
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన ఎన్‌సీబీ.. శుక్రవారం ఉదయం ముంబైలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. అదే విధంగా మరో బృందం సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరండా ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఎన్‌డీపీఎస్ చట్టం, విధివిధానాలను అనుసరించి ఈ మేరకు రియా, మిరండా నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. కాగా డ్రగ్ డీలర్‌తో రియా చక్రవర్తి సంభాషణ జరిపినట్లుగా ఉన్న వాట్సాప్ చాట్ బహిర్గతమైన సంగతి తెలిసిందే. తద్వారా ఆమె నిషేధిత డ్రగ్స్ గురించి తన సన్నిహితులతో చర్చించినట్లు వెల్లడైంది. (చదవండి: ‘రియా, సుశాంత్ కలిసి గంజాయి తాగేవారు’)
ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్‌సీబీ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండాలకు డ్రగ్స్ అందించినట్లుగా అనుమానిస్తున్న అబ్దుల్ బాసిత్, జైద్ విల్తారా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి మార్చి 17న జైద్ ఫోన్ నంబరును సుశాంత్ మేనేజర్ మిరాండాకు షేర్ చేసినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 10 వేల రూపాయల విలువ గల 5 కిలోల డ్రగ్స్‌ను కొనుగోలు చేసినందుకు జైద్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా షోవిక్ కోరాడు. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా)
ఈ క్రమంలో మిరండా జైద్‌కు మూడు సార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. భాసిత్ ద్వారా జైద్ నంబర్ వీరికి తెలిసినట్లు సమాచారం. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ ఎదుట హాజరైన అతడి మేనేజర్ శృతి మోదీ సుశాంత్, రియా కలిసి గంజాయి తాగేవారని వెల్లడించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు షోవిక్, మిరండా టెర్రస్ మీద గంజాయి పీల్చేవారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి తాము మీడియాకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని సీబీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
House search being conducted at Showik Chakraborty's and Samuel Miranda's residences as provided under NDPS Act: Narcotics Control Bureau (NCB) https://t.co/EpKDxZEkqK
— ANI (@ANI) September 4, 2020