
సాక్షి, గుంటూరు: నగరంలోని మణి హోటల్ సెంటర్‌లో లక్కీ వైన్స్‌ను తొలగించాలంటూ మహిళలు, స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం షాపు దగ్గరకు వచ్చిన ఎక్సైజ్ సీఐ లతను మహిళలు నిలదీశారు. వైన్ షాపు కారణంగా మద్యం తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సీఐ లత దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ధర్నా చేస్తున్న స్థానికులపై ఎక్సైజ్ సీఐ లత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ నుంచి మద్యం షాపును తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూల్స్ ప్రకారమే ఇక్కడ షాప్ కేటాయించామని సీఐ తెలిపారు. వైన్స్ దగ్గర తాగుబోతులు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సెక్యూరిటీ కల్పిస్తామంటూ సీఐ లత చెప్పుకొచ్చారు. దీంతో సీఐ లతపై మహిళలు ఆగ్రహించారు. దీంతో సీఐ, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్నా చేస్తున్న స్థానికులతో వైన్స్ యాజమాన్యం కూడా గొడవకు దిగింది.
ఇక్కడ నుంచి వైన్స్ తీసే ప్రసక్తే లేదంటూ మహిళలపై వైన్స్ యజమాని చిందులు తొక్కారు. ప్రభుత్వమే మాకు మద్యం అమ్ముకోమని లైసెన్స్ ఇచ్చిందని.. మీరేంటి చేసేదంటూ స్థానికులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఐదేళ్లపాటు మమ్మల్ని మీరేం చేయలేరంటూ ధర్నా చేస్తున్న వారిపై చిందులేశారు.
