
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్‌లలో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబుపేలుళ్ల కేసులో దోషులైన ఆరుగురిలో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2016 డిసెంబర్19న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పునిచ్చింది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లతో పాటు ఆరు నగరాల్లో జరిగిన విధ్వంసాలకు సూత్రధారి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది రియాజ్ భత్కల్. అతడి సోదరుడు యాసీన్ భత్కల్ ఇందులో ప్రధాన పాత్రధారి. రియాజ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. యాసీన్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు 2013 ఆగస్టులో పట్టుకున్నారు.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ మగ్దూం కాలనీకి చెందిన యాసీన్ భత్కల్ అసలు పేరు మహమ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప. ఇంజినీరింగ్ చేయడానికి పుణే వెళ్లిన ఇతడు అక్కడే యునానీ వైద్యుడిగా ఉన్న తన సోదరుడు ఇక్బాల్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రారంభించి, ఇండియన్ ముజాహిదీన్‌లో కీలకంగా మారాడు. ఉగ్రవాదంలో 2007 నుంచి క్రియాశీలంగా ఉంటూ, 2008 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లకు కుటుంబంతో కూడా పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాడు.
ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడిగా యాసీన్ భత్కల్ అనేక విధ్వంసాలకు పథకరచన చేశాడు. టిఫిన్‌బాక్స్, ప్రెషర్ కుక్కర్ బాంబుల తయారీ పద్ధతిని తన అనుచరులకు నేర్పాడు. అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో ఇతడి పేరు వినిపించినా, 2010 ఫిబ్రవరి 13న పుణేలోని జర్మన్ బేకరీ పేలుడుతో ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలోకి చేరాడు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబై తదితర నగరాల్లో 2008–13 మధ్య జరిగిన విధ్వంసాలలో ఇతడి ప్రమేయం ఉండటంతో భద్రతా సంస్థలు ఇతడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.
సాంకేతిక నిఘాకు చిక్కకుండా తప్పించుకుంటున్న యాసీన్‌ను పట్టుకోవడానికి అతడి ఫొటో కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న కొన్నేళ్ల కిందటి ఫొటోతో కొన్నాళ్ల పాటు, 2010లో పాస్‌పోర్ట్ కోసం రాంచీ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో ఆ ఫొటోతో ఇంకొన్నాళ్లు గాలించారు. ఇతగాడు 2008–2011 మధ్య చిక్‌మగళూరు, మంగుళూరు, కోల్‌కతా, చెన్నైలలో ఐదుసార్లు తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. యాసీన్ భత్కల్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ స్పెషల్‌సెల్ అధికారులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. తమ మనిషికి ఉగ్రవాదిగా మార్చి, అతడిని యాసీన్‌కు దగ్గర చేయడం ద్వారా పట్టుకోవడానికి నఖీ అహ్మద్‌ను రంగంలోకి దింపారు. 2012 జనవరిలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నఖీ ఉగ్రవాది అనే ఆరోపణలపై అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యాసీన్‌ను పట్టుకునే మరో దారినీ కోల్పోయారు.
ఈ ఉదంతం పెను దుమారం రేపడంతో కేంద్ర హోమ్‌శాఖ కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇంతలో చీకట్లో చిరుదీపంలా మాస్టర్‌జీ చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీకి చెందిన బషర్ హసన్ అలియాస్ తల్హా అలియాస్ మాస్టర్‌జీని ఢిల్లీ పోలీసులు 2013లో పట్టుకున్నారు. 2007లో రియాజ్, ఇక్బాల్, యాసీన్‌లతో సన్నిహితంగా మెలిగిన మాస్టర్‌జీని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆ ముగ్గురూ కొరియర్‌గా వాడుకుంటున్నారని బయటపడింది. రియాజ్, ఇక్బాల్ పాకిస్తాన్‌కు మకాం మార్చాక యాసీన్ మాత్రమే ఇతడితో టచ్‌లో ఉన్నాడు. తనపై నిఘా పెరిగిపోవడంతో సెల్‌ఫోన్ సహా సాంకేతిక అంశాలకు దూరంగా ఉంటున్న యాసీన్ అనేక సందర్భాల్లో మాస్టర్‌జీని కొరియర్‌గా వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఆ సందర్భంలో మాస్టర్‌జీ చెప్పిన మాటే నేపాల్‌లోని పోఖరా. అత్యవసర పరిస్థితుల్లో తనను కలుసుకోవాలంటే అక్కడకు రమ్మని యాసీన్ చెప్పినట్లు మాస్టర్‌జీ బయటపెట్టాడు. దీంతో కేంద్ర నిఘా వర్గాలు బిహార్ సరిహద్దులోని పోఖరాపై దృష్టి పెట్టాయి. 2013 జూలై 7న బుద్ధగయలో వరుస పేలుళ్లు జరిగాయి. దీంతో భత్కల్, అతడి అనుచరులు ఈ విధ్వంసానికి పాల్పడి, సరిహద్దులు దాటి ఉంటారని అంచనా వేసిన ఐబీ ఇద్దరు బిహార్ అధికారులను రహస్యంగా పోఖరా పంపింది. అక్కడ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ఇద్దరు నిఘా అధికారులూ ముఖ్యంగా యునానీ వైద్యులు, అత్తరు వ్యాపారులపై దృష్టి పెట్టారు.
కేవలం ఓ వర్గానికి చెందిన వారే ఉన్నా ఎవరూ అనుమానించనివి ఈ రెండు వృత్తులే కావడమే దానికి కారణం. ఓ యునానీ వైద్యశాలలో ఉన్న వైద్యుడు వీరి దృష్టిని ఆకర్షించడంతో అతడిపై నిఘా ఉంచారు. కొన్ని రోజులకు మరో వ్యక్తి వచ్చి యునానీ వైద్యుడితో కలిసి ఉండటంతో అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఉన్న పాత ఫొటోల ఆధారంగా నిశితంగా పరిశీలించి, సదరు యునానీ వైద్యుడే తమకు కావాల్సిన యాసీన్ భత్కల్ అని, పక్కనున్నది అసదుల్లా అక్తర్ అని గుర్తించారు. ఇద్దరూ కరడుగట్టిన ఉగ్రవాదులు కావడంతో వారిని పట్టుకోవడానికి నేపాల్ పోలీసుల సహకారం కోరారు. వారు స్పందించలేదు.
చివరకు నేపాల్ పోలీసులకు రూ.50 వేలు లంచం ఇచ్చి, వారి సహకారంతో యాసీన్, అసదుల్లాల్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత తాను యునానీ వైద్యుడినే అంటూ నమ్మించేందుకు ప్రయత్నించిన యాసీన్ ఎట్టకేలకు నిజం బయటపెట్టాడు. దీంతో ఆపరేషన్ యాసీన్ ముగిసిందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు అధికారులు నేపాల్, బిహార్ పోలీసుల సాయంతో వారిని సరిహద్దులు దాటించి 2013 ఆగస్టు 29న జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ)కు అప్పగించగా, బిహార్‌లోని మోతిహారీ కోర్టులో హాజరుపరచారు. ఆ తర్వాత హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు తరలించి విచారించారు.