
న్యూఢిల్లీ: బ్రూనై పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌లో ప్రవాస భారతీయులు మోదీకి నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోదీ ఢోలువాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం 'లావణి'ని వివిధ మహిళలు ప్రదర్శిస్తుండగా.. ప్రధాని మోదీ ఢోలు వాయించారు. అనంతరం సింగపూర్ ప్రధాని లారె న్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ఇతర మంత్రులతో భేటీ కానున్నారు.
ఇక సింగపూర్ పర్యటనపై మోదీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే సింగపూర్‌లో ల్యాండ్ అయ్యాను. భారత్-సింగపూర్ స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగే వివిధ సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు.
VIDEO | PM Modi (@narendramodi) tried his hands at 'dhol' as he received a warm welcome upon arrival at Marina Bay, #Singapore.
(Source: Third Party) pic.twitter.com/hY4WAyELFy— Press Trust of India (@PTI_News) September 4, 2024
కాగా మోదీ బ్రూనై, సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి 40 ఏళ్లయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. భారత ప్రధాని బ్రూనై వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్రూనై రాజు హాజీ హసనల్ బోల్కియాను మోదీ భేటీ అయ్యారు.
ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.