
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కనులపండువగా శ్రీ సీతారాముల కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ సమీపంలో ఆరుబయట ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణవేదికపై సీతారాముల కల్యాణాన్ని రాజేష్ భట్టర్ బృందం వైభవంగా జరిపించింది. అంతకుముందు ఎదుర్కోలు కార్యక్రమాన్ని అర్చకులు, భక్తులు వేడుకగా నిర్వహించారు. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి శోభాయాత్రగా కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు.
అమ్మవారి పక్షాన ఈ కార్యక్రమానికి ఆచార్య చక్రవర్తుల రంగనాథస్వామి, ఆచార్య ఆకెళ్ల విభీషణశర్మ హాజరయ్యారు. సంకల్పం అనంతరం ప్రవరలు చెప్పించి కన్యాదానం నిర్వహించారు. షోడసోపచారాల అనంతరం చంద్రుని సాక్షిగా పండువెన్నెల్లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు టీటీడీ పక్షాన సీతమ్మకు సువర్ణ కిరీటం, రామయ్యకు సువర్ణ యజ్ఞోపవీతాలు, పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, రాయచోటి/ సాక్షి కడప/కడప కల్చరల్/ఒంటిమిట్ట
శ్రీ సీతారామలక్ష్మణులకు స్వర్ణకిరీటాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్లతో విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణకిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం విరాళంగా అందించారు. దాదాపు ఏడుకిలోల బంగారంతో తయారుచేసిన ఈ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, ఈ కిరీటాలను శ్రీ సీతారామలక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.

ప్రజలు నీతి, ధర్మ మార్గాలను అనుసరించాలి: సీఎం
ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమలలో గోవిందనామంలాగా ఒంటిమిట్టలో ‘జై శ్రీరామ్’ నినాదం ప్రతిధ్వనించాలన్నారు. తిరుమల మాదిరిగా ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని కోరుతున్నట్లు చెప్పారు. ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.