భస్మాసుర హస్తంగా... ట్రంప్‌! | Sakshi Guest Column On US President Donald Trump | Sakshi
Sakshi News home page

భస్మాసుర హస్తంగా... ట్రంప్‌!

Published Tue, Mar 18 2025 12:28 AM | Last Updated on Tue, Mar 18 2025 12:30 AM

Sakshi Guest Column On US President Donald Trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌

విశ్లేషణ

సమస్యలను పరిష్కరించగలిగే అధికారం కలిగినవారే కొత్త సమస్యలను, సవాళ్లను కొనితెస్తే ఎలా ఉంటుంది? అచ్చు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారంలా ఉండదూ! ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో ఎన్నికలలో మళ్లీ గెలిచి 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ పట్ట పగ్గాలు లేనివిధంగా తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం ఆర్థికంగా అల్లకల్లోలంగా మారుతున్నది. 

ట్రంప్‌ దేశాధ్యక్షుడు అయిన వెంటనే అమెరికాకు సంబంధించి పలు రక్షణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా పౌరసత్వంపై ఆంక్షలు, విదేశాలకు అందించే సహాయ నిధులలో కోత, అక్రమ వలసదారులపై వేటు, అమెరికన్‌ ప్రభుత్వ ఉద్యోగుల కుదింపునకు, దుబారా నివారణకు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో ‘డోజ్‌’ ఏర్పాటు తదితర నిర్ణయాలకు చాలావరకు సానుకూల స్పందన వచ్చింది. 

కానీ వివిధ దేశాలతో జరిపే ఎగుమతులు, దిగుమతులలో సమాన స్థాయిలో సుంకాలు విధిస్తామనీ, టారిఫ్‌ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవనీ తెగేసి చెప్పడంతో అంతర్జాతీయ వాణి జ్యంలో అనిశ్చితి ఏర్పడింది. ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అనే ఓ ముతక సామెతను గుర్తు తెచ్చే విధంగా ట్రంప్‌ ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత దేశ ప్రజల పట్ల తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని చెబుతూనే భారత్‌ నుంచి దిగుమ తయ్యే సరుకులపై అధిక సుంకాలు వేస్తామని తేల్చేశారు.

పరస్పర సుంకాల విధానం  అంటే, ఏదైనా ఒక దేశం అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎంత మొత్తాన్నైతే దిగుమతి సుంకంగా విధిస్తుందో, అమెరికా కూడా సదరు దేశ ఉత్పత్తులపై అంతే సుంకం విధిస్తుందంటూ ట్రంప్‌ ఏకపక్షంగా ప్రకటించేశారు. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తులపై 25%; చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అలాగే, భారత్‌ వద్ద చాలా సంపద ఉందనీ, అమె రికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్‌ 100 శాతం సుంకాలు విధిస్తోంది కనుక... ఆ మేరకు మేమూ సిద్ధమేనంటూ ట్రంప్‌ సాక్షాత్తూ మోదీ సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.

సుంకాలకు శ్రీకారం చుట్టింది అమెరికాయే!
ప్రపంచం మొత్తం ఓ అంతర్జాతీయ గ్రామంగా మారాలనీ, స్వేచ్ఛా ప్రపంచ వాణిజ్యం వల్ల అన్ని దేశాలూ లాభపడతాయంటూ తొలుత విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 1929 నుంచి ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది అమెరికాయే. దాంతో, అంత ర్జాతీయ వాణిజ్యంలో క్రమంగా అన్ని దేశాలూ పాల్గొనడం మొదలైంది. 

వాణిజ్య సుంకాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు ఏర్పరచడం తప్పనిసరి అని అన్ని దేశాలూ అంగీకారానికొచ్చిన నేపథ్యంలోనే 1948లో ‘గాట్‌’ (జనరల్‌ అగ్రిమెంట్‌ ఫర్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌) ఒప్పందం మొదలైంది. దాంతో ‘అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజం’ ఆవిర్భవించింది. 

1994లో 117 దేశాలు గాట్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందులో భారత్‌ కూడా ఉంది. ‘వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌’ (ప్రపంచ వాణిజ్య సంస్థ)లోని సభ్య దేశాల నడుమ వాణిజ్య ఒప్పందాలు జరగడం; సుంకాల విధింపునకు సంబంధించి పలు దఫాలు చర్చలు జరిగి ఆయా దేశాలపై విధించిన ఆంక్షల విషయంలో సడలింపులు చోటు చేసుకొన్నాయి. భారతీయ జౌళి ఉత్పత్తుల దిగు మతులపై అప్పటివరకు ఉన్న ఆంక్షల్ని చాలా దేశాలు ఎత్తి వేశాయి. ఇదంతా చరిత్ర!

ఎవరికి నష్టం?
‘అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం’ అనిట్రంప్‌ తన నిర్ణయాలను సమర్థించుకొంటున్నారు. పైగా, దీనికోసం అమెరికా అధ్యక్షుడిగా తనకున్న అసాధారణ అధికారాలను ఉపయో గించుకొని ‘అంతర్జాతీయ ఆత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈ ఈపీఏ)ను ఉపయోగించుకొంటున్నారు. దీనివల్ల అమెరికా న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికీ, ట్రంప్‌ నిర్ణయాలను సమీక్షించ డానికీ అవకాశం లేకుండా పోయింది. 

ప్రజల స్పందన ఎలా ఉన్నా, అమెరికా దేశీయ స్టాక్‌ మార్కెట్లు మాత్రం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షల డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చౌకగా లభించే శ్రామిక శక్తి దూరమైంది. ఈ విపరిమా ణాలతో అమెరికా ద్రవ్యోల్బణ రేటు ప్రస్తుతం ఉన్న 2.9 శాతం నుంచి 3.3 శాతానికి చేరుకొంటుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. అమెరికాలోని భారతీ యులు కూడా ఆ మేరకు నష్టపోతారు.

ట్రంప్‌ దూకుడును నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధంపై బైడెన్‌ అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్‌ రష్యాకు అనుకూలంగా మారిపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనివార్యంగా ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా సభ్య దేశాలుగా ఉన్న ‘బ్రిక్స్‌’ కూటమి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక దశలో డాలరు చెల్లింపుల వ్యవçస్థ నుంచి వైదొలగాలని భావించినప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకొనే అవకాశం ఉంది.

‘అమెరికా హితం ప్రపంచ హితం, అమెరికా శోకం ప్రపంచ విషాదం’ అనే ఓ వ్యంగ్య నానుడి ఉంది. అంటే అమెరికా ఏది చేసినా ప్రపంచానికి మంచి చేస్తుంది కనుక అన్ని దేశాలూ గొర్రెల్లా తలలు ఊపాల్సిందే. కానీ ట్రంప్‌ తీసుకొంటున్న సమాన టారిఫ్‌ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని చావుదెబ్బ తీసే పరిస్థితులు కనిపిస్తున్న నేప థ్యంలో మిగతా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరం.

భారత రైతాంగానికి రక్షణ అవసరం
నిజానికి, అభివృద్ధిలో వెనుకబడిన దేశాలు తమ దేశీయ ఉత్పత్తులను రక్షించుకోవడానికి అధిక సుంకాలు విధించడం సహజం. ఉదాహరణకు మన దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించనట్లయితే... దేశ రైతాంగానికి పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించక వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. 

ఒకవేళ భారత ప్రభుత్వం కనుక ట్రంప్‌ హెచ్చరికలకు తలొగ్గి, అమెరికా వ్యవసాయ దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను తగ్గించినట్లయితే... భారతీయ మార్కెట్లను అమెరికన్‌ వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తుతాయి. ఫలితంగా భారతీయ రైతాంగం మరింతగా కష్టాల ఊబిలోకి కూరుకుపోతుంది.

కాగా, అమెరికాకు భారత్‌ చేస్తున్న ఎగుమతులలో వస్త్రాలు, ఔషధాలు, ఐటీ ఆధారిత సేవలు, అల్యూమినియం, ఉక్కు, ఇంకా కొన్ని రకాల వ్యవసాయ ఉత్పతులు ప్రధానంగా ఉన్నాయి. వీటిపై అమెరికా అధిక సుంకాలు వేస్తే మన దేశంలోని పరిశ్రమలు నష్ట పోతాయి. నష్టాన్ని నివారించాలంటే కొత్త మార్కెట్లను అన్వేషించాలి. 

అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల... దేశ పారిశ్రామిక రంగాన్ని ‘ట్రంప్‌’ సవాళ్ల నుంచి రక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే. ట్రంప్‌ ఏకపక్షంగా పెంచిన సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)కు ఫిర్యాదు చేసింది. భారత్‌ కూడా అమెరికా మీద ఒత్తిడి తేవడానికీ, తన ప్రయోజనాలను కాపాడుకోవడానికీ దృఢంగా వ్యవహరించాలి.

డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement