ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు | USA Supreme Court pauses deportation of Venezuelans In Country | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Published Sun, Apr 20 2025 7:04 AM | Last Updated on Sun, Apr 20 2025 10:52 AM

USA Supreme Court pauses deportation of Venezuelans In Country

వాషింగ్టన్‌: అమెరికాలో 1798 నాటి ఎలియన్‌ ఎనిమీస్‌ చట్టం కింద నిర్బంధానికి గురైన వెనిజులా పౌరులకు భారీ ఊరట లభించింది. వారిని బలవంతంగా వెనక్కి పంపించకుండా అమెరికా సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది.

​కాగా, ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఉత్తర టెక్సాస్‌లో 261 మంది వెనిజులా పౌరులను ఎలియన్‌ ఎనిమీస్‌ చట్టం–1798 కింద నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఈ 261 మందిని ట్రంప్‌ ప్రభుత్వం ఎల్‌సాల్వెడార్‌ దేశంలో భూలోక నరకంగా పరిగణించే ఓ జైలుకు తరలించింది. తర్వాత వారందరినీ వెనిజులాకు పంపించాలని నిర్ణయించింది. దీంతో బాధితులకు మద్దతుగా అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ కార్యకర్తలు న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులను ఆశ్రయించారు. 261 మందిని వారి స్వదేశానికి తరలించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ కింది కోర్టు మార్చి 15న ఆదేశాలిచ్చింది.

అయితే, వారిని వెనక్కి పంపించడానికి 1798 నాటి వార్‌టైమ్‌ చట్టాన్ని ట్రంప్‌ ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెలువరించింది. కానీ, డిపోర్టేషన్‌ను సవాలు చేసే అవకాశం వారికి ఇవ్వాలని స్పష్టంచేసింది. దాంతో సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం డిపోర్టేషన్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. వెనిజులా పౌరులకు ఇది అతిపెద్ద విజయమని అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

వెనిజులా వాసులు ప్రస్తుతానికి ఎల్‌ సాల్వెడార్‌ జైలులోనే ఉండనున్నారు. 216 మందిలో 137 మందిపై ఎలియన్‌ ఎనిమీస్‌ చట్టం–1798ను తొలగించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను అక్రమ వలసదార్లను గుర్తించి, అరెస్ట్‌ చేసి డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రభుత్వం అమెరికా నుంచి  బయటకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement