
ఉమ్మడి అనంతలో చాపకింద నీరులా విస్తరిస్తున్న షుగర్ వ్యాధి
22 శాతానికి పైగా బాధితులు
వందలో 28 మందికి రక్తపోటు
అవగాహన లేక గ్రామీణులూ బాధితులవుతున్న వైనం
అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.
నగరానికి చెందిన మటన్ వ్యాపారి గౌస్‌మొహిద్దీన్‌కు 37 ఏళ్లు కూడా లేవు. ఇద్దరు పిల్లలున్నారు. సరైన వ్యాయామం లేక ఒత్తిడికి గురై బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. ఇటీవల సరిగా నిద్రపట్టడం లేదని బాధితుడు వాపోతున్నాడు. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.
గ్రామీణులూ బాధితులే..
మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది.
అవగాహన లేకే..
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్‌టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది.
అలవాట్లు మార్చుకోవాలి
మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. –డా.సుధాకర్‌రెడ్డి, గుండె వైద్య నిపుణులు
సమస్యలెన్నో..
» షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
» కంటిచూపుపై దు్రష్పభావం పడుతుంది.
» శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం.
» మధుమేహం అదుపులో లేకపోతే
» గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ.
» అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
» నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.