
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రా తినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినెట్‌తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. వీరందరిలో ప్రధానంగా ముగ్గురు సీనియర్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది.
‘గడ్డం’ సోదరుల పోటీ..
‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై నమ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకొన్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది.
‘పీఎస్సార్’కు ఖర్గే హామీ!
ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) మంత్రి పదవి రేసులో ప్రముఖంగా ఉన్నారు. గత ఏప్రిల్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీఎస్సార్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కీలక హోదాలో ఉంటారని హామీ ఇచ్చారు.
అయితే తొలివిడతలో ఆయనకు అవకాశం రాలేదు. మరోవైపు మంత్రి పదవులు వరించిన వారి సామాజిక వర్గాలు చూస్తే, వెలమ కోటలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఇక ఎస్సీ కోటాలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో భర్తీ చేయాల్సి వస్తే, సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. పోటీలో ఉన్న వారి సామాజిక కోటా పరిగణనలోకి తీసుకుంటే, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
కేబినెట్ స్థాయి పదవులతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌తో పదవి దక్కని వారు నిరాశ పడకుండా సర్దుబాటు చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తదుపరి టీంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు ఉంటుందో, ఎవరికి నిరాశ కలుగుతుందోనని అధికార పార్టీ వర్గాల్లోనూ, ఇటు ఉమ్మడి జిల్లా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు ఇటు రాష్ట్ర పెద్దలతోపాటు అటు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఇవి చదవండి: సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం