
సనత్ నగర్ ఎస్‌ఆర్‌టీ కాలనీ ప్రత్యేకత
సనత్‌నగర్ ఇండస్ట్రీయల్ పార్కు
నెహ్రు పార్కు , ఎస్‌ఆర్‌టీ కాలనీ ఈ–సేవా వెనుక పార్కు
నవ వనాల పార్కు, వినాయక గ్రౌండ్
సనత్‌నగర్: నగరంలో రోజురోజుకు కాలుష్య ప్రమాణాలు పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండగా ఆ కాలనీవాసులు మాత్రం కాలుష్యానికి దూరంగా ఉండేలా ఏడు దశాబ్దాల క్రితమే పచ్చదనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 56 ఉద్యానవనాలు ఆ కాలనీ సొంతం. ఏ రోడ్డు కెళ్ళినా పార్కులు దర్శనమిస్తాయి. గజం జాగ కనిపిస్తే కాంక్రీట్‌మయంగా మార్చే ప్రస్తుత తరుణంలో 56 పార్కు స్థలాలను కేటాయించడం ఒక వంతైతే...వాటిని కబ్జా కాకుండా కాలనీవాసులంతా సమష్టిగా కాపాడుకోవడం మరో వంతు. కార్మికగడ్డగా పేరొందిన సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీ కాలనీకి వెళితే ఆయా పార్కుల అందాలను ఆస్వాదించవచ్చు. ఎస్‌ఆర్‌టీ కాలనీవాసులే కాకుండా పక్క కాలనీలైనా జెక్‌కాలనీ, రాజరాజేశ్వరీనగర్, తులసీనగర్, సౌభాగ్యనగర్, నాగరాజేశ్వరీనగర్, అల్లావుద్దీన్‌కోఠి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఆయా పార్కులకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఇక్కడి పార్కుల అభివృద్ధి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సగం వరకు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రాగా...మరికొన్ని క్రీడామైదానాలుగా వినియోగిస్తున్నారు. వాటికి నలువైపులా సైతం పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నారు. ఇంకొన్ని అభివద్ధి దశలో ఉన్నాయి.
సనత్‌నగర్ పారిశ్రామికవాడ సాక్షిగా...
స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి నిజామ్ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం సనత్‌నగర్ ప్రాంతంలో అల్లావుద్దీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 408 ఎకరాల భూమిని అప్పటి ప్రప్రథమ రాష్ట్రపతి ద్వారా తన పేరిట రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. తదనంతరం కేంద్ర కార్మిక సంస్థ ఇక్కడి దాదాపు 150 ఎకరాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిరి్మంచుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అల్లావుద్దీన్‌న్ నుంచి భూమిని సేకరించింది. అలా సేకరించినదే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా నామకరణం జరిగింది. ‘సనత్’ అంటే పరిశ్రమగా పేర్కొంటారు. అందుకే మొట్టమొదటి పారిశ్రామికవాడ కావడంతో సనత్‌నగర్‌గా ఈ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా సనత్‌నగర్ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. అదే పారిశ్రామికవాడ ఎదురుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆనాటి కార్మికుల ఆవాసం కోసం ఏర్పాటు చేసినదే నేటి సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీ కాలనీ. ఎస్‌ఆర్‌టీ (సింగిల్ రూమ్ టెనెంట్స్) పేరిట 1500 క్వార్టర్స్ ఇళ్ళ నిర్మాణం జరిపారు. ఆరు వేల జనాభా ఉన్న ఆ కాలనీలో పార్కుల కోసం 56 ఖాళీ ప్రదేశాలను విడిచిపెట్టారు. కాలక్రమంలో వాటిని కాపాడుకుంటూ అభివద్ధిపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పార్కు 1500 గజాల నుంచి మొదలుకొని ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి.
చెట్లు,పూలమొక్కలతో ఆహ్లాదంగా...
ఆయా పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో చెట్లు, పూలమొక్కలతో కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం పార్కు, మార్కెట్ ఉద్యానవనం, భగత్‌సింగ్ గ్రౌండ్, వినాయక గ్రౌండ్, బాస్కెట్‌బాల్ మైదానం, నవ వనాల పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, నెహ్రు పార్కు, ఎస్‌ఆర్‌టీ–80, ఎస్‌ఆర్‌టీ–87, ఎస్‌ఆర్‌టీ–495 తదితర పార్కులు ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. క్రీడా స్థలాలను మినహాయిస్తే సుమారు 30 వరకు ఉద్యానవనాలు చెట్లు, పూల మొఇక్కలు, పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యానవనంలో 300 పైచిలుకు వృక్షాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి పరిరక్షణ,
అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యానవన సంక్షేమ సంఘం, వినాయక సంక్షేమ సంఘం, భగత్‌సింగ్ ఉత్సవ కమిటీ, సనత్‌నగర్‌యువజన సంక్షేమ సంఘం వంటి వాటిని ఏర్పాటుచేసుకున్న కాలనీవాసులు ఈ ఉద్యానవనాలను ఆక్రమణదారుల పాలుకాకుండా కాపాడుకుంటున్నారు.