
జపాన్ కానుక
టోక్యో: భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఊపందుకుంటోంది. ట్రయల్ రన్, తనిఖీ తదితర అవసరాల నిమిత్తం రెండు ఐకానిక్ షింకన్సెన్ రైళ్లను భారత్‌కు జపాన్ కానుకగా ఇవ్వనుంది. నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ట్రయల్ రన్ కోసం వాటిని వినియోగించనున్నారు. వీటిలో ఒకటి ఇ5 సిరీస్‌కు, మరోటి ఇ3 సిరీస్‌కు చెందినవి. ఈ రైళ్లను 2026 మొదట్లో భారత్‌కు డెలివరీ చేయనున్నట్లు టోక్యోకు చెందిన ది జపాన్ టైమ్స్ దినపత్రిక తెలిపింది.
ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే దేశంలో తొలి హైస్పీడ్ రైలు మార్గం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై–అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయ్యాక అధిక ఉష్ణోగ్రతలు, ధూళి ప్రభావాలతో సహా డ్రైవింగ్ పరిస్థితులపై డేటాను సేకరించడానికి షింకన్సెన్ రైళ్లను ఉపయోగిస్తారు. అంతకు అవసరమైన తనిఖీ పరికరాలను బిగించిన మీదట జపాన్ వాటిని భారత్‌కు అప్పగించనుంది.
హైస్పీడ్ టెక్నాలజీ
షింకన్సెన్ జపాన్ హైస్పీడ్ రైల్వే టెక్నాలజీ. ఈ10 అందులో నెక్ట్స్ జనరేషన్ మోడల్. 2030 నాటికి ముంబై–అహ్మదాబాద్ కారిడార్లో ఈ అత్యాధునిక ఈ10 మోడల్ షింకన్సెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత్ యోచిస్తోంది. ‘మేకిన్ ఇండియా’కింద ఈ రైళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు 2016లో నాటి జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ త్వరలో భారత్‌కు బదిలీ చేస్తుంది.
ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆర్‌ఆర్టిఎస్, వందేభారత్ వంటి దేశీయంగా తయారైన సెమీ హైస్పీడ్ రైళ్లను భారత్ ఉపయోగిస్తోంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్లో ఈ5 సిరీస్ షింకన్సెన్ రైళ్లను నడపాలని తొలుత భావించింది. కానీ అధిక ఖర్చులు, జాప్యం కారణంగా ఆ ప్రతిపాదనలో ప్రతిష్టంభన ఏర్పడింది. దాన్ని తొలగించడమే గాక భారత్‌కు ఏకంగా అత్యాధునిక ఇ10 సిరీస్ రైళ్లను అందించేందుకు జపాన్ ముందుకొచ్చింది. అదే సమయంలో ఇ5, ఇ3 సిరీస్‌లకు చెందిన ఒక్కో రైలును ట్రయల్స్ తదితర అవసరాల నిమిత్తం పూర్తి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. మోదీ త్వరలో జరపనున్న జపాన్ పర్యటనలో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదురుతుందని సమాచారం.