
కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌లో అందరూ దాదాపు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్వీయ సవాల్ విసురుకున్నారు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా ఎన్ని రోజులు ఉండగలనన్నది ఆ చాలెంజ్. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కొన్ని రోజుల క్రితం పంచుకున్నారు.
‘ఇప్పటికే నాన్న ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి 150 రోజులయింది’ అని పేర్కొన్నారు దుల్కర్. దాదాపు తొమ్మిది నెలలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు మమ్ముట్టి. సుమారు 275 రోజులు ఇల్లు కదల్లేదు ఆయన. తాజాగా స్వీయ నిర్భంధాన్ని బ్రేక్ చేశారు. శుక్రవారం ఇంటి నుంచి అడుగు బయటపెట్టారు మమ్ముట్టి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. త్వరలోనే సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొననున్నారట మమ్ముట్టి.