ఈ ఏడాది వృద్ధి 6 శాతానికిపైనే | India's Gdp Grows 6.1 Percent In Q4 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వృద్ధి 6 శాతానికిపైనే

Published Sat, Jun 3 2023 7:44 AM | Last Updated on Sat, Jun 3 2023 7:47 AM

India's Gdp Grows 6.1 Percent In Q4 - Sakshi

భారత్‌ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి 7.2 శాతం వృద్ధి రేటును సాధించడం, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం,అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాల నేపథ్యంలో ఎకానమీపై తాజా అంచనాలను పరిశీలిస్తే.. 

2023–24లో వృద్ధి అంచనాలు అప్‌ 
అంతర్జాతీయ వృద్ధి అవుట్‌లుక్‌ బాగుంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖంగా పయనిస్తున్నాయి. సేవల ఎగుమతులు మెరుగుపడుతున్నాయి. 2022–23 క్యూ4లో భారత్‌ వృద్ధి అంచనాలకు మించి మెరుగ్గా 6.1 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎకానమీ ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నాం. వెరసి 2023–24లో వృద్ధి 6.2 శాతంగా ఉండవచ్చు. ఇక భారత్‌ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 2023–24లో క్రితం అంచనాలు 5.3 శాతంకన్నా తక్కువగా 5.1 శాతంగా సగటు నమోదుకావచ్చు.  ప్రపంచ వృద్ధి అంచనాలను ఇప్పటికే 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 2.6 శాతానికి పెంచడం జరిగింది. చైనా, యూరోపియన్‌ యూనియన్, అమెరికా నుంచి వెలువడుతున్న గణాంకాల సానుకూలత దీనికి కారణం.  క్యాలెండర్‌ ఇయర్‌ ప్రారంభంలో ఉన్న అనిశ్చితి పరిస్థితి ఇప్పుడు కనిపించడంలేదు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి.  – యూబీఎస్, స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ 

ఈ సారీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు 
ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో జూన్‌ 8వ తేదీ సమీక్షా సమావేశంలో కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటులో ఎటువంటి మార్పూ చేయకపోవచ్చు. మార్చిలో 5.7 శాతం వద్ద ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. 2023లో సగటున రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా నమోదుకావచ్చు. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది తక్కువ. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మే 2022 నుంచి ఆరు దఫాలుగా రెపో రేటును ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పెంచుతూ వచ్చింది. ఈ కాలంలో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్‌ పాలసీ సమీక్షా సమావేశంలో అందరి అంచనాలకూ భిన్నంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయించింది. అయితే భవిష్యత్‌ నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడిపై ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.  – గోల్డ్‌మన్‌ శాక్స్, వాల్‌స్ట్రీట్‌ బ్రోకరేజ్‌ సంస్థ 

2023–24లో 6.7% వరకూ..
దేశీయంగా పటిష్టంగా ఉన్న ఆర్థిక ఫండమెంటల్స్, ప్రభుత్వం భారీ మూలధన పెట్టుబడుల మద్దతుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.5–6.7 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. 2022–31 దశాబ్ద కాలంలో భారత్‌ సగటున అంతక్రితం దశాబ్దంతో పోల్చితే (6.6 శాతం) భారీగా 7.8 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్యలు భారత్‌ను చక్కటి వృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం.  భారతదేశం జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టిన దృష్ట్యా,  ఈ సంవత్సరం దేశానికి చాలా ముఖ్యమైనది. ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది. దీని నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలు మనకు  ముఖ్యమైనవి. ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. భారత్‌ వృద్ధికి దోహదపడే అంశం ఇది.  – ఆర్‌ దినేష్, కొత్తగా ఎన్నికైన సీఐఐ ప్రెసిడెంట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement