
పల్లెటూరి నుంచి వచ్చి ఎన్నో పాట్లు పడి సినిమా తీసి నిలదొక్కుకున్నవారెందరో. తమిళ దర్శకుడు సుశీంద్రన్ (Suseenthiran) కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. సినిమా తీయాలన్న లక్ష్యంతో 18 ఏళ్ల వయసులో చెన్నైకి చేరుకున్నాడు. కష్టాలకు ఓర్చుకున్నాడు. ఎదురుదెబ్బలకు వణికిపోకుండా నిలబడ్డాడు. పన్నెండేళ్ల ప్రయత్నాల తర్వాత తొలి సినిమా తీశాడు. వెన్నెల కబడ్డీ కుజు దర్శకుడిగా అతడి తొలి చిత్రం. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో మరుపటి ఏడాది కార్తీ- కాజల్‌తో కలిసి నాన్ మహాన్ అల్లా మూవీ తీశాడు. ఇది మరింత హిట్టు.
సహజమైన కథలతో..
అళగర్‌సామిన్ కుదిర, ఆదలాల్ కాదల్ సెవీర్, పాండ్య నాడు, జీవా, పాయుం పులి వంటి హిట్ చిత్రాలు తీశాడు. కొన్నిసార్లు అపజయాలతోనూ ప్రయాణం సాగించాడు. అయితే లేనిపోని హీరోయిజం, లాజిక్ లేని సీన్స్‌కు దూరంగా ఉంటూ తన కథలు సహజంగా ఉండేలా చూసుకున్నాడు. ఇతడు 2021లో శింబు (Silambarasan TR)తో ఈశ్వరన్ తీశాడు. నిజానికి ఈ కథ హీరో జై కోసం రాసుకున్నాడట!
కథ బాలేదని ఛీ కొట్టిన హీరో
కానీ శింబు తనతో ఓ సినిమా చేయమని కోరడంతో ఈ కథ అతడికి వినిపించాడు. అయితే కథ అస్సలు బాగోలేదంటూ శింబు ఉమ్మేశాడట! దీంతో కథను శింబుకు తగ్గట్లుగా మార్చేశానని దర్శకుడు సుశీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్త వైరలవుతోంది. ఇకపోతే ఈశ్వరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. శింబు విషయానికి వస్తే పాదు తల (2023) సినిమాలో చివరిగా కనిపించాడు. ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు.