
2047 నాటికి రెండో స్థానం మనదే
నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే మూడేళ్లలో జర్మనీ, జపాన్‌లను అధిగమిస్తుందనని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి విద్యా కేంద్రంగా భారత్ ఎదుగుతుందన్నారు. మిగతావన్నీ పక్కన పెడితే, భారత్‌కు ఉన్న అతిపెద్ద సానుకూలత ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు.
‘‘ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది చివరికి నాలుగో స్థానానికి చేరుకుంటాం. ఆ తర్వాతి సంవత్సరంలో మూడో స్థానాన్ని సాధిస్తాం’’అని సుబ్రమణ్యం చెప్పారు. ఐఎంఎఫ్ తాజా డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత కంపెనీలు, న్యాయ సేవల సంస్థలు, అకౌంటింగ్ సంస్థలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగే ఆకాంక్షలతో పనిచేయాలని సుబ్రమణ్యం పిలుపునిచ్చారు.
తక్కువ ఆదాయ దేశాల్లోని సమస్యలతో పోల్చితే మధ్యాదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవిగా పేర్కొన్నారు. ప్రపంచానికి పనిచేసే కారి్మక శక్తిని భారత్ అందిస్తున్నట్టు చెప్పారు. జపాన్ 15వేల మంది భారత నర్సులను తీసుకుంటే, జర్మనీ 20వేల మంది హెల్త్‌కేర్ సిబ్బందిని నియమించుకున్నట్టు గుర్తు చేశారు. వారిదగ్గర కుటుంబ వ్యవస్థ ముక్కలైనట్టు వ్యాఖ్యానించారు.