
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ సీజన్‌లో నిర్ధేశించిన సాగు లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన బీటీ పత్తి విత్తనాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్ ఆదేశించారు. ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కంపెనీలు ఎంవోయూలు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తన ఉత్పత్తిదారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 5.82 లక్షల హెక్టార్లు కాగా, రానున్న ఖరీఫ్ సీజన్‌లో 6.17 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
ఇందుకోసం 36 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమన్నారు. ఆ మేరకు జన్యు ఇంజనీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) ఆమోదించిన నాణ్యమైన బీటీ విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తివిత్తన విక్రయ ధర (475 గ్రాముల ప్యాకెట్) బీజీ–1కు రూ.635, బీజీ–2 ప్యాకెట్‌కు రూ.810గా నిర్ణయించిందన్నారు. అంతకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీఈఏసీ నిషేధించిన హెచ్‌టీ పత్తివిత్తనాలను విక్రయించరాదని, ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు తమదృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 47 లక్షల విత్తన ప్యాకెట్లు సరఫరా చేయగలమని కంపెనీల ప్రతినిధులు తెలిపారు.