
నిస్సందేహంగా మన దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్(Kamal Haasan) ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజజీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతన్న లివ్ ఇన్ రిలేషన్ షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2, 3 దశాబ్ధాల క్రితమే కమల్ చేసేశాడు..
ఒక్కసారి కమల్ అనుబంధాలను పరిశీలిస్తే... 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ చిత్రంలో కమల్ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డ్యాన్సర్ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కమల్ హాసన్ సహ నటి సారికతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శ్రుతి హాసన్ (ప్రస్తుతం టాప్ హీరోయిన్) జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్ పుట్టింది.
ఈ అనుబంధం మరో పదేళ్లు పైనే కొనసాగి 2002లో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది 2004లో మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచుగా కమల్ చెబుతుంటాడు. ప్రస్తుతం 7 పదుల వయస్సులో కూడా కమల్ పెళ్లిళ్లు ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటే... అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం.
ఈ నేపధ్యంలో సీనియర్ స్టార్ కమల్ హాసన్, నటి త్రిష కృష్ణన్(Trisha), సిలంబరసన్ టిఆర్, శింబులు నటించిన, మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా మరోసారి కమల్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.
ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3 పదుల వయసు దాటినా, ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న త్రిష....బదులిస్తూ..‘‘ పెళ్లిపై తనకు నమ్మకం లేదు’’ అంటూ స్పష్టం చేసింది. ‘‘తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే’’ అని అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్‌ను ప్రశ్నించగా.. దశాబ్దం క్రితం ఎంపీ జాన్ బ్రిటాస్‌కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు.

‘‘ఇది 10–15 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ముందు నన్ను ‘‘ నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడివి, మరి రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు? అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి? అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే..నేను ఏ దేవుడ్నీ పూజించను. అంతేకాదు నేను రాముడి జీవనశైలిని అనుసరించను. బహుశా నేను అతని తండ్రి (దశరథ) మార్గాన్ని (ముగ్గురు భార్యలు కలిగి ఉన్న) మార్గాన్ని అనుసరిస్తాను’’ అంటూ కమల్ హాసన్ బదులిచ్చాడు. విక్రమ్ సినిమా సూపర్ హిట్‌తో మరోసారి ఊపందుకుంది కమల్ హాసన్ కెరీర్... తదుపరి చిత్రం, థగ్ లైఫ్, జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.