టారిఫ్ ‘రిలీఫ్’ ర్యాలీ..!
న్యూఢిల్లీ: చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాలు 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. బుధవారం రాత్రి అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 12.16%, ఎస్అండ్పీ సూచీ 9.52%, డోజోన్స్ ఇండెక్స్ 8% లాభపడ్డాయి. యూఎస్ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా, యూరప్ మార్కెట్లు గురువారం రాణించాయి. జపాన్ నికాయ్ 9%, దక్షిణ కొరియా కోస్పీ 7%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 5%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 2%, చైనా షాంఘై ఒకశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్ 5%, ఫ్రాన్స్ సీఏసీ 5%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ నాలుగు శాతం పెరిగాయి. కాగా బుధవారం భారీగా ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు మళ్లీ భారీ గా పడ్డాయి. నాస్డాక్ 5% క్షీణించి 16,292 వద్ద, డోజోన్స్ 3% పడి 39,184 వద్ద, ఎస్అండ్పీ 4% నష్టంతో 5,243 వద్ద ట్రేడవుతోంది. భారత మార్కెట్ భారీ గ్యాప్‌అప్..? అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతల కారణంగా శుక్రవారం దేశీయ మార్కెట్ భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభం కావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు సంకేతంగా దలాల్ స్ట్రీట్‌ను ప్రతిబింబించే గిఫ్ట్ నిఫ్టీ 3% (680 పాయింట్లు) పెరిగింది. శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా భారత మార్కెట్ గురువారం పనిచేయలేదు. భారత్‌తో సహా 60 దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ భారీగా పన్నులు వడ్డించారు. దీంతో అంతర్జాతీయంగా ప్రపంచ వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. నాటి (ఏప్రిల్ 2)నుంచి సెన్సెక్స్ 2,770 పాయింట్లు(3.61%), నిఫ్టీ 933 పాయింట్లు(4%) క్షీణించాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.19.15 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.393.82 లక్షల కోట్లకు దిగివచి్చంది.మన మార్కెట్లోనూ దూకుడు...! నిఫ్టీ సుమారు 700 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. షార్ట్ కవరింగ్‌తో మార్కెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. విస్తృత స్థాయిలో కొనుగోళ్ల పర్వం కొనసాగొచ్చు. ఐటీ షేర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యే వీలుంది. ఫార్మా షేర్లు డిమాండ్ లభించవచ్చు. లార్జ్ క్యాప్ బ్యాంకులు, ఫైనాన్షియల్స్ షేర్లు ర్యాలీ చేయొచ్చు. అమెరికా–చైనా ట్రేడ్ వార్ ముదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు త్వరలో భారత ఈక్విటీల కొనుగోళ్లకు ఆసక్తి చూపొచ్చు. – వీకే విజయ్‌కుమార్, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్