
చినబాబు ఇలాకాలో కొకైన్, గంజాయి విక్రయాలు
నలుగురు అరెస్ట్..
8.71 గ్రాముల కొకైన్, 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం
అమరావతిలో పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు.. ఇటీవలే డీజీపీ ఆఫీసు సమీపాన మహిళపై హత్యాచారం
ఇప్పుడు డ్రగ్స్ దొరకడంతో ఆందోళనలో జనం
మంగళగిరి: ఇటీవల అమరావతి పరిధిలో డ్రగ్స్ అమ్మకాలు పెరిగిపోయాయి. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన కొకైన్ వంటి డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. గంజాయి అయితే అన్నిచోట్లా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి మంగళగిరిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న యువకులను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఇటీవల మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోనే ఒక మహిళ దారుణ హత్యకు గురికాగా... ఇప్పుడు అక్కడికి కొద్ది దూరంలోనే ఏకంగా డ్రగ్స్ విక్రయిస్తూ యువకులు దొరకడంతో అమరావతి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
నలుగురి అరెస్ట్... విజయవాడ కృష్ణలంకకు చెందిన నందం నిఖిల్, రాణిగారితోటకు చెందిన బొట్ల కాశీవర్ధన్ అనే యువకులు శుక్రవారం రాత్రి మంగళగిరిలోని ఎర్రబాలెం డిలైట్ డాబా సెంటర్ వద్ద కొకైన్, గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా... మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని 8.71 గ్రాముల కొకైన్, 1,200 గ్రాముల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.
వారిని విచారించగా, తమకు కృష్ణలంకకు చెందిన పెండ్యాల సాయికుమార్, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన గొర్ల గిరీష్‌రెడ్డిలు కొకైన్, గంజాయి విక్రయిస్తారని చెప్పారు. సాయికుమార్, గిరీష్రెడ్డిలను కూడా అరెస్ట్ చేసి విచారించగా..వారికి విజయవాడకు చెందిన సొహైల్, శామీర్‌లు కొకైన్ గంజాయి విక్రయిస్తారని తెలిపారు. పరారీలో ఉన్న సొహైల్, శామీర్ల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ విభాగం ఐజీ ఏకే రవికృష్ణ శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిందితులను విచారించారు.