
బజాజ్ ఆటో మాజీ వైస్ ఛైర్మన్ మాధుర్ బజాజ్(73) మృతి చెందారు. వృద్ధాప్య కారణాల వల్ల అస్వస్థతతో ఇటీవల దక్షిణ ముంబైలో ఉన్న బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతుండగానే శుక్రవారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగా గతేడాది జనవరిలో బజాజ్ ఆటో వైస్ ఛైర్మన్ పదవికి మాధుర్ రాజీనామా చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు మాధుర్ బజాజ్. విదేశాల్లో విద్యనభ్యసించిన ఆయన గ్రూప్‌లోని పలు కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్)తో పాటు సీఐఐ, ఇతర పారిశ్రామిక సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇదీ చదవండి: డాలర్‌కు ట్రంప్ గండం
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు భారత వృద్ధిలో భాగస్వామ్యం అయ్యారంటూ బజాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ స్నేహితుడు కన్నుమూశారని విచారం వ్యక్తం చేస్తూ భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి సంతాపం తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (వెస్ట్రన్ రీజియన్) ఛైర్మన్‌గా, చాంబర్ ఆఫ్ మరాఠ్వాడా ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడిగా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌తో భాగస్వామిగా ఆయన ఎంతో సేవలందించారని బాబా కళ్యాణి తెలిపారు.