
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ధర్మవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరానికి చెందిన స్నేహలత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కాంట్రాక్టు ఉద్యోగిని. యథావిధిగానే మంగళవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో స్నేహలత తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా, బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద స్నేహలత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కుమార్తెను హత్య చేశారని స్నేహలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధించారని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు.. సమగ్ర విచారణ చేపట్టారు.