
అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తే కెనడాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దేశం తీవ్ర మాంద్యంలోకి వెళ్తుందని బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపింది. తీవ్ర అనిశ్చితి కారణంగా సెంట్రల్ బ్యాంక్ తన సాధారణ త్రైమాసిక ఆర్థిక అంచనాలను విడుదల చేయలేదు. దానికి బదులుగా భవిష్యత్తులో యూఎస్ ఆర్థిక వైఖరి కెనడాపై ఎలా ప్రభావం చూపుతుందో అంచనా వేసింది.
బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి సందర్భంలో, చాలా సుంకాలు రద్దు చేస్తారు. కెనడాతోపాటు ప్రపంచ వృద్ధి తాత్కాలికంగా బలహీనపడుతుంది. కెనడా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 1.5%కు పడిపోతుంది. తరువాత 2%కు చేరుతుంది. రెండో సందర్భంలో, సుంకాలు దీర్ఘకాలిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి. కెనడా భారీ మాంద్యంలోకి ప్రవేశిస్తుంది. ద్రవ్యోల్బణం 2026 మధ్యలో 3% కంటే ఎక్కువ పెరిగి 2% కు తిరిగి వస్తుంది. ఇంకా ఇతర పరిస్థితులు సాధ్యమేనని నొక్కిచెప్పిన బ్యాంక్ వార్షిక మొదటి త్రైమాసిక జీడీపీ 1.8%గా అంచనా వేసింది. ఇది జనవరి చివరిలో అంచనా వేసిన 2.0% కంటే తక్కువ.
ఇదీ చదవండి: ‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’
ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?
వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు.