
2025లో 550 మిలియన్ డాలర్ల సమీకరణ
భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్
లిస్టులో ఎపిస్, యాక్సెల్ తదితర సంస్థలు
ముంబై: దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫిన్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం 2025లో ఇప్పటివరకు వృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలు దాదాపు 550 మిలియన్ డాలర్లు సమీకరించాయి. మరికొన్ని డీల్స్ ముగింపు దశలో ఉన్నాయి.
పీక్ ఫిఫ్టీన్ పార్ట్‌నర్స్, ఎపిస్, యాక్సెల్, మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్, ఎస్‌ఎంబీసీ గ్రూప్ లాంటి భారీ ఫండ్స్, ఫిన్‌టెక్‌లో భాగమైన వివిధ విభాగాల్లోని సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. నియంత్రణ నిబంధనలపరమైన అనిశ్చితి తగ్గడంతో రాబోయే రోజుల్లో ఫిన్‌టెక్ రంగంలో మరిన్ని డీల్స్ నమోదవుతాయని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వర్గాలు తెలిపాయి. ఫిన్‌టెక్ రంగంలోకి 2023, 2024లో కేవలం 1.3 బిలియన్ డాలర్లు మాత్రమే రాగా.. తాజాగా ఈ ఏడాది తొలి నాళ్లలోనే అర బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు రావడం సానుకూల పరిస్థితులను సూచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి.
వెల్త్‌టెక్‌కు ప్రాధాన్యం..
ఫండ్స్ పెట్టుబడుల్లో వెల్త్‌టెక్ విభాగానికి ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, పేమెంట్స్, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లాంటి ఇతరత్రా విభాగాలకు కూడా గత మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో గ్రోత్ స్టేజ్ పెట్టుబడులు మెరుగ్గానే లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన క్యాష్‌ఫ్రీ సంస్థ ఫిబ్రవరిలో 43 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. అలాగే, టోన్‌ట్యాగ్ అనే సౌండ్ ఆధారిత పేమెంట్స్ స్టార్టప్ 78 మిలియన్ డాలర్లు అందుకుంది.
ఇక ఈజ్‌బజ్ అనే పేమెంట్ అగ్రిగేటర్ సంస్థలో బెస్సీమర్ వెంచర్ పార్ట్‌నర్స్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 40 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. టోన్‌ట్యాగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దన్ను ఉంది. ఈ విభాగంలో వృద్ధి చాలా నెమ్మదిగా ఉండొచ్చు కానీ తాజా పరిణామాలతో వ్యాపారాలకు కాస్త స్థిరత్వం లభిస్తుందని ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు, ఫిన్‌టెక్ రంగంలో అంతర్గతంగా వెల్త్‌టెక్ విభాగం విస్తరణకు గణనీయంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటక్ చెర్రీ సీఈవో శ్రీకాంత్ సుబ్రమణియన్, ఐఐఎఫ్‌ఎల్ వెల్త్‌కి చెందిన సందీప్ జెత్వానీ వంటి ప్రముఖ వెల్త్ మేనేజర్ల సారథ్యంలోని సంస్థలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. పేటీఎం మనీ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ జాదవ్ నెలకొలి్పన ధన్ సుమారు 1.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో దాదాపు 200 మిలియన్ డాలర్లు సమీకరించే యత్నాల్లో ఉంది.
2022లో ప్రారంభమైన స్టేబుల్ మనీ సంస్థ 130 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 20 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంటోంది. 2024 జూన్‌లో నిధులు సమీకరించినప్పటితో పోలిస్తే వేల్యుయేషన్ మూడు రెట్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి నియంత్రణ నిబంధనల విషయంలో స్పష్టత నెలకొనడమే ఈ విభాగంపై వెంచర్ క్యాపిటల్ సంస్థలకు ఆసక్తి పెరగడానికి కారణమని పలువురు ఇన్వెస్టర్లు వెల్లడించారు.