
అందరి నాన్నల్లా అతడు కూడా తన కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. తన కూతురిని పైలట్ చేయాలనుకున్నాడు. కానీ కూతురు ఊహించని షాక్ ఇచ్చింది. తన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంత తండ్రికూతుళ్ల మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. అయితే కాలం (Time) ఎవరి కోసం ఆగదుగా, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతటి గాయాన్నైనా కాలం నయం చేస్తుందంటారు. అంతేకాదు విడిపోయిన మనుషులను కూడా కాలం కలుపుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి విషయంలోనూ అదే జరిగింది.
అస్సలు ఊహించలేదు..
ఆయన పేరు అశోక్ కేత్కర్. భారత వాయుసేనలో వింగ్ కమాండర్‌గా రిటైర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దీని కంటే కూడా తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కన్నకూతురు భార్గవి తనను కాదని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కేత్కర్‌ను ఎక్కువ బాధ పెట్టింది. దీంతో కూతురికి కటీఫ్ చెప్పారు. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత ఒకరోజు కేత్కర్ విమానంలో ముంబై (Mumbai) నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనకు ముందుగా తెలియదు ఈ ప్రయాణం (Journey) తన జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం అవుతుందని. భూమాకాశాల మధ్యలో విధి ప్రత్యేక ‘నిధి’ని కానుకగా అందివ్వబోతోందని ఆయన అస్సలు ఊహించలేదు.
విమానం గాల్లోకి లేవగానే ఓ చిన్నపిల్లవాడు కేత్కర్‌కు వచ్చి గ్లాసుతో మంచినీళ్లు అందించాడు. ఆ బుడ్డోడిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కేత్కర్. ఇంతలో మైక్ నుంచి మహిళా పైలట్ (Woman Pilot) మాటలు వినిపించాయి. కేత్కర్‌ను యుద్ధవీరుడిగా ప్రయాణికులకు పరిచయం చేసింది. తర్వాత మాటలు విని ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే ఆ పైలట్ ఎవరో కాదు, ఆయన కూతురు భార్గవి. ‘సర్, మీరు బంధాలను తెంచుకున్న అమ్మాయి, మీ కూతురు భార్గవి ఈ విమానాన్ని నడుపుతోంది’ అనే మాటలు చెవిన పడగానే కేత్కర్ ఖిన్నుడయ్యారు.
కేత్కర్ తేరుకునేలోపే కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన భార్గవి, ఆయనకు ఎదురుగా నిలబడి సెల్యూట్ చేసింది. ‘నాన్నా.. నేను మీ కలను సాకారం చేశాను. మీరు అనుకున్నట్టుగానే పైలట్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించండి’ అని వేడుకుంది. కూతురిని అలా చూడగానే ఆయన కరిగిపోయాడు. తన బిడ్డను ఆలింగనం చేసుకుని అప్యాయత కురిపించారు. ఇందాక మీకు మంచినీళ్లు ఇచ్చిన చిన్నారి ఎవరో కాదు తన కొడుకే అని భార్గవి చెప్పడంతో కేత్కర్ ఆనందంతో పొంగిపోయారు. ‘తాతయ్యా, నేను మీలాగే ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంటున్నాను’ అని మనవడు అనడంతో ఆయన సంతోషం రెట్టింపయింది.
‘బయట సూర్యుడు అస్తమించాడు. విమానం కిందకు దిగిపోయింది. కానీ అశోక్ కేత్కర్ జీవితం మళ్ళీ చిగురించింది’ అంటూ ఈ కథను ఎక్స్‌లో షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka). అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఆయన వెల్లడించలేదు. ఈ పోస్ట్‌కు 3 లక్షలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా లైకులు వచ్చాయి.
నెటిజన్ల రియాక్షన్..
హర్ష్ గోయెంకా పోస్ట్‌పై పలువురు నెటిజనులు స్పందించారు. ‘దర్శకుడు మణిరత్నం దీన్ని చదివితే, ఈ కథకు ఒక రూపాన్ని ఇచ్చి సినిమా తెరకెక్కిస్తార’ని ఒకరు కామెంట్ చేశారు. ‘ఆ తండ్రి గర్వం, బాధ తన కూతురి కౌగిలిలో కరిగిపోయాయి. ఒకప్పుడు వారిని విడదీసిన ఆకాశం ఇప్పుడు వారిని కలిపింది. అతడు కూతురిని కోల్పోయాడు కానీ హీరోని కనుగొన్నాడు!’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది నిజంగా జరిగిందనడానికి నమ్మదగిన ఆధారాలు లేవని మరొక యూజర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సోర్టీ చాట్‌జీపీటీ రాసిందా అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా అడిగారు. కొంతమంది అయితే స్టోరీలోని లొసుగులను ప్రశ్నించారు. ఎక్కువ మంది మాత్రం పాజిటివ్‌గా స్పందించారు.
At Mumbai airport, a wheelchair-bound veteran, Wing Commander Ashok Ketkar, boarded a flight to Delhi. He had lost both legs in service, but what truly broke him was losing his daughter Bhargavi, who married against his wishes.
He hadn’t spoken to her in 5 years.
Mid-flight, an…— Harsh Goenka (@hvgoenka) March 26, 2025