంట్లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే 13 శాఖలకు చెందిన 29 అధికారాలను గ్రామ పంచాయతీలతో కూడిన స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ 2007, 2008 సంవత్సరాల్లో పలు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారాలు నిర్వహించడానికి గ్రామ పంచాయతీల్లో తగిన సిబ్బంది నియామకానికి ఇప్పటివరకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పంచాయతీలకు బదలాయించిన అధికారాలను స్థానికంగానే నిర్వహించుకునేలా పటిష్ట వ్యవస్థను నిర్మించేందుకు నిర్ణయించారు. దీంతోపాటు నవరత్నాల పథకాలు అట్టడుగు స్థాయిలో అర్హులందరికీ సమర్థవంతంగా అందజేసే లక్ష్యంతో గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతనంగా వ్యవస్థలో గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు గ్రామ సచివాలయాల పరిధిలోకి వస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. సచివాలయ కన్వీనర్ పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులందరికీ గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనాభా సంఖ్య ఆధారంగా కొన్నిచోట్ల రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ సచివాలయం యూనిట్‌గా గ్రామ కార్యదర్శి, అతనికి అనుబంధ సిబ్బంది పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. కొన్ని పెద్ద గ్రామ పంచాయతీల్లో రెండు కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయని, వాటిలోనూ పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో గల 13,065 గ్రామ పంచాయతీలను 11,114 గ్రామ సచివాలయాలుగా వర్గీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2 వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండే గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు. 2 వేల లోపు జనాభా ఉన్నచోట వీలును బట్టి రెండు మూడు పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ సచివాలయ యూనిట్ సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. 4వేలకు పైబడి జనాభా ఉన్న ఒకే గ్రామ పంచాయతీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 2వేల కంటే తక్కువ జనాభా ఉన్నచోట ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితోపాటు ఆ గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసే వలంటీర్లకు కన్వీనర్‌గా వ్యవహరించే గ్రామ కార్యదర్శి చేతుల మీదుగానే జీతాల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యదర్శి సహా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని సర్పంచ్‌కు అప్పగించారు. గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ లైన్ డిపార్ట్‌మెంట్స్‌తో కలిపి గ్రామాభివృద్ధి ప్రణాళికలు (జీపీడీపీ) రచించి అమలు చేస్తారు. రెండేళ్ల పాటు రూ.15 వేలు జీతం.. తర్వాత రెగ్యులరైజేషన్ గ్రామ సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావించి, ఆ కాలంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్ రూపంలో వేతనంగా చెల్లిస్తారు. రెండేళ్ల తర్వాత వివిధ శాఖల నిబంధనల మేరకు వారిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి మండల, జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణకు ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
జెడ్పీలకు భవనాలెట్ల!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో స్థానిక పరిపాలన కొత్త రూపు సంతరించుకోనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4తో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం మొదలవుతుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు మొదటి సమావేశంలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. పాలకవర్గం సైతం అదే రోజు కొలువుదీరుతుంది. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న తొమ్మిది జిల్లా పరిషత్‌లు 32కు పెరగనున్నాయి. అన్ని జిల్లాల్లో జెడ్పీ భవనాల కోసం పంచాయతీరాజ్ శాఖ వెతుకులాట మొదలుపెట్టింది.ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జెడ్పీ భవనాలు అన్ని రకాలుగా గొప్పగానే ఉన్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో ఆ స్థాయి భవనాలు ఎక్కడా లేవు. ఒకటిరెండు కొత్త జిల్లాల్లో తప్పితే జెడ్పీలకు ప్రభుత్వ భవనాలు ఉన్న పరిస్థితి లేదు. దీంతో పరిపాలన భవనం, సమావేశ మందిరం వంటి హంగులతో ఉండే భవనాల కోసం అధికారులు వెతుకుతున్నారు. ఎక్కువ జిల్లాల్లో ఆ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ కార్యాలయాలుగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మండల పరిషత్‌లకు కొత్తగా కార్యాలయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు సొంత భవనాలలో ఉన్న మండల పరిషత్ కార్యాలయాలను ఇప్పుడు ఇతర భవనాల్లోకి మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. జెడ్పీ కార్యాలయాల కోసం భవనాల ఎంపిక ప్రక్రియను రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెండు జెడ్పీలు ఆలస్యం... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విషయంలో జాప్యం వల్ల ఆ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఆలస్యంగా మొదలైంది. 2019 ఆగస్టు 6తో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ పదవీకాలం మొదలుకానుంది. -
చకచకా రెవెన్యూ ముసాయిదా చట్టం
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం చకచకా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందిస్తోన్న నూతన చట్టానికి ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసే దిశగా అడుగులు పడుతున్నా యి. కేవలం కొత్త చట్టానికి పరిమితంకాకుండా రెవెన్యూ శాఖనూ సంస్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూశాఖను రద్దు చేయ డమా? లేక ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేయడమా? అనే అంశంపైనా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేర్వేరు చట్టాలను ఒక్కగొడుగు కిందకు తీసుకురావాలనే ఆలోచనతో ముసాయిదా చట్టాన్నిరూపొందిస్తోంది. భూ వివాదాలకు తావు లేకుండా, రెవెన్యూ వ్యవస్థను అవినీతిరహితంగా మలిచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా చట్టం రూపకల్పన చేస్తామని అధికారులు చెబుతున్నారు. టైటిల్ గ్యారంటీకే మొగ్గు.. కొత్త రెవెన్యూ చట్టంపై లోతుగా అధ్యయనం చేస్తున్న సర్కారు.. టైటిల్ గ్యారంటీ చట్టంతోనే భూవివాదాలకు అంతిమ పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చట్టాలను మదింపు చేస్తున్న కమిటీ.. టైటిల్ గ్యారంటీయే కాకుండా ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ గ్యారంటీ చట్టం తేవడం సులువే అయినా.. ఆచరణలోకి వచ్చేసరికి సవాలక్ష సమస్యలున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. రికార్డుల ఉన్నతీకరణ, భూ సరిహద్దులపై స్పష్టత లేకపోతే టైటిల్ గ్యారంటీ సాధ్యపడదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో సమగ్ర భూసర్వే అనంతరమే టైటిల్ గ్యారంటీ అమలు చేసే వీలుంది. ఇదిలావుండగా త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో టైటిల్ గ్యారంటీకి ఆమోద ముద్ర వేసి.. దశలవారీగా అమలు చేయనున్నట్లు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు చెప్పాయి. అంశాలపై జాగ్రత్త.. కొత్త చట్టంలో ఏయే అంశాలను పొందుపరుస్తున్నారు? ఇతర శాఖల్లో ఉద్యోగుల విలీనం? రెవెన్యూ వ్యవస్థలో చేపట్టే సంస్కరణలపై సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. రెవెన్యూ శాఖ రద్దు, ఉద్యోగుల విలీనంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తుండటంతో అనవసర రాద్ధాంతానికి ఆస్కారం ఇవ్వకూడదని అనుకుంటోంది. అయితే, మంత్రుల సంఖ్యకు అనుగుణంగా శాఖల కూర్పు జరపాలనిచూస్తున్న సీఎం కేసీఆర్.. రెవెన్యూ శాఖతోనే ఇతర శాఖల కుదింపుపైనా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. వీఆర్వో, వీఆర్ఏల లెక్క తీయండి.. గ్రామస్థాయిలో సేవలందించే గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన సీఎం.. జూన్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో ఫోన్లో మాట్లాడుతూ ప్రకటించారు. ఇందులో భాగంగానే వీఆర్వో, వీఆర్ఏల వివరాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి సిబ్బందితో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని భావిస్తున్న సీఎం.. శాఖలో సంస్కరణలు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే కిందిస్థాయి ఉద్యోగులను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీఆర్వో, వీఆర్ఏల వివరాలను పంపాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల కేడర్ స్ట్రెంత్ 7,039 కాగా, 5,088 పనిచేస్తున్నారని, అలాగే వీఆర్ఏల కేడర్ స్ట్రెంత్ 24,035 కాగా, 22,174 మంది పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయని, ఈ లెక్కన జిల్లాలవారీగా ఉద్యోగుల వివరాలను నిర్దేశిత నమూనాలో పంపాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న సంస్కరణల కారణంగానే ఇప్పుడు ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. -
‘పరిషత్’ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఏప్రిల్ 11న రాష్ట్రంలో తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ముగియగానే, రెండో వారంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. మే నెల మొదటి లేదా రెండో వారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవకాశమున్నట్లుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 27న జిల్లా పంచాయతీ అధికారులు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా వార్డులు, పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయింది. తుది జాబితా పూర్తయిన నేపథ్యంలో శనివారం మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పరిధిలోని ఎంపీటీసీ స్థానాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలతోపాటు జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ)ల పరిధిలోని జెడ్పీటీసీ సీట్ల వారీగా ఓటర్ల జాబితాలను కొన్ని జిల్లాల్లో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలను ఆయా జిల్లాల్లోని సంబంధిత మండల, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించినట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి కాని జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి కల్లా అధికారులు తమ పనిని ముగించవచ్చని చెబుతున్నారు. 27న జిల్లాల్లోని పంచాయతీల వారీగా ప్రచురించిన ఓటర్ల తుది జాబితాకు అనుగుణంగా ఏప్రిల్ 7 నుంచి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలు సిద్ధం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ జాబితాల ఆధారంగా పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసుకుని, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను ఏప్రిల్ 20 కల్లా పూర్తిచేసుకోవాలని పేర్కొంది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ, సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నిక కమిషన్ , పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
అప్పుల్లోనూ అయ్య బాబోయ్!
సాక్షి, అమరావతి: అప్పులు తేవడంలో మంత్రి నారా లోకేశ్.. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంలో ముందంజలో ఉంది. ఈ శాఖలో అమల్లో ఉన్న కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచే ఏటా రాష్ట్రానికి దాదాపు రూ.10 వేల కోట్లు వస్తున్నాయి. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.1,000–1,500 కోట్ల దాకా కేటాయింపులు జరుగుతుంటాయి. ఈ నిధులూ సరిపోక 2018 ఏప్రిల్ తర్వాత కేవలం ఒక ఏడాది కాలంలోనే ఆ శాఖ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.18,850 కోట్లు అప్పులు తెచ్చింది. ప్రభుత్వం నేరుగా అప్పు తీసుకోకుండా.. అప్పు తేవడం కోసమే అన్నట్టుగా శాఖకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెస్తున్నారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. ఈ అప్పులన్నీ సాధారణ ఎన్నికలు జరగడానికి ఐదారు నెలల ముందే కావడం గమనార్హం. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి పథకాలు, రోడ్లు వంటి వాటిని తాకట్టు పెట్టి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల నగదును.. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రకటించిన పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. – గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం రూ.1500 కోట్ల అప్పు అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లోని 16 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 5,515 లింకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని.. వాటికి మరమ్మతుల కోసమంటూ రూ.1,500 కోట్లు అప్పు తీసుకొస్తోంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రానికి కేటాయించిన రూ.400 కోట్లను ప్రత్యేకించి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాలో ఖర్చు పెడతామని.. ఆ ఖాతాల్లో ఉండే నిధులను సెక్యూరిటీగా పేర్కొంటూ ఆ బ్యాంకు నుంచి రోడ్ కార్పొరేషన్ పేరిట రూ.1,500 కోట్లు అప్పుగా తీసుకుంటున్నారు. ఈ అప్పుకు ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుందంటూ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు వెలువడ్డాయి. – చిన్న చిన్న రోడ్ల నిర్మాణం కోసం రూ.3,800 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో 250 మంది జనాభా ఉండే చిన్న గ్రామాలకు కొత్తగా తారు రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.3,800 కోట్లు అప్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు కూడా పిలిచారు. ఆ అప్పును కూడా చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలుకు ఖర్చుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని చెబుతున్నారు. – మంచినీటి పథకాల పేరుతో రూ.12,380 కోట్ల అప్పు ఎన్నికల ముందు ప్రభుత్వం ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్లు తీసుకొస్తోంది. 13 జిల్లాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా ప్రతి మనిషికీ 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా లక్ష్యంగా వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్టు చంద్రబాబు 2014లో ప్రకటించారు. 2015 అక్టోబర్‌లోనే అధికారుల బృందాన్ని వివిధ రాష్ట్రాల పర్యటనకు పంపడంతో పాటు.. పథకం అమలుకు రూ.22 వేల కోట్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నాలుగేళ్లు దీనిపై మౌనంగా ఉన్న సర్కార్.. ఎన్నికల ముందు ఆ ప్రతిపాదనలకు దుమ్ము దులిపి బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. మొదట తయారు చేసిన రూ.22 వేల కోట్ల ప్రతిపాదనలను.. రూ.29 వేల కోట్లకు పెంచి, ఎన్నికల ముందు ఇప్పుడు అందులో మొదట దశలో రూ.15,769 కోట్ల పనులు అమలుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. అందుకుగాను పంచాయతీరాజ్ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి ప్రభుత్వం ఇప్పటికే కొంత అప్పు తీసుకుంది. ఆ డబ్బుతో మంచినీటి పథకాల నిర్మాణ పనులు మొదలు పెట్టనే లేదు. కానీ ఆ నిధులను చంద్రబాబు ఎన్నికల పథకాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.1250 కోట్లు అప్పు.. గ్రామాల్లో కరెంటు స్తంభాలకు ఎప్పటి నుంచి ట్యూబ్ లైట్ వీధి దీపాలు వెలుగుతున్నాయి. లోకేశ్ మంత్రి అయ్యాక తనకు అనుకూలంగా ఉండే కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు ఇప్పుడున్న ట్యూబ్ లైట్లను తొలగించి.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు పూనుకున్నారు. ఒక్కో ఎల్ఈడీ బల్బుకు ఏడాదికి రూ.450 చొప్పున పదేళ్ల పాటు గ్రామ పంచాయతీ గానీ, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.1000 కూడా ఖర్చు కాని ఎల్ఈడీ బల్బుకు కాంట్రాక్టరుకు రూ.4,500 చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీల్లో 30 లక్షల కరెంట్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు గానూ కాంట్రాక్టర్లకు పదేళ్ల కాలంలో మొత్తం రూ.1,250 కోట్లు అప్పు తెచ్చి చెల్లించాల్సి ఉంటుంది. -
సీఈవోలు, డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో పాతికేళ్లకుపైగా ఎంపీడీవోలుగా పనిచేస్తూ పదోన్నతులు, పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలించింది. మూడు నెలల క్రితం వంద మందికిపైగా ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించినా ఎన్నికల కోడ్ కారణంగా వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఈ పదోన్నతుల ద్వారా జిల్లాల్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి తదితర విభాగాల్లో పీఆర్ శాఖకు సంబంధించిన అధికారులే వివిధ విధులు నిర్వహించనున్నారు.‡రెండున్నర దశాబ్దాలకుపైగా ఎదురుచూపుల తర్వాత 95 మందికి డిప్యూటీ సీఈవో, డీఆర్డీఏ, గ్రామీణాభివృద్ధి, అకౌంట్స్ ఆఫీసర్లు తదితర పోస్టుల్లో బదిలీ, పోస్టింగ్, డిప్యూటేషన్లపై నియమిస్తూ గురువారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీచేశారు సీఈవో, డిప్యూటీ సీఈవో, ఇతర పదవులకు... ఆదిలాబాద్ మండల ప్రజాపరిషత్(ఎంపీపీ)లో పనిచేస్తున్న జి.జితేందర్‌రెడ్డిని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా; మంచిర్యాల ఎంపీపీలో పనిచేస్తున్న కె.నరేందర్‌ను ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా బదిలీ చేశారు. పీజే వెస్లీని డిప్యూటేషన్‌పై టీఎస్ఐఆర్డీలోని ఈటీసీ ప్రిన్సిపాల్‌గా; కె.అనిల్‌కుమార్‌ను టీఎస్ఐఆర్డీ ఏవోగా, ఎం.ఉమారాణిని స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా; కె.సునీతను ఎస్ఈసీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు. ఎస్.దిలీప్‌కుమార్‌ను డైరెక్టర్ ఎస్బీఎంగా డిప్యూటేషన్‌పై పంపించారు. డిప్యూటీ సీఈవోలుగా నియమితులైన వారిలో ఎం.లక్ష్మీబాయి (మెదక్–పోస్టింగ్), ఎం.పద్మజ(మహబూబ్‌నగర్–పో), సి.శ్రీకాంత్‌రెడ్డి (రంగారెడ్డి –పో), డి.పురుషోత్తం (ఖమ్మం–పో), ఎల్.విజయలక్ష్మీ (నల్లగొండ–పో), బి. గౌతంరెడ్డి (కరీంనగర్–పో), గోవింద్(నిజామాబాద్–పో), ఎ.రాజారావు (వరంగల్–పో), సన్యాసయ్య(ఆదిలాబాద్–పో) ఉన్నారు. డిప్యూటేషన్‌పై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులుగా నియమితులైనవారిలో మర్రి వెంకట శైలేష్ (ఆసిఫాబాద్), జె.సుమతి (భూపాలపల్లి).సీహెచ్ శ్రీనివాసరావు(సంగారెడ్డి), పి.బలరామారావు(మహబూబాబాద్) ఉన్నారు. ఈ.అనిల్‌కుమార్‌ను టీఎస్ఐఆర్డీ జాయింట్ డైరెక్టర్‌గా; ఎం.నవీన్‌కుమార్, టి.శ్రీనాథ్రావులు సెర్ప్ డైరెక్టర్లుగా; జి.వెంకటసూర్యారావు, ఎస్.వెంకటేశ్వర్, బి.రాఘవేందర్రావు, ఎన్.శోభారాణిలు ఈటీసీ ఫ్యాకల్టీలుగా నియమితులయ్యారు. సీఎం, మంత్రికి కృతజ్ఞతలు... ఇరవై ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడంతోపాటు పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖలోనే పోస్టింగ్‌లు ఇచ్చిన సీఎం కేసీఆర్, పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్‌లకు తెలంగాణ ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బి.రాఘవేందర్రావు, ప్రధానకార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వడంతో తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. -
లెక్కలు చెప్పాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా గెలుపోటములు, విరమణ, ఏకగ్రీవ ఎన్నికవంటి వాటితో సంబంధం లేకుండా తాము చేసిన వ్యయాన్ని చూపించాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా 45 రోజుల నిర్ణీత గడువులోగా లెక్కలు చూపకపోతే ఆ అభ్యర్థులు పంచాయతీరాజ్ ఎన్నికల్లో మూడేళ్లపాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తారు. గెలుపొందిన వారి విషయానికొస్తే వారు తమ స్థానాన్ని కోల్పోవడంతో పాటు మూడేళ్లపాటు పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ ఏడాది జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగడంతో పాటు ఆ మూడురోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు విడతల్లో ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45రోజుల్లోగా నామినేషన్లు సమర్పించిన వారంతా తాము చేసిన వ్యయంపై తుది రిటర్న్స్‌ను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శనివారం ఆదేశించింది. అభ్యర్థులు సమర్పించిన వ్యయ వివరాలను ఎంపీడీవోలు తమ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. అభ్యర్థులు చేసిన వ్యయానికి సంబంధించిన పత్రాలను జిరాక్స్ ఖర్చులను చెల్లించడం ద్వారా ఎవరైనా ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆ వివరాలు పొందవచ్చు. అభ్యర్థుల ఖర్చుపై, వారు సమర్పించిన రిటర్న్స్‌పై అభ్యంతరాలుంటే, సరైన ఆధారాలతో జిల్లాల పర్యటనలకు వ్యయ పరిశీలకులు వచ్చినపుడు వారి దృష్టికి తీసుకురావచ్చు. మొదటి విడతకు 6వ తేదీలోగా గత నెల 20న తొలివిడత పంచాయతీ ఫలితాలు వెలువడినందున, అభ్యర్థులు ఈ నెల 6లోగా రిటర్న్స్ దాఖలు చేయాలని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. రెండో విడతకు సంబంధించి ఈనెల 10లోగా, మూడో విడతకు సంబంధించి ఈనెల 15లోగా నామినేషన్ దాఖలు చేసిన వారంతా లెక్కలు సమర్పించాలని సూచించారు. -
పల్లెలకు పచ్చని శోభ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. పరిశుభ్రతకు కేంద్రంగా మారనున్నాయి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 90 రోజుల ప్రణాళికను విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన గ్రామసర్పంచ్‌లంతా సమగ్ర కార్యాచరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం ఆదేశాలు.. గ్రామపంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్ కొన్ని ఆదేశాలిచ్చారు. వీటిని తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ, జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మెమో జారీచేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు చేపట్టడంలో భాగంగా గ్రామాల్లోని వీధులు, మురుగుకాల్వల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరి ద్వారా రెగ్యులర్‌గా వీధులు, కాల్వలు శుభ్రం చేయడానికి పంచాయతీ కార్యదర్శి వెంటనే కార్యకలాపాల పట్టిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతో పాటు ఈఓపీఆర్డీ, ఎంపీడీవోలు ఈ పనులను పర్యవేక్షించాలని సూచించింది. 100 శాతం పన్నుల వసూలు.. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కల్పనకు 3 నెలల పాటు వివిధ రూపాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా 100 శాతం పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రతి గ్రామసర్పంచ్ చర్యలు తీసుకోవాలని సూచించింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నెలకు కనీసం ఒకసారి శ్రమదానం నిర్వహించి, ఇందులో గ్రామస్తులు కొన్ని గంటల పాటు పాల్గొనేలా కార్యక్రమాలు చేపట్టాలి. చేపట్టాల్సిన కార్యక్రమాలు.. - ప్రతి గ్రామంలో కనీసం ఒక కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేసి, చెత్తంతా తీసుకొచ్చి కంపోస్ట్‌గా మార్చాలి. - గ్రామాల్లోని ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను విడివిడిగా పెట్టేందుకు వీలుగా గ్రామపంచాయతీ నిధులతో డబ్డాలు సరఫరా చేయాలి. - ఉపయోగించని, పనికి రాకుండా పోయిన అన్ని బోర్‌వెల్స్‌ను, ఓపెన్ వెల్స్ మూసేయాలి. - ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం (శ్మశానం)ఏర్పాటు కోసం తగిన స్థలం ఎంపికచేయాలి. పంచాయతీ భూములను మొదటి ప్రాధాన్యమివ్వాలి. అందుబాటులో లేకపోతే ఏదైనా శాఖకు సంబంధించిన భూమిని జిల్లా కలెక్టర్ కేటాయిస్తారు. ఇవేమి అందుబాటులో లేనపుడు గరిష్టంగా రూ.5 లక్షల వరకు గ్రామపంచాయతీ నిధులు లేదా ఎమ్మెల్యే నిధి, తదితరాల నుంచి కేటాయించవచ్చు. - ఉపాధి హామీ నిధులతో శ్మశానాల నిర్మా ణ పనులు చేపట్టి ఆరు నెలల్లోగా పూర్తిచేయాలి. పట్టణాల్లో మాదిరిగా కనీస సౌకర్యాలు.. నగరాలు, పట్టణాల్లో మాదిరిగా పంచాయతీల్లోనూ పారిశుధ్యం, వీధి దీపాలు, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ విధులు, బాధ్యతలు, అధికారాలు, చట్టంలో పొందుపరిచిన ఆయా అంశాల గురించి పూర్తిస్థాయి అవగాహన సాధించేందుకు జిల్లా స్థాయిల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఎంపీటీసీ స్థానాల లెక్క కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోని ఎంపీటీసీ స్థానాలతో పోలిస్తే ఇప్పుడు 493 స్థానాలు తగ్గనున్నాయి. 3,500 జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేశారు. ఉమ్మడి 9 జిల్లా ల పరిధిలో మొత్తం 6,473 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పుడు 5,977కి తగ్గనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 535 జడ్పీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేర కు సోమవారం ముసాయిదా ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి సమర్పించనుంది. రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. పట్టణ స్వరూప మున్న మండల కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. మార్చి 30న పంచాయతీవార్డులవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ నియోజకవర్గాల సంఖ్య అత్యధికంగా 98 పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 89 ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి. -
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 20,093 కోట్లు, పంచాయతీరాజ్ విభాగం కింద రూ. 10,716 కోట్లు కేటాయించాలని ఆయా శాఖలు ప్రభుత్వాన్ని కోరగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో భాగంగా గ్రామీణాభివృద్ధికి రూ. 5,358 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ. 4,221 కోట్లను సర్కారు ప్రతిపాదించింది. 2018–19 బడ్జెట్లో ఈ శాఖకు రూ. 15,562 కోట్లు (పీఆర్ విభాగానికి రూ. 8,929 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 6,633 కోట్లు) కేటాయించింది. మరోవైపు గత బడ్జెట్లో ఆసరా పింఛన్ల కింద రూ. 5,388 కోట్లు కేటాయించగా దానికంటే రెండింతలు అధికంగా తాజా బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ. 12,067 కోట్లకు ప్రభుత్వం పెంచింది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథకు ప్రత్యక్ష కేటాయింపులు పెద్దగా కనిపించలేదు. గతేడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ. 1,803 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం స్పష్టమైన కేటాయింపులు చేసినట్లు కనబడలేదు. అయితే పీఆర్, ఆర్డీకి సంబంధించి వివిధ రంగాలు, పథకాల కింద పలు రూపాల్లో కేటాయింపులు చేసినందున వాటిలోంచి మిషన్ భగీరథకు కేటాయించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకున్న దశలో బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. 2017–18 బడ్జెట్లో ఈ పథకానికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. కాగా, అటవీ, పర్యావరణ, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్య శాఖకు రూ. 342 కోట్లు కేటాయించాలని అధికారులు కోరగా ప్రభుత్వం మాత్రం రూ. 171 కోట్లకే బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ‘డబుల్’ స్పీడ్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ అంశాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.2,643 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు 80 వేల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఈ సారి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2019–20 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్లో రూ.4,709.5 కోట్లు కేటాయించింది. దీంతో ఈ సారి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగనుంది. 2019 జనవరి వరకు మొత్తం 19,195 ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. వీటికి ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. పెళ్లికి సాయం పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ పథకాలకు 2019–20 బడ్జెట్లో రూ. 1,450 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1.433 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ రెండు పథకాలకు రూ. 1,400 కోట్లు కేటాయించింది. కాగా, ఈ పథకాలకు ఈ నెల 20 నాటికి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జనవరి నెలాఖరు నాటికి 1,29,742 మందికి ఆర్థిక సాయం అందించారు. 2014–15లో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అమలు చేయగా.. 2016–17 వార్షిక సంవత్సరం నుంచి బీసీ, ఈబీసీలకూ అందిస్తోంది. ఆర్టీసీకి నిరాశే.. రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న అప్పులు, వాటి వడ్డీలతో సంస్థపై ఆర్థికభారం పెరిగిపోతోంది. అయితే ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో సైతం ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.630 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో వివిధ బస్సుపాస్‌లు ఇతర రాయితీల కింద రూ.520 కోట్లు వివిధ రీయింబర్స్‌ల కింద పోను, మిగిలిన రూ.110 కోట్లను రుణాల కోసం కేటాయించారు. కొత్త బస్సుల కొనుగోలుకు ఇందులోనే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బడ్జెట్లో ప్రకటించిన మొత్తాన్ని ఏనాడూ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం గమనార్హం. గతేడాది రూ.975 కోట్లు కేటాయించిన సర్కారు ఈ సారి ఏకంగా రూ.345 కోట్ల కోత విధించింది. -
30 జెడ్పీలు.. 535 ఎంపీపీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికగా జెడ్పీలు, ఎంపీపీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్త జిల్లాలు, మండలాల పరిధి ప్రాతిపదికగా జిల్లా ప్రజాపరిషత్‌లు, మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. జెడ్పీలు, ఎంపీపీల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4, 5 తేదీల్లో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా జెడ్పీలు, ఎంపీపీల పునర్విభజన పూర్తిచేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 25లోగా పునర్విభజన ప్రతిపాదనల ప్రక్రియ పూర్తిచేసి పంపించాలని కలెక్టర్లకు సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు ముఖ్యకార్యదర్శి సమాచారం పంపించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై క్షేత్రస్థాయి పరిస్థితులు, సవివరమైన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్‌కు సూచించారు. దీంతో కలెక్టర్లు పునర్విభజన ప్రక్రియను మొదలుపెట్టారు. 535 మండలాల్లో ప్రజాపరిషత్‌లు... మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 585 గ్రామీణ రెవెన్యూ మండలాల్లో పట్టణ స్వరూపం ఉన్నవాటిని మినహాయించి 535 మండలాలకు ప్రజాపరిషత్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాల్లో హైదరాబాద్‌ను మినహాయించి 30 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు, నాలుగు మండలాలు ఏర్పాటుకానున్న తరుణంలో వీటిని సైతం తుది జాబితాలో చేర్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రకారమే తొమ్మిది జిల్లా ప్రజాపరిషత్‌లు ఉన్నాయి. ఎంపీపీలు కూడా పాత మండలాల సంఖ్య ప్రకారమే ఉన్నాయి. జూలై 5వ తేదీతో వీటి కాలపరిమితి పూర్తికానుంది. దీంతో కొత్తగా ఏర్పడిన, పునర్ వ్యవస్థీకరించిన 30 జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల గ్రామపంచాయతీలకు అమలు చేసినట్టుగానే రెండుసార్లు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు రిజర్వేషన్ల విధానం ఖరారు చేయనున్నారు. -
ఊరూరా నర్సరీలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకొని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. నరేగా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత మొత్తంలో నిధులు ఇస్తుందో అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని... ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించా లన్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, శ్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారు. నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తు లను సృష్టించడానికి ఉపయోగించాలని సూచిం చారు. అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఎంపీలు బి. వినోద్ కుమార్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, ఈటల రాజేందర్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అడిషనల్ పీసీసీఎఫ్ డోబ్రియాల్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు. మొక్కల సంరక్షణ గ్రామ పంచాయతీలదే... ‘తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలి. వాటికి నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులను వాడాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని సంరక్షించడం లాంటి బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కచ్చితంగా ఆరు నెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి లేదా దాతల నుంచి స్వీకరించాలి. నరేగా నిధులతో వైకుంఠధామాలను నిర్మించాలి. మూడు వేలలోపు జనాభాగల 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున... మూడు వేలకుపైగా జనాభా కలిగిన 1,300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. గ్రామాలను పరిశుభ్రంగా నిలపడం గ్రామ పంచాయతీల బాధ్యత. శిథిలాలను తొలగించాలి. పాడుపడిన, వాడని బావులను పూడ్చేయాలి. కూలిన ఇళ్ల శిథిలాలు తొలగించాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలి. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించాలి. నరేగాతోపాటు వివిధ పథకాల కింద సమకూరిన నిధులతో గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు తనిఖీ చేయాలి. నిధులు దుర్వినియోగం కావద్దు. ప్రతి పైసా సద్వినియోగం కావాలి. పనులు నామమాత్రంగా చేసి నిధులు కాజేసే పద్ధతి పోవాలి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీ పాలనపై నేడు శిక్షణ... కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామాల్లోని పాలన తీరుపై గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చే ముఖ్య శిక్షకులకు అవగాహన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. వారితోపాటు ప్రతి జిల్లా నుంచి 10 మంది ఎంపిక చేసిన అధికారులు పాల్గొననున్నారు. ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, పలువురు కొత్త సర్పంచ్‌లు, తాజా మాజీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. -
పల్లెల్లో కొత్త పాలన
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీలు శనివారం కొలు వుదీరనున్నాయి. పల్లెపోరు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికైన పంచాయతీ ప్రజా ప్రతినిధుల ప్రమాణ స్వీకారంతో పాటు కొత్త గ్రామ పంచాయతీల తొలి సమావేశాలతో గ్రామాలు కళకళలాడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతలుగా దాదాపు నెల రోజుల పాటు సాగిన ఎన్నికలు పూర్తయ్యాక పదవీ స్వీకారాలతో పల్లెలు కొత్త సవాళ్లకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీ కాలం శనివారం (ఫిబ్రవరి 2) నుంచి మొదలవుతుందని పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు నుంచే పంచాయతీల కొత్త పాలకవర్గాల పదవీకాలం మొదలవుతోంది. అన్ని గ్రామపంచాయతీల్లోనూ కొత్త పాలకవర్గాల ప్రమాణ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలు మినహా శనివారం పదవీ స్వీకారం చేసిన పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లపాటు కొనసాగనుంది. ఎన్నికలు జరగని పంచాయతీలు, గడువు ముగియని పంచాయతీలకు పంచాయతీరాజ్ శాఖ విడిగా అపాయింటెడ్ డేను ప్రకటించనుంది. గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా పంచాయతీ సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సహా గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న హరితహారం తదితర కార్యక్రమాల గురించి సమగ్రఅవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలోనే శిక్షణ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఈ నెల 11 నుంచి విస్తృతస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావించినా ఈ కార్యక్రమం కొన్ని రోజులు వాయిదా పడింది. సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే అధికారుల శిక్షణ కార్యక్రమం ఈ నెల 4 నుంచి మొదలుకానుంది. 15 జిల్లాలకు చెందిన అధికారులకు ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు మిగతా 15 జిల్లాల అధికారులకు ఆ తర్వాత మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తారు. పంచాయతీ చట్టంపై అవగాహనతో పాటు, శిక్షణ కార్యక్రమాల్లో తగిన అనుభవమున్న 10 మంది అధికారులకు ఒక్కో జిల్లా నుంచి (ఒక ఎంపీడీవో, ఒక ఈవోపీఆర్డీ, ఒక పంచాయతీ సెక్రటరీతో పాటు ఏడుగురు విశ్రాంత ఉద్యోగులు) శిక్షణ ఇస్తారు. రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కింద ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం తప్పనిసరి కాబట్టి ఈ శిక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శిక్షకులకు శిక్షణ ముగిశాక ఒక్కో జిల్లాలో కొత్త సర్పంచ్‌లకు రెండు బ్యాచ్‌ల (వంద మంది) చొప్పున పంచాయతీ చట్టాలు, విధులు, అధికారాలు, తదితర ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పిస్తారు. -
2న గ్రామ పంచాయతీల తొలి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21, 25, 30 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ జిల్లా మినహా) జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొం దిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఫిబ్రవరి 2ను అపాయింట్మెంట్ డేగా నిర్ణయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం (ఫిబ్రవరి 2న) కొత్త గ్రామపంచాయతీలు కొలువుదీరనున్నాయి. ఈ సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల తొలి సమావేశం జరగనుంది. అదే రోజున సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపడతారు. ఆ రోజు నుంచి వారి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నోటిఫికేషన్లకు అనుగుణంగా మూడు దశలుగా ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో అంతకు ముందు, ఈ నెల 30న ఎన్నికలు జరగని పంచాయతీలు, ఇంకా గడువు ముగియని పంచాయతీలకు పంచాయతీరాజ్‌శాఖ విడిగా అపాయింటెడ్ డేను ప్రకటించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా గ్రామస్థాయిల్లోని పంచాయతీ సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సహా గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం తదితర కార్యక్రమాల గురించి సమగ్ర అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 11 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ.. రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్‌లకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు ఆయా జిల్లాల వారీగా విభజించి మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో విడతలో రెండు బ్యాచ్‌లుగా వంద మందికి శిక్షణ ఇస్తారు. తొలి విడత శిక్షణను ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు, రెండో విడత శిక్షణను ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు, మూడో విడత శిక్షణను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ముందుగా శిక్షకులకు శిక్షణ (ట్రైనింగ్ టు ట్రైనర్స్) కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన.. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ అనంతరం వారి పనితీరుకు అనుగుణంగా సర్పంచ్‌లకు గ్రేడింగ్‌లు ఇస్తారు. -
నేడు మూడో విడత పంచాయతీ ఎన్నికలు
-
నేడు ‘పంచాయతీ’ తుది పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్న తుది (మూడో) విడతతో ముగియనున్నాయి. ఈ నెల 21న మొదటి, 25న రెండో విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బుధవారం పంచాయతీ పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. పోలింగ్ విధుల నిర్వహణకు పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల సేవలనువినియోగిం చుకుంటున్నారు. రూ.1.95 కోట్ల నగదు స్వాధీనం మూడో విడత ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీతో పాటు ప్రలోభాల పర్వం సాగుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు నిఘా పెంచారు. మంగళవారం వరకు రూ.1.95 కోట్ల మేర నగదు, దాదాపు రూ.65 లక్షల విలువ చేసే మద్యం, ఇతర వస్తువులను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెలవు లేదా వెసులుబాటు.. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని (హైదరాబాద్ మినహా) పబ్లిక్, ప్రైవేట్ అండర్ టేకింగ్స్, పారిశ్రామిక, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సంస్థల యాజమాన్యాలు స్థానికంగా ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ఆయా సంస్థలు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకునేందుకు వీలుగా మరో సెలవు రోజును పనిదినంగా పరిగణించవచ్చునని సూచించింది. అది సాధ్యం కాకపోతే ఓటు వేసేందుకు వీలుగా ఓటింగ్ సమయాల్లో 3 గంటల పాటు వెసులుబాటు కల్పించవచ్చునని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులిచ్చారు. -
తొలివారంలో ‘పంచాయతీ’ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ కసరత్తు ఊపందుకోవడంతో ఎన్నికల కమిషన్ జనవరి తొలివారంలోనే నోటిఫికేషన్‌ను వెలువరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు, అన్‌రిజర్వుడ్ స్థానాలు ఖరారైన నేపథ్యంలో జిల్లా, మండల స్థాయిలో సర్పంచ్, వార్డు స్థానాల్లో రిజర్వేషన్లు నిగ్గుతేల్చే ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. ఒకటి రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు ఈ జాబితాను సిద్ధం చేసి పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయానికి సమర్పించేలా చర్యలు చేపట్టారు. రెండ్రోజుల్లోనే గ్రామస్థాయిల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామస్థాయిల్లో సర్పంచ్, వార్డుల కేటాయింపు ముగిశాక జిల్లాల వారీగా ఈమేరకు గెజిట్లు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఈ వివరాలను రెండుమూడ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29లోపు పంచాయతీ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. దీన్నిబట్టి జనవరి మూడు లేదా నాలుగు తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని జనాభా పరంగా కేటాయించిన రిజర్వేషన్లలో కొన్ని అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నల్లగొండ జిల్లా 844 స్థానాలతో తొలిస్థానంలో, మహబూబ్‌నగర్ జిల్లా 721 పంచాయతీలతో రెండో స్థానంలో, సంగారెడ్డి జిల్లా 647 స్థానాలతో మూడో స్థానంలో ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ ఏరియాల్లో... మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా బీసీలకు 170 సర్పంచ్ స్థానాలు, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా అన్‌రిజర్వుడ్‌కు(జనరల్ కేటగిరీ) 370 స్థానాలు, ఎస్సీలకు 136 స్థానాలు, ఎస్టీలకు అత్యధికంగా ఎస్టీలకు 69 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు రిజర్వ్ చేసిన పంచాయతీలే లేకపోవడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 479 పంచాయతీలు ఉన్నాయి. 25 మినహా అన్నీ షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉండటంతో ఇతర ప్రాంతాల్లో అన్‌రిజర్వుడ్‌కు 11, ఎస్టీలకు 9, ఎస్సీలకు 5 స్థానాలు రిజర్వ్ చేశారు. దీంతో బీసీలకు ఒక్కటీ రిజర్వ్ కాలేదు. మహిళా రిజర్వేషన్లు అత్యధికంగా ఉన్న జిల్లాలు - బీసీ కేటగిరీలో మహబూబ్‌నగర్ జిల్లా–85, నల్లగొండ–82, సిద్ధిపేట–72, సంగారెడ్డి–69, కామారెడ్డిజిల్లా–66 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. - ఎస్సీ కేటగిరీలో నల్లగొండ జిల్లా–68, సంగారెడ్డి–64, ఖమ్మం–60, రంగారెడ్డి–55, మహబూబ్నగర్జిల్లాలో–53 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ చేశారు. - ఎస్టీ కేటగిరీలో నల్లగొండ జిల్లా–34, ఖమ్మం–29, మహబూబాబాద్–25, సూర్యాపేట–25, నిర్మల్‌జిల్లాలో–18 స్థానాలు మహిళలకు కేటాయించారు. -
ఎట్టకేలకు ఎంపీడీఓలకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు పదోన్నతులు లేకుండానే ఒకే పోస్టులో దీర్ఘకాలం పాటు పని చేసిన వారికి ఉపశమనం లభించింది. ప్రస్తుతమున్న నిబంధనలకు మినహాయింపులిస్తూ అడ్హాక్ తాత్కాలిక పద్ధతుల్లో 103 మంది ఎంపీడీఓ, డీపీఓలకు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల్లో పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1996 తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 10 (ఏ) అనుగుణంగా ఎంపీడీఓలు/డీపీఓలను తాత్కాలికంగా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కేడర్‌లో న్యాయస్థానం నిబంధనలకు లోబడి పదోన్నతులు కల్పిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి పొందిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పదోన్నతులపై హర్షం.. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పదోన్నతులు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాఘవేందర్రావు, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ బి.శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతుల కోసం కృషి చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ నేతలు కేటీఆర్, టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు పైళ్ల జయప్రకాశ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి నందకుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
ఆసియా బ్యాంకు అప్పుతో ఆరగింపు సేవ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలే ‘దారి’ దోపిడీ కొనసాగుతుంది. రూ.వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణం పనుల టెండర్లను ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి, అంచనా వ్యయాలు పెంచేసి, భారీ ఎత్తున కమీషన్లు కొల్లగొడుతున్నారు. కేవలం రూ.50 లక్షల విలువైన పనికి కూడా రూ.40 కోట్ల విలువైన రోడ్ల పనులు చేసిన అనుభవం ఉండాలంటూ టెండర్ నిబంధనలు విధించడం వెనుక లోగుట్టు ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పిలిచే టెండర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 5 శాతానికి మించి(ఎక్సెస్) ధరను కోట్ చేసే అవకాశం కాంట్రాక్టర్‌కు ఉండదు. ప్రభుత్వ పెద్దలు స్వలాభం కోసం ఈ నిబంధనను పక్కనపెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎంతైనా అధికంగా కోట్ చేసుకోవచ్చంటూ అస్మదీయ కాంట్రాక్టర్లకు వెసులుబాటు ఇచ్చేశారు. రాష్ట్ర ఖజానాపై రూ.వందల కోట్ల అదనపు భారం మోపుతున్నారు. 15 నుంచి 30 శాతం ఎక్సెస్‌కు టెండర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) నుంచి రూ.4,234 కోట్ల అప్పు తీసుకొస్తోంది. తొలుత రూ.3,575 కోట్ల విలువైన రహదారుల నిర్మాణం పనులకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన పనులకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎంతైనా ఎక్సెస్ కోట్ చేయొచ్చంటూ వెసులుబాటు కల్పించడంతో కాంట్రాక్టర్లు పండగ చేసుకున్నారు. 15 నుంచి 30 శాతం అధిక ధరలను కోట్ చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ.500 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ సొమ్మంతా చివరకు ఎవరి జేబుల్లోకి చేరుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్యాకేజీల మాయ ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు పిలవాల్సి ఉండగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం 200–300 పనులను కలిపి ఒక ప్యాకేజీగా మార్చేశారు. మొత్తం 2,440 పనులను 50 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.360 కోట్లతో 493 కిలోమీటర్ల మేర 315 రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తం 315 పనులను 4 ప్యాకేజీలుగా వర్గీకరించారు. విజయనగరం జిల్లాలో 156 పనులను 4 ప్యాకేజీలుగా, విశాఖ జిల్లాలో 73 పనులను 3 ప్యాకేజీలుగా, తూర్పు గోదావరి జిల్లాలో 109 పనులను 3 ప్యాకేజీలుగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 57 పనులను 3 ప్యాకేజీలుగా, కృష్ణా జిల్లాలో 58 పనులు 2 ప్యాకేజీలుగా, గుంటూరు జిల్లాలో 71 పనులు 2 ప్యాకేజీలుగా, ప్రకాశం జిల్లాలో 203 పనులను 4 ప్యాకేజీలుగా, నెల్లూరు జిల్లాలో 196 పనులను 3 ప్యాకేజీలుగా, చిత్తూరు జిల్లాలో 585 పనులను 8 ప్యాకేజీలుగా, వైఎస్సార్ జిల్లాలో 144 పనులను 3 ప్యాకేజీలుగా, కర్నూలు జిల్లాలో 139 పనులను 5 ప్యాకేజీలుగా, అనంతపురం జిల్లాలో 334 పనులను 6 ప్యాకేజీలుగా విభజించి, టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను పది రోజుల క్రితం అధికారులు తెరిచారు. ఇందులో 18 ప్యాకేజీలకు మాత్రమే ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారని, 24 ప్యాకేజీలకు సింగిల్ టెండర్లు, 8 ప్యాకేజీలకు అసలు టెండర్లు దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం ఒక్క ప్యాకేజీ మాత్రమే గరిష్టంగా ఐదు టెండర్లు దాఖలయ్యాయి. మొత్తంగా 47 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా కేవలం టెక్నికల్ బిడ్లను మాత్రమే తెరిచారు. ప్రైస్ బిడ్లను తెరవాల్సి ఉంది. ముందే బహిర్గతం చేసిన ‘సాక్షి’ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి ముందే ఈ దోపిడీ తంతును ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘అసియా బ్యాంకు అప్పు ఆరగింపునకే’ శీర్షికన ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయినా అదంతా అబద్ధమని ప్రభుత్వ పెద్దలు బుకాయించారు. అధికారులతో ఖండన ప్రకటనలు ఇప్పించారు. ఈ పనులను ప్యాకేజీలుగా కాకుండా ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు నిర్వహించాలని కాంట్రాక్టర్లు కోరినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. రూ.63 లక్షల పనిలో రూ.20 లక్షల కమీషన్లు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బంటుపల్లి మండలం నారాయణపురం గ్రామం నుంచి అక్కడికి సమీపంలో ఆర్అండ్బీ రహదారి వరకు 600 మీటర్ల పొడవున రూ.63 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాధారణంగా ఈ పని చేయడానికి పంచాయతీరాజ్ శాఖలో కాంట్రాక్టరుగా నమోదు చేసుకున్న వారందరికీ అర ్హత ఉంటుంది. కానీ, ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే కాంట్రాక్టర్‌కు ఒక ఏడాదిలో రూ.40 కోట్ల విలువైన పని చేసిన అనుభవం ఉండాలని ప్రభుత్వం టెండర్ నిబంధనల్లో పేర్కొంది. దాంతో కేవలం ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకే ఈ పని చేసేందుకు అర్హత దక్కింది. ఈ రోడ్డు నిర్మాణం పనికి అర్హత సాధించిన ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని 30 శాతం దాకా అధిక ధరను కోట్ చేశారు. అంటే రూ.63 లక్షల అంచనా వ్యయాన్ని రూ.80 లక్షల నుంచి 85 లక్షల దాకా పెంచేయనున్నారు. పెంచేసిన అంచనా వ్యయం రూ.20 లక్షలు ముఖ్యనేత, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కమీషన్లుగా దక్కనున్నాయి. -
ఆలయాల నిర్మాణానికి రూ. 50 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బలహీనవర్గాల కాలనీల్లో నిర్మిం చే ఆలయాలకు రూ.10 లక్షల వరకు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ లేకుండానే కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులు మంజూరు చేయనున్నట్లు దేవా దాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులు, సీజీఎఫ్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీజీఎఫ్ ద్వారా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరిం గ్ అధికారులకు సీజీఎఫ్ పనులు అప్పగించిన చోట సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తయ్యేలా చూ డాలని సూచించారు. 165 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు సీజీఎఫ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ధూప దీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు గౌరవ వేతనం చెల్లించేందుకు రూ.27 కోట్లను కమిటీ మంజూరు చేసినట్లు వెల్లడించారు. వేదపాఠశాల నిర్వహణకు ఏడాదికి రూ. కోటి కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, సీజీఎఫ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా పని చేయాలి ప్రభుత్వం అర్చకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అర్చక, ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. -
ప్రారంభమెన్నడో..?
నల్లగొండ అగ్రికల్చర్ : పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ఏడాది కావస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పాడిగేదెలు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలను నిత్యం వైద్యసేవల కోసం ఆస్పత్రికి తీసుకువస్తుంటారు. ఇంతకాలం సరైన సౌకర్యాలు లేకపోవడంతో సేవలు సరిగా అందించలేక సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో బహుళార్థక పశు వైద్యశాల నిర్మాణానికి 2016లో ఆర్ఐడీఎఫ్ పథకం కింద రూ. ఐదు కోట్ల నాబార్డ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మూడంతస్తుల్లో అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించడంతోపాటు, ఆధునిక పరీక్షల కోసం ఎక్స్‌రే, ఈసీజీ, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ విభా గాలను నిర్మించారు. చిన్న, పెద్ద జంతువులకు అన్ని రకాల వైద్యసేవలను అందించడంతోపాటు ఇన్‌పేషెంట్ సేవలకు అవసరమైన సిబ్బందిని సైతం నియమించారు. ఆపరేషన్ థియేటర్‌కు పశువులను తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులను మంజూరు చేశారు. చర్యలు తీసుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా తెల్ల పశువులు 1.20 లక్షలు, నల్ల పశువులు 4.10 లక్షలు, మేకలు, గొర్రెలు 12 లక్షలు, కోళ్లు మూడు కోట్లు, పెంపుడు కుక్కలు 12 వేల వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తే వాటన్నింటికి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అం దే అవకాశం ఉంటుంది. కానీ నిర్మాణం పూర్తయినా ఆస్పత్రిని ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పశు వైద్యశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భవనాన్ని అప్పగించగానే ప్రారంభిస్తాం బహుళార్ధ పశువైద్యశాల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. భవన నిర్మాణం పూర్తి కాగానే మాకు అధికారికంగా అప్పగించాలి. కానీ ఇప్పటివరకు భవనాన్ని అప్పగించలేదు. అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి ప్రారంభమైతే జిల్లాలోని మూగజీవాలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.– డాక్టర్ శ్రీనివాస్‌రావు, ఇన్చార్జి జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ అధికారి -
‘ప్రత్యేక’ కసరత్తు షురూ
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల ఒకటి నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే 68 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లు, 12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారుల నియామకాలపై ప్రతిపాదనలను రెండ్రోజుల్లోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం, హరితహారం, మత్స్యశాఖ, పాడిగేదెల పంపిణీ, వివిధ కేసుల్లో మెడికల్, పోస్టుమార్టం నివేదికల జారీలో జాప్యం, లారీల సమ్మె తదితర అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు, 565 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ఇన్‌చార్జీలుగా పంచాయతీ కార్యదర్శులు, 68 కొత్త మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లుగా తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులుగా ఆర్డీవోలు, లేదా జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలను పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు పంపించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రత్యేకాధికారులు, ఇన్చార్జి కమిషనర్ల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కోరారు. కొన్ని మండలాలకు ఒకటి కంటే ఎక్కువ కొత్త పురపాలికలుంటే అందుకనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. కొత్త పుర పాలికలు ప్రస్తుతమున్న బ్యాంకు ఖాతాలను మూసే సి జాతీయ బ్యాంకుల్లో కొత్తగా అకౌంట్లు తెరవాలని సూచించారు. పురపాలికల్లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా చేపట్టే పనులు డిసెంబర్‌కు పూర్తి చేయాల న్నారు. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకంపై పంచాయతీ రాజ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. పోస్టుమార్టం, వైద్య నివేదికల్లో జాప్యం వద్దు వివిధ కేసుల్లో పోస్టుమార్టం, వైద్య నివేదికలు జిల్లాల వారీగా పెండింగ్‌లో లేకుండా చూడాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కేసుల దర్యాప్తును నిర్దిష్ట కాల పరిమితిలోగా పూర్తిచేసేందుకు వైద్య, పోస్టు మార్టం నివేదికల జారీలో జాప్యం లేకుండా చూడా లని డీజీపీ మహేందర్ రెడ్డి కలెక్టర్లను కోరారు. 20 నుంచి లారీల సమ్మెకు ప్రైవేటు యజమానులు పిలుపునిచ్చినందున నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోషి ఆదేశించారు. -
‘పంచాయతీ’పై అస్పష్టత!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జాప్యం జరుగుతోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. ఆలోపే కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేసేలా ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అయితే పంచాయతీరాజ్ శాఖ వైఖరి దీనికి విరుద్ధంగా ఉంది. జూన్ 25లోపు గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రి జూపల్లి చెప్పిన గడువు దగ్గరపడినా జిల్లాల వారీగా రిజర్వేషన్ల కోటాను నిర్ధారించలేదు. ఏ కేటగిరికి ఎన్ని పంచాయతీలు అనే లెక్కలు తేలలేదు. దీనిపై స్పష్టత వస్తేనే పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కోసం కనీసం వారం రోజులు పడుతుంది. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ తీరుతో గడువులోపు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడంలేదని స్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా, బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల నిర్ధారణ వంటి ప్రక్రియల్లోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే నిబంధనలున్నాయి. ఈ విషయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా అనుసరించే వ్యూ హంపైనా పంచాయతీరాజ్ శాఖ సరిగా స్పందించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించే మార్గదర్శకాలను జూన్ 12న ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేటగిరీకి ఎన్ని సర్పంచ్ స్థానాలు కేటాయించాలనేది స్పష్టత ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ, జిల్లాల కలెక్టర్లు జిల్లాల వారీగా రిజర్వేషన్ కోటా ను నిర్ధారించాలని ఆదేశించింది. ఈ ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12,751 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ‘పంచాయతీ’ బదిలీలా?
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డివిజనల్ పంచాయతీ అధికారులకు జిల్లా పంచాయతీ అధికారులుగా పదోన్నతులు ఇచ్చి ఇతర జిల్లాలకు బదిలీ చేయడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరిన కమిషన్, బదిలీ అయిన అధికారులను తమ అనుమతి లేకుండా రిలీవ్ చేయవద్దని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రంలోని ఆరుగురు డివిజనల్ పంచాయతీ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరు ఆయా జిల్లాల ఇన్చార్జి పంచాయతీ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదో న్నతులిచ్చిన నేపథ్యంలో వారు పనిచేస్తున్న స్థానాలనూ మారు స్తూ బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపైనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. సాధారణ బదిలీల నుంచి పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, దీన్ని పట్టించుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం సరైంది కాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్ జిల్లాల కలెక్టర్లకు బుధవారం పంపిన లేఖలో పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ చేయడం జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ప్రభావం చూపుతుందని, దీంతో బదిలీలపై స్టే విధిస్తున్నామని పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా బదిలీ అయిన అధికారులను రిలీవ్ చేయవద్దన్నారు. వారు పనిచేస్తున్న స్థానాల్లో మార్పు లేకుండా ఆయా అధికారులకు పదోన్నతులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. -
బీసీలకు 3,440 పంచాయతీలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని.. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం పదవులను ఆయా కేటగిరీల మహిళలకు కేటాయించాలని సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వెనుకబడిన వర్గాలకు 34 శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించాలని స్పష్టం చేశారు. ఇక మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73 శాతం లెక్కన ఆ వర్గానికి 580 సర్పంచ్ పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులన్నింటినీ ఆ వర్గం వారికే కేటాయించాలని సూచించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా ఎస్టీలకు 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అయ్యాయి. కొత్త చట్టం.. కొత్త రిజర్వేషన్లు.. రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12,751. అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 2.02 కోట్ల జనాభా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్సీ మహిళ, ఎస్టీ, ఎస్టీ మహిళ, బీసీ, బీసీ మహిళ, జనరల్, జనరల్ మహిళ కేటగిరీలుగా రిజర్వేషన్లు ఉంటాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు విధానం ప్రస్తుత ఎన్నికలతోనే మొదలుకానుంది. అంటే 1995, 2001, 2006, 2013 ఎన్నికలలో ఖరారైన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా (జీరో రిజర్వేషన్) ప్రస్తుతం కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రాష్ట్రం యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని బీసీలకు 34 శాతం పదవులను కేటాయిస్తున్నారు. బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా.. జిల్లాల వారీగా బీసీలకు ఖరారు చేసే పదవుల సంఖ్యలో మార్పులు ఉంటాయి. 2011 లెక్కల ఆధారంగా తాజా రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించనున్నారు. సర్పంచ్ల రిజర్వేషన్ సంఖ్యలను జిల్లాల వారీగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, మండలాల వారీగా జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్ పదవులు ఏ వర్గానికి అనేదాన్ని ఆర్డీవో, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవో నిర్ణయిస్తారు. మొత్తానికి మండలం యూనిట్‌గా తీసుకుని జనాభా ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు వరుసగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మిగిలిన పంచాయతీలను జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారు. గ్రామాల్లోని మొత్తం ఓటర్లు, అందులో బీసీ ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటూ రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. -
పారిశుధ్య కార్మికులపై వేటు!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మూడు, నాలుగు వేల రూపాయల వేతనాలకే పనిచేసే పారిశుధ్య కార్మికుల పొట్టగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. తొలుత మూడు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు చేశారు. యంత్రాలతో కాల్వల్లో మురుగు తొలగింపు పనులను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు సామర్లకోట, బాపట్ల, శ్రీకాళహస్తిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మూడు ట్రైనింగ్ సెంటర్లలో యంత్రాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 వేల మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీలు వీరిని కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకున్నాయి. వీరిలో దాదాపు 20 వేల మంది మేజర్, మీడియం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మేజర్, మీడియం గ్రామ పంచాయతీల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తే 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం తథ్యం. తొలగించక తప్పదు గ్రామాల్లో పారిశుధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత కార్మికులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలంటే పంచాయతీలకు నిధుల కొరత తప్పదు. నిబంధనల ప్రకారం.. గ్రామ పంచాయతీకి చెందిన మొత్తం నిధుల్లో కేవలం 15 శాతం మాత్రమే పారిశుధ్య పనులకు ఖర్చుపెట్టాలి. కాంట్రాక్టర్లకు డబ్బులను గ్రామ పంచాయతీ నిధుల నుంచే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అరకొర నిధులతో కార్మికులందరికీ జీతాలు చెల్లించడం గ్రామ పంచాయతీలకు అసాధ్యమేనని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించడం మినహా మరో మార్గం ఉండదని చెబుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో సరిపడా నిధులు లేవన్న కారణంతో ఇప్పటికే పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. అధికార పార్టీ వారికే కాంట్రాక్టులు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ పంచాయతీల్లో కీలకమైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. 105 మేజర్ పంచాయతీల్లో రోడ్లు శుభ్రం చేశాక పోగయ్యే చెత్తను ఊరి బయటకు తరలించేందుకు కాంట్రాక్టు విధానంలో ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులకే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించి, ట్రాక్టర్లు అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఎస్సీలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. యంత్రాల ద్వారా కాల్వల్లో మురుగు తొలగింపు కాంట్రాక్టులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికే దక్కే పరిస్థితి కనిపిస్తోంది. -
తెలంగాణలొ పంచాయితీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు
-
‘పంచాయతీ’కి ముమ్మర కసరత్తు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిమిత్తం ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా పెట్టారు. పంచాయతీ కార్యాలయంతోపాటు మరో రెండు ముఖ్యకేంద్రాల్లో జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను రూపొందించారు. ముసాయిదా జాబితాపై వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మంగళవారం నుంచి మొదలవుతోంది. మే 8 వరకు వీటికి అవకాశముంటుంది. అభ్యంతరాలను, ఫిర్యాదులను మే 10లోపు పరిష్కరిస్తారు. అనంతరం అన్ని అంశాలను సరిచూసుకుని తుది ఓటర్ల జాబితాను రూపొందించి 17న అన్ని పంచాయతీల్లో ప్రకటిస్తారు. అనంతరం బీసీ ఓటర్ల గణన ప్రక్రియ మొదలవుతుంది. మే 18 నుంచి బీసీ ఓటర్ల గణన జరిగే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రామపంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. కొత్త పంచాయతీల ప్రకారం గడువులోపు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్ని కల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు నమోదై ఉంటారు. బీసీ ఓటర్లను మాత్రం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి బీసీ ఓటర్లను గుర్తించనున్నారు. బీసీ ఓటర్ల గుర్తింపు అనంతరం ఎన్నికల నిర్వహణ తేదీలపై స్పష్టత వస్తుంది. పంచాయతీల్లో వార్డుకో పోలింగ్ కేంద్రాన్ని ఏ ర్పాటు చేస్తారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కు పెరిగింది. 1,13,380 వార్డులున్నాయి. -
తెలంగాణకు ‘ఈ పంచాయతీ’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు జాతీయ స్థాయి లో ‘ఈ పంచాయతీ’ పురస్కారం దక్కింది. పంచాయతీరాజ్ దివస్ (ఏప్రిల్ 24)ను పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా రాంనగర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలోని మరో 8 ఉత్తమ స్థానిక సంస్థలకూ అవార్డులు ప్రదానం చేశారు. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి, సిద్దిపేట మండల పరిషత్ అధ్యక్షుడు యాదయ్య, శ్రీరాంపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు సారయ్యగౌడ్ అందుకున్నారు. గ్రామపంచాయతీ విభాగంలో రాజన్న సిరిసిల్ల మండలం ముష్టిపల్లి సర్పంచ్ బాలయ్య, సిద్దిపేట మండలం ఇర్కోడు సర్పంచ్ వినీత, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మండలం గంట్లవల్లి సర్పంచ్ లలిత, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ నర్సింగరావు అందుకున్నారు. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి సర్పంచ్ రాజయ్య అందుకున్నారు. 2016–17లో పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లో పంచాయతీరాజ్ శాఖలోని పలు పథకాల వెబ్సైట్లను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్గా చేస్తూ దేశంలోనే తెలంగాణ ఈ పంచాయతీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా అవార్డును అందుకున్న కమిషనర్ నీతూప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులను పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. -
పల్లెకు పట్టం
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్లో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసింది. సాగునీటి శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రాధాన్యం కల్పించింది. 2018–19 బడ్జెట్లో ఈ శాఖకు ఏకంగా రూ.15,562.84 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.12,776 కోట్లను ప్రగతి పద్దుగా, రూ.2,786.78 కోట్లను నిర్వహణ పద్దుగా పేర్కొన్నారు. ఈ మేరకు భారీ నిధులతో ప్రగతి పద్దును గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం కేటాయించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు కూడా చేయనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగానే గ్రామ పంచాయతీల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవికాక ఇతర సాధారణ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తారు. తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈటల పేర్కొన్నారు. ఆసరాకు రూ.5,388.89 కోట్లు ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉదారంగా వ్యవహరిస్తోంది. గత బడ్జెట్లో కొత్తగా ఒంటరి మహిళలకు పింఛన్‌ను ప్రకటించి.. ప్రస్తుతం అమలు చేస్తోంది. తాజాగా బడ్జెట్లో బోదకాలు వ్యాధి బాధితులకు ప్రతి నెల రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సీఎం ఇటీవల ప్రకటించిన ప్రకారం బోదకాలు వ్యాధి బాధితులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం.. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. అలాగే వికలాంగులకు నెలకు రూ.1,500 చొప్పున పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా 41,78,291 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకు ఏటా సగటున రూ.5,300 కోట్లను ఖర్చు చేస్తోంది. ఆసరాకు ఈ ఏడాది రూ.5,388.89 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు ఏడాది కేటాయింపులు 2014–15 13,761 2015–16 13,896 2016–17 14,262 2017–18 14,775 2018–19 15,562 ‘భగీరథ’కు రూ.1,803 కోట్లు రాష్ట్ర ప్రజలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 15 పట్టణాలకు, 2,900 గ్రామాలు, 5,752 ఆవాసాలకు లబ్ధి చేకూరింది. ఈ ఏడాది భగీరథ పథకానికి రూ.1,803.35 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రాంతాలను 26 సెగ్మెంట్లుగా విభజించి పనులు చేపడుతున్నారు. 67 ఇన్‌టెక్ వెల్స్, 153 వాటర్ ఫిల్టర్స్, 1,69,705 కిలోమీటర్ల పైపులైన్లు, 35,514 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు 80 శాతం రుణాల రూపంలోనే నిధులు సమకూరుతున్నాయి. మిగిలిన 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తోంది. గత బడ్జెట్లో ప్రభు త్వం ఈ పథకానికి రూ.3 వేల కోట్లను కేటాయించింది. -
తేలని ‘పంచాయతీ’!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగే పరిస్థితి కనిపించడంలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటు, వార్డుల పునర్విభజన విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటమే ఇందుకు కారణమవుతోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలను గడువు లో పు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాత్కాలిక షెడ్యూల్ ఖరారు చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకా రం ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుత పాల క వర్గాల పదవీ కాలం జూలై 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 3 నెలలు ముందుగా అంటే మే 31లోపే ఎన్నికలు నిర్వహించాలి. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏర్పాటు కాని కొత్త పంచాయతీలు మెరుగైన గ్రామ పరిపాలనే లక్ష్యంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని, జనాభా ఆధారంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిం చింది. గడువు లోపు ఈ ప్రక్రియను ముగించే విషయంలో మాత్రం విఫలమవుతోంది. ప్రతిపాదనలు మారుతుండటంతో జిల్లాల నుంచి కొత్తగా ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. దీంతో పంచాయతీల ఏర్పాటు ఎంతకీ ముగియడంలేదు. వార్డుల విభజన పూర్తి కావడంలేదు. ఈ రెండు పూర్తయితేనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసే పరిస్థితి ఉంటుంది. రిజర్వేషన్లు నిర్ణయించిన తర్వాత పంచాయతీల జాబితాను ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. అనంతరం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరి స్థితి చూస్తే గడువు లోపు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే రూపొందించిన షెడ్యూల్ అమలు చేసే పరిస్థితి లేకపోవడంతో.. కొత్తది ఖరారు చేయాల్సి ఉంది. మారుతున్న ప్రతిపాదనలు జనవరి 25 లోపే కొత్త గ్రామ పంచాయతీలపై అన్ని జిల్లాల అధికారులు.. పంచాయతీరాజ్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపా లని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు 30 జిల్లాల్లో 4,122 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లు ప్రతిపాదనలు పంపారు. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి పదేపదే కొత్త మార్గదర్శకాలు వస్తుండటంతో జిల్లా స్థాయి అధికారులకు పాలుపోవడంలేదు. 500 జనాభా, 300 జనాభా ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నారు. దీంతో కొత్త పంచాయతీలపై స్పష్టత రావడంలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కొత్త పంచాయతీలు ఎన్నో తేలనుంది. -
స్థానిక సంస్థలకు కొత్త రిజర్వేషన్లు!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల్లో కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం సర్పంచ్ల ప్రాంతీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన వెయ్యిమంది వరకు సర్పంచ్‌లు హాజరుకాగా మంత్రులు జూపల్లి, పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ త్వరలోనే కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రానుందని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలా లేక పరోక్షంగానా అన్నది ఇంకా నిర్ణయం తీసు కోలేదన్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర ఉంటుందన్నారు. అనేక సమస్యలకు పరిష్కారం ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి జూపల్లి అన్నారు. నిధులు ఖర్చు చేయడమే సర్పంచ్ల విధిగా భావించొద్దని, ప్రజలను సంఘటితం చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు రూ.500 కోట్ల నిధులు విడుదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. -
‘అభయ హస్తం’ ఇక ఉచితం!
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులకు భరోసా కల్పించే అభయ హస్తం పథకం పూర్తిగా మారనుంది. సభ్యులకు, వారి భర్తలకు సైతం బీమా కల్పించేలా పథకంలో మార్పులు చేశారు. రాష్ట్రంలో 78 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త విధానంలో పథకాన్ని అమలు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త తరహా అభయ హస్తం పథకం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందిస్తున్న అభయ హస్తం పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంఘాల్లోని సభ్యులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే చెల్లించిన వారి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని భావిస్తోంది. లబ్ధిదారులకు అందించే ప్రయోజనాలను పెంచుతోంది. రాష్ట్రంలో మొత్తం 4.26 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 44.42 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం 20.15 లక్షల మంది మాత్రమే అభయ హస్తం పథకంలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులతో సంఘా ల్లోని మొత్తం సభ్యులు అభయ హస్తం పథకం పరిధిలోకి వస్తారు. సభ్యులుగా ఉన్న వారి భర్తకు కూడా బీమా పథకం వర్తించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీమా వర్తించే వారి సంఖ్య 78 లక్షలకు చేరనుంది. వైఎస్ హయాంలో ప్రారంభం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బీమా సౌకర్యం, వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు. 18 నుంచి 60 ఏళ్లలోపు వారు అభయ హస్తం పథకానికి అర్హులు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.356 చెల్లిస్తే.. ప్రభుత్వం తన వంతుగా ఇంతే మొత్తాన్ని చెల్లిస్తోంది. పథకంలో సభ్యులకు 60 ఏళ్లు దాటిన తర్వాత కనీసం రూ.500 తగ్గకుండా పింఛను వస్తుంది. తెలంగాణ ఏర్పడిన రోజు వరకు రాష్ట్రంలో 2,13,852 అభయ హస్తం పింఛనుదారులు ఉన్నారు. అనంతరం వీరిలో 1,16,848 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారుల జాబితాలో చేరారు. మిగతా 97,004 మంది అభయ హస్తం పింఛను పొందుతున్నారు. అభయ హస్తం పింఛను నెలకు రూ.500 మాత్రమే ఉండగా.. అదే ఆసరా వృద్ధాప్య పింఛను నెలకు రూ.వెయ్యి అందుతోంది. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆసరా పింఛను ఇవ్వాలనే నిబంధన ఉంది. దీంతో వయస్సు పరంగా అర్హత ఉన్నా కుటుంబంలో మరొకరు ఆసరా లబ్ధిదారుగా ఉండటంతో 89,356 మందికి అభయ హస్తం పథకం కింద రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు అభయ హస్తం పథకంలో చేరిన వారు ప్రతి రోజు రూపాయి చెల్లించడంపైనా మహిళల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పథకం మొత్తాన్ని కొత్తగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
‘పంచాయతీ’ పరోక్షమే!
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించడానికే మంత్రివర్గ ఉపసంఘం మొగ్గు చూపింది. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ పరిధిలో కార్యనిర్వాహక అధికారాలన్నీ సర్పంచులకే అప్పగించాలని ప్రభుత్వానికి సూచించింది. పంచాయతీకి ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులను నామినేట్ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు నివేదికను శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేసింది. తుది మెరుగులు దిద్ది.. పంచాయతీరాజ్ చట్టంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రులు కె.తారక రామారావు, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ఉప సంఘం శనివారం సచివాలయంలో సమావేశమైంది. పంచాయతీరాజ్ చట్టంలో చేర్చాల్సిన, తొలగించాల్సిన అంశాలపై మరోసారి చర్చించి నివేదికకు తుదిరూపు ఇచ్చింది. అనంతరం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి నివేదికను అందజేసింది. దీనిపై ఈ నెల 22న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించే అవకాశముంది. అనంతరం ఒకటి రెండు రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీరాజ్ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ‘పంచాయతీ’సమస్యలపై ట్రిబ్యునల్ ప్రస్తుతం సర్పంచులపై అనర్హత వేటు వేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంది. సర్పంచులు కలెక్టర్ నిర్ణయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రికి అప్పీలు చేసుకునేందుకు అవకాశముంది. పంచాయతీరాజ్ మంత్రిదే తుది నిర్ణయంగా అమలవుతోంది. అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఉన్న జ్యుడీషియల్ అధికారాలను తొలగించి.. సర్పంచుల అప్పీలు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో సూచించింది. ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులు గ్రామ పంచాయతీల్లో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులను నామినేట్ చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ఇందులో... గ్రామ స్వయం సహాయక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు ఒక కో–ఆప్షన్ సభ్యురాలిగా ఉంటారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లేదా ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసిన వారిలో ఒకరు రెండో కో–ఆప్షన్ సభ్యులుగా... గ్రామ పరిపాలన, అభివృద్ధి, చట్టాల్లో నైపుణ్యం, సేవాభావం కలిగిన సీనియర్ పౌరులెవరినైనా మూడో కో–ఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేయాలని సూచించింది. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో వీరికి ఓటు వేసే అధికారం ఇవ్వాలా, వద్దా అన్న దానిపై ఉప సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లా, మండల పరిషత్‌లలో కో–ఆప్షన్ సభ్యులకు ఓటు అధికారం లేదని, ఇక్కడా అదే విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. వీటితోపాటు మరిన్ని సూచనలను నివేదికలో పొందుపరిచింది. అయితే ఉప సంఘం ఏ సూచన చేసినా.. చివరికి ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమంగా అమలవుతుందని, సర్పంచ్ ఎన్నిక అంశం కూడా సీఎం అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని మంత్రివర్గ సభ్యుడొకరు పేర్కొన్నారు. వార్డు సభ్యుల నుంచే సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించడానికే మంత్రివర్గ ఉపసంఘం మొగ్గు చూపించింది. ప్రస్తుతం గ్రామ ఓటర్లంతా నేరుగా సర్పంచ్‌ను ఎన్నుకునే పద్ధతి అమల్లో ఉంది. ఒకసారి ఎన్నికైతే నాలుగేళ్ల దాకా సర్పంచ్‌ను దింపేయడానికి అవకాశం లేదు. దాంతో సర్పంచుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అందువల్ల వార్డు సభ్యుల నుంచే సర్పంచును ఎన్నుకునేలా చట్ట సవరణ చేయాలని ప్రతిపాదించింది. ఇక పంచాయ తీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకే కార్యనిర్వహణ అధికారాలు ఉండగా.. వాటిని సర్పంచులకే అప్పగించాలని సూచించింది. సర్పంచులకు ప్రస్తుతం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని గ్రామ కార్యదర్శి ద్వారా అమలు చేయించే అధికారం మాత్రమే ఉంది. దీనివల్ల గ్రామ కార్యదర్శికి, సర్పంచుకు మధ్య సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నట్టు ఉప సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయిలోని నిర్ణయాలను తీసుకునే అధికారం, జరిమానాలను విధించే అధికారం వంటివాటిని సర్పంచులకే అప్పగించాలని నివేదికలో పేర్కొంది. ‘పెట్టుబడి సాయం’పై సీఎంకు నివేదిక రైతులకు పంట పెట్టుబడి సాయం పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శనివారం సీఎం కేసీఆర్‌కు తమ నివేదికను అందజేసింది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉప సంఘం సభ్యులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు తమ సిఫార్సులను అందజేశారు. -
పంచాయతీల్లోనూ కో–ఆప్షన్ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు కూడా కో–ఆప్షన్ సభ్యులను నామినేట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతులు, వివిధ రంగాల్లో నిపుణులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరిద్దరిని నామినేట్ చేయాలని భావిస్తోంది. ఇక గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకు ఉన్న అన్ని కార్యనిర్వాహక అధికారాలను సర్పంచులకు అప్పగించాలని నిర్ణయించింది. మొత్తంగా పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పులపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సుదీర్ఘంగా సమావేశమైంది. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఈటల, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో పాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఒకరిద్దరు కో–ఆప్షన్ సభ్యులతో.. మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్తులకు నామినేట్ చేస్తున్న తరహాలోనే గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వమే కో–ఆప్షన్ సభ్యుడిని నామినేట్ చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు. అదే గ్రామానికి చెందిన విద్యావంతులు, వివిధ రంగాల్లో నిపుణులు, స్వయం సహాయక సంఘం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరిని లేదా ఇద్దరిని నామినేట్ చేసే అంశంపై చర్చించారు. కో–ఆప్షన్ సభ్యుల నియామకంపై సానుకూలత వ్యక్తమైనా.. సర్పంచ్, ఉప సర్పంచ్ల ఎన్నికలో వారికి ఓటు హక్కు ఇవ్వాలా, వద్దా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలా, పరోక్షంగానా అన్నది తేలాక కో–ఆప్షన్ సభ్యుల ఓటుహక్కుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఎలాంటి మార్పులు చేయాలన్న అంశాన్ని పరిశీలించే బాధ్యతను అడ్వొకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డికి అప్పగించారు. జిల్లా స్థాయిలోనే జీ ప్లస్ టూ ఆపై ఉండే బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు, గ్రామ పంచాయతీల పరిధిలోని లేఔట్లు వంటి వాటికి అనుమతులను కూడా జిల్లా స్థాయిలోనే ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన ఈ బాధ్యతను జిల్లా స్థాయి కమిటీకి అప్పగించాలని, నిర్ణీత కాల పరిమితిలోగా దరఖాస్తులను తిరస్కరించడమో, ఆమోదించడమో చేయాలని నిర్దేశించేలా నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు. రెండు పర్యాయాలు రిజర్వేషన్..! పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్పైనా భేటీలో చర్చ జరిగింది. ప్రతిసారి (ఐదేళ్లకోసారి) రిజర్వేషన్ రొటేషన్ కావడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. అభివృద్ధి చేయాలనుకునేవారికి మరోసారి అవకాశం రావడం లేదని అభిప్రాయం వ్యక్తమైంది. మరోసారి రిజర్వేషన్ రాదని, పోటీచేసే అవకాశం కూడా రాదనే ఉద్దేశంతో కొందరు సర్పంచులు బాధ్యతారహితంగా పని చేస్తున్నారనే ప్రస్తావన వచ్చింది. ఈ పరిస్థితిని నివారించడానికి ఏ రిజర్వేషన్ అయినా వరుసగా రెండు పర్యాయాలు ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది. తరచూ గ్రామ సభలు గ్రామాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ఇతర మార్పులు, నిర్ణయాలపై ప్రజలను భాగస్వామ్యం చేయడానికి గ్రామ సభలను ఎక్కువసార్లు నిర్వహించేలా చట్టంలో నిబంధనలు పొందుపరచాలని సబ్ కమిటీ భేటీలో నిర్ణయించారు. నెలకోసారి లేదా కనీసం రెండు నెలలకోసారి కచ్చితంగా గ్రామ సభను నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కాగా మంత్రివర్గ ఉప సంఘం బుధ, గురువారాల్లో కూడా సమావేశం కానుంది. అన్ని అంశాలపై లోతుగా చర్చించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా నివేదికను రూపొందించనుంది. ‘పంచాయతీ’ ట్రిబ్యునల్ ప్రస్తుతం సర్పంచులు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన న్యాయపరమైన (జ్యుడీషియల్) అధికారాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయి. దీంతో ఆయా అంశాలకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో... న్యాయపరమైన అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా సబ్ కమిటీ భేటీలో చర్చించారు. ప్రభుత్వోద్యోగులకు ఉన్నట్టుగానే పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. సర్పంచులకేపూర్తి అధికారాలు గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకు ఉన్న కార్యనిర్వహణాధికారాలను పూర్తిగా సర్పంచులకే అప్పగించాలని సబ్ కమిటీ భేటీలో ప్రతిపాదన వచ్చింది. నిధులు, కార్యనిర్వాహక అధికారాలను సర్పంచ్‌కే అప్పగించడంతో పాటు విధులు, బాధ్యతలపైనా ప్రధానంగా చర్చించారు. సర్పంచులు, వార్డు సభ్యులకు పూర్తి అధికారాలను అప్పగించడం ద్వారా జవాబుదారీతనం పెంచవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో నిధుల వినియోగం పారదర్శకంగా ఉండటానికి పలు నియంత్రణలు కూడా విధించాలని నిర్ణయించారు. -
తప్పుల తడకగా ‘ఇంటింటి సర్వే’
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను పెంపును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 82 లక్షల ఇళ్లకు చేసిన సర్వేలో దాదాపు 20 లక్షల ఇళ్ల సమాచారంలో తప్పులు దొర్లినట్లు గుర్తించారు. గత ఐదు నెలలుగా గ్రామ, మండల స్థాయిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పూర్తిగా ఈ కార్యక్రమంపైనే దృష్టిపెట్టి రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీల్లో 82 లక్షల ఇళ్ల సర్వేను పూర్తిచేశారు. ఇంటి పన్ను రేట్లు పెంచడం కోసం ప్రధానంగా ఈ సర్వే చేపట్టగా, ప్రభుత్వం మాత్రం ఇంటి విలువకు సంబంధించి ఆస్తి సర్టిఫికెట్ జారీకోసం సర్వే సమాచారం ఉపయోగించుకుంటామని చెబుతూ వస్తోంది. కాగా ఇంటింటి సర్వేలో.. ఎంత విస్తీర్ణం భూమిలో ఇంటి నిర్మాణం జరిగింది.., నిర్మాణం జరిగిన భవన విస్తీర్ణం ఎంత అన్న వివరాలను.. ఒక్కో ఇంటి వద్ద కొలతలు తీసుకుని, వాటిని ఆన్లైన్లో పొందుపరిచారు. పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది సేకరించిన వివరాలను నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్లో పొందుపరచడంతో పాటు ఆ ఇంటికి సంబంధించి ఫొటో, జియో ట్యాగింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదుచేసే బాధ్యతలను ఎంట్రో ల్యాబ్స్ అనే ఐటీ సంస్థకు అప్పగించారు. వివరాల ఆన్లైన్ నమోదు చేసినందుకు ఎంట్రో ల్యాబ్‌కు ఒక్కో ఇంటికి రూ.9 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి 82 లక్షల ఇళ్ల వివరాల సేకరణ, ఆన్లైన్లో నమోదు ప్రక్రియ గత నెల 27న ముగిసింది. అయితే.. కొన్ని ఇళ్ల సమాచారం రెండేసి సార్లు నమోదు కావడం.. కొన్ని ఇళ్లకు సంబంధించిన సమచారానికి.. ఆ ఇంటి ఫొటో కూడా పొందపరచనట్టు అధికారులు గుర్తించారు. ఇళ్ల కొలతల్లో.. నంబర్ల నమోదులో తప్పులు సర్వేలో ఒక్కో ఇంటి వివరాలు సేకరించాక గ్రామాలవారీగా ఆ ఇంటికి ఒక నంబరు ఇచ్చి దాని వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. అయితే.. అలాంటి నంబర్లను కూడా పలు ఇళ్లకు పొందపరచలేదని అధికారుల పరిశీలనలో తేలింది. ఇళ్ల కొలతలు పేర్కొనాల్సిన చోట పూర్తిగా తప్పులు దొర్లినట్టు గుర్తించారు. దాదాపు 20 లక్షల ఇళ్ల సమాచారంలో ఏదో ఒక తప్పు దొర్లినట్టు కనుగొన్నారు. తప్పులు దొర్లిన ఇళ్ల సమాచారాన్ని పునఃపరిశీలించి తిరిగి çసరైన సమాచారం నమోదు చేయాలంటూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ రామాంజనేయులు జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎంట్రీ ల్యాబ్స్ సంస్థ సిబ్బందినీ ఆదేశించారు. -
జూన్, జూలైల్లో పంచాయతీ ఎన్నికలు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు కార్యాలయాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్. రమేష్‌కుమార్ లేఖ రాశారు. ప్రస్తుత గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీకి ముగియనున్న దృష్ట్యా భారత రాజ్యాంగంలోని 243 ఈ (3) (ఏ) నిబంధన ప్రకారం పదవీ కాలం ముగిసేలోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 ప్రకారం పాత సర్పంచుల పదవీ ముగిసే మూడు నెలల ముందు వీలును బట్టి ఎప్పుడైనా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్పి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామ పంచాయతీలకు తాజాగా ఎన్నికల నిర్వహణ అవసరమైన ముందస్తు కసరత్తు ప్రణాళికను ఆయన లేఖలో పొందుపరి చారు. కొత్త పంచాయతీల ఏర్పాటు, ఇప్పుడు గ్రామ పంచాయతీల విలీనం తదితర ప్రక్రియలను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా ఎన్నికలు జరిపే గ్రామ పంచాయతీల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్ల వివరాలను మే నెలాఖరు కల్లా ప్రకటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే జూన్, జూలైల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుందని లేఖ లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీలకు విడతల వారీగా ఎన్నిక నిర్వహిస్తామని, నోటిఫికేషన్ విడుదల చేసిన 30 రోజుల కల్లా ఎన్నికల ఫలితాలను ప్రకటించే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ఉంటుందని తెలిపారు. -
మోక్షం లేదా..!
♦ కొట్టాలకు వెళ్లేందుకు గతుకులుగా ఉన్న రోడ్డు ♦ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్అండ్బీ విలీనానికి రాని ఆదేశాలు ♦ పట్టించుకోని అధికారులు కొట్టాల(రాజుపాళెం) : గ్రామాల్లో ఉన్న పంచాయతీ రాజ్ రోడ్లకు మోక్షం కలగడం లేదు. ఎన్నో ఏళ్లుగా గతుకుల రోడ్లతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. అదే కోవలోనే రాజుపాళెం మండలంలోని కొట్టాల రోడ్డు ఉంది. ఈ రోడ్డును అభివృద్ధి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాదెగూడూరు నుంచి కొట్టాల గ్రామానికి పంచాయతీ శాఖ రాజ్ అధికారులు కొన్నేళ్ల కిత్రం తారురోడ్డును వేశారు. ఎనిమిదేళ్లుగా పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఈ రోడ్డుకు మరమ్మతులు లేదా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఆర్ఆర్ఎం గ్రాంటు కింద నిధులు మంజూరు చేసి టెండరు ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ టెండరును రద్దు చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ రోడ్డుకు నిధులు మంజూరు కాలేదు. విలీనానికి బ్రేక్: ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు లేవని పం చాయతీ రాజ్ శాఖ చేతులెత్తేయడంతో.. ఆర్అండ్బీ అధికారులు ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి విలీనం చేసేందుకు ఉన్నతాధికారులకు ఇటీవల ప్రతిపాదనలు పంపిం చారు. వాటికి కూడా మోక్షం కలగలేదు. ఈ రోడ్డును గాదెగూడూరు నుంచి కూలూరు సమీపంలోని కుందూ నదిపై నిర్మించిన హైలెవెల్ వంతెన వరకు అనుసంధానం చేశారు. ఈ దారి అధ్వానంగా ఉండటంతో గతంలో ఆర్టీసీ బస్సును కూ డా రద్దు చేశారు. తిరిగి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారుల వద్దకు వెళ్లి బస్సును తిప్పాలని కోరడంతో వారు తిప్పుతున్నారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా చాగలమర్రిలోని జాతీయ రహదారి 40కి ఈ రోడ్డు అనుసంధానంగా ఉంది. నిత్యం ఈ దారిలో రాకపోకలు జరుగుతుండేవి. అయితే గుంతలమయంగా మారడంతో కూలూరు మీదుగా వాహనదారులు వెళుతున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ అధి కారులైనా చొరవ తీసుకొని పంచాయతీ రాజ్‌శాఖలో ఉన్న ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి బదలాయించి అభివృద్ధి చేయాలని కొట్టాల గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్డును మరిచారు మా గ్రామానికి వెళ్లే కొట్టాల రోడ్డును అభివృద్ధి చేయడంలో అటు అధికారులు, ప్రజాప్రతినిధులు మరిచారు. బండ్ల బాట కన్నా అధ్వానంగా ఉండటంతో ఇబ్బందికరంగా ఉంది. రోజూ చాగలమర్రి, ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు ఈ రోడ్డే దిక్కు. ఏళ్లు గడస్తున్నా గుంతలు కూడా పూడ్చలేదు. – నరసింహరెడ్డి, కొట్టాల నాగరికతకు దూరంగా.. ఆధునిక యుగంలో కూడా కొట్టాల గ్రామం వెనుకబడి ఉంది. ఎవరైనా గ్రామానికి వచ్చేందుకు కనీసం రోడ్డు కూడా బాగలేదు. ఇక్కడ ఒక గ్రామం ఉందని అధికారులకు, పాలకులకు తెలియదా? తెలిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదు. – రంగారెడ్డి, కొట్టాల -
ఏమిటీ బదిలీలలు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ సిబ్బంది ఒకే చోట ఎక్కువ కాలం పనిచేస్తే ప్రలోభాలకు లొంగుతారని, పరిపాలనా వ్యవస్థ గాడి తప్పుతుందని బదిలీలు నిర్వహిస్తారు. మరి ఆ బదిలీలే గాడితప్పితే? జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో అదే జరిగింది. ఆ శాఖ బదిలీల్లో ఉద్యోగుల లీలలు ఔరా అనిపించేలా ఉన్నాయి. బదిలీ అయిన చోట నుంచి కదలకుండా తిరిగి అక్కడే డెప్యుటేషన్ వేయించుకుని తిష్ట వేశారు కొందరు ఉద్యోగులు. మరి కొందరు కుంటి సాకులతో బదిలీ నుంచి తప్పించుకున్నారు. ఎక్కడకు బదిలీ చేస్తే ఏమవుతుందంటూ సిబ్బంది తిరిగి తాము కోరుకున్న చోటకే వెళ్లిపోతుంటే ఇక బదిలీలకు అర్ధమేముందని ఆ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నా అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. బదిలీ నిబంధనలకు తిలోదకాలిచ్చి తమకు నచ్చినట్టు వ్యవహరిస్తున్న పంచాయతీ రాజ్ సిబ్బందికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బదిలీ అయినా... జిల్లాలో డీపీఓ కార్యాలయం, రెండు డివిజనల్ పంచా యతీ కార్యాలయాలున్నాయి. వీటితో పాటే 15 మేజర్ పంచాయతీలూ ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలోని 921 పంచాయతీల్లోని కార్యదర్శులు, సిబ్బంది, అధికా రులకు గడచిన మే నెలలో బదిలీలు నిర్వహించారు. వారికి కేటాయించిన చోట విధులు నిర్వర్తించాల్సిన అధికారులు, సిబ్బంది డెప్యుటేషన్‌పై మళ్లీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ∙కొండపాలెం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కనకరాజును ఎస్.కోట బదిలీ చేశారు. ఇతనిని డెప్యూటేషన్‌పై తిరిగి కొండపాలెంలోనే కొనసాగిస్తున్నారు. ∙చీపురుపల్లి శానిటరీ ఇన్స్పెక్టర్కు ఎస్.కోట శానిటరీ ఇన్స్పెక్టర్గా రెండు నెలల క్రిందటే బదిలీ అయింది. ఆయన నేటికీ చీపురుపల్లిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ∙గర్భాం పంచాయతీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న స్వామికి జామి మండల కేంద్రానికి బదిలీ అయినా ఇంకా గర్భాంలోనే పనిచేస్తున్నారు. బదిలీ అయిన చోటే పనిచేయాలి పంచాయతీ రాజ్ శాఖలో గతంలో నిర్వహించిన బదిలీల ప్రకారం కొత్త స్థానాల్లోనే సిబ్బంది పనిచేయాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. శాఖాపరంగా ఎవరికీ డెప్యుటేషన్ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎవరి స్థానాల్లో వారు పనిచేయకుంటే మేం తీసుకునే కఠిన చర్యలకు వారు బా«ధ్యులవుతారు’ – బలివాడ సత్యనారాయణ, ఇన్చార్జి డీపీఓ -
పనుల్లో జాప్యం.. ప్రజలకు శాపం
నత్తనడకన పీఆర్ రోడ్లు, బ్రిడ్జి పనులు - ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ పనులు సైతం అదే దారిలో.. - దృష్టి సారించని ఉన్నతాధికారులు - క్షేత్ర స్థాయిలో కానరాని పర్యవేక్షణ - ఇబ్బందుల్లో పల్లె వాసులు ఉమ్మడి జిల్లాలో బ్రిడ్జిల నిర్మాణం : 43 పూర్తయినవి: 20 ఏడాదికాలంగా సాగుతున్నవి: 23 విడుదలైన నిధులు:రూ.35.16 కోట్లు సాక్షి, మెదక్: పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టాల్సిన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఊపందుకోవడంలేదు. ఫలితంగా సరైనా రవాణా సౌకర్యం లేక గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాతోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగటంలేదు. సరైన రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులు లేక గ్రామీణులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించటంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖదే ముఖ్యపాత్ర. నాబార్డు, ఎంఆర్ఆర్ (మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్), సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్), కల్వర్టు వర్క్(సీడీ వర్క్)తోపాటు వివిధ స్కీంల ద్వారా రహదారులు నిర్మాణం, మరమ్మతులు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తారు. ఆయా స్కీంల ద్వారా మెదక్‌తోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరైనా పనులు మాత్రం సకాలంలో పూర్తి కావటంలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నాబార్డు ఆర్ఐడీఎఫ్ ద్వారా 43 బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.35.16 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 20 పనులు పూర్తి కాగా మిగతా 23 బ్రిడ్జిల నిర్మాణం పనులు ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. నాబార్డు (ఆర్ఐడీఎఫ్ 21) ద్వారా రూ.29.33 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో మొత్తం 37 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఒక్క బ్రిడ్జి నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. మిగతా 36 బ్రిడ్జిలనిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో పలుచోట్ల బ్రిడ్జిల నిర్మాణం పనులు ముందుకు సాగడంలేదు. హవేళిఘనపూర్ మండలం గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. తిమ్మాయిపల్లి–అనంతసాగర్ బ్రిడ్జి, ర్యాలమడుగు–పేరూర్ బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలంలోని నస్కల్ నుంచి తుజాల్పూర్ వరకు చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాలేదు. కౌడిపల్లి మండలంలోని సీలంపల్లి నుంచి గౌతాపూర్ లోలెవల్ కాజ్ వే పనులు ప్రారంభంకాలేదు. చిలప్‌చెడ్ మండలం సోమక్కపేట రాందాస్‌గూడ మధ్య బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. కొల్చారం మండలంలో లింగంపల్లి మధ్య కంచన్‌పల్లిలో చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కొల్చారం మండలంలో కుబ్యాతండా– అంసాన్‌పల్లిలో బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించలేదు. నర్సాపూర్ మండలంలోని తుల్జాపూర్ నుంచి కాజీపేట మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. నర్సాపూర్ మండలంలోని మూసాపేట నుంచి దౌల్తాబాద్ మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రిడ్జిలు పూర్తి కాకపోవటంతో ఆయా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ పనుల్లోనూ.. రహదారులు, భవనాల నిర్మాణం పనుల్లో సైతం జాప్యం చోటు చేసుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంఆర్ఆర్ ద్వారా రూ.213 కోట్ల అంచనా వ్యయంతో 507 పనులు మంజూరు కాగా 397 పనులు పూర్తయ్యాయి. ఇంకా 110 పనులు కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ కింద రూ.355 కోట్లతో 248 కొత్త పనులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 183 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 65 రహదారుల నిర్మాణం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో మండల సమాఖ్య భవనాల నిర్మాణం కోసం రూ.3.98 కోట్ల మంజూరయ్యాయి. మొత్తం 14 భవనాలు నిర్మించాల్సి ఉండగా కేవలం ఐదు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా తొమ్మిది భవనాల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అలాగే అంగన్వాడీ భవనాల నిర్మాణం పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. -
ఆ పోస్టుల్లో ఇతరులను నియమించొద్దు
ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం వినతి సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నత స్థాయి పోస్టుల్లో ఇతర శాఖలకు చెందిన అధికారులను నియమిం చవద్దని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం (టీపీఎస్ఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని కోరింది. అర్హులకు పదోన్నతులు కల్పించాలని, క్లస్టర్లను పునర్విభజన చేసి రెగ్యులర్ కార్యదర్శులను నియమించాలంది. సర్వీస్ క్రమబద్ధీకరణకు పరీక్షలు పాస్ కావడం నిబంధన తొలగించాలని, ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శులకు ప్రతి నెలా రూ.3 వేలు ఎఫ్‌టీఏ ఇవ్వాలసింది. తమ డిమాండ్లపై సానుకూల స్పందన రాకుంటే జేఏసీగా ఏర్పడి సమ్మెకు దిగుతామని అసోసియేషన్ ప్రకటించింది.ఈ సమావేశంలో టీపీఎస్ఏ ప్రధాన కార్యదర్శిగా పి.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా జోగం రాజు, ఉపాధ్యక్షుడిగా పి.జనార్దన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జి.మనోహర్‌ను నియమించినట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
నేటి నుంచి ‘అమరావతి’ పాలన
-
1,524 గ్రామీణ రోడ్లు ధ్వంసం
370 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టండి... పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో జూపల్లి సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 1,524 పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. దాదాపు 1,700ల కి.మీ.మేర పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. పంచాయతీరాజ్ రహదారుల స్థితిగతులపై ఆ విభాగ ఉన్నతాధికారులతో గురువారం సచివాల యంలో మంత్రి జూపల్లి సమీక్షించారు. కోతకు గురైన 530 రహదారులకు మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పాడైన అన్ని రోడ్లకు కలిపి తాత్కాలిక మరమ్మతులకు రూ.49.61 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.318.58 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. జిల్లాల్లో 73 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. వీటి మరమ్మతుల కోసం రూ.2.89 కోట్లు అవసరమని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని నాలాలపై ఆక్రమణలను వెంటనే తొలగించాలని, ఆక్రమణదారులపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. నాలాల ఆక్రమణ, అనుమతులులేని నిర్మాణాలపై పదిరోజుల్లో గా నివేదికను సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్‌ను, జిల్లా డీపీవోను ఆదేశించారు. -
హరితహారానికీ ‘ఉపాధి హామీ’
- రూ.800 కోట్లతో గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికలు - మొక్కలను సంరక్షించే ఉపాధి కూలీలకు దినసరి వేతనాలు సాక్షి, హైదరాబాద్ : హరితహారానికి ఉపాధి హామీ నిధులను వెచ్చించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం నుంచి సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉపాధిహామీ చట్టంలోని కేటగిరి -ఎ ప్రకారం అడవులు, రహదారులు, చెరువు గట్లు, ప్రభుత్వ విద్యా, పారిశ్రామిక సంస్థలు, కమ్యూనిటీ స్థలాలు తదితర ప్రదేశాల్లోనూ, కేటగిరి-బి మేరకు ఇళ్లు, పంట పొలాలు తదితర వ్యక్తిగత స్థలాల్లో మొక్కలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం, రవాణా, మొక్కల పెంపకం, వాటిని సంరక్షించేవారికి దినసరి వేతనాలను కూడా ఉపాధి హామీ నుంచే కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం 15 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మూడు కోట్లకుపైగా మొక్కలను పెంచుతున్నారు. ఆయా నర్సరీల్లో ఇప్పటికే సుమారు 60 లక్షల ఈత మొక్కలు, 40 లక్షల పండ్లు, పూలు, 6 లక్షల టేకు మొక్కలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 13 వేల కిలోమీటర్ల మేర రహదారుల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది పొడవునా ఉపాధిహామీ పథకం కింద హరితహారాన్ని కొనసాగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కోటి మొక్కల హరితహారం నేడే హరితహారంలో భాగంగా మంగళవారం ఒక్కరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దామరగిద్ద గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల క్షేత్రస్థాయి అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. కోటి మొక్కల హరితహారంలో 4.15 లక్షల స్వయం సహాయక గ్రూపుల నుంచి 47.21 లక్షల మంది మహిళలు పాల్గొంటారని మంత్రి తెలిపారు. సమావేశంలో కమిషనర్ అనితారాంచంద్రన్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో పౌసమీ బసు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో ఆపరేటర్లకు పొంచి ఉన్న గండం
♦ నెలాఖరుతో ముగియనున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ గడువు ♦ 1,313 మంది డేటా ఎంట్రీ ♦ ఆపరేటర్లలో ఆందోళన కొనసాగింపు విషయమై త్వరలో ఉత్తర్వులు: డెరైక్టర్ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ విభాగంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. గ్రామ పంచాయతీల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు 2014లో ఔట్సోర్సింగ్ పద్ధతిన వీరందరినీ ప్రభుత్వం నియమించింది. కార్వీ ఏజెన్సీతో సర్కారు కుదుర్చుకున్న ఒప్పందం గత డిసెంబరు 31తోనే ముగియగా, చివరి నిమిషంలోప్రభుత్వం మరో మూడు నెలల పాటు (2016 మార్చి 31) వరకు కాంట్రాక్ట్ గడువును పొడిగించింది. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయోనని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కార్వే ఏజెన్సీ కింద ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వీరందరిని వదిలించుకోవాలని, కార్వే కాంట్రాక్ట్‌కు మంగళం పాడాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 తర్వాత సదరు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’కోసం విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని పంచాయతీరాజ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు. కొనసాగిస్తాం: పీఆర్ విభాగం డెరైక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తామని, వారు పనిచేస్తున్న కార్వీ ఏజె న్సీ కాంట్రాక్ట్ గడువును మాత్రం పొడిగించడం లేదని పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ అనితా రాంచంద్రన్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల ఆదాయంలో 10 శాతం నిధులను పరిపాలనకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలను ఆ పంచాయతీలే చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీచేస్తామని ఆమె పేర్కొన్నారు. -
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా
♦ ‘గ్రామజ్యోతి’ మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు ♦ గ్రామాభివృద్ధికి ఏడు కమిటీలు ♦ పంచాయతీ స్థాయిలోనే ప్రణాళికలు ♦ గ్రామ సభ ఆమోదంతో అమలు ♦ అన్ని సంఘాలు, సంస్థల భాగస్వామ్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామాల సంపూర్ణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే ‘గ్రామజ్యోతి’ ప్రధాన ఆశయంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీలు సాధికారత సాధించాలంటే ఏడు కీలక రంగాలకు సంబంధించిన అభివృద్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. తాగునీరు-పారిశుద్ధ్యం, ఆరోగ్యం-పోషకాహారం, విద్య, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణ, సామాజిక భద్రత-పేదరికాన్ని తగ్గించడం, వ్యవసాయం వంటివి ఇందులో ఉన్నాయి. ఆయా రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను గ్రామస్థాయిలోనే రూపొందించాల్సి ఉంది. ప్రణాళికల రూపకల్పనలో గ్రామాల్లో ఉండే స్వయం సహాయక గ్రూపులు, శ్రమశక్తి సంఘాలు, యువజన బృందాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డు ఉద్యోగులు, వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రతి రంగానికి ఒక కమిటీ ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు నిమిత్తం ప్రతి రంగానికి తప్పనిసరిగా ఒక కార్యనిర్వాహక కమిటీ ని ఏర్పాటు చేయాలని సర్కారు సూచించింది. మండల/గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేసే అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ క మిటీలో ఒకరు లేదా కొందరు వార్డు సభ్యులు, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లీడరు, కుల సంఘం లేదా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే ఎన్జీవో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సకాలంలో పూర్తయ్యేలా కమిటీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రణాళికల రూపకల్పన నిమిత్తం ఆ రంగానికి సంబంధించి వనరుల సమాచారం సేకరించాలి, అవసరాలను అంచనా వేయాలి, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలి. నిర్ణయం తీసుకోవడంలో అందర్నీ భాగస్వాములను చేసే పద్ధతులను పాటించాలి. ప్రణాళికను రూపొందించి గ్రామసభ ఆమోదం పొందాలి. కార్యక్రమాలు-ఫలితాలు :- పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ సర్వే ద్వారా గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లను గుర్తించాలి. ప్రజల భాగస్వామ్యంతో మురుగునీరు, చెత్తకోసం డంప్‌యార్డులను గుర్తించాలి. చెత్తాచెదారాన్ని తొలగించాలి. దోమల వ్యాప్తిని నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. మలే రియా, డెంగీ, చికెన్ గున్యా, డయేరియా, కలరా, కామెర్లు వంటివి విజృంభించకుండా చర్యలు చేపట్టాలి. తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలి. నల్లాద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలి. పైపులైన్ల లీకేజీని అరికట్టాలి. ఆరోగ్యం-పోషకాహారం ఈ కమిటీకి పంచాయతీలోని వార్డు సభ్యురాలిని చైర్మన్‌గా నియమించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను సమన్వయపరచి వారు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలి. తల్లులు, శిశువులు, వృద్ధుల ఆరోగ్య సమస్యలను ఏఎన్ఎం, ఆశావర్కర్లు తప్పనిసరిగా కమిటీకి, గ్రామసభకు రిపోర్టు చేయాలి. ప్రధానంగా గర్భిణులు, శిశు ఆరోగ్యం, జనరల్ హెల్త్ అంశాలపై కమిటీ దృష్టి సారించాలి. వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగేలా, శిశువులకు సంపూర్ణంగా వ్యాధి నిరోధకాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం ద్వారా మాతా శిశువులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి. వ్యవసాయం గ్రామ ఉప సర్పంచ్‌ను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలి. సబ్సిడీ విత్తనాల పంపిణీ, భూసార ఆరోగ్య కార్డుల నిర్వహణ, సాగు యాంత్రీకరణ, వడ్డీలేనిరుణాలు, పావలా వడ్డీ రుణాలు, చేనేతలకు రుణాలు అందేలా చూడాలి. పెట్టుబడులు, రుణాలను పర్యవేక్షించి రైతులపై ఒత్తిడి తగ్గించాలి. సామాజిక భద్రత ఎస్సీ/ఎస్టీ మహిళను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలి. గ్రామంలోని నిరుపేదల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. సంక్షేమ పథకాలు వినియోగించుకునేలా ప్రణాళికలు ఉండాలి. నిరుపేదలను ఎంపిక చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని అర్హులకు అందించాలి. సహజ వనరుల నిర్వహణ ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రక్షిత వాతావరణం ఉండేలా గ్రామంలోని సహజ వనరులను పరిరక్షించాలి. ఉపాధి హామీ పథకంతో వాటర్షెడ్లు ఏర్పాటు చేయాలి. ‘హరిత హారం’ ద్వారా గ్రామంలో ఏటా 40వేల మొక్కలు నాటాలి. ఉపాధి హామీ ద్వారా గ్రామానికి శాశ్వత ఆస్తులను సృష్టించాలి. విద్యాకమిటీ గ్రామంలో 100 శాతం అక్షరాస్యత ఈ కమిటీ లక్ష్యం. ఆరు నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులందరినీ పాఠశాలకు పంపాలి. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులను ప్రీప్రైమరీలో చేర్చాలి. విద్యలో నాణ్యతను, మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. డ్రాపౌట్లను నియంత్రించాలి. వయోజన విద్యను మెరుగుపర్చాలి. మౌలిక సదుపాయాలు ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా ఉంటారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయ పరచాలి. రోడ్లు, వీధి దీపాల నిర్వహణ ద్వారా మెరుగైన సేవలందించాలి. వంద శాతం ఇంటిపన్ను వసూలు ద్వారా పంచాయతీ సిబ్బందికి వేతనాలివ్వాలి. ఎస్సీ కాలనీలు, గిరిజన తండాల్లో వసతుల కల్పనకు సబ్‌ప్లాన్ నిధులు వినియోగించుకోవచ్చు. కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా.. పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా పాలనాధికారులు గ్రామజ్యోతిలో భాగస్వాములవ్వాలి. గ్రామాభివృద్ధి ప్రణాళికల కసరత్తుకు అధికారుల సూచనల మేర కు పంచాయతీ కార్యదర్శి ఏర్పాట్లు చేయా లి. మనఊరు-మన ప్రణాళిక తరహాలోనే గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్ ఉంటారు. డివిజన్ పరిధిలో డివిజినల్ పంచాయతీ అధికారి సమన్వయం చేసా రు. జిల్లాకు నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ఉంటారు. -
‘గౌరవ’మేదీ...?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవాన్ని ఇనుమడింపజేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ గాల్లో కలసిపోతోంది. అట్టహాసంగా గౌరవ వేతనాల పెంపును ప్రకటించినా.. ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. ఈ పెంపును ఏప్రిల్ 1 నుంచే వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసి ఐదు నెలలు గడిచినా... రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క సర్పంచ్‌కు గానీ, ఎంపీటీసీకి గానీ పెంచిన గౌరవ వేతనం అందలేదు. జూన్‌లో ఉత్తర్వులొచ్చినా..: ప్రభుత్వం ప్రకటించిన విధంగా గౌరవ వేతనాలను పెంచకపోవడంతో జూన్‌లో సర్పంచులు, ఎంపీటీసీల సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనకు ప్రజాసంఘాలు కూడా మద్దతు పలకడంతో దిగివచ్చిన సర్కారు... హడావుడిగా వేతనాల పెంపునకు సంబంధించి జీవో నంబరు 53 (జూన్ 24న)ను జారీచేసింది. ఇది వచ్చి నెలన్నర దాటినా... పెరిగిన వేతనం జమ కాలేదని సర్పంచులు, ఎంపీటీసీలు చెబుతున్నారు. హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందున మరోమారు పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సర్పంచుల సంఘాలు ప్రకటించాయి. అయితే గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ పంపిన ఫైలుకు ఆర్థికశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిసింది. చెక్‌పవర్ అనిశ్చితి..: గ్రామాల్లో అభివృద్ధి నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి ఉమ్మడిగా అధికారమిచ్చే జాయింట్ చెక్‌పవర్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదు. దీనిపై జూన్ నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు తర్వాత ఆ ఊసే మరిచారు. దీంతో జాయింట్ చెక్‌పవర్‌తో పంచాయతీల్లో కార్యదర్శులే పైచేయిగా మారిందని, ప్రజాప్రతినిధులకు వీసమెత్తు విలువ లేకుండా పోయిందని సర్పంచులు వాపోతున్నారు. ఏకగ్రీవ పంచాయతీ సం‘గతేంటి’?: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు నగదు పురస్కారాలను అందిస్తామని 2013లో ఎన్నికలప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్న మేజర్ గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీకి రూ.5లక్షలు ఇస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. వీటికి సంబంధించి రూ.54కోట్ల సర్కారు అందజేయాల్సి ఉంది. కానీ ఎన్నికలై రెండేళ్లవుతున్నా ‘ఏకగ్రీవ’ పంచాయతీలకు నగదు పురస్కారాలు అందలేదు. రూ.2.20కోట్లను మాత్రం విడుదల చేశారు. -
పల్లెలకు సరికొత్త రూపు
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లెలకు సరికొత్త రూపునిచ్చేందుకు గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు ఉంటాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై శనివారం ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీల ప్రాథమిక విధులైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ.. తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, ఏడాది కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రణాళికల్లో పొందుపరుస్తామన్నారు. మన ఊరు-మన ప్రణాళిక ద్వారా గతంలో ప్రజల నుంచి సేకరించిన సూచనలను, సలహాలను తాజాగా చేపట్టిన ప్రణాళికల రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామాన్ని వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లె మాదిరిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రణాళికల ద్వారా నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని చెప్పా రు. స్వయం సహాయక సంఘాల, రిటైర్డు ఉద్యోగుల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. -
రూ.25 కోట్లతో పంచాయతీరాజ్ పనులు
బొబ్బిలి రూరల్ : తమ డివిజన్ పరిధిలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.25కోట్ల వ్యయంతో 780 పనులు జరుగుతున్నాయని ఆ శాఖ పార్వతీపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.గజేంద్ర తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారి పనులు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. సాంకేతిక సమస్య లేదని తెలిపారు. అన్ని పనులూ ప్రారంభించామని, 2016 మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. తమ పరిధిలో 202 పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నామని, ఒక్కో పంచాయతీ భవనానికీ రూ.13 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నామన్నారు. వీటిలో 193 నిర్మాణదశలో ఉన్నాయన్నారు. అంగన్వాడీ భవనాలు 46మంజూరయ్యాయని, ఒక్కో భవనానికి 6.5లక్షల రూపాయలు నిధులు అందిస్తున్నామన్నారు. వీటిలో 40 వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఉపాధిహామీ పథకంలో ఫేజ్-2, ఫేజ్-3 పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. సిబ్బంది కొరత వేధిస్తోందని, దీనికోసం టీఏలను నియమించాలని ప్రతిపాదనలు పంపామని, జిల్లా కలెక్టర్ అంగీకరించారని తెలిపారు. సాంకేతిక సమస్య తలెత్తితే 24గంటలలో పరిష్కరిస్తున్నామన్నారు. -
పార్టీలతో ప్రమేయం లేకుండా అభివృద్ధి: మంత్రి అయ్యన్న
నర్సీపట్నం : పార్టీలతో ప్రమేయం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ కేంద్రం నర్సీపట్నంలో ఆదివారం మూడు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు సైతం తనకు సహకరించారని, వారి రుణం తీర్చుకునేలా పార్టీ ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. గత ఎన్నికల్లో తాను సాధించిన విజయంలో పార్టీ నాయకులతో పాటు ప్రత్యర్థుల ప్రమేయముందని, కష్ట సమయంలో వెన్నంటి ఉన్నవారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో తనకు సహకరించిన వారికి సైతం అవకాశం ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. రాష్ర్టంలో ఎక్కడాలేని విధంగా తన నియోజకవర్గానికి రూ. 40 కోట్ల మేర నిధుల్ని కేటాయించినట్టు ఆయన వివరించారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేందుకు నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కొన్ని మండలాల్లో పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసేలా వ్యవహరిస్తున్నారని, అవసరం లేని చోట పనులు చేపట్టి నిధుల వృధాకు పాల్పడుతున్నారని, ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి నియోజక అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవుపలికారు. తనకు ఎన్నికల్లో సహకరించిన ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాగా, పార్టీ గొలుగొండ, మాకవరపాలెం మండలాల అధ్యక్షులుగా అడిగర్ల అప్పలనాయుడు, రుత్తల శేషుకుమార్లను నియమించారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు సీహెచ్ వివేకానంద, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామునాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వాటాల కిరికిరి
పంచాయతీ రోడ్లకు గ్రహణం - ముందుకురాని కాంట్రాక్టర్లు - కమీషన్ల కోసం ప్రజాప్రతినిధుల ఒత్తిడి - మట్టి రోడ్లను బీటీగా మార్చేందుకు.. - రూ. 27.73 కోట్లతో 34 ప్యాకేజీల పనులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని మట్టి రోడ్లను బీటీ (బ్లాక్‌టాప్) చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మూడు నెలల వ్యవధిలో రూ.27.73 కోట్ల విలువ చేసే 36 ప్యాకేజీల కింద 378 పనులకు మూడు సార్లు టెండర్లు పిలవగా రెండు పనులకే కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఆ రెండు పనులను కమీషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) ఆమోదించి నెల రోజులు గడుస్తున్నా.. కాంట్రాక్టర్లు పనుల అగ్రిమెంట్ చేయించుకోవడం లేదు. దీంతో మట్టిరోడ్లను బీటీ చేయాలన్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ వ్యవహారంపై ఆరా తీస్తే.. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల నుంచి కొందరు ప్రజాప్రతినిధులు వాటా లు డిమాండ్ చేస్తుండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బీటీ రోడ్ల నిర్మాణాలకు కొందరు ప్రజాప్రతిని ధుల పర్సంటేజీల పర్వం అడ్డంకిగా మారింది. దీంతో జిల్లాలోని మట్టిరోడ్లను బీటీ చేసే ప్రక్రియకు మోక్షం లభించడం లేదు. మూడు నెలలుగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లను పిలువగా ఏ ఒక్క టెండర్‌దారుడు ముందుకు రావడం లేదు. జిల్లాలో ఎంఆర్ఆర్ స్కీం కింద 36 ప్యాకేజీల కింద ఆయా మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడానికి అనుమతి లభించింది. పంచాయతీరాజ్ అధికారులు రోడ్ల నిర్మాణానికి సంబంధించి పూనుకున్నారు. ఇందులో భాగంగా 2014, నవంబర్ 19న 36 మండలాల్లో ఈ రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లను పిలిచారు. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. భీమ్‌గల్, జక్రాన్‌పల్లి ప్యాకేజీల అగ్రిమెంట్‌కు సీవోటీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినా.. ఇంకా అగ్రిమెంట్ కాలేదు. ప్రజాప్రతినిధులు పర్సెంటేజీల కోసం బెదిరిస్తుండటంతో కాంట్రాక్టర్లు టెండర్లయినా అగ్రిమెంట్‌కు ముందుకు రావడం లేదన్న ప్రచారం ఉంది. అధికారులు 2014 డిసెంబర్-20న మరోసారి టెండర్లను పిలిచారు. ఇందులో 13 మంది మాత్రమే పాల్గొన్నారు. ఆయా పనులకు టెండర్లు వేసేందుకు రాగా కొందరు ప్రజాప్రతినిధులు పర్సంటేజీలు ఇవ్వాలని నిర్మొహమాటంగా డిమాండ్ చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఆ పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం లేదు. ముచ్చటగా మూడో దఫా జనవరి 19న టెండర్లు పిలవగా ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఈ పనుల్లో ప్రజాప్రతినిధులు భారీగా పర్సంటేజీలు డిమాండ్ చేయడంతో ఉన్నఫలంగా కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారంటున్నారు. నాలుగోసారి స్పందిస్తారా.. మిషన్‌కాకతీయ, ఆర్అండ్బీ పనుల్లో సైతం కొందరు ప్రజాప్రతినిధులు పర్సెంటేజీల కోసం కాంట్ట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఇదివరకే ఇంటలిజెన్స్ నివేదికలు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ మట్టిరోడ్లను బీటీ చేసేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో రూ.27.73 కోట్లు మంజూరు చేస్తే.. ఆ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాల్సి ఉండగా మూడు నెలలుగా ‘పర్సెంటేజీ’ల పేరిట కాలయాపన జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఓ డివిజన్లో ప్రజాప్రతినిధి టెండర్ వేసే ముందు నన్ను కలువాలంటున్నారని కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెప్తుండటం గమనార్హం. మరో ప్రజాప్రతినిధి అడుగు ముందుకేసి సంబంధిత పనులకు టెండర్ వేసేకంటే ముందుగానే పర్సంటేజీలు ముట్టజెప్పాలని హుకుం జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇంకో ప్రజాప్రతినిధి అయితే తనతో సత్సంబంధాలున్న కాంట్రాక్టర్లను టెండర్ల కోసం ఆహ్వానిస్తుండటంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్నట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా పనులు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా వుండగా... రూ.27.73 కోట్ల విలువ చేసే 378 పనులకు నాలుగోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారైనా ఆ పనులకు టెండర్లు ఖరారవుతాయా? అన్న చర్చ జరుగుతోంది. -
క్లారిటీ కావాలి
పుష్కరాలకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలన్న ప్రభుత్వం పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు ఆదేశం అవి ఏమూలకూ చాలవంటున్న అధికారులు కేంద్ర నిధులు కావడంతో ఇబ్బందులు వస్తాయేమోనని సందేహం వీటిపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, రాజమండ్రి : పుష్కరాల నిధులపై అధికారుల్లో ఇప్పటికీ స్పష్టత రావడంలేదు. నిన్నటివరకూ పనులు మంజూరు కాలేదని మధనపడ్డ అధికారులు ఇప్పుడు, ఆ పనులకు నిధులెలా వస్తాయని మల్లగుల్లాలు పడుతున్నారు. రాజమండ్రి కార్పొరేషన్ సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో రూ.336 కోట్ల విలువైన పుష్కరాల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించాలంటూ జీఓ విడుదల చేసింది. అలాగే గ్రామాల్లో ఘాట్ల వద్ద చేపట్టే పనులకు కూడా ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అయితే ఈ నిధులను పుష్కరాల పనులకు వినియోగిస్తే, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ములు ఎక్కడ నుంచి వస్తాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు పుష్కరాల పనులు చేపట్టేంత స్థాయిలో ఉండవు. ఉదాహరణకు ఒక్క రాజమండ్రిలోనే రూ.240 కోట్ల పుష్కరాల పనులు మంజూరవగా 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు కూడా లేవు. మిగిలిన నిధులు ఎక్కడనుంచి వస్తాయన్నది ప్రశ్నార్థకమే అవుతోంది. గడచిన ఐదేళ్లలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకూ సుమారు రూ.80 కోట్లు, పంచాయతీలకు మరో రూ.120 కోట్ల వరకూ 13వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని అంచనా వేశారు. ఆ అంచనాల మేరకు ఇప్పటికే 50 శాతం నిధులను వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంఘం నిధులను పుష్కరాలకు ఎలా వినియోగించాలనేదానిపై అధికారులు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన నిధులు కావడంతో.. రానున్న రోజుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. ఈ సందేహాలన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలని మంగళవారం రాజమండ్రిలో జరిగిన పుష్కరాల హైపవర్ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ను పలువురు అధికారులు కోరారు. పనులను మంజూరు చేసిన ప్రభుత్వమే అవసరమైన నిధులు కూడా ఇస్తుందని పుష్కరాల ప్రత్యేకాధికారి జె.మురళి అన్నారు. అయితే జీఓల్లో మిగిలిన నిధులను ప్రభుత్వం ఇస్తుందన్న విషయం ఎక్కడా లేకపోవడంతో మురళి వివరణ అధికారులకు నమ్మకాన్ని కలిగించలేదు. పుష్కరాల పనులకు టెండర్లు పిలవాలంటే నిధులను ఏ పద్దు కింద వినియోగించాలనే దానిపై స్పష్టత రావాల్సిందేనని వారంటున్నారు. తీరా పనులు పూర్తయ్యాక మిగిలిన నిధులు ఎవరిస్తారనేదానిపై కూడా ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
పంచాయతీరాజ్ మరింత పటిష్టం
పునర్వ్యవస్థీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో పంచాయతీరాజ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆ శాఖలోని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ విభాగం (పీఆర్ఐ), పంచాయతీరాజ్ ఇంప్లిమెంట్ యూనిట్ (పీఐయూ) ఏకం కానున్నాయి. 2007 వరకూ ఒకటిగానే ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని, అప్పటి పని సౌలభ్యం దృష్ట్యా రెండుగా విభజించారు. ఆయా విభాగాల్లో ఉన్న పనిభారం మేరకు ఉద్యోగులను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంజీఎస్‌వై, నాబార్డు తదితర ప్రాజెక్టుల బాధ్యతలను పీఐయూకు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే కార్యక్రమాల బాధ్యతను పీఆర్ఐ విభాగానికి అప్పగించారు. ప్రారంభంలో ఈ రెండు వ్యవస్థలకు సరిపడా ప్రాజెక్టులు ఉండగా... కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా నిధులు గానీ, ప్రాజె క్టులుగానీ రాని నేపథ్యంలో పీఐయూ విభాగానికి అంతగా పనిలేకుండా పోయింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపట్టడంతో పీఆర్ఐ వ్యవస్థకు పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం సిబ్బంది కొరతను అధిగమించేందుకు రెండు వ్యవస్థలను ఏకం చేయాలని నిర్ణయించి... తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పీఆర్ ఇంజనీరింగ్ వ్యవస్థలను రెండింటినీ ఏకం చేయడం ద్వారా పంచాయతీరాజ్ విభాగం మరింత బలోపేతం కానుంది. పీఐయూలో ప్రస్తుతం ఉన్న 43 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 206 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 1,065 మంది ఏఈ/ఏఈఈలు పీఆర్‌యూ విభాగానికి జత కాబోతున్నట్లు సమాచారం. -
పనుల్లో పురోగతి చూపండి
పంచాయతీరాజ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం కర్నూలు(జిల్లా పరిషత్): ఇతర జిల్లాలతో పోలిస్తే పనులను పూర్తి చేయడంలో వెనుకబడ్డారంటూ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులపై కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వివిధ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పంచాయతీ.. స్త్రీ.. మండల సమాఖ్య భవనాల నిర్మాణంలో లక్ష్యాన్ని సాధించలేకపోయారన్నారు. వారం రోజుల్లో మరోసారి పురోగతిని పరిశీలిస్తానని.. మార్చు రాకపోతే చర్యలు తప్పవన్నారు. మంజూరైన నిధులు, వ్యయం వివరాలపై మండలాల వారీగా నివేదిక అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రూ.5 లక్షల్లోపు పనులను ఉపాధి హామీ కింద చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి పొందాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆయా మండలాల్లో గ్రామాల వారీగా పనులను గుర్తించి ఆయా మండల అభివృద్ధి అధికారుల సహకారంతో పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లతో తీర్మానాలు చేయించి సీసీ రోడ్డు వేయించాలన్నారు. సాధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఈ పీఆర్ సురేంద్రనాథ్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, పీఆర్ ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
నీ పని చేస్తే నాకేంటి?
విజయనగరంఫోర్ట్: పంచాయతీరాజ్‌శాఖలో ఏళ్ల తరబడి కమీషన్ల దందా కొనసాగుతోంది. ఈ శాఖ ద్వారా ఏ పని మంజూరు అవ్వాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా చేయి తడపాల్సిందే. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటే 10శాతం కమీషన్ ఇస్తేగానీ పంచాయతీరాజ్‌శాఖ అధికారులు బిల్లులు చెల్లించరు. కాంట్రాక్టర్ల వద్ద అదేతీరు, ప్రజాప్రతినిధుల వద్ద అదేతీరు. కమీషన్ ఇవ్వకపోతే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అయినా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు బిల్లులు చెల్లించరు. ఎస్ఈలు దగ్గరనుంచి ఏఈల వరకు ఒకటే తీరు. కమీషన్ల దందా ఏళ్ల తరబడి కొనసాగుతున్నప్పటికీ ఇంతవరకు ఎవరూ దొరకకపోవడంతో దొరల్లా చలామణి అయ్యారు. పంచాయతీరాజ్‌శాఖలో ఏళ్లతరబడి జరుగుతున్న అవినీతి ఎట్టకేలకు బయట పడడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. ఏసీబీ అధికారులు పంచాయతీరాజ్ శాఖ డీఈ లక్ష్మణరావును జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పట్టుకుని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి తీసుకు రావడంతో ఈఈ కార్యాలయం సిబ్బంది ఎక్కడి ఫైళ్లు అక్కడే వదిలేసి చెల్లాచెదురైపోయారు. ఏసీబీ అధికారులు ఉన్నంత సేపు ఆ ఛాయలకు సిబ్బంది ఎవరూ రాలేదు. మరి ఇకనైనా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అవినీతికి దూరంగా ఉంటారా? లేదంటే కొనసాగిస్తారా అనేది వేచిచూడాలి. వరుస ఏసీబీ దాడులు..వదలని అవినీతి జాడ్యం ఒక వైపు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతున్నా..మరో వైపు లంచావతారులు మాత్రం తమ పని తాము చేసుకు పోతున్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో 12 కేసుల్లో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. -
అవసరమైన మేరకే కదలికలు
* ‘సాక్షి’ కథనంతో స్పందించిన పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ * సవరణ జీవో జారీ * గ్రామ కార్యదర్శులు, డీఎల్పీవో బదిలీలు తాత్కాలికంగా నిలుపుదల సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ రూపొందించుకున్న నియమనిబంధనలను సవరించింది. శాఖ పరిధిలోని గ్రామ, మండల స్థాయిలోని దాదాపు అందరు సిబ్బంది బదిలీల ప్రక్రియలోకి వచ్చేలా ఉన్న నిబంధనలను సవరించి పరిపాలన అవసరాలకు సరిపడా మాత్రమే బదిలీలు ఉండాలని పేర్కొంటూ తిరిగి నిబంధనలను రూపొందించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 15వ తేదీ వరకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలకు కొన్ని నిబంధనలు పాటించాలని జిల్లా అధికారులకు సూచన చేస్తూ సోమవారం జీవో నం. 979ని జారీ చేశారు. ఈ జీవో పేర్కొన్న నిబంధనల ప్రకారం గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఈవో (పీఆర్ఆర్డీ)లు దాదాపు అందరూ బదిలీ పరిధిలోకి వస్తారు. ఈ విషయంపై ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘అందరూ బదిలీయా!- పంచాయితీరాజ్ ఉద్యోగుల్లో కలవరం’ శీర్షికతో ‘సాక్షి ’ బుధవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. స్పందించిన సంబంధిత మంత్రిత్వ శాఖ గ్రామ కార్యదర్శుల బదిలీలను ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేసింది. ఎంపీడీవోలు, ఈవో (పీఆర్ఆర్డీ)ల బదిలీల విషయంలోనూ పరిపాలన అవసరాలకు సరిపడా మాత్రమే బదిలీ చేయాలని పాత నిబంధనను సవరించారు. వీటికి అదనంగా డివిజనల్ పంచాయితీ అధికారుల బదిలీలను కూడా తదుపరి ఉత్తర్వులు నిలుపుదల చేయాలని జీవోలో పేర్కొన్నారు. శాఖ ఒకరిది.. అధికారం మరో మంత్రికి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి సీహెచ్ అయ్యన్నపాత్రుడు మంత్రిగా కొనసాగుతుంటే, ఆ పథకం అమలు చేసే జిల్లా స్థాయి అధికారుల బదిలీల అధికారం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళినికి అప్పగించారు. ఉపాధి హామీ పథకం జిల్లా స్థాయిలో అమలు చేసే డ్యూమా పీడీలు, ఏపీడీవో బదిలీలు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై స్పష్టత కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎంవో వివరణ కోరినట్టు సమాచారం. కృష్ణా జడ్పీ సీఈవో నియామకం నిలుపుదల కృష్ణా జిల్లా జడ్పీ సీఈవోగా టీకే గిరీశ్వర్ నియమాకాన్ని ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ, డ్యూమా పీడీల నియమాకాలు గుంటూరు జిల్లా డ్యూమా పీడీగా పనిచేస్తున్న దిల్లీ రావు విజయనగరం జిల్లా డీఆర్డీఏ పీడీగా నియమితులయ్యారు. శ్రీకాకుళం డ్యూమా డీపీ ఏ కల్యాణచక్రవర్తి విజయనగరం జిల్లా డ్యూమా పీడీగా నియమితులయ్యారు. ప్రస్తుతం విజయనగరం డ్యూమా పీడీగా ఉన్న గోవిందరాజులును అతని సొంత రెవెన్యూ శాఖకు సరెండర్ చేశారు. చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ వైవీ రమణరావును శ్రీకాకుళం జిల్లా డీఆర్డీఏ పీడీగా నియమించారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వులిచ్చారు. -
అబ్రకదబ్ర..
పంచాయతీరాజ్‌లో మాయా ఆఫీస్ - రేగొండలో 4 ఏళ్లుగా తెరుచుకోని పీఆర్‌యూ కార్యాలయం - కళ్లు మూసుకున్న ఉన్నతాధికారులు - అప్పనంగా జీతభత్యాల చెల్లింపు సాక్షి, హన్మకొండ : పంచాయతీరాజ్ విభాగం అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా మారింది. లేని కార్యాలయాలు ఉన్నట్లుగా చూపి మోసాలకు పాల్పడే బోగస్ సంస్థల మాది రిగానే జిల్లా పంచాయతీ రాజ్ అధికారుల వ్యవహారశైలి ఉంది. లేని కార్యాలయం ఉన్నట్లుగా చూపడంతోపాటు అక్కడ ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రభుత్వానికి భ్రమ కల్పిస్తున్నారు. నమ్మిన పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు... లేని కార్యాల యంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతినెలా లక్షల రూపాయల మేర జీతభత్యాలను చెల్లించారు. నాలుగేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా.... ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయూన్ని కలిగిస్తోంది. పంచాయతీరాజ్ విభాగంలో పనులు, పరిపాలన అస్తవ్యస్తంగా ఉందనడానికి రేగొండ పీఆర్‌యూ వ్యవహారమే నిదర్శనంగా నిలుస్తోంది. ఒక్క రోజూ తెరుచుకోలేదు... పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సాధారణ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ (పీఆర్ఐ), భారీ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ యూనిట్ (పీఆర్‌యూ) విభాగాలు ఉన్నాయి. రేగొండ కేంద్రంగా 2009లో పీఆర్‌యూ విభాగం మంజూరైంది. ఒక డివిజనల్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఒక్కొక్కరు చొప్పున అసిస్టెంట్ ఇంజనీరు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, క్లర్కు, అటెండర్, స్వీపర్... మొత్తం ఎనిమిది మంది రెగ్యులర్ సిబ్బందికి ఈ విభాగంలో విధులు కేటాయించారు. పీఆర్‌యూ కార్యాలయాన్ని రేగొండలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా కార్యాలయంలోని ఓ గదిలో 2010లో ప్రారంభించారు. జిల్లా పరిషత్‌లోని పంచాయతీ రాజ్ శాఖ రికార్డుల్లో ఇలాగే పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లుగా ఈ కార్యాలయం కేంద్రంగా ఒక్క పని జరిగిన దాఖలాలు లేవు. అసలు ఇక్కడ ఓ కార్యాలయం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. అంతేకాదు... రేగొండ పీఆర్‌యూ కార్యాలయం ఒక్కరోజూ తెరుచుకోలేదు. కనీసం ఆగస్టు 15, జనవరి 26... ఆఖరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2న కూడా కార్యాలయానికి ఏ ఒక్క అధికారి, సిబ్బంది రాలేదు. ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న జిల్లా అధికారులకు సైతం ఇక్కడో కార్యాలయం ఉందని, అక్కడ పనులేవి జరగడం లేదనే సంగతి తెలియని పరిస్థితి. నాలుగేళ్లలో రేగొండ పీఆర్‌యూ విభాగం నుంచి ఏ పనులు చేపట్టారనే అంశంపై అక్కడ పని చేసే అధికారులు, సిబ్బంది వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. గుడ్డిగా ఆమోదం... ఎవరికీ తెలియకుండా కొనసాగుతున్న ఈ కార్యాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులు టంచన్‌గా వేతనాలు పొందుతున్నారు. విధులకు హాజరుకాకుండా... పని చేయకుండా... ఉత్తపుణ్యాన జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ, పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఇక్కడున్న డివిజనల్ ఇంజనీర్ (డీఈ) కార్యాలయం పనిచేస్తున్నట్లు, ఉద్యోగులు హాజరవుతున్నట్లు పట్టికలో నమోదు చేసి జిల్లా అధికారులకు పంపిస్తూ పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చూసీచూడకుండా ఆమోదిస్తుండడంతో రేగండ్ పీఆర్‌యూ విభాగానికి కేటాయించిన ఉద్యోగులు, సిబ్బందికి నిర్ణీత సమంయలో వేతనాలు అందుతూనే ఉన్నాయి. నాలుగేళ్లలో ఏ ఒక్క జిల్లా అధికారి ఈ కార్యాలయాన్ని సందర్శించ లేదు. అలా జరిగి ఉంటే ఈ విషయం ఎప్పుడో బయటకు వచ్చేది. తమకు ఒకే గది ఉన్నదని, అక్కడికి వెళ్లడం లేదనే విషయాన్ని రేగొండ పీఆర్‌యూ విభాగం అధికారులు ఒక్కసారైనా పై అధికారుల దృష్టికి తేలేదని తెలిసింది. కార్యాలయం సరిపోయేలా ఉంటే రోజు వెళ్లాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే అందరూ కూడబలుక్కుని ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కిరాయి ఇవ్వాలని అడిగాం ఒకే గదిలో ఎనిమిది మంది సిబ్బంది పని చేయలేక పోతున్నాం. కిరాయి ఇస్తే.. అద్దె భవనంలో కొనసాగుతామని పై అధికారులను అడిగాం. అక్కడి నుంచి సమాధానం రాలేదు. ఇక్కడ పనిచేయడం కష్టంగా ఉంది. - ఆత్మారాం, రేగొండ పీఆర్‌యూ డివిజనల్ ఇంజనీర్ ఇటీవలే నా దృష్టికి వచ్చింది రేగొండలోని పీఆర్‌యూ కార్యాలయంలో ఎలాంటి పనులు జరగడం లేదనే అంశం ఇటీవలే నా దృష్టికి వచ్చింది. అద్దె భవనంలో కార్యాకలాపాలు ప్రారంభించాలని ఆదేశించాం. కార్యాలయానికి రాకుండా వేతనాలు తీసుకున్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం. - సత్తయ్య ,సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ -
క్రీడాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మాకవరపాలెం : గ్రామీణ క్రీడాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కోరారు. జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో జోన్ గ్రిగ్ మీట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఒక్కో జిల్లాను పది జోన్లుగా విభజించి, ఆరు మండలాలకు ఒక జోన్‌గా ఈ గ్రిగ్మీట్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థుల్లో కొందరికే క్రీడా దుస్తులుండడం బాధాకరమన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఆటల్లో రాణిస్తున్న విద్యార్థుల దుస్తులు పంపిణీకి ముందుకు రావాలన్నారు. మండల కేంద్రంలో గరుకుల పాఠశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఇక్కడ గెలుపొందినవిద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం గొలుగొండ మండలం ఏఎల్ పురం, మాకవరపాలెం జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలను తిలకించారు. మొక్కుబడిగా నిర్వహిస్తారా? గ్రిగ్మీట్ నిర్వహణ మొక్కుబడిగా జరుగుతోందని మంత్రి అయ్యన్న మండిపడ్డారు. ఆరు మండలాల విద్యార్థులకు జరిగే ఈ పోటీలకు మంత్రి పాల్గొన్నా డీఈవో, క్రీడా అభివృద్ధి అధికారులు రాకపోవడంపై మండిపడ్డారు. జిల్లా స్థాయి అధికారులు పోటీలను పర్యవేక్షించాలన్నారు. గ్రిగ్మీట్ నిర్వహణకు రూ.5 వేలు సరిపోవని, ఈ నిధులు పెంచేలా తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎంపీపీ రుత్తల చిన్నయ్యమ్మ, జెడ్పీటీసీ కె.కుమారి, ఆర్డీవో సూర్యారావు, తహశీల్దార్ గంగాధరరావు, ఎంఈవో మూర్తి పాల్గొన్నారు. -
జేబులు నింపినఎన్నికలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఎం పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ‘కాసుల’ వర్షం కురిపించాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో జిల్లాలోని 584 ఎం పీటీసీ, 36 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల నిర్వహణకోసం ఒక్కో మండలానికి పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షలు విడుదల కాగా, ఇందులో నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వాహన వినియోగానికి ఖర్చు చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఇది కొందరు ఎంపీడీవోలకు వరంగా మారింది. ఎన్నికల విధుల నిమిత్తం వచ్చిన అధికారులతో పాటు జిల్లాలోని కొందరి ఎంపీడీవోల కన్ను ఈ నిధులపై పడింది. ఇంకేముంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంజూరైన నిధులతో పాటు మండల పరిషత్ ఖజానాకు చిల్లు పెట్టారు. అటు ఎన్నికల నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి నెలకు రూ.24 వేల చొప్పున మార్చి, ఏప్రిల్, మే నెలల్లో బిల్లులు లేపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా జిల్లాకు వచ్చిన ఎంపీడీవోల్లో కొందరితో పాటు జిల్లాలోనే పనిచేసే మరికొందరు రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా బయటపడిన అక్రమ బాగోతం పంచాయతీరాజ్ శాఖలో కలకలం రేపుతోంది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 36 మండలాలుంటే, 1768 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 16 వేల నుంచి రూ.19 వేల వరకు నిధులు మంజూరు చేశారు. ఈ లెక్కన ఒక్కో మండలానికి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షల వరకు నిధులు విడుదల కాగా, జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం రూ.2.92 కోట్ల వరకు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అత్యల్పంగా కమ్మర్‌పల్లికి రూ.4,97,640 విడుదల కాగా, అత్యధికంగా రూ.14,99,180 ఎన్నికల నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా 36 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.2.92 కోట్లు మం జూరయ్యాయి. అయితే ఈ నిధుల నుంచి అత్యధికంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వాహన వినియోగంపై ఖర్చు చూపిన కొందరు ఎంపీడీవోలు మండల పరిషత్‌ల నిధుల నుంచి ఒక్కో మండలంలో రూ.65 వేల నుంచి రూ.72 వేల వరకు నిధులను వాహనాల పేరిట డ్రా చేశారు. ఈ వ్యవహారంపై ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు, సిబ్బంది ద్వారానే బయటపడటం కలకలం రేపుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం విడుదలైన నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి భారీగా స్వాహా చేసిన కొందరు ఎంపీడీల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. ఇంటలిజెన్స్ ఆరా.. వాహనాల వినియోగం పేరిట నిధుల స్వాహా కలకలం రేపుతుండగా.. ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగడం పంచాయతీరాజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ కోసం కమ్మర్పల్లి, నాగిరెడ్డిపేట, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, జక్రాన్‌పల్లి మండలాలకు రూ.4.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు విడుదల కాగా, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, డిచ్పల్లి, నం ది పేట, నిజాంసాగర్‌లకు రూ.10 లక్షల నుంచి రూ.14.99 లక్షలు వచ్చాయి. మిగతా మండలాలకు రూ.5.50 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఎన్నికల నిధులు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల నిధులకు తోడు మండల పరిషత్ నిధులను కాజేసిన అధికారుల వివరాలను ఆరా తీసేందుకు తాజాగా ఇంటలిజెన్స్ రంగంలోకి దిగి కలకలం రేపుతోంది. మండల పరిషత్‌ల సాధారణ నిధి నుంచి వాహన వినియోగం కోసం డ్రా చేస్తే తప్పకుండా లాగ్‌బుక్ నిర్వహించాలి. ఏ వాహనాన్ని వినియోగించారు, ఏయే రోజు ఎక్కడికి, ఎంత దూరం వెళ్లారు, ఎంత చమురు ఖర్చయ్యిం ది, ఆ నెలలో ఖర్చయిన మొత్తం, ఆ వాహనానికి సంబంధించిన వివరా లు సమర్పించాల్సి ఉంది. అయితే కనీసం లాగ్ బుక్‌లు లేకుండా వాహన వినియోగం నిధులు భారీగా లాగించేసిన కొందరు అక్రమార్క ఎంపీడీవోలపై ఇంటలిజెన్స్ ఆరా తీస్తుస్తోంది. త్వరలోనే నిందితుల బండారం బట్టబయలు కానుంది. -
పంచాయుతీరాజ్‌లో అధికార వికేంద్రీకరణ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలను బలోపేతం చేయుడానికి కృషిచేస్తానని, ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖలో అధికార వికేంద్రీకరణ చేపడతామని గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ ద్వారా లభించే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. గురువారం సచివాలయంలోని డి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం మొదటి ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం తన అదృష్టమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గ్రామీణాభివృద్ధి చేపడతావుని చెప్పారు. మొదటి ప్రాధాన్యంగా ఫ్లోరైడ్బాధిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తావున్నారు. ఐటీలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతావుని, ఇందుకోసం అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 15 నుంచి 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, 20 నుంచి 25 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. -
ఫిబ్రవరికల్లా పనులు ప్రారంభించండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిబ్రవరి చివరి నాటికి మంజూరైన పనులను ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదే శించారు. గురువారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినందున ఈ కొద్ది కాలంలో అన్ని పనులను గ్రౌండింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయినవి, టెండర్ అవసరం లేని పనులను కూడా ఈ నెల 20 కల్లా నివేదిక అందించాల ని ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు, ఆర్డీఎఫ్ పనులు గ్రౌండ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గత మార్చిలో పెద్ద సంఖ్యలో ఉపాధి పనులు మంజూరు చేసినప్పటికీ నిధులు లేవని పనులు ప్రారంభించలేదన్నారు. ప్రస్తుతం నిధులు అందుబాటులో లేనప్పటికీ కూలీలకు పనులు కల్పించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నిధులు విడుదల చేస్తారని తెలిపారు. గత మార్చిలో మంజూరు పొందినా, పనులు ప్రారంభించనందున సుమారు రూ. 30 నుంచి రూ. 40 కోట్ల పనులు చేయలేకపోయామన్నారు. ‘ఉపాధి’లో ఇప్పటి వరకు రూ.150 కోట్లు ఖర్చు ఈ ఏడాదిలో ఉపాధి హామీలో ఇప్పటివరకు రూ. 150 కోట్ల ఖర్చుచేసినట్లు చెప్పారు. మరో రూ. 40 కోట్లు మార్చిలోగా ఖర్చుచేయాల్సి ఉందన్నారు. నిధులు అందుబాటులో ఉన్న మేరకు ఎస్సీ, ఎస్టీలకు పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పనులు పూర్తి చేయాల న్నారు. కామారెడ్డి డివిజన్లో 574 పనులు డిసెంబర్‌కల్లా పూర్తి చేయాల్సి ఉండగా, కేవలం 62 శాతంతో 356 పనులు పూర్తి చేశారన్నారు. నిజామాబాద్ డివిజన్లో 2292 పనులకుగాను 1372 పనులు చేసి 60 శాతం పూర్తి చేశారన్నారు. బోధన్ డివిజన్లో 770 పనులకు గాను 59 శాతంతో 449 పనులను మాత్రమే పూర్తి చేశారన్నారు. జిల్లాలో 500 అంగన్వాడీ భవనా ల నిర్మాణానికి మొదటి విడతగా ఒక్కో భవనానికి రూ. 4.50 లక్షల చొప్పున విడుదల చేసిందని తెలిపారు. -
పీఆర్ పనుల్లో టెండ‘రింగ్’
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నాబార్డు నిధుల ద్వారా పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు రింగయ్యారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఈ టెండర్లలో లక్షల రూపాయలు చేతులు మారాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జడ్పీ ఆవరణలో మంతనాలు జరిపిన కాంట్రాక్టర్లు అంచనా ధరకు మించి కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయి ప్రభుత్వ అంచనా ధర కంటే ఎక్కువగా కోట్ చేశారు. మరికొందరిని టెండర్లు వేయకుండా ఒప్పించి, పనులు పొందిన వారు టెండర్ వేయని వారికి తలా కొంత ముట్టజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా అంచనా కంటే ఎక్కువగా కోట్ చేయడంతో ఈ పనుల్లో ప్రభుత్వ ఖజానాకు గండి పడినట్లే. ఖమ్మం అర్బన్, ముదిగొండ, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, పెనుబల్లి, తల్లాడ, వేంసూరు, కొణిజర్ల, వైరా, కారేపల్లి, ఏన్కూరుల్లో చేపట్టే రూ2.95 కోట్ల విలువైన గోపాలమిత్ర సర్వీస్ సెంటర్లు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర 41 పనులకు మంగళవారం జిల్లా పరిషత్ ఆవరణలోని పీఆర్ఐ డివిజన్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. ఈ 41 పనుల్లో 5, 6 మినహా మిగిలిన అన్నింటికీ కాంట్రాక్టర్లు రింగై అంచనా ధరకు మించి టెండర్లను దక్కించుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల అనుచరులు ఇతర కాంట్రాక్టర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి రింగయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధులలో 36 గోపాలమిత్ర సర్వీస్ సెంటర్ల నిర్మాణానికి రూ.7.50 లక్షలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.4 లక్షలు, గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి నాలుగు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4 లక్షల చొప్పున అంచనా విలువ నిర్ణయించారు. ఈ మొత్తం పనులకు కలిపి 5 శాతం పైగానే ఎక్కువకు కోట్ చేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వంపై లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. కోలాహలంగా జడ్పీ ..... పీఆర్ఐ డివిజన్ పరిధిలో నిర్వహించిన పనులను దక్కించుకునేందుకు పలువురు కాంట్రాక్ట్‌ర్లు ఉదయం 9 గంటలకే జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ ఎత్తున కాంట్రాక్టర్లు రావడంతో జడ్పీ ఆవరణ కోలహలంగా మారింది. అయితే ఈ టెండర్లను దక్కించుకునేందుకు అధికార పార్టీనేతల అనుచరులు కొందరిని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. చివరకు ఘర్షణలకు సైతం దిగారు. మొత్తానికి కాంట్రాక్టర్లు కూడపలుక్కొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కొంతమేర పంచుకున్నారు. -
జేబుకు చిల్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి సర్కారు మాట మార్చింది. కేవలం కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్యదర్శులకే అవకాశం కల్పించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేకంగా ఓ మెమోను జారీ చేశారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి స్పష్టం చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో 122 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేవలం డిగ్రీలో ఉత్తీర్ణత మార్కుల శాతం అధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని, ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్యదర్శులకు 25శాతం వెయిటేజీ కల్పిస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 5,400 మంది నిరుద్యోగులు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలు పరిశీలించి మెరిట్ జాబితా రూపకల్పనలో తలమునకలైన జిల్లా యంత్రాంగం గత వారం ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితా విడుదల చేసింది. ఇందులో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 100 మంది కార్యదర్శులు ఎంపిక కాగా.. మరో 20 మంది కొత్తవాళ్లు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులు మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. అయితే సర్కారు తాజా ఉత్తర్వులతో పరిశీలన ప్రక్రియ తలకిందులైంది. పరిశీలన ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడింది. తాజా ఉత్తర్వుల్లో... ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల్లో.. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారినే ఎంపిక చేయాలని ఆదేశించింది. దీంతో కొత్తగా ఎంపికైన 20 మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. కొత్త నిబంధనలతో వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. గత వారం విడుదల చేసిన ఎంపిక జాబితాలో వారి పేర్లు ఉండడంతో ఉద్యోగం గ్యారంటీ అని భావించిన వారికి.. తాజా ఉత్తర్వులు మెండిచెయ్యిని చూపినట్లైంది. ఇదిలా ఉండగా.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలనడంతో వేల మంది అభ్యర్థులు స్వతం ఖర్చులతో జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చి మరీ దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాట మార్చడంతో వారి జేబుకు చిల్లు పడడం తప్ప ఒరిగిందేమీ లేదని స్పష్టమవుతోంది. -
ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి అందుబాటులో నిధులు
తాండూరు, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధిక మొత్తంలో నిధులు మంజూరైనా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. ఉపాధి హామీ పథకం కింద పంచాయతీల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం కోసం ఈ ఏడాది జూలై 2న పంచాయతీరాజ్ శాఖకు రూ.4.70కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ ఈ నిధులతో ఇప్పటివరకు ఏ అభివృద్ధి పనీ చేపట్టలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పనులుచేపట్టకపోతే నిధులు దారిమళ్లే అవకాశం ఉంది. ఈ నిధులు మంజూరైనప్పటి నుంచి ఆరు మాసాల్లో పనులు చేపట్టి వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నిధులు మంజూరై నాలుగు నెలలు దాటింది. ఉపాధి హామీ పథకం కింద తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లోని మొత్తం 90పంచాయతీలకుగాను 86 పంచాయతీలకు సుమారు రూ.4.70కోట్ల నిధులు మంజూరయ్యాయి. యాలాల మండలంలోని రాస్నం, నాగసముందర్, పెద్దేముల్ మండలంలో జనగాం, అడ్కిచెర్ల, బషీరాబాద్ మండలంలో నవల్గ, నీళ్లపల్లి, తాండూరు మండలంలో గోనూర్, ఉద్ధండపూర్ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.10లక్షలు, మిగతా 78 పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.4.70కోట్లు మంజూ రయ్యాయి. ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలి. టెండర్లు, అగ్రిమెంట్ అవసరం లేకుండానే పంచాయతీలు ఆయా పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఉపాధి పథకంతోపాటు పంచాయతీ పేరు మీద సర్పంచ్, కార్యదర్శులు జాయింట్‌గా బ్యాంకు ఖాతా తీయాలి. ఈ ఖాతా ద్వారానే నిధులు డ్రా చేస్తూ పనులు చేపట్టాలి. కానీ చాలా పంచాయతీల్లో సర్పంచ్‌లు ఇంకా ఇందుకు సంబంధించి బ్యాంకు ఖాతాలు తీయలేదు. ఎన్నికైన సర్పంచ్‌ల్లో చాలా మంది కొత్తవారే ఉన్నారు. వారికి ఈ పనులపై పూర్తిగా అవగాహన లేదు. ఈ కారణాల వల్ల పనులకు మోక్షం కలగడం లేదు. మిగిలి ఉన్న రెండు నెలల గడువులో కొన్ని పనులైనా చేపడితే నిధులు వెనక్కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. -
మరో వడ్డన!
ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు పన్నులు పెంచాల్సిం దేనన్న నిర్ణయానికి వచ్చేసింది. పన్నులను ఎలా సవరించాలన్న విషయమై పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్ర అధికారులతో అధ్యయనం చేయిస్తోంది. నెలరోజులుగా అధికారులు గ్రామాలలో పర్యటిస్తూ పంచాయతీల ఆదాయ వనరులపై అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీలకు నిధులు సరిపోవడం లేదని, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పిం చాలంటే పన్నులు పెంచాల్సిందేనని వారు గుర్తించి నట్లు సమాచారం. 15 ఏళ్లుగా పన్నులను సవరించలేదని, గ్రామాల అభివృద్ధికోసం పన్నులు పెంచాల్సిందేనని వారు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పన్నుల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయని భావిస్తున్నారు. ఆస్తి పన్ను భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. 50 శాతం పెరగొచ్చు పన్నుల పెంపు భారం మేజర్ పంచాయతీలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 718 పంచాయతీలుండగా ఇందులో 74 మేజర్ గ్రామ పం చాయతీలున్నాయి. ఇందులోనూ 10 వేలకుపైగా జనాభా కలిగిన మేజర్ పంచాయతీలు 17 ఉన్నాయి. 15 ఏళ్లుగా పన్నులు పెంచలేదని, ఇన్నేళ్లలో భూములు, ఆస్తుల వి లువ భారీగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంటోంది. పన్నులు పెంచితే గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు పుష్కలంగా నిధులు ఉంటాయని భావిస్తోంది. 15 ఏళ్లలో పెరిగిన అస్తి విలువ ప్రకారం పన్నులను పెంచడానికి కసరత్తు చేస్తోంది. సుమారు 50 శాతం ఆస్తి పన్ను పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలతోపాటు పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో పన్నులు భారీగా పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో హోర్డింగ్‌లపై పన్ను, వ్యాపార సంస్థలపై పన్ను, ఖాళీ స్థలాల వినియోగంపై పన్ను, వినోద పన్ను, సెల్ టవర్‌పై పన్ను, మార్కెట్ వేళాల పన్నులు, లెసైన్సు పన్నులు పెరగనున్నట్లు సమాచారం. నీటి పన్ను కూడా పెంచుతారని తెలుస్తోంది. తాగు నీటి పంపిణీకి అయ్యే నిర్వహణ ఖర్చును రాబట్టుకునే విధంగా మాత్రమే చార్జీలు పెంచనున్నట్లు సమాచారం. పన్నుల పెంపుపై ప్రజలకు నచ్చజెప్పే బాధ్యత సర్పంచ్‌లకే అప్పగిస్తారట! పెంపు ఉత్తర్వులు ఇంకా అందలేదు -సురేశ్‌బాబు, డీపీఓ గ్రామ పంచాయతీల్లో త్వరలో పన్నులు పెంచుతారని తెలిసింది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఉత్తర్వులు వచ్చాకే ఏ పన్ను ఎంత పెరిగిందన్న తెలుస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు పన్నులు పెంచితే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగాయి. ఆస్తిపన్ను పెంచితే పంచాయతీ లకు ఆదాయం సమకూరినా.. ప్రజలపై భారం పడుతుంది. పన్నులు పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. -గాడి లింగం, సర్పంచ్,బీబీపేట, దోమకొండ పేదలను దృష్టిలో ఉంచుకోవాలి పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పన్నులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పేదల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. -మామిడి రవీందర్‌రెడ్డి, సర్పంచ్, పొందుర్తి, భిక్కనూరు