చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు | Trump administration announced new tariff on Chinese imports | Sakshi
Sakshi News home page

చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు

Published Wed, Apr 16 2025 1:29 PM | Last Updated on Wed, Apr 16 2025 2:27 PM

Trump administration announced new tariff on Chinese imports

చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్‌ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్‌ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.

చైనా తాజా చర్యలు..

చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్‌ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడి

ఆర్థిక పరిణామాలు

అమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్‌టైల్‌ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement