
విశాఖపట్నం: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేసిన ఘటనలో సీహెచ్ సీతయ్య అనే వ్యక్తిపై ఎంవీపీ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాసవానిపాలేనికి చెందిన 14 ఏళ్ల బాలిక 21వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆమె తల్లి, అన్నయ్యతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడైన సీహెచ్ సీతయ్య గత ఏడాదిగా బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకుంటున్నాడు.
ఈ ఏడాది జనవరిలో ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి అనుమానంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా, గర్భవతి అని తేలింది. దీంతో ఆమె తల్లి ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీతయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.