
పంపాలో మట్టి దొంగలు
రిజర్వాయర్‌లో తాటి చెట్టు లోతున సాగుతున్న తవ్వకాలు
పంపా రిజర్వాయర్ గర్భంలో భారీ
యంత్రాలతో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు
● తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
● మరమ్మతుల ముసుగు
● స్వలాభం కోసం రబీకి ఎగనామం
● అను‘మతి’ లేకుండా తవ్వకాలు
● 5 వేల ట్రిప్పులకు చీకటి ఒప్పందం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కూటమి సర్కార్ గద్దెనెక్కాక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తమ ఆగడాలను ప్రశ్నించే ధైర్యం ఎవరికుందంటూ తెలుగు తమ్ముళ్లు బరి తెగిస్తున్నారు. నిలువు దోపిడీకి నిఖార్సయిన బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. గ్రావెల్, మట్టి, ఇసుక.. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే సహజ వనరులను లూటీ చేస్తున్నారు. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా.. అధికార పార్టీ అండదండలు దండిగా ఉండటంతో అధికారులు నోరు మెదపడం లేదు.
జిల్లాలోని మెట్ట ప్రాంతం గ్రావెల్, మెటల్‌కు పెట్టింది పేరు. జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో గ్రావెల్‌కు కొదవ లేదు. నాడు చంద్రబాబు సర్కార్‌లో కొండలను పిండి చేసి కోట్లు కొల్లగొట్టిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతున్నారు. అడిగే నాథుడు లేడనే ధైర్యంతో వారి ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. జిల్లాలో ఏలేరు, పుష్కర, సుబ్బారెడ్డి సాగర్ తదితర జలాశయాల మాదిరిగానే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని పంపా రిజర్వాయర్ కూడా వేలాది మంది రైతులకు జీవనాధారంగా ఉంది. దీని కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయంపై ఆధారపడి సుమారు 20 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇంతటి కీలకమైన ఈ పంపా జలాశయానికి తెలుగు తమ్ముళ్లు గర్భశోకం కలిగిస్తున్నారు.
మరమ్మతుల సాకుతో..
పంపా రిజర్వాయర్, గేట్ల మరమ్మతుల సాకుతో కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆయకట్టులో రబీ సాగు లేకుండా చేశారు. తద్వారా వేలాది మంది రైతుల పొట్ట కొట్టారు. అక్రమంగా గ్రావెల్ తవ్వేసి రూ.లక్షలు మింగేయాలనే దురుద్దేశంతోనే ఈవిధంగా చేశారని అన్నదాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా ఐదేళ్లూ రబీ సాగుకు సమృద్ధిగా నీరు అందించిన విషయాన్ని పంపా ఆయకట్టు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ జలాశయంలో ఇప్పుడు మట్టి దొంగలు పడ్డారు. మరమ్మతుల పేరుతో ఉన్న నీటిని బయటకు వదిలేసి.. తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు జలాశయం గర్భంలో తాటి చెట్టు అంత లోతున నిట్టనిలువునా తవ్వేసి, గ్రావెల్ తరలించుకు పోతున్నారు. రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. వాస్తవానికి రిజర్వాయర్ పూడుకుపోయినప్పుడు మాత్రమే దాని గర్భం నుంచి మట్టి లేదా పూడిక తొలగించాల్సి ఉంటుంది. అది కూడా మైనింగ్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరగాలి. ఒకవేళ మట్టి తొలగించాల్సి వస్తే దానిని రిజర్వాయర్ చుట్టూ ఉన్న గట్టును పటిష్టపరిచేందుకు వినియోగించాలి. కానీ, పంపా రిజర్వాయర్‌లో అటువంటిదేమీ లేకుండానే టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొంటున్నారు.
నిద్రలో అధికార యంత్రాంగం
ఇంత పబ్లిక్‌గా కళ్ల ముందే పంపా రిజర్వాయర్‌లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, జలవనరుల శాఖల అధికారులు నిద్రలో జోగుతున్నట్టు కనిపిస్తోంది. జలవనరుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అంటున్నారు. పంపాను పరిరక్షించాల్సిన అక్కడి జలవనరుల శాఖ యంత్రాంగం ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం అందినా ఉదాసీనంగా వ్యవహరిస్తుండబట్టే ఇంత అడ్డగోలుగా గ్రావెల్ తెగనమ్మేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గ్రావెల్ దోపిడీ బాగోతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పుడు పగటి పూట ఆపేస్తూ తిరిగి రాత్రి దందా కొనసాగిస్తూండటం ఇక్కడ రివాజుగా మారింది. దీనిపై జిల్లా యంత్రాంగం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
తవ్వకాలకు ఎవ్వరికీ
అనుమతివ్వలేదు
గ్రావెల్ తవ్వకాలకు ఎవ్వరికీ ఎప్పుడూ అనుమతులు ఇవ్వలేదు. జలాశయంలో మట్టి తవ్వాలంటే పంపా ప్రాజెక్టు, డైరెక్టర్లు తీర్మానం చేయాల్సి ఉంటుంది. మా శాఖ నుంచి లేఖ రాస్తే మైనింగ్ అధికారులు వచ్చి, క్యుబిక్ మీటర్‌కు ఎంత మొత్తం చెల్లించాలో నిర్ణయిస్తారు. అప్పుడు నిబంధనలకు అనుగుణంగా అనుమతిస్తాం.
– శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్,
పంపా రిజర్వాయర్
రూ.లక్షల్లో దోపిడీ
రిజర్వాయర్‌లో అక్రమ గ్రావెల్ తరలింపు బాగోతం పక్షం రోజులకు పైబడే సాగుతోంది. భారీ యంత్రాలతో ఎక్కడ పడితే అక్కడ నిట్టనిలువునా మట్టి తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 12 చక్రాల భారత్ బెంజ్ లారీల్లో గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. రాత్రి ఏడు, ఎనిమిది గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజాము వరకూ 50, 60 లారీలతో గ్రావెల్ తరలించేస్తున్నారు.
పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ తదితర నియోజకవర్గాల్లోని ప్రైవేటు లే అవుట్లు, ఇటుక బట్టీల యజమానులకు ఈ గ్రావెల్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోని లే అవుట్ల యజమానులకే 5 వేల ట్రిప్పుల గ్రావెల్ తరలించేందుకు చీకటి ఒప్పందం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. గడచిన రెండు వారాలుగా ఇప్పటికే వెయ్యి ట్రిప్పుల గ్రావెల్ పిఠాపురం తరలించేశారని అంచనా వేస్తున్నారు. ఇందులో రూ.70 లక్షలు చేతులు మారాయి.
తుని నియోజకవర్గంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న అక్కడి ముఖ్య నేత బంధుగణం, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు పంపాను గుల్ల చేస్తున్నారని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు.
అన్నవరం, పిఠాపురం, చిత్రాడ, గొల్లప్రోలు, తుని తదితర ప్రాంతాలకు లారీ గ్రావెల్‌ను రూ.7 వేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రతి రోజూ రాత్రి ఒక లారీ తక్కువలో తక్కువ నాలుగు ట్రిప్పులు వేసినా.. మొత్తం అన్ని లారీలూ కలిపి 240 ట్రిప్పుల వరకూ వేసి, మట్టిని తరలిస్తున్నారు. ఇలా పంపా నుంచి ఒక్క రాత్రి పూటే సుమారు రూ.16.80 లక్షల మేర కొల్లగొడుతున్నారు. పగటి వేళ స్థానికులతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఇందులో సగం ట్రిప్పులు వేస్తున్నారు. ఇలా ఏడెనిమిది లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఈవిధంగా పంపాను గుల్ల చేసి ప్రతి రోజూ సుమారు రూ.24 లక్షలు పైగా తెలుగు తమ్ముళ్లు బొక్కేస్తున్నారు.

పంపాలో మట్టి దొంగలు

పంపాలో మట్టి దొంగలు