
'పుష్ప' ఇప్పుడు దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇదే. ఈ సినిమాతో అల్లు అర్జున్ నటనకుగాను తాజాగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ అవార్డు అందుకుంటున్న టాలీవుడ్ తొలి హీరో కూడా ఆయనే.. ఈ అవార్డుతో పాటు విజేతలకు కేంద్ర ప్రభుత్వం ఏమేం ఇస్తుందని సోషల్‌మీడియాలో నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు వెతుకుతున్నారు.
జాతీయ చలనచిత్ర అవార్డలను అందుకున్న విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని అందిస్తారు. అంతేకాకుండా గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా అందిస్తారు. కానీ జ్యూరీ నుంచి అభినందనలు అందుకున్న సినిమాల విషయంలో కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు మాత్రం ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తారు.
(ఇదీ చదవండి: డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా)
2021 ఏడాదికి గాను 69వ జాతీయ అవార్డు అందుకోబోతున్న వారి జాబితా ఇప్పటికే విడుదలైంది. ఇందులో భాగంగా ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్‌లకు ఒక్కోక్కరికి రూ.50 వేల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
► ఉత్తమ చిత్రం అవార్డుల కోసం 28 భాషల నుంచి 280 సినిమాలు పోటీ పడితే.. బెస్ట్ మూవీగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌కు రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు.
► ఉత్తమ వినోద చిత్రం అవార్డు కోసం 23 భాషల నుంచి 158 చిత్రాలు పోటీపడగా ఈ అవార్డుకు ఎంపికైన RRR సినిమాకు రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం దక్కించుకోనుంది.
► గోదావరి అనే మరాఠ సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్‌కు రూ.2.50 లక్షల నగదు బహుమతి, రజత కమలం అందుకుంటారు
► ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్‌కు రూ. 1.50 లక్షల నగదుతో పాటు రజత కమలం అందుకుంటారు. ఈ సినిమాకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే
► జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన షేర్షా సినిమాకు రూ.2 లక్షల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.