
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టీకరణ
బిలాస్‌పూర్: కన్యత్వ పరీక్షకు చేయించుకోవాలంటూ మహిళను బలవంతం చేయరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి చర్య రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు గుండెకాయ వంటిదైన ఆర్టికల్ 21కు విరుద్ధమంది. జీవించే హక్కుకు, గౌరవానికి భంగం కలిగించరాదని, మహిళలకు ఇది కీలకమైనది పేర్కొంది. వేరొకరితో అక్రమ సంబంధం నెరపుతున్న తన భార్యకు కన్యత్వ జరిపించేలా ఆదేశాలివ్వాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టుపై వ్యాఖ్యలు చేసింది.
నపుంసకుడైన భర్తతో కలిసి జీవించలేనని ఆ మహిళ ఆరోపించగా స్పందించిన న్యాయస్థానం..ఇది అబద్ధమని రుజువు చేసుకోవాలంటూ వైద్య పరీక్షలకు సిద్దం కావాలని పిటిషనర్‌ను కోరింది. లేదా అందుకు తగిన ఆధారాలు చూపించాలంది. జనవరి 9వ తేదీన ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఇద్దరూ పరస్పరం చేసుకున్న ఆరోపణలకు సాక్ష్యాధారాలు అవసరమని, వాటితోనే కేసుకు ముగింపు పలకగలమని తెలిపింది.
కోర్బా జిల్లాకు చెందిన వీరిద్దరూ 2023 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. భర్తతో కొన్నాళ్లు ఉన్నాక మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నపుంసకుడని, అతడితో కలిసి ఉండలేనని ఆరోపించింది. అతడి నుంచి నెలకు రూ.20 వేల భరణం ఇప్పించాలంటూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో, ఆమె వేరొకరితో సంబంధం నెరుపుతోందని ఆరోపించిన భర్త..కన్యత్వ పరీక్ష జరిపించాలంటూ పిటిషన్ వేశాడు. కుటుంబ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాలతో తిరిగి కేసు కుటుంబ న్యాయస్థానానికే చేరింది.